Sunday, 2 November 2014

మృత్యు స్పర్శ


క్షణాల్లో కబురు సెల్ ఫోన్కెక్కింది
చచ్చి పీనుగయ్యాడట నేడు
ముల్లుగర్ర పోటీతో నిన్నంతా నడచిన ముసలోడు 
ఒక నాటి నిలువెత్తు మనిషి
అంతకు ముందు బండల్నీ పిండిచేసిన ఆ మొనగాడు

వాకిట్లో...

పీనుగ కాడికెత్తకుండా
ఊళ్ళో పొయ్యి రాజేయ్యగూడదట
కబురు తెలియగానే
కడుపు నింపుకొచ్చిన
ఊరిపెద్దల హడావిడి
రావాల్సిన వారు వచ్చేసారా
ఆలస్యం అయితే పీనుగ
వాసన వచ్చేస్తుందంటూ...

విడతలు విడతలుగా బంధుజనం
కళ్ళల్లోకి తెచ్చుకున్న కాస్తంత దిగులుతో
ఓ చెంచాడు దుఃఖం వేసిన రెండు మాటల పలకరింపుతో
పెదాల కొనలు జారిన పలుకులతో కొన్ని పరామర్శలు
వచ్చిన వాళ్ళమీద పోయిన వారికున్న మమకారాలు
కొత్త చుట్టం రాగానే పెల్లుబికుతున్న ఆర్తనాదాలు

పలకరింపుల కొలతలవగానే నీడకు చేరిన ఓదార్పు జాడలు
షామియానా కింద కుశల ప్రశ్నల బాతాఖానీలు
పిల్లల అమెరికా ఉద్యోగాల గర్వాలు
ఊళ్ళో ప్లాట్లుగా మారుతున్న పొలాలకి వస్తున్న గిరాకీలు
తరిగిపోతున్న రాజకీయ విలువలు చర్చలు
ఎన్నెన్ని విషయాలో లోకం అంతా అక్కడి పెదాల్లోనే నానిపోతూ

ఆ వాకిలికే వాక్కు వస్తే అందరి బతుకులూ వెటకారాలే

నట్టింట్లో...

వీలునామాల వెదుకులాటలు
ఎప్పుడో పంచిచ్చిన పొలం గురించి తగాదాలు
వచ్చే వాటాని బట్టే చెయ్యాల్సిన జమాఖర్చుల జంఝాటాలు
పుట్టింటి బంగారం మీద ఒకరికి మమకారం
అత్తింటి పసిడి తనదంటూ మరొకరి అధికారం
భాధ్యతతో పంపకాలేసిందో పెద్దరికం

సాయం అడుగుతారేమోననుకుంటూ
బావగారు చెప్పే అప్పుల చిట్టాలు
దిన కర్మలు ఘనంగా చెయ్యాలంటూ
ఆడపడచుల ఉచిత సలహాలు
ఎవరి దగ్గర ఎన్ని రోజులు అంటూ
తలచెడి తల్లడిల్లుతున్న తల్లి బతుకు మీద జూదాలు

లెక్కలన్నీ తేలిపోయాయిగా
కార్యక్రమాలు మొదలెట్టేయ్యాలట
దండగ మారి ఖర్చయినా లోకం కోసమన్నా
సిమెంట్ బెంచీ మీద పేర్లు చెక్కించాలి
పోయినోళ్ళదేమో గానీ మన పేరు శాశ్వతమయ్యేలా
అనుకునే కొడుకుల మనో వాంఛితాలు

పాడెనెత్త రమ్మంటే
వింత వింత కారణాలతో
నలుగురు బంధువులూ ముందుకురాని
సంఘటిత సమాజపు బతుకు చిత్రమిదిలే

ఆ ఇంటిగోడలకే జీవం ఉంటే నట్టింట్లో కన్నీళ్ళ వరదలే

***

బరువు తగ్గిన వీధరుగు బావురుమంటుంది
వెన్ను తట్టే బక్క పలచని దేహపు స్పర్శ ఇక లేదని తెలిసిందనుకుంటా
రచ్చబండ మధ్యలో రావి చెట్టు ఎదురు చూస్తూనే ఉంది
టీవీల రోజుల్లోనూ తనను రోజూ పలకరించే ఒకే ఒక్క నేస్తం ఇంకా రాలేదని

3 comments:

కళ్ళకు కట్టినట్లుగా చాలా బాగా వ్రాశారండి. ఈ క్రింది భావ ప్రకటన బాగా నచ్చింది

>>
పలకరింపుల కొలతలవగానే నీడకు చేరిన ఓదార్పు జాడలు
షామియానా కింద కుశల ప్రశ్నల బాతాఖానీలు
పిల్లల అమెరికా ఉద్యోగాల గర్వాలు
ఊళ్ళో ప్లాట్లుగా మారుతున్న పొలాలకి వస్తున్న గిరాకీలు
తరిగిపోతున్న రాజకీయ విలువలు చర్చలు
ఎన్నెన్ని విషయాలో లోకం అంతా అక్కడి పెదాల్లోనే నానిపోతూ

బరువు తగ్గిన వీధరుగు బావురుమంటుంది
వెన్ను తట్టే బక్క పలచని దేహపు స్పర్శ ఇక లేదని తెలిసిందనుకుంటా
రచ్చబండ మధ్యలో రావి చెట్టు ఎదురు చూస్తూనే ఉంది
టీవీల రోజుల్లోనూ తనను రోజూ పలకరించే ఒకే ఒక్క నేస్తం ఇంకా రాలేదని

Post a Comment