మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Wednesday, 6 April 2016

తడి గాలం


నిదురలోకి జారుకోవటం తెలియని
ప్రతి అస్తిత్వం లిఖించే
సంఘర్షణా ప్రతులలో
కొన్ని వాక్యాలుగా అలుముకోవడం
ప్రతి నాకూ ప్రతి నీకు కంఠో పాఠమే కదా

సంస్థాగత వ్యామోహాలని తప్పించుకోలేని
నాగరిక విన్యాసాలలో
ప్రతి జీవనం పొడిబారటం నిజమే కావచ్చు
అయితేనేం ఎక్కడో ప్రతి మనలో
తడిగాలమొకటి సిద్ధంగా ఉండే ఉంటుంది

కళ్ళల్లో మెరుపు లిఖించబడి ఉన్నన్నాళ్ళూ
శూన్యం దరి చేరని ఏకాంతాలు
జీవితం మీద పెంచే ఇచ్ఛని
అద్దుకున్న వాడికి శాపాలైనా వరాలైనా
బతుకులో పెద్ద తేడా ఉండదులే

స్వప్నాలు అమ్ముకోవడం వచ్చిన వాడికి
కష్టాన్ని నమ్ముకోవటం రాదనుకోవటం
ద్వేషాంకురానికి తొలిశ్వాస అన్నది
చరిత్రలో ఏ శాసనం మీదా
చెక్కబడని జీవన సత్యం

అందరి శ్రమకీ చెమట కారటమే నిదర్శనమైతే
మనిషి తిరిగినంత మేరా చిత్తడి నేలలు తప్ప
ఇంకేమీ ఉండేవి కాదు
ప్రతి తానూ ఒక శ్రమజీవేనన్న నిజం అతిశయోక్తిగా కనిపించినంత కాలం
కొన్ని నరాలు రగులుతూనే ఉంటాయి

అలకూ అలకూ మధ్య విరామాన్ని భరించలేనంత
అసహనం తీరానికి ఉండి ఉంటే
ఇక్కడ నీటికి తప్ప మనిషికి ఆరామాలు ఉండేవే కాదు
నలుపూ తెలుపులని రెండు పార్శ్వాలుగా
చూడగలిగే ప్రతి మనిషికీ జీవితం వడ్డించిన విస్తరే

మనసు చదవగలిగే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు
బాహ్యాంతరాల సరిహద్దు రేఖపై నువ్వు నిలబడ్డప్పుడూ
మలినాలకి మరణ శాసనం లిఖిస్తూ
ఒకానొక స్వచ్ఛతకి నిర్వచనంలా మారేలా
అలలు అలలుగా ఒక నవ్వు విరబూయాలి… ఒకే ఒక్క నవ్వు

(ఏప్రిల్ 16 వాకిలి ఆన్లైన్ మాగజైన్ లో ప్రచురితమైన కవిత)

http://vaakili.com/patrika/?p=10832

Monday, 4 April 2016

తుషార లిపి



గరిక రంగులద్దుకున్న మంచు ముద్దలా నువ్వు మెరిసినప్పుడల్లా 
హేమంతమొకటి గొంతులోనుండి జాలువారి గుండెని  మంత్రించినట్లనిపిస్తుంది 

గాలి వలవేసినప్పుడల్లా గంధం చిక్కుతున్న తావులో ఊపిరి నెగళ్ళతో 
నను కాచుకుంటున్న నిన్ను నెమలి రెక్కలతో లిఖించాలనిపిస్తుంది 

నువ్వొక సంపెంగ నీడవై నన్ను పరిమళించడానికి వస్తున్నప్పుడల్లా 
మౌనసంద్రాన్నై నీకెదురు రావటం  ఎప్పుడూ కొత్త అనుభూతినే ఇస్తుంది 

జ్ఞాపకాలపై తడిసిన కంబళి కప్పుకున్నప్పుడల్లా 
రేకుల నిండా స్వప్నాలని నింపుకున్న శరత్ పుష్పంతో ఇచ్చకాలాడుతూ 
వెన్నెల తళుకులీనుతున్న ఉదయం ఒకటి వెచ్చని ధారగా కురుస్తూ ఉంది 

అలనల్లన ఆకాశంలో మేఘమాలికలు వేస్తున్న ఆవిరి ముగ్గులో 
గొబ్బెమ్మలా నీ నవ్వు పలకరిస్తుంటే 
రెక్కలు ముడుచుకున్న వాన చినుకునై పుడమంతా తొలకరిస్తుంటాను 

మధూలికవై నువ్వు లోకాన్ని నర్తిస్తున్నప్పుడల్లా 
గాలి రేణువునై నిన్ను విస్తృత పరిచేస్తుంటాను 

నేనొక  ఉద్వేగపు సడిలో పొర్లిపోతున్నప్పుడల్లా
నువ్వొక  తుషారలిపివై నీ వడిలో నను లాలిస్తూ 
నీలో నన్ను లయం చేసుకకుంటుంటే తెలిసింది 
నువ్వు కవిత్వమైన ప్రతిసారి నన్ను అక్షరంగా పొదవుకుంటావని 
ఏయ్… ఏమి మహిమోయ్ నీది…!

Wednesday, 23 March 2016

నిషిద్ధ మంత్రం



నీకు నేను నాకు నువ్వు
మృగత్వంగా మారిన
క్షణాల మోత బరువులో
లోకానికి మనిషి అరుదయిన వార్తలు
ఇప్పుడసలు వింతలే కాదు

మనిషికి మనిషి భయమవుతున్న చోట
ప్రకృతి ప్రకోపించటం
ప్రళయాన్ని ఆలపించటం
ఎప్పటికప్పుడు వార్తా యంత్రాలలో
ముద్రితమవుతూ ఉన్నప్పుడల్లా
నెపాలని కాలానికి మనమంటించిన
కలిముద్రలమీద వేసేసి
మనం మాత్రం పవిత్ర జీవాలైపోతాం

తప్పేముందిలే
ఎవరికివారు తమదే చివరి ఊపిరన్నట్లుగా
స్వార్ధమవుతున్న చోట
పాపం పుణ్యం అన్నీ సామాజిక ధర్మాలవుతుంటే
ఒకరికి ఒకరు నిషిద్ధ మంత్రాలే

Monday, 21 March 2016

ఇంద్రజాలం



నిజమే
భ్రమలని ప్రేమించటం
కలలని రమించటం మొదలు పెట్టాక
ఇంద్రజాలాలూ ఇంద్రధనుస్సులూ
ఎప్పుడూ నచ్చేస్తుంటాయ్
శూన్యాలూ ఎప్పుడూ అంతే మరి
కొత్త కొత్తగా మత్తుజల్లుతూ
నీ ప్రతి సమయాన్నీ గడ్డ కట్టిస్తూ ఉంటాయ్
మట్టి వాసనని వదిలేసినప్పుడే
జీవం నిన్ను బహిష్కరించిందన్న సంగతి
నీకు చేరవెయ్యగలిగే స్వచ్ఛహృదయాలకి
కొరత వచ్చేసిందిప్పుడు
ఎందుకంటే
ప్రపంచమిప్పుడు కుగ్రామం కదా మరి
హృదయాలూ కుంచించుకు పోయాయి.

నడక


ఇన్నేళ్ళ ప్రయాణంలో
నీదంటూ
ఒక్క అడుగూ లిఖించబడ్డ నేల
కానరాకపోవటం
నేల సాంద్రత ఎక్కువవ్వటమేమీ కాదు
నీకింకా నడక కుదరక పోవడం
కాదనలేని నిజమే ఇది
కాళ్ళ మీద నమ్మకం కుదిరేంతవరకూ
నడకకు పట్టు చిక్కదు
తడబాటు పడని నడకలకి
గమ్యాల వరద వెల్లువవడం
అడుగులన్నీ చరిత్రలో ముద్రితమవ్వటం
చర్వితచరణమే

Sunday, 20 March 2016

ప్రపంచమంత నవ్వు



ఖాళీ చేసుకున్న మనసులో
లోకాన్నంతా కూర్చేద్దాం అనుకున్న
ప్రతీసారీ
మరింత శూన్యం పోగుపడుతుంది కానీ
నిండారా నిన్ను పూయించే
నవ్వు జాడ మాత్రం
ఏ నిషిద్ధ మంత్రలిపిలోనో
చిక్కుబడిపోతుంది
మరి… ఆశలకి అంతులేని చోటు
ఏ ఆనందాలకూ చిరునామా అవ్వదుగా
అయినా మించి పోయేదేమీ లేదు
ప్రపంచమంత నవ్వు చేరువవుతుంది
అన్ని ఖాళీతనాలలో
నిన్ను నువ్వు స్వచ్ఛంగా నింపుకోవటం మొదలు పెడితే

Saturday, 19 March 2016

చద్మ వేషం



ఊపిరి కమ్మిన అద్దంపై
తను రాసిన అశ్రువొక్కటి
ఒక అబద్ధపు ముఖాన్ని పలచగా కప్పేసింది, నిజానికి ముసుగే నప్పినట్లుంది

జీవన తూకాలని తకరారు చేస్తుంది
ఆషాడభూతిత్వమెక్కువైన సానుభూతి ఒకటి
ప్రపంచం చాలా మంచిది, లోతు చూడకుండానే తోడుంటానంటుంది

గోడలన్నీ చెమ్మగిల్లే కథలు
ఆమె చెప్తూ ఉంది
అతనేమో బయటెక్కడో తడి తడిగా కురిసేస్తున్నాడు

ఆమె ఒంటరితనం కురుస్తున్నప్పుడల్లా
అక్కడ సమూహాలు గుంపు కట్టాయ్
అతని వెలివాడకై రహదారి సిద్దం చేస్తూ

కథలేమోకానీ
కొన్ని జీవితాలు మాత్రం ఎప్పుడూ మూగగా ఉండటమే
ఓదార్పుని సిద్ధం చేసుకున్న లోకపు చారిత్రిక అవసరం

చద్మవేషధారణతో నిండిన లోకతత్వంలో
పరాయి అంతరంగం అంతుబట్టదు
అణువణువునా కాపు కాసినా

చిలకకొయ్యనుండి కోసుకు వస్తున్న
అనేకానేక ముఖాల వ్యధల కొలువులో
ఏ కన్నీరూ నిజాలు కురియదు

సమానత్వమంటే ఏ ఒక్క వైపో తూగుతున్నంతసేపూ
నిజంగా రాలే ప్రతి కన్నీటి బొట్టుకీ లెక్కగట్టగలిగే నేర్పు
ఈ ప్రపంచం ఇంకా నేర్వలేదు

నిద్ర పోనివ్వలేదు



గ్రీష్మ తాపంతో మంటెక్కిన భూమి దాహం తీర్చుతూ
తొలకరి అద్దిన మధుర వాసనతో
ప్రకృతిలో మమేకమై అనేకాలుగా అనుభూతిస్తున్న
మనసుకి ఆనందాన్ని అనంతం చేద్దామనుకుందేమో
ఈ మట్టి నన్ను నిద్ర పోనివ్వలేదు ఇన్నాళ్ళూ

వసంతాన్ని తనువుకద్దుకున్న తరువుని
చల్లగా స్పర్శిస్తూ
తన వీవెనలతో తలలూపుతున్న చిగురాకు హొయలని
కంటినిండా లిఖిద్దామనుకుందేమో
ఈ గాలి నన్ను నిద్ర పోనివ్వలేదు ఇన్నాళ్ళూ

శూన్య స్మృతులన్నిటినీ తానొడిసిపట్టి
చుక్కల వరుసలతో వెలుగుల దారులు వేసి
కరి మబ్బుల కదలికల కోలాటంతో
చినుకుల కోలాహలం చేద్దాం అనుకుందేమో
ఆ నింగి నిద్ర పోనివ్వలేదు ఇన్నాళ్ళూ

స్వార్ధం తిప్పుతున్న తిరగలి నుండి రాలిపడుతున్న
తిమిరం అలుముకున్న లోకానికి
ఎడతెరగని కాంతిని పరిచయిద్దామనుకుందేమో
నా నరాల్లో స్వేచ్ఛగా జ్వలిస్తూ జ్ఞానప్రమిదలా వెలుగుతూ
ఈ నిప్పు నిద్ర పోనివ్వలేదు ఇన్నాళ్ళూ

యంత్రతనాన్ని అద్దుకుంటూ
పొడిబారుతున్న గుండెలపై
ఎడారులుగా మారుతున్న మనసులపై
తడిసంతకం చేస్తూ చెమ్మగిల్లుదామనుకుందేమో
ఈ నీరు నిద్ర పోనివ్వలేదు ఇన్నాళ్ళూ

పంచభూతాలంటే నిరంతర చైతన్య ప్రవాహికలై
తమ అనిమిషేత్వంతో ప్రకృతిని కాపు కాస్తున్న కరదీపికలు
ఎప్పటికప్పుడు వాటి పవిత్ర స్పర్శతో పునీతమౌతున్నా
జన్మాంతర ధూళినై వాటికి నిత్యార్చన చేస్తూ
నిత్యం ప్రకృతిగా కదలాడుతుంటా... నిరంతర జీవ ప్రవాహాన్నవుతా !