మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 18 March 2016

ఒక నవ్వు



ఒక ఆగంతకత్వం తడిమినప్పుడల్లా
చుట్టుముట్టాడే భయానికి అస్తిత్వాన్ని రద్దుచేసే భరోసావై
ఒక తేలికపాటి నవ్వుతో నువ్వు కమ్ముకుంటావు చూడూ
అప్పుడు...దిగంతాల ధైర్యపు ప్రతిధ్వనిలా అనిపిస్తావు

ధ్వని పూరితమైన నిశ్శబ్దం పెట్టే చికాకులో
వ్యవస్థీకృత మౌనాన్ని పూయించటం కష్టమైనప్పుడల్లా
నిన్ను ఆవాహన చేసేసుకుని
నీ స్వరరహిత నవ్వుల తరగల్లో ఈదులాడటం
పల్లె మట్టినద్దుకుని పంటకాలువలో సేదతీరటమేననిపిస్తుంది

శిలా పుష్పాల అంశలో పుట్టిన నవీనత్వమంతా
ఒక్క స్వచ్ఛతా నవ్వులో కరిగిపోవటం
కొందరికి అలవిమాలిన తపనే కావచ్చు
నాకు మాత్రం అది ఒక ఎనలేని ఆత్మీయ వరద

నీ నవ్వెప్పుడూ వృధా కాలేదు
కంటి చివర్లలో కాంతిని వేలాడదియ్యటం
గుండె లోతుల్లో ఒక ఉత్సవాన్ని జరపడం
ఒక్క తనకి మాత్రమే తెలుసు

ఏయ్.. ఇప్పుడైతే
నిన్ను నాకు వాగ్ధానం చేసుకుంటున్నా
ప్రతీ ధ్వనిలో ప్రతిధ్వనిగా నిన్నే నవ్వుతానని
ప్రతి పదం చివరా ఒక నవ్వుగా జన్మిస్తావని

హంసధ్వని



ఇష్టమైన మౌనంలో
తచ్చాడుతున్న మాటల హంసలు
బద్ధకమెక్కిన తరగలపై
నెమ్మదిగా
చాలా నెమ్మదిగా తేలియాడుతూ
మనసులో కురిసే ప్రతి శబ్దాన్ని
మౌనం నుండి వేరు చేద్దామనుకున్నప్పుడల్లా
కవిత్వమే విలీనమైన తనమొకటి హంసధ్వని చేస్తుంది

ఎప్పటికప్పుడు లోన చెక్కుకున్న మాటలన్నీ
మౌనాన్ని ఆలపిస్తున్న వేళ
కళ్ళనుండి కారుతున్న ఒంటరి క్షణాలని వెలివేస్తూ
అప్పుడప్పుడూ నీ నీడల కింద నిద్రపోవాలని ఉంది
ఆకాశం చెప్పే రహస్యాలని
గుండె గదుల్లో ఖైదు చేస్తున్నప్పుడల్లా
పెరిగే హృదయం బరువుని
అతి తేలికగా తేలిక చేస్తున్న
అతిధివై నడిచొస్తుంటే
నా తలపులన్నీ ఒద్దికగా
తలుపుల గడియలు విప్పేసాయి

పాతదనాలన్నీ పచ్చి పచ్చిగా తడుముతుంటే
కాసేపలా నీలో కూర్చుని వెలగాలని ఉంది
ఇప్పుడు కాదు
నిన్నటి పసితనంలో
అప్పుడైతేనే
నిజంగా అప్పుడైతేనే
నీ పెదాలమీది నిజమైన వెలుగుల్ని
నిండారా నాలో చిమ్మేసుకుంటాను
నీదీ నాదీ అంటూ తేడాలేని ఆ నవ్వుల కన్నా
స్వచ్ఛతను ఇంకెక్కడి నుండి కోసుకోను మరి?

Sunday, 13 March 2016

నీకోసం ఒక తీరం



ఓ నా సహచరీ
నీ సుఖదుఃఖాలన్నీ నావిగా చేసుకున్నాననుకున్నాక
నీ చెక్కిలిపై చెమరింతలని చూసినప్పుడల్లా
నాలో నన్ను వెలి వేసుకోవాలనిపిస్తుంది
నాలో నేను మునిగిపోవాలనిపిస్తుంది

శూన్యానికి ముసుగేసుకున్న మనసెప్పుడూ
మిథ్యా సమయాలనే వాంఛిస్తుందేమో
ప్రతి క్షణమూ సంధి కాలమైనచోట
పరిచయం పాతబడింది కానీ
పెరిగిన దూరం తెలియనితనంలో
అంతరంగాన్ని అణువణువునా అనువదించే
నిశ్శబ్దభేది ఒక్కటుంటే బాగుండు

ఇదెప్పుడూ నిజమే
నీలో నువ్వు ముడుచుకుపోతూ
గుమ్మరించబడ్డ గరళాలన్నిటినీ గొంతులో దాపెట్టి
నాకు మాత్రం అమృత భాండాన్ని అందిస్తుంటే
దాన్ని మోసుకు తిరిగేంత అమరత్వం నాకు లేదు

ప్రతి నా నిశ్చలతలో నీకై ఎన్నెన్ని చలనాలనో కూరి ఉంచా
నీ ప్రతి గాయానికి ఒక లేపనంగా సిద్ధమై ఉన్నా
పూడిక పడని శోకంగా నువ్వు తడి శ్లోకాన్ని పఠిస్తుంటే
ఇక నా శబ్దమెప్పుడూ నిద్రిస్తుంది నిశ్శబ్దమై

నీ దుఃఖాల మీదుగా ప్రవహించటానికి
నాలో నన్ను దాటేసిన కొన్ని సమయాలని
ఒక తెరచాపగా చేసుకుని
కాంతిసాగర తీరాన్ని సిద్ధం చేశాను
నావికత్వం తెలియని వాడికి
తీరాన్ని చేర్చే నేర్పు రాదని మరచిన నేను
కేవలం తీరాన్నే సిద్ధం చేశాను

కానీ ఒక్కటైతే చెప్పగలను
నావలో నువ్వున్నాక
నిన్ను తీరం చేర్చగలిగేంతవరకూ
నా ఊపిరి విశ్రమించదని

Saturday, 12 March 2016

వెన్నెలమ్మాయీ


తలపుల పడవల్లో జ్ఞాపకాల తెరచాపలనెత్తి
గడచిన సమయాల తీరాన్ని తాకినప్పుడల్లా
కుంకుమ తోటలలోని వాయుస్పర్శనద్దుకున్న
వినీల కుంతలాలలో మెరుగు పూలు ముడుచుకున్న
నులివెచ్చని గ్రీష్మ కావ్యంలా లిఖించబడ్డ నీకై
నా రెప్పల కుంచెలని అరువిచ్చిన వార్తలు
ఎప్పటికప్పుడు నాలో చదవబడుతూనే ఉన్నాయి

నువ్వు విసిరేసిన జ్ఞాపకాల్లో
నన్ను నేను ఏరుకుంటూ వస్తున్నప్పుడల్లా
కొన్ని వెన్నెల జూకాల సవ్వడి
నిన్ను మరింత దగ్గరగా వినిపిస్తుంటే
చూడక పోతే విరాగం... చూస్తే రాగంగా
నువ్వెప్పుడూ ఓ ఇంద్రజాలపు మంత్రమై
నా గుండె గొంతుకలో తడి తడిగా
చల్లగా కురిసేస్తూ ఉంటావ్…
నువ్వెంతటి శీతలానివో ఓ వెన్నెలమ్మాయీ…!

ఒకటిగా


ఎప్పటికప్పుడు ఒకే దేహంలో 
రెండుగా చీల్చబడుతున్న సంఘర్షణలో 
రాజీ కుదర్చడానికి 
ప్రపంచమేమీ ఖాళీగా లేదులే 
నిశ్శబ్దానికీ అలజడికీ 
ఒకే ఉదాహరణలున్నచోట
ఎడతెగని మౌనానికీ 
ఘర్జించే నినాదానికీ 
ఒకే పుట్టుక ఉండటం 
పెద్ద వార్తేమీ కాదులే 
తన అస్తిత్వంలోని భిన్నత్వాలని 
సమన్వయం చేసుకోగలుతున్న ప్రతి మనిషికీ
ప్రపంచంతో కలసి నడవటం కష్టమేమీ కాదుగా 
మరి రా నేస్తమా… 
ఒకటిగా నడుద్దాం… ప్రగతిగా సాగుదాం

దైవత్వం



ఆకలిలో సోలిపోయిన మనిషి
మరో రోజులో కళ్ళు తెరిచినప్పుడల్లా
నువ్వొక బంగారు వెలుగులా
కనిపించనవసరం లేదు
ఒక్క అన్నం ముద్ద వాసనలా వీస్తే చాలు
ఆదిమత్వం నుండి అంతరిక్షం వరకూ
స్వర్ణరథమెక్కిన దేవతలా మిగిలిపోతావు

వెచ్చని చినుకు



శతాబ్దాల క్రితం కంచెలేసావ్
యుద్ధం కొన సా……..గుతూనే ఉంది
చెప్పుకోవటానికే యుద్ధం
నిజానికిది దండయాత్రే
అయితేనేం... ఏ దండయాత్రలో నైనా
అంతిమంగా వీరతిలకమద్దుకునేది మాత్రం మట్టే కదా

గెలిచి నిలిచినవారంటూ లేని రణరంగాన
కాలం అంచున కారుతున్న రక్తపుటేరుల కమురువాసన
ఇంకా నీకు వెగటు పుట్టించలేదనుకుంటా
ఒక చేత్తో అభయం మరో చేత్తో ఆయుధం ఇస్తూ
కృష్ణతత్వం వంటబట్టించుకున్నావ్
ఎక్కడో రగులుతున్న అగ్గిలో
నువ్వు వెలుగు కాచుకుంటున్నాననుకుంటావ్
నాకో నిజం  చెప్పు నేస్తమా
ఆ వెలుగుప్పుడైనా
ఒక్క ప్రాణజ్యోతిని నిలబెట్టిన నిజాన్ని చూసావా

నీటిమీద నువ్వు గీసిన బొమ్మలెంత శాశ్వతమో
బహుశా నీకు తెలిసే ఉండవచ్చు
కాలానికి నువ్వూ అంతేనన్న నిజం కూడా స్ఫురించనంత
జ్ఞానత్వంతో మిడిసి పడకు మిత్రమా
నీలో నువ్వు శలభంలా కొట్టుకులాడే రోజొకటి వచ్చేస్తుంది

క్లిష్టమైనచోట కాస్తంత కోల్పోయి చూడు
నువ్వెంత ఇష్టమవుతావో నీకే తెలుస్తుంది
కంటి చివర కొన్ని వెచ్చని చినుకులు తడిమితే కదా తెలిసేది
ప్రతి తేమలో ఒక హాయి ఉంటుందని
నీకు నువ్విచ్చుకునే ఒకానొక అద్భుతమైన కానుక తానని

వాయిదా



కాలం ఇంకిపోయే కొద్దీ 
చేతలు త్వరపడటం అన్నది 
శతాబ్దాలుగా 
ఎరిగిన సత్యమన్నది  
తెలిసీ 
నిన్ను నువ్వు బద్ధకించుకుంటూ 
వాయిదా వేసిన అనేకానేకాలను
కాలం నీకు మాయం చేసిన సంగతి
నీ దృష్టికి ఎన్నడూ రాకపోవటం 
దృష్టి లోపమేమీ  కాదు 
అది ఆ అవకాశం జారిపోవటమూ 
నిన్ను నువ్వు కోల్పోవటమూ  కూడా