మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 9 November 2014

ఏయ్ మనిషీ....

ఏయ్ మనిషీ....
బాగున్నావా...?
నీకేం నువ్వెప్పుడూ బాగానే ఉన్నాను అని అనుకుంటావ్ లే.
బాగా బతికేస్తున్నాననుకుంటూ నువ్వు చేసే భ్రమల ప్రయాణపు తీరంలో ఆఖరి అలగా నువ్వు తాకటం ఎదురు చూడాలని ఉంది. నువ్వు ఈ గమ్యం చేరే క్షణాలలో నీ కళ్ళు పలికే నిస్తేజంతో మాట్లాడాలని ఉంది. అవి చెప్పే కథలు వినాలని ఉంది.
కురిసే జీవితాన్ని ఖాతరు చెయ్యక ఆశల వేదికగా నువ్వు నిర్మించుకున్న బతుకు భవంతి లక్కా గృహమని నీకు తెలిసే సరికి నీ వాళ్ళందరినీ విడిచి మరో లోకపు రహదారుల్లో నువ్వు ఒంటరి ప్రయాణం చేస్తుంటావ్. నీకు తెలియకుండానే నువ్వు చిదిమేసిన జీవుల జీవితాల లెక్కలు చూడటానికి చిత్రగుప్తుడు కొత్తచిట్టా మొదలెట్టాలేమో.
ముఖానికి అద్దం... మనస్సుకి అంతరాత్మ... సత్య పేటికలే కదా...! వాటిని చూసి మనిషి తన లోపాల్నిసరి దిద్దుకుంటాడులే అని నిశ్చింతగా నిద్రించే ఆ భగవంతుడికి ఏమి తెలుసు...? దేనికైనా మేకప్పులు వెయ్యటం నేర్చుకున్న నీ పనితనం గూర్చి. కావాలంటే క్షణానికో కొత్త భగవంతుడినే సృష్టించగలిగే సృష్టికర్తవు అయ్యావని ఆ కలలోనైనా తెలుస్తుందో లేదో పాపం.
నీ కోరికల దాహానికి తను వసించే ఈ నేల చాలటం లేదని గ్రహాంతర యానాలు మొదలు పెట్టిన నువ్వు ఎప్పుడో ఒకప్పుడు తన పాల సముద్రాన్ని సైతం బురద చెరువుగా కైలాసాన్ని కూడా బూడిద కొండగా మార్చగలిగినంత కాలుష్యం చెందావని జీవాన్ని మనిషీకరించిన ఆ దేవ దేవుడు ఎప్పటికైనా తెలుసుకుంటాడా...? తెలుసుకునే వరకూ తానైనా మిగిలి ఉంటాడా?
నీ నాగరికతకి భూమిని బలి చేసిన నువ్వు తన తదుపరి లక్ష్యంగా విశ్వాన్ని ఎంచుకుని తనతో పాటు ఇంకెవ్వరినీ ప్రశాంతంగా ఉంచలేని స్థితికి వచ్చేసావని అభివృద్ధి పేరుతో నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వు నరుక్కుంటూ నీతో పాటుగా విశ్వంలో అన్ని ప్రాణులనీ శూన్యంలోకి తీసుకుని వెళ్ళేలా ఉన్నావనీ... ఆ భగవంతుడికి లిప్తపాటు క్షణం పాటైనా తెలిస్తే బాగుండు కదా... (అసలుంటూ ఉండి ఉంటే)
మీ నాగరికత లెక్కల్లో సమాధిలోకి జారి పోయిన జీవ జాలాల ఉసురు అనుకోని ఉత్పాతాలుగా మారి ఇప్పటికే మిమ్మల్ని వెన్నాడుతున్నా నిద్ర నటిస్తూ నిన్ను నువ్వు చేసుకుంటున్న మోసం యమపాశమై నిను చుట్టిన ఆ క్షణాల వేదికపై నీలో కనిపించే పశ్చాత్తాపం చూడ బోయే రోజు అతి త్వరలో వచ్చేలా ఉందని అనిపిస్తుంటేనే నాకు నీ మీద జాలి కలుగుతుంది.
ఏ స్వజాతిలోనూ లేని వర్గ వైషమ్యాల కోరల్లో అసూయా ద్వేషాల చెరల్లో చిక్కి సాటి మనుషుల మీద నువ్వు సాగించే యుద్ధంలో సమిధగా మారుతున్న విశ్వాన్ని తలచుకుంటుంటే అసలు మీ జాతి ఎందుకు పుట్టిందా అని నాకే అంతులేని చింతగా ఉంది.
నీ వాళ్ళందరినీ విడిచి ఒంటరి ప్రయాణం చేస్తుంటావ్ అని ఏదో అన్నాను కానీ... ఏదైనా వింత జరిగి అన్ని ప్రాణులూ... అన్ని జీవజాతులు అలానే ఉండి మీ మానవ జాతి ఒక్కటే అంతమొందితే కానీ నాకు నిశ్చింత కలిగేలా లేదు.
నీ సాటి మనిషిని నువ్వు చెవులతో చదువుతూ రంగుతో కొలుస్తూ నాగరికపు మేధావితనాల ముసుగులో సకల చరాచర జగత్తుపై నువ్వు సాగించే దమనకాండకి చింతిస్తూ లిప్తపాటు క్షణమైనా ఒక్క అశ్రువు కార్చి చూడు మార్పు మొదలవుతుంది... మొక్క పెరుగుతుంది... చెట్టు నిలుస్తుంది... మేఘం కురుస్తుంది... ప్రకృతి మురుస్తుంది...
నువ్వు మారితే నాకంటే సంతోషం ఎవరికీ ఉండదు...
మరి మారి చూపించవూ...
ఇట్లు...
నీ గమనం మొత్తానికి ససాక్ష్యంగా నిలిచిన
కాలం

- సురేష్ రావి 09.11.14


చదవని కథలు

పుస్తకాలకందని లెక్కలే 
జీవితం కురిసే క్షణాలన్నీ

పాఠకుణ్ణి చేరని కథల్లో 
అక్షరాలు తడసిన వ్యధలెన్నో

చెట్టనేది మిగలదు ప్రపంచంలో
గోడలకి తెలిసిన కథలన్నీ కాగితాల కెక్కిస్తే

చదువరికి అలవాటులేని అక్షరాల నడతలా
అటూ ఇటూ ఎటూ కాకుండా నడిచే
వాస్తవగాథల తడిలోతుల కన్నా
ఈ లోకంలో ఏ కడలి లోతులెక్కువ

కొలతలుగా కారే కన్నీళ్లు
తూనికేసిన శాంతి వచనాలు
ప్లాస్టిక్ పూసిన నవ్వులు
ఇవే కదా వాస్తవ జీవిత నవీన పార్శ్వాలు

ఆ కన్నీటికే తెలియదు
కారే ప్రతి కన్నీటి బొట్టులో తడి ఉండదని...
ఆ వచనానికీ తెలియదు
అన్ని వచనాల్లోనూ శాంతి ఉండదని...
ఆ నవ్వులకీ తెలియదు
జీవమున్ననవ్వంటే ఎలా ఉంటుందో...
ఎక్కడి కథలక్కడే గప్ చుప్ అనుకుంటూ
సాగే జీవితాలనుండి వచ్చే కథలకే విలువిక్కడ

Tuesday, 4 November 2014

వెన్నెల శ్లోకం

చందన సమీరాలు కురిసే నీ ఊపిరిని 
నా శ్వాసలో ఒంపేస్తూ 
నీకన్నీ నేనేరా అంటూ నాలో కరిగిపోతూ 
నువ్వు నిరాకారివే అయిపోతున్న ఆ క్షణాన 
వర్షించవూ నీ వలపుల వేదాన్ని 
జాబిలి పాడిన వెన్నెల శ్లోకంలా

మలినమంటని మధూలికవై 
తుషారంలో స్నానించిన మౌనకీర్తనలా నువ్వూ... 
సుప్రభాత గీతాలకి ప్రత్యూష వర్ణాల స్పర్శలా
నీ ఉనికికి నా ఊపిరద్దుతూ నేనూ 
జత కలువలమై అల్లుకు పోతున్న ఆ క్షణాన 
ఒకరికొకరం చెమ్మగిల్లిన అద్దాలం కదూ...

నీ చెక్కిళ్ళపై నే చేవ్రాలు చేస్తుంటే
చందనాలు కురుస్తున్న చప్పుడు వింటూ 
స్వప్న వీధుల్లో నీతో సంచరిస్తుంటే
ఆవిరైపోతున్న నిద్రల లెక్కలు దాటాక 
నీ సింధూరమే రవికిరణమవ్వగా 
మదిలోని కల్మషమంతా ఆవిరవ్వదూ

కలల లోకాన్ని రెప్పల తెరలపై స్పర్శించేసాక 
కనుపాపలకి అనుభవమవుతున్న వాస్తవ స్పర్శలో 
అణువంత అలజడి చాలదూ 
నీ ఎద జడి నా కళ్ళల్లో ప్రవహించటానికి
ఒక్క తడిపిలుపు చాలదూ 
నా జీవితం నీ గుండెకు కవచమవ్వటానికి

ఆకలి

అన్నాన్ని కలగంటున్నా...
ఆకలి కళ్ళుమూస్తూ...!
***
రాతి బొమ్మలకేమో రంగురాళ్ళ ఉంగరాలట...
ఆకలి కడుపులకి గంజినీళ్ళూ కరువట...!
***
ప్రతి రాత్రీ మరణశయ్యే వారికి...
ఆకలినీ మనసునీ ఒకేసారి చంపుతూ...!
***
హంతకుడిగా మారాలనిఉంది...
అన్నార్తుల ఆకలిని హత్య చెయ్యడానికి...!
***
ఆకలికి ఎంత గర్వమో...
మనిషింకా తనని గెలవలేదని..!
***
కరువు తల్లికి పస్తుల పండుగ
ఆకలి డొక్కల సవ్వడి మేళాలతో..!
***
అమ్మ చేతి ముద్ద
లేని ఆకలిని పుట్టిస్తూ...!
***
అంటరానిదైతే బాగుండు ఆకలి
కడుపెప్పుడూ నిండి ఉండేలా...!
***
ఎవెరెవరి తప్పులో...
అన్నదాత కడుపులో ఆకలి రాజేస్తూ...!
***
మట్టిపై మనిషి చేసే స్వేదసంతకం..
ఆకలి కడుపుకి అన్నపూర్ణలా అంకితమౌతూ...!

Sunday, 2 November 2014

మృత్యు స్పర్శ


క్షణాల్లో కబురు సెల్ ఫోన్కెక్కింది
చచ్చి పీనుగయ్యాడట నేడు
ముల్లుగర్ర పోటీతో నిన్నంతా నడచిన ముసలోడు 
ఒక నాటి నిలువెత్తు మనిషి
అంతకు ముందు బండల్నీ పిండిచేసిన ఆ మొనగాడు

వాకిట్లో...

పీనుగ కాడికెత్తకుండా
ఊళ్ళో పొయ్యి రాజేయ్యగూడదట
కబురు తెలియగానే
కడుపు నింపుకొచ్చిన
ఊరిపెద్దల హడావిడి
రావాల్సిన వారు వచ్చేసారా
ఆలస్యం అయితే పీనుగ
వాసన వచ్చేస్తుందంటూ...

విడతలు విడతలుగా బంధుజనం
కళ్ళల్లోకి తెచ్చుకున్న కాస్తంత దిగులుతో
ఓ చెంచాడు దుఃఖం వేసిన రెండు మాటల పలకరింపుతో
పెదాల కొనలు జారిన పలుకులతో కొన్ని పరామర్శలు
వచ్చిన వాళ్ళమీద పోయిన వారికున్న మమకారాలు
కొత్త చుట్టం రాగానే పెల్లుబికుతున్న ఆర్తనాదాలు

పలకరింపుల కొలతలవగానే నీడకు చేరిన ఓదార్పు జాడలు
షామియానా కింద కుశల ప్రశ్నల బాతాఖానీలు
పిల్లల అమెరికా ఉద్యోగాల గర్వాలు
ఊళ్ళో ప్లాట్లుగా మారుతున్న పొలాలకి వస్తున్న గిరాకీలు
తరిగిపోతున్న రాజకీయ విలువలు చర్చలు
ఎన్నెన్ని విషయాలో లోకం అంతా అక్కడి పెదాల్లోనే నానిపోతూ

ఆ వాకిలికే వాక్కు వస్తే అందరి బతుకులూ వెటకారాలే

నట్టింట్లో...

వీలునామాల వెదుకులాటలు
ఎప్పుడో పంచిచ్చిన పొలం గురించి తగాదాలు
వచ్చే వాటాని బట్టే చెయ్యాల్సిన జమాఖర్చుల జంఝాటాలు
పుట్టింటి బంగారం మీద ఒకరికి మమకారం
అత్తింటి పసిడి తనదంటూ మరొకరి అధికారం
భాధ్యతతో పంపకాలేసిందో పెద్దరికం

సాయం అడుగుతారేమోననుకుంటూ
బావగారు చెప్పే అప్పుల చిట్టాలు
దిన కర్మలు ఘనంగా చెయ్యాలంటూ
ఆడపడచుల ఉచిత సలహాలు
ఎవరి దగ్గర ఎన్ని రోజులు అంటూ
తలచెడి తల్లడిల్లుతున్న తల్లి బతుకు మీద జూదాలు

లెక్కలన్నీ తేలిపోయాయిగా
కార్యక్రమాలు మొదలెట్టేయ్యాలట
దండగ మారి ఖర్చయినా లోకం కోసమన్నా
సిమెంట్ బెంచీ మీద పేర్లు చెక్కించాలి
పోయినోళ్ళదేమో గానీ మన పేరు శాశ్వతమయ్యేలా
అనుకునే కొడుకుల మనో వాంఛితాలు

పాడెనెత్త రమ్మంటే
వింత వింత కారణాలతో
నలుగురు బంధువులూ ముందుకురాని
సంఘటిత సమాజపు బతుకు చిత్రమిదిలే

ఆ ఇంటిగోడలకే జీవం ఉంటే నట్టింట్లో కన్నీళ్ళ వరదలే

***

బరువు తగ్గిన వీధరుగు బావురుమంటుంది
వెన్ను తట్టే బక్క పలచని దేహపు స్పర్శ ఇక లేదని తెలిసిందనుకుంటా
రచ్చబండ మధ్యలో రావి చెట్టు ఎదురు చూస్తూనే ఉంది
టీవీల రోజుల్లోనూ తనను రోజూ పలకరించే ఒకే ఒక్క నేస్తం ఇంకా రాలేదని

Saturday, 1 November 2014

అతివనే..

(అంతర్జాల పత్రిక కౌముది నవంబర్ సంచికలో ప్రచురింపబడిన నా కవిత 'అతివనే')

ఇంకా పుట్టనే లేదు...
హత్య చేయబడ్డాను 
ఎందుకంటే
నేనొక గర్భస్థ ఆడపిండాన్ని
ఇంకా కన్ను తెరవనే లేదు
చెత్తకుప్పలో విసిరేయబడ్డాను
ఎందుకంటే
నా తల్లో ‘కన్నె’పిల్ల మరి
ఇంకా బాల్యపు స్పర్శ వీడనే లేదు
తిమిరంలో కరిగిపోతున్నాను
ఎందుకంటే
నేనో కలలు కాటేసిన కౌమారాన్ని
ఇంకా కళ్ళకి కలల తడి తాకనే లేదు
నడిరోడ్డుకి వార్తనయ్యాను
ఎందుకంటే
నేనో కీచకుల గుంపుకి చిక్కిన అబలని
ఇంకా తొలి జీతం అందుకోలేదు
నా మానానికి ముప్పొచ్చింది
ఎందుకంటే
కార్యాలయంలో నేనో కొత్తపిల్లని
ఇంకా ప్రేమ ఊసులు మరవనే లేదు
మా ఇంటి దూలానికి ఉరివేయబడ్డాను
ఎందుకంటే
మా కులానికి పరువు పరదాలున్నాయని
ఇంకా కాళ్ళ పారాణి ఆరనేలేదు
నట్టింట్లో అగ్నికి ఆహుతయ్యాను
ఎందుకంటే
వరకట్న పిశాచుల నిలయమది
ఇంకా మమతలకర్ధం తెలియనే లేదు
స్వేచ్ఛ చచ్చిన మానవ యంత్రానయ్యా
ఎందుకంటే
నేనో మాంగల్యమేసుకున్న ముత్తైదువని
ఇంకా కన్నపేగు పిచ్చి తీరనేలేదు
బిడ్డలకి నా పొడే గిట్టటం లేదు
ఎందుకంటే
నేను ఏమీ తెలియని అమ్మని మరి
ఇంకా ఆయన నా కళ్ళలోనే ఉన్నారు 
అయినా నేనెదురొస్తే అరిష్టమంటున్నారు 
ఎందుకంటే 
నే తల చెడిన విధవని మరి


Friday, 31 October 2014

వెన్నెల కుసుమం - 25 (ఎన్నడూ ముగియని ప్రణయ లేఖ)


హనీ...

నీ ముక్కుని ఏమని పోల్చను విశాఖ సాగర తీరంలో దొరికిన అందమైన గవ్వలా ఉందని చెప్పనా? సంపెంగ పూల తోటలో విరిసిన ఓ అపురూపమైన సంపెంగ పూవులా ఉందని చెప్పనా? ఏమని చెప్పను? చెప్పు ప్రియతమా...

హిమాలయ పర్వత శ్రేణులలో నునుపైన ఓ సుందరమైన హిమ పర్వతపు కొనలా ఉంది కదా నీ నాసిక. ముక్కు చూడు ముక్కందం చూడు అని చెప్పిన మహానుభావుడు ఎవరో కానీ నిన్ను చూసిన తరువాతే ఆ మాట అని ఉంటాడు. ఎందుకంటే ఇంత అందమైన నాసిక ఈ భూమండలంలో ఎవరికీ లేదు కదా. ఇంత అందమైన సోయగాలున్న నిన్ను పొందే అదృష్టం మాత్రం నాదే కదా ప్రియా..! 

నిండు పున్నమి జాబిల్లిని రెండు ముక్కలుగా చేసి నీ చెక్కిళ్ళగా తీర్చి దిద్దినట్లు ఉన్నాడు ఆ బ్రహ్మ. అందుకే వెన్నెల కాంతులతో పాటు హేమంతపు చల్లదనాన్ని కూడా ప్రసాదిస్తున్నాయి నునుపైన నీ చెక్కిళ్ళు. 

గులాబీలని చూర్ణం చేసి ఆ వచ్చిన లేపనాన్ని నీ చెక్కిళ్ళపై మర్ధన చేసాడేమో ఆ సృష్టి కర్త. ఎంత సొగసు... ఎన్ని అందాలు దాచుకున్నాయో కదా నునుపైన నీ చెక్కిళ్ళు. పసిడి కాంతులీనుతూ చామంతుల సోయగాలతో అలరిస్తున్నాయి. ఎర్రగా కందినట్లున్న నీ చెంపలు గులాబీల కాంతులని తమలో దాచుకున్నాయి. 

వెన్నెల కిరణాన్ని అమృత కలశం లో ముంచి వెండి ముద్దని హేమంతపు మంచు బిందువుల చల్లదనంతో రంగరించి గులాబీ రేకుల మృదుత్వాన్ని వాటి వర్ణంతోనే కలగలిపి అర్ధచంద్రాకారపు ముక్కలుగా కోసి వాటిని నీ నాసిక కింది భాగంలో అద్భుతమైన వంపుతో అతికించినట్లు ఉన్నాయి ప్రియా నీ అధరాలు.

నీ పెదవులని చూసి అవి సుమాలేమో అని భ్రమించి వెంచేస్తున్న అల్లరి తుమ్మెదలు అవి పువ్వులు కాదు నీ అధరాలు అని గ్రహించి తెల్లబోయి తాము వచ్చిన దారినే మరలిపోతున్నాయి.

నీ పెదవులపై పలికే భావంలోనే నా ప్రాణం నిక్షిప్తమై ఉంది. మృదు మధురమైన నీ అధర సుధలని గ్రోలాలని నీ పెదవుల సోయగాలని మీటాలని నా అధరాలు ఆశగా చూస్తున్నాయి. 

మధువులూరే నీ పెదవులపై నా పెదవులతో నీ అధరామృతాన్ని గ్రోలుతూ అమరత్వాన్ని పొందుదామని నా ఆశ. 

ఓ వెన్నెల కన్యా! ఘనరూపాన్ని పొందిన అమృతం నీ పెదవులుగా మారి ఉంటుంది. అందుకే నీ అధరాల్లో అనంతమై మధువులూరుతూ ఉన్నాయి. 

నీ 
...రేష్

Wednesday, 1 October 2014

వెన్నెల కుసుమం - 24 (ఇది ఎన్నడూ ముగియని ప్రణయ లేఖ)

హనీ...

ఏమని వర్ణించను నీ సోగకళ్ళ సోయగాలని...?  పేరుకి మాత్రం  కళ్ళే కానీ నిజానికి అవి...

కలల పుప్పొడిని నింపుకున్న కలువ రేకుల్లా ఉన్న వలపు వాకిళ్ళు
కృష్ణుని మేని వర్ణాన్ని కాటుకగా అంచులలో అద్దుకున్న వన్నెల పొదరిళ్ళు 
లోకంలో ఉన్న శాంతాన్నంతా పోత పోసినంత ప్రశాంతంగా వెన్నెల నడయాడే లోగిళ్ళు
ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసి పడుతూ కులుకులాడే కిన్నెరసాని కిల కిలల పరవళ్ళు
కోడె వయసు కుర్రాడి నుండి మూడు కాళ్ళ ముదుసలిని కూడా కట్టివేసే సుతిమెత్తని సంకెళ్ళు
ప్రాణ సఖుని సడి కోసం నిదుర మరచి  విరహాగ్నితో రగులుతున్న నెగళ్లు
పరువమంతా పరచిన పడతుల వైపూ చూపు మరల్చనివ్వని మాయ లేళ్ళు
జాబిలిని  ప్రమిదలలో నింపి వెన్నెలలో స్నానమాడుతున్న సోయగాల సెలయేళ్ళు

నిజం చెప్పాలి అంటే నీ నయన సరాగాలని వర్ణించటం కవి కాళిదాసుకైనా చాలా కష్టం రా... నేను కాళిదాసు కంటే గొప్ప వాడిని ఐతే  కాదు కానీ నీ కను రెప్పల కౌగిలిలో కలలా చిక్కుకు పోవాలని తపన పడుతున్న  ప్రేమ పిపాసిని.

నీ కలల సుమాల దొంతరల పరిమళాలు ఆఘ్రాణించటానికి  ఆఘమేఘాల మీద వాలిపోవాలని పిస్తుంది స్వప్న కావ్యాలంటిన  నీ కళ్ళలో...

ప్రతి శబ్దాన్ని నిశ్శబ్దిస్తూ మౌనంలో తడుస్తున్న నీ కళ్ళని చూస్తూ కన్నీటికి అర్ధం తెలియని తడి అంటని నీ రెప్పల కుడ్యాల్లో కలగా నిరంతరం పయనిస్తూ ఉండాలని... నీ కన్నుల ఆవరణలే నా రూపానికి ఆట మైదానాలుగా మారిపోవాలని  ఆ కంటికి అంతులేని నవ్వుల కిరణాల ఉషస్సునై నేనక్కడే నిలిచిపోవాలని ఆ భగవంతుని కోరుతూ తపస్సు చెయ్యాలని అనిపిస్తుంది.

అందరూ పెదవులతో చెప్పే భాష్యాలన్నీ నీకైతే కళ్ళలోనే పలుకుతున్నాయ్... ఇక నయన కావ్యాలకి శ్రీకారం చుట్టవచ్చేమో మరి...


కన్నె ఆశలన్నీ కళ్ళ ప్రమిదల్లో ఆశా దీపాలుగా వెలుగుతూ కంటి పాపలు రెప్పలు దాచే ప్రణయ పత్రాల్లా పరిమళిస్తుంటే... కంటి రెప్పల చివర ఉన్న నూగారు వెంట్రుకలు కలలను చిత్రించే కుంచెలా అన్నట్లుగా అనిపిస్తూ రెప్పల వీణలు మోసే స్వర తంత్రుల్లా... అగుపిస్తూ....  తలచుకుంటుంటే  ఓహ్.... మనసంతా అలౌకికానందమే...

... రేష్