Wednesday, 5 April 2017

నరకానికి వేళయ్యింది

ఎందుకే పుట్టుకా? 
వద్దన్నా ఉరుకిరికి వస్తావ్.
ఆశల మొగ్గలు విచ్చుకునేలోగా... 
బతుకొక పోరు నేర్చుకొనేలోగా
నువ్వే  నేను విడువలేని నేస్తమంటూ 
మృత్యువును  కౌగలించుకుంటావ్

ఊహగా నీ ఉనికెంత మధురమో 
ఊపిరిగా ఈ  బ్రతుకంత నరకం
అందుకే వద్దు .. 
మా ఇంటి గడప నువ్వు తొక్క వద్దు 
గడప గడపకీ బొట్టెట్టి చెపుతా... 
అసలు పుట్టుకనే రానివ్వద్దని

చిట్టి మొలకగా వచ్చి 
మానుగా నిలదొక్కుకుంటున్నప్పుడు.
ఒక్క పెనుగాలిలా వీచే రాక్షసత్వానికి
కూలిపోతున్న నిన్ను చూసి
కన్నీరింకిపోతున్న గుండె బరువుని 
తట్టుకునే ఓపిక లేదు 

నువ్వొచ్చి తట్టిన 
మనసు పొరల వెనుక తడిని
ప్రాణధారవై నువ్వు తాకిన 
మైదానాల శబ్దాన్ని
వెన్నెల యేరువై 
అలలు అలలుగా సాగిన 
నీ జీవన ప్రవాహాన్ని 
ఒక్క మాటుగా చెరిపేసే 
కర్కశత్వానికి నిన్ను బలిచేసే బతుకుకన్నా

నువ్వంటూ లేని 
ఈ గొడ్డుమోతుదనంలో  
మోడులా వెల్లమారిపోవటంలో 
జీవితాన్ని దాటేస్తూ
లోకానికి మనిషి ఊపిరిని 
పలుచన చేసేస్తాం 

  



1 comments:

An impossible thought with superb expression! :)

Post a Comment