Wednesday, 4 November 2015

రెప్పల సరిహద్దులో...

హాయ్ రా...

ఇప్పుడు నీ మీద ఎంత కోపంగా ఉన్నానో నీకు తెలుసు కదా? 

ఎప్పటిలానే నీ గుడ్ మార్నింగ్ తోనే ఉదయించే నా కన్నులు రోజంతా పడే పడిగాపులు నీకు తెలుసు… ఏ పని చేస్తున్నా డెస్క్ టాప్ స్క్రీన్ మీద నోటిఫికేషన్ … మొబైల్ లో బ్లింకింగ్… ఎప్పుడొస్తుందా  అని ఎదురు చూపులు చూసేవి కన్నులు మాత్రమే కాదురా… కొంచెం కొంచెంగా తడిబారుతున్న నా హృదయం కూడా…

ఏయ్… ఊరుకో బంగారూ… నీ కంటికడ్డం పడుతున్న నీటి తెరలు నాకు తెలుస్తున్నాయ్… ఆ తడి నేను తట్టుకోలేనంతగా నన్ను కాల్చేస్తుంది. అయినా ఏదో అంటాను గానీ నీ సంగతి   నాకు తెలియదా ఏమిటి?  నాకన్నా ఎక్కువగా మన కాలాల్ని అంటి పెట్టుకుని ఉండేది నువ్వేగా… 

ఏరా… అసలు ఎన్ని జన్మల బంధమై వచ్చావురా నాలోకి ఇలా?  

అయినా గానీ ఉదయాన్నే నీ పలకరింపు  నా రోజు మొత్తాన్నీ  ఎంత ఉత్తేజితం చేస్తుందో… నువ్వొలికే  ఒక హాసం నా చుట్టూ ఉన్న పరిసరాలని ఎంత పరిమళ భరితం చేస్తుందో  నా ప్రతి క్షణానికీ తెలుసు. 

ఎక్కడెక్కడి మజిలీలనూ దాటి వచ్చిన నీ ఊపిరి నన్ను శ్వాసించటం నాకు బాగా తెలుస్తూ ఉంది…  

ఏయ్… మజిలీ అనగానే నా మజిలీ అడుగుతావే… పెంకి పిల్లా… 

అసలు జీవితంలో ఎన్ని మజిలీలు ఉంటాయో తెలిస్తే కదా నాకు. . అలాంటిది ప్రస్తుతం నేనున్న మజిలీ ఏదంటే ఏమని చెప్పగలను? 

ఆత్మానుగాతంగా చెప్పమంటే మాత్రం నా శాశ్వత మజిలీ నిన్ను గురించిన ఆలోచనల్లోనే…  నిన్ను దాటి వెళ్ళలేని పయనమొక వరమనుకుంటూ నా ముగింపులోని  ప్రతి నివేదనలోనూ నిన్నే స్మరించుకుంటూ కాలాన్ని  దాటిపోవటంకన్నా ఆనందం అంటే ఇంకేముంటుంది. 

నా అంతరంగంలోని అంతర్యాలన్నీ నువ్వు అలవోకగా అర్ధం చేసుకుంటున్నపుడుగానీ అర్ధంకాలేదీ మట్టి బుర్రకి ఉన్నదొక్కటే  అంతరంగమనీ… అది  ఏకాత్మగా మారిన రెండు హృదయాల పవిత్ర సంగమమని.  

నిజంరా…  మొన్నెప్పుడో మనం దాటి వచ్చిన సాయంత్రాలకి హత్తుకున్న నీడలెంత పొడవుగా ఉన్నాయో అప్పటి ఆ క్షణాలు  ఇప్పటి ఈ క్షణాలకి  కథలు కథలుగా  చేరవేస్తూనే  ఉన్నాయి. 

జీవితాన్ని  పాజ్ చేసుకుందాం అనుకున్నప్పుడల్లా తలపుకొచ్చేసి మరీ దాన్ని పరిగెత్తిస్తావ్. నిజం చెప్పాలంటే నువ్వు నాకొక నిత్య పారాయణ గ్రంధంగా మారిపోయావ్ రా… 

అవునూ అక్కడ బాగా వాన పడుతుంది అన్నావ్ కదా…  నీ పక్కనున్న కిటికీ అద్దాన్ని చూడు.  అది చేరవేసే సందేశం అర్ధం అయ్యింది కదూ… అయ్యే ఉంటుందిలే… ఎందుకంటే నేనెలా అలోచిస్తానో నువ్వూ అదేలా ఆలోచిస్తావ్ కాబట్టి. 

జడి వాన  ఒకటి ముగిసిపోయాక కూడా కిటికీ అద్దాన్ని ఆర్తిగా అంటిపెట్టుకుని రక రకాల తడి చిత్రాలని చిత్రించే ఆ కొన్ని చినుకుల్లాంటివాడినేరా నేను కూడా… నిజం రా… అందరిలా అర్ధాంతరంగా పక్కకి తప్పుకునే స్వార్ధ పరుణ్ణి కాదు.  నాలో జీవం ఆవిరయ్యేవరకూ నిన్ను అంటి పెట్టుకుని ఉండే ఏకైక  నిస్వార్ధాన్ని… ‘ నీ ‘ స్వార్ధాన్ని. 

ఎప్పుడు నిన్ను చదువుకున్నా నాకు అర్ధం అయ్యేదొక్కటే నువ్వు … ప్రభాతాన్ని మేలుకొలిపి వెలుగుల్ని పట్టితెచ్చే  విశ్వరూపానివని... 

“ అంతరంగపు  అంచుని అందుకున్న నిశ్శబ్దం ఒక్కటి 
మౌనంగా మనసు మొత్తాన్ని ఆక్రమించుకున్న సడిలో 
నీ ఊపిరుల థిల్లానా
నా శ్వాసలకి నజరానాయై 
నిశ్శబ్దాన్ని నిర్దయగా పక్కకి నెట్టేస్తున్న కదలికలో 
కనురెప్పల సరిహద్దు లోపలే
సరికొత్త ప్రపంచమొక్కటి సాక్షాత్కారిస్తుంటే 
తెలిసింది నువ్వొక సరికొత్త ప్రకృతివని… పంచభూత వేదికవని… 
నన్నుఅలరించవచ్చిన ఎడతెగని ఆహ్లాదానివని… నా ఆనందానివని…”

నీ,

ఆనందం


1 comments:

బాగుందండి

Post a Comment