Friday, 31 March 2017

ఆకు దాచిన చినుకు

నాకు తెలుసు నువ్వు అలసిపోయావని

ఇప్పుడు ఇదే మార్గం

రా మరి

ఒక నిశ్శబ్దం ఆక్రమించుకున్న ఈ తోటలో  

ఆత్మైక్యమై సేద తీర


ఏటి కడుపులో దాగున్న పాటలా 

ఒక మౌనపు అలజడిని హత్తుకుంటూ 

నిశ్శబ్దపు లోతుల్లో శ్వాస తీసుకుంటూ 

చెప్పలేని భావాలకు ఆకారం ఇస్తూ 

అతి దగ్గరగా నిలిచిన క్షణం ఇదని 

మాటలకంటే ముందే మనసును గుర్తిస్తూ

దాచుకోలేనంత దగ్గరితనముందిక్కడ  

ఏకాంతపు వ్యాకరణాన్ని  

కంటి మెరుపులుగా రాయగలిగే  

హృదయ లేఖినీ ఉంది


వెలుతురుని తాగిన చెట్టు కొమ్మపై

ఆకు దొన్నెలా మారి దాచుకున్న

ఒక గోరు వెచ్చని చినుకులో  

లేచివురాకు మెత్తని వెన్నెల కాంతి

ప్రతిఫలిస్తున్న తేజస్సు మీదుగా

గాలి రాసుకొస్తుందే  ఒక చిరు పరవశం

తన దారినే మరిచిపోయినట్టుగా

నిన్ను తాకుతూ కరిగిపోతుంది


ఆకాశపు అందాన్ని

నీలంగా తాగేస్తున్న సంద్రపు అంశలా

ఒక పువ్వు నుండి నీలోకి

నిశ్శబ్దంగా ప్రవహించే అనుభూతి ఉందే

హృదయాన్ని తాకడం దానికి తెలుసు

దివారాత్రాల ప్రతి స్వరమూ

నీ ఊపిరి స్పర్శకై విరహపడుతున్న

ప్రణయస్వామ్యంలో

రెక్కలు విప్పుకుంటూ ఎగిరిపోతుందీ అలసట

కంటి రెప్పలకి తేనె చెమరింతలని పరిచయిస్తూ

 


1 comments:

భలే మార్గం కదా!!
కంటి రెప్పలకి తేనె చెమరింతలను పరిచయిస్తూ... 💘

Post a Comment