Tuesday, 28 March 2017

భృత్యుడు

మరణం ఎప్పుడో రాయబడి ఉన్న పాత శాసనం.
పుట్టిన క్షణం నుంచే నా గడప ప్రక్కన నిలబడి,
నా శ్వాసల తాళపత్రాలని  లెక్కపెడుతూ నడిచే
ఒక నిశ్శబ్ద సహచరి అయి ఉంటుందేమో.

 

లోపల ఎక్కడో
మరణం ముందుగానే అంగీకరించిన
ఒక నెమ్మదైన వెలుగేదో దాగి ఉన్నట్లుంది

ఏ విపత్తులూ మనసుని

నిజంగా బంధించలేకుండా ఉన్నాయి

రానీ మృత్యువుని

నేనెరుగని మృత్యువా తను

తొలి శ్వాస  నుండీ నాతోనడుస్తున్న ఏకైక నేస్తం తాను  

తనకు తెలిసిందల్లా దేహాన్ని మౌనంలోకి నెట్టడమే

అవును...దాన్ని మాత్రమేగొని పోగలదు తను

అయితే మనసుని?
కాలాన్ని?
నన్ను నేను తెలుసుకుంటున్నంత సేపూ
తను ఏలా తాకగలడు?

ఆ లోకానికి చేరే దారి తనకు తెలియదు  
చేరినా అక్కడ తను నా భృత్యుడు మాత్రమే

 

నిజం

అసలైన నడక తెలిసాకే అర్థమవుతుంది

ఆనందమంటే పది క్షణాలు పెదవులపై మెరిసే నవ్వు కాదు

అది మన లోపల వెలిగే నిగర్వ స్వభావం.

విజయం అనేది శ్రమకి దూరంగా దొరికే కిరీటం కాదు

చెమటను సారం చేసుకున్న ప్రయాణం.

మృత్యువంటే దేహం నిర్జీవమైన చావు కాదు

ప్రకృతికి తిరిగి అర్పణ అయ్యే స్వేఛ్చా ఏలిక

 

ఈ తత్త్వం గ్రహించిన జీవితం

జరామరణాల గడియారాన్ని దాటేసి

గుండె నిండా నవ్వుని నింపుకుంటుంది

అప్పుడు కాలమే
నన్ను తన అక్షరాలతో రాయడం మొదలుపెడుతుంది.



0 comments:

Post a Comment