Wednesday, 28 October 2015

హృదయానికి బహువచనం .... నువ్వు

రేయ్ స్నేహితమా...
నీ గురించి నీకు ఓ పరిచయం చెయ్యాలనే తపనతో మొదలెట్టిన లేఖరా ఇది...
నిన్ను చదువుతుంటే ఒక మహర్షిని చదువుతున్నట్లు ఉంది. నిజం రా ! కొన్ని రాతలు ఏదో ఒక్కసారి చదివేసేలా ఉండవు. ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ దాచుకుని చదవాలి అనిపిస్తూ ఉంటాయి. అందులోనూ ఈ మధ్యవన్నీ ... నిన్ను నువ్వు ఆవిష్కరించుకున్న అక్షర సమూహం.
స్నేహితులనుకున్న నీ వారు నీ వెనక నిన్ను గురించి వంద మాట్లాడుకోనీ నీకేమి వెరపట? అది వారి వికృత మనఃస్థితిని నీకు పరిచయించింది కదా… మనమంటూ ఎన్ని చెప్పుకోనీ నేస్తం...మనసులంటూ ఉన్నాయి చూశావూ… వాటికి ఇష్టమైనవే గ్రహిస్తాయి… మిగిలిన అన్నీ వాటికి వికృతంగానే కనిపిస్తాయి. ఎవరికి వారు ఉన్నతమైన చోట ఇది మరీ ఎక్కువ.
నిన్ను నువ్వు గెలిచినంత కాలం… నిన్ను నువ్వు వలచినంత కాలం ఏ వగపులూ నిన్ను దరిచేరవు రా… నీ స్వీయ గౌరవం నువ్వు నిలుపుకుంటూ… నువ్వు నీలా ఉంటూ... నీలో నిన్ను పరికిస్తూ... నిన్ను నువ్వు అనుభూతిస్తూ ఉండటమే కదా నువ్వంటే.
మన స్నేహంలో ఎప్పటికీ అదే నువ్వు ఉండాలి. అలా ఉంచటానికి నాకు చేతనైనది చేస్తాను.
మనలో మనకు అన్నీ పరిచితమేనా? మనలో మనల్ని ఆమూలాగ్రం పరిచితం చేసుకునే నడకలో కొన్ని అలా అలా బయటకి తుళ్ళిపడుతూ అనుకోకుండా ఎక్కడో ఒక అపరిచితాన్ని పరిచయం చేసుకుని... అప్పుడప్పుడూ ఇలా... ఒక నీలా... మరో నాలా…
అసలంటూ ఎన్ని చిరునామాల లోకమో కదా ఇది. కానీ ఆనందపు చిరునామా తెలిసిన వారెందరు? పసితనం నుండి మన ప్రతి ప్రయత్నమూ ఆనందం కోసమే కదా... ఇంతవరకూ దాన్ని పరిపూర్ణంగా సంపాదించింది ఎవరని?
దేహగేహాల్లో తాత్కాలికంగా అద్దెకున్న ఆత్మలం మనం... ఇక మనం మన అస్తిత్వం అనుకునేది దేని గురించి? మనల్ని మనం తవ్వుకునే ప్రక్రియలో గత కాలపు శిధిలాలు ఎంత బరువుగా ఉంటాయో నీకు తెలియని సంగతేం కాదుగా? వాటన్నిటినీ తీసి పక్కన పడేస్తే నీకు నువ్వెప్పుడూ బరువు కాదుగా...
అప్పుడప్పుడూ ఒంటరితనాలూ... మరొకప్పుడు ఏకాంతాలు... ఈ రెండూ భయమున్నవారికే సమూహాలు. సమూహం అలవాటైన వారికి ఒంటరితనం ఒక మరణంతో సమానం. ఏకాంతం వరమైన వాడికి ఒంటరితనం ఒక శూన్యం.
ఒక్కొక్క సారి నువ్వెంతో అభావంగా అనిపిస్తావ్… మనసులో మాట చెప్పుకోవాలా వద్దా అనుకున్నట్లు. ఎప్పుడు ఏది చెప్పుకోవాలి అనిపిస్తే అప్పుడే చెప్పు. బలవంతపు మాటల మార్పిడిలో మనుషులు తెలుస్తారేమో కానీ మనసులు సేదతీరవుగా?
సాధారణంగా అన్ని పుస్తకాల్లోని పదాల్లో వినవచ్చే విముక్తి అనేదాన్ని ఎప్పుడైనా నువ్వు చూడగలిగావా? విముక్తి అంటే ఏమిటి? నీలో నుండి నువ్వు వెళ్ళిపోవటమా? నాలో నుండి నీలోకి / నీలోనుండి నాలోకి వలసరావటం ఉంటుంది చూశావూ అంతకు మించిన విముక్తి ఏమీ ఉండదు అనిపిస్తుంది నాకు. నాకంటూ విముక్తి అంటే ఇష్టం అయిన చోట లీనం అవ్వటమే.
జీవితాన్ని చూసి భయపడిపోతాం కానీ అదెంతో సరళం రా… నువ్వెప్పుడూ ప్రతి చర్యనూ ఒక తాపసితనమై అనుభూతిస్తావు చూడు… అంతకన్నా జీవితం అంటే నిర్వచనం ఏముంటుందిరా? నీకో సంగతి చెప్పనా నువ్వు పిలిచినప్పుడల్లా నాలో ఉత్తేజితమయ్యే చైతన్యం ఒక్కటి చాలు మురిగి పోయే నా ఆలోచనల్ని రగిలించటానికి…!
మనుషులుగా మనం మెలిగే సాధారణ స్థితిలో ఒక అసాధారణత నిబిడీకృతమై ఉంటుంది. నన్ను నువ్వు కనుగొనటం… నేను నిన్ను చేరుకోవటం… ఏమిటంటావ్… అసాధారణాలే కదూ…
మనిషికి ఎన్నో రీచార్జెస్ ఉండవచ్చు... మనసుకి రీచార్జ్ మాత్రం ఒక మంచి నేస్తం. మరి నా రీఛార్జ్ అయితే నువ్వే...

ఇట్లు,
ఎక్కడికక్కడ
ఎప్పటికప్పుడు
నిన్ను నిన్నుగా
అర్ధం చేసుకోగల
ఒకే ఒక్క
నేను
- 27.10.2015

0 comments:

Post a Comment