హనీ...
ఎంతటి సౌందర్యం నీ నయనాలది... ఇలలో ఎప్పుడూ చూడనంత నయన సౌందర్యం.
నల్లని నీ కనుబొమ్మలు అర్జునుని విల్లు గాండీవంలా వంపు తిరిగి ఉన్నాయి.
మన్మధుని చేతిలోని చెరుకుదంటు విల్లులా నా గుండె వైపే ఎక్కుపెట్టినట్లు ఉన్నాయి. అందాల నీ నయనాలు నా గుండెల్లో ఏదో అలజడి రేపాయి. నీ కను రెప్పల మధ్యనే నా హృదయాన్ని బందీ చేసావు కదా...
నీ మనసులోనికి నేను చేరటానికి నువ్వు తెరచి ఉంచిన ద్వారబంధాల్లా ఉన్నాయి నీ కను రెప్పలు. టపటపా కొట్టుకుంటున్న నీ కను రెప్పల మధ్యన నా హృదయం నెమ్మదిగా నీ మనసులోన స్థానం కోసం ప్రయత్నిస్తుంది.
మానస సరోవరం లో ఈదులాడుతున్న రెండు అందమైన బుల్లి మీనాలని తీసుకుని వచ్చి నీ కనురెప్పల కింద ఉంచినట్లు ఉన్నాయి.... నిజమేనా చెలి... బ్రహ్మ మహా మాయదారి కదా అలా చేసినా చేసి ఉంటాడు.
మూసి ఉంచిన నీ కనురెప్పల వెనక నా రూపం ఎప్పుడూ అలా నిలిచిపోవాలని.... నీ కనుపాపలే నీ మనసులో చేరటానికి సింహ ద్వారాలుగా నన్ను ఆహ్వానిస్తున్నాయి.
అందమైన కలువ రేకుల్ని నీ కను రెప్పలుగా అతికించాడేమో ఆ బ్రహ్మ... ఎంతైనా ఆయన ప్రియ పుత్రికవు కదా మరి.
నీ నయనాల నుండి కురుస్తున్న కాంతి నీలి వెన్నెల కిరణాల వెలుగులు విరజిమ్ముతూ నన్ను సంతోష సాగరంలో తడిపేస్తుంది.
తెల్లని నీ కనుపాపల మధ్య నల్లని నీ కనుగుడ్లు పాల సముద్రం మధ్యలో ఆదిశేషువుపై పవళించిన శ్రీ మహా విష్ణువు లా ఉన్నాయి ప్రియా...
నీ కళ్ళు రువ్వే చిలిపి నవ్వులు నా గుండెకు వేసేస్తున్నాయి వలపు బంధాలు. నీ కళ్ళల్లో పలికే భావనలు నా హృదయంలో వెలిగే మణి దీపికలు.
నీ నీలాల నయనాల్లో ప్రతి ఫలించే నీ ప్రేమానురక్తి నీ కళ్ళు చిందించి నవ్వుల్లో వ్యక్తమవుతూనే ఉంది. నీ కళ్ళే నీ మనసు పలికే భావ వీచికల ప్రతిరూపాలు.
నక్షత్రాల మెరుపుని నీ కనురెప్పల మాటున దాచుకున్నావ్ కదా ప్రియా. నీ మనసు పరవళ్ళని ప్రతి ఫలిస్తున్న నీ నయనాల వెలుగులే నా హృదిలో చేస్తున్నాయి వలపు గాయాలని.
వెన్నెల దీపికలయిన నీ నీలాల నయనాలు ఎల్లప్పుడూ పన్నీరు తప్ప కన్నీరు కార్చకూడదని నా కోరిక. నీ కళ్ళలోని వెలుగులతో తమ మెరుపులని మెరుగు దిద్దుకోవాలనుకుంటున్నాయనుకుంటా ఆ నింగిలోని తారకలు ఆశగా నీకేసి చూస్తున్నాయి.
ఇలలోన నిన్ను మించిన నయన సౌందర్యవతి ఎక్కడ ఉంది?
నీ
... రేష్






0 comments:
Post a Comment