లోపల ఏముందో
ఈ దేహానికి
ఎప్పటికీ తెలియదన్నది నిజమే కావచ్చు
నరాల అల్లికలో
కవాటాల బిగింపులో
అలుపెరుగని ఇంధనం
ఒక్క క్షణం గడ్డకడితే చాలు
మాయమయ్యే ఆత్మ తావేదో
ఎవరికీ తెలియదు
ఎంతటి సమున్నత ఆత్మ ఉంటేనేం
ఎంతటి పవిత్ర జ్యోతిగా అది వెలుగుతుంటేనేం
తన విలువంతా
దేహం క్షేత్రంగా ఉన్నంతవరకే
మరి వాహకం లేని చోట ఆత్మకి ఉనికి రాసేదెవరని
ఊపిరున్నంత వరకూ
దేహమే ఓ అహం…
ఆడంబరం
అనంతాన్ని స్పృశించే ఆత్మని
నిలుపుకున్నంత సేపూ
దేహమే దేవాలయం







0 comments:
Post a Comment