పిడికితంత
నా హృదయం అంతా నిండి పోయిన నీ మీద ప్రేమని విశాలమైన ప్రేమ మందిరం లో ఎటు చూసినా మన
ప్రేమ చిహ్నమే కనిపించే లాంటి అద్దాల గదిలో ఎవ్వరూ తాకలేకుండా ఉండే పంజరం లోని చిలకలా
కాకుండా కళ్యాణ వీణని మోగించే రెక్కలు వచ్చిన విహంగం లా స్వేచ్చగా ఉంచి దానికి
రక్షణ గా పిల్లగాలి తెమ్మెరలనూ, గులాబీ రేకులని మరియు చందన సుకుమార లేపనాలని ఉంచి
తరతరాలకూ మాయకుండా చెయ్యాలని ఉంది.
భవిష్యత్తరాల వారు ఈ అపురూపమైన ప్రేమ మందిరాన్ని గురించిన విశేషాలని ప్రేమికుల పాఠ్యాంశాల్లో చదువుకుని మన ప్రేమని ఒక అపురూపమైన ప్రేమ కధగా భావించి విఫలమైన ప్రేమ కధల సరసన కాకుండా విజయవంతమైన ప్రేమ కధా సంపుటాలలో మొదటి సంపుటి గా మన కధనే ముద్రిస్తే... ఓహ్... ఆ ఆలోచనే అద్భుతం కదూ...
మాయదారి మనస్సు కదా... దానికేం దాని పాటి కది ఎన్నెన్నో కలలు కంటూ ఉంటుంది. అవన్నీ నిజం గా తీరినప్పుడు కలిగే ఆనందం నిజం గా అనిర్వచనీయం కదూ...
ఓ ప్రియా... సఖీ... చెలీ... హనీ... పిలుపేదైతేనేమి? నీ సడి చెయ్యని తలపులని నే తలచలేను. నీవు లేని వలపులు వల్లకాడే కదా నా మదికి? నీ ఊహలలోనే తేలియాడే నా ప్రతి క్షణం నీకే అంకితం.
ఓ సఖీ... నిన్ను గురించిన ఊహల్లో ఉయ్యాల లూగుతూ అనుక్షణం నీతో నే ఉండాలని ఉంది. నీ కన్నా నాకు దగ్గర వారెవరున్నారు ప్రియా? నీ ప్రమేయం లేని నా జీవిత గమనాన్ని ఊహించ గలగటం నా మనసుకి సాధ్యమా?
ఎవరూ తోడులేక ఒంటరినై చీకటి గుయ్యారం లో తిరుగాడే నాకు నీ నయనాల కాంతుల వెలుగులలో కనిపించిన మార్గం సప్త రధారూడుడై తిరుగాడే ఆ సూర్య భగవానుడి కిరణాల వెలుగుల లో నైనా కనిపిస్తుందా?






1 comments:
ఆహాఁ... ప్రేమికుల పాఠ్యాంశాల్లో ముద్రిస్తారేఁ... Jokes apart... ఇది మీ రైటింగ్స్ లోని ఆలోచనాశైలికి చాలా భిన్నంగా ఉన్నట్లు అనిపించింది.
Post a Comment