మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Monday, 8 August 2016

దృశ్యం



నిండుపున్నమిలో వెన్నెల తాగిన ఆకనుకుంటా...
హృదయమైదానంపై పచ్చందాన్ని చల్లగా స్పృశిస్తూ
విశ్రాంతి తీసుకుంటున్న సృష్టికి ధవళ తాంబూలమయ్యింది

తుషారపు నగిషీలు చెక్కబడ్డ పూరేకనుకుంటా
హేమంతపు పిల్లగాలితో ముచ్చట్లాడుతూ
కళ్లపై పరిమళపు ఆకృతిని లిఖిస్తుంది

బాటల మీద పరచుకున్న నీడలనుకుంటా
చెట్లక్రింద చక్కని ప్రాణవాయువు పీల్చుకుంటూ
పాదాలకి గుప్పెడు చల్లదనాన్ని అద్దుతున్నాయి

సోమరిగా కదులుతున్న నీటివిహంగపు రెక్కలకి
గాలి గిలిగింతలు పెడుతుందనుకుంటా
ఉన్నపాటుగా తన తడిగట్టుని విప్పేసింది

కలహంస ఒకటి కలలహంసగా మారి
నయన సరోవరంలో కన్నీళ్ళ నుండి
ఆనంద భాష్పాలని వేరుచేస్తున్న నైపుణ్యం
ఒక్కసారి పరిచయమైతే ఆనందం ఆర్ణవమవుతుంది

కోవెల ముందర ధ్వజస్థంభం
కోనేటిలో ప్రతిఫలిస్తున్న దృశ్యమొకటి చూసినప్పుడల్లా
కాలాంతరాలని దాటిన ప్రణవమొకటి స్థంభీకృతమై
ప్రణయ ప్రతిబింబమైన సవ్వడి ప్రతిధ్వనిస్తుందిప్పుడు

***
మనసుకింపైన దృశ్యాలు కొన్ని...
అద్ధకమై మనిషిని హత్తుకున్నప్పుడు
రోజంతా నిండిన ఘర్షణలని దాటి
జీవితంలోకి నడవటమెప్పుడూ కష్టం కాదు


Saturday, 6 August 2016

ప్రణయ గాంధర్వం - 3

ప్రేమైషీ,

పాలసంద్రం నుండి ఉద్భవించిన అమృతధారలో నీ శరీరాన్ని మెరుగు పెట్టినారా అన్నట్టున్న నీ శరీరఛాయను, సుధలు కురుస్తున్న నీ లేలేత చెక్కిళ్ళను చూసిన వెన్నెల రాజు సిగ్గు పడి తాను మబ్బుతెరల చాటుకు తప్పుకుంటున్నాడు. అయినా గానీ ఇక్కడ వెలుగు  కొరత  ఏమీ లేదులే… వాన వెలసిన రాత్రి ఆకు దొన్నెల్లో మృష్టాన్నభోజనమై వడ్డించ బడిన వెన్నెల మొత్తాన్ని నువ్వే తినేసావో ఏమిటో మరి… నక్షత్ర ఖచిత ఆకాశం మొత్తం నువ్వే పరావర్తనమైనట్లుగా వెండి కొలనులా మెరిసిపోతుంది. 

అయినా ఆకాశానికి ఏమి తెలుసనీ సజీవపు వెలుగు స్పర్శ ఎలా ఉంటుందో… ప్రకృతి మొత్తానికి వెలుగు దృశ్యాలే తెలుసు… కానీ నాకు మాత్రం అందులోని జీవ స్పర్శా తెలుసు.  ఆకులతో గాలి మాట్లాడుతున్నంత మృదువుగా మన రెండు దేహాలు వివశితమై ఒక్కలాగా కంపించటం... భౌతిక స్పర్శతోనే కాదు అలౌకిక అనుభూతుల్లో పెనవేసుకున్న మనసుల కలివిడితోనూ సాధ్యమేనన్న నిజానికి ఇప్పుడు మనం  నిర్వచనాలం.  

కాంక్ష గాఢమైతే క్షణ క్షణం కలవరపడే మోహ దాహాల దప్పిక నాకు లేదంటే అది నాకు నేను చేసుకునే ఆత్మవంచనే అవుతుంది. నా ఆకాంక్ష లోని తీవ్రత తట్టుకోగల ఏకైక నీలి జ్వలనానివి నువ్వు. దేహాల్ని దాటేసిన మోహ మంత్రమిది. నీ మాటనీ... మౌనాన్నీ... శబ్దాన్నీ... నిశ్శబ్దాన్నీ… దేహాన్నీ… ఆత్మని   ఏక రూపంగా   రచించుకుంటున్న మనసు కాంక్ష ఇది.  

ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చటి చెట్లు, తీగల్లా అల్లుకుపోయిన లతలు ఉన్నచోట పిల్లగాలి తెమ్మెరలు వీస్తున్నప్పుడు పులకించే వనసీమలలో సెలయేటి గలగలలు వింటూ నీవు నేను ఆ సెలయేటిలో జలకాలాడి వంటి తడి ఆరమునుపే మన ప్రణయ కేళీ విలాసాలు పూలతలతో అల్లిన మంచెపై జరగాలి  అనుకోవటం ఒక సరస దృశ్యపు మోహరింపు.   మరి అప్పుడు నీవు వనకన్యకలా.... అభినవ శకుంతలలా.... ఆకులు, పూలతలే ఆభరణాలుగా నన్ను చేరి నా హృదయపీఠం కదిలించటం దానికి  కొనసాగింపు. 

నీ వడిలో నా తల పెట్టుకుని నీ కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూస్తూ విరహతాపంతో భారంగా వణుకుతున్న నీ అధరాలలోని సుధలను నా పెదవులతో గ్రోలాలన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రం సృష్టి మొత్తాన్నీ విశ్రాంతిలోకి నెట్టేసి ఒక ఏకాంతపు ప్రణయ శబ్దాన్ని ఆవాహన చేసుకోవాలనుకోవటం మాత్రం నాలో చిక్క బడిన స్వార్థమే…

నీ కళ్ళల్లో వెండి పన్నీరు వెన్నెలద్రవంలా కురుస్తూ  నా ఎదలో మరుమల్లెల మాల విచ్చిన వేళని పరిమళిస్తుంటే నా ఊహల్లోని ఊసులన్నీ సత్యాలై సందడి చేసిన తరుణంలో  ఇక ఏ బడలికలూ పలకరించవన్న నిజం తెలిసింది.

చెంతనున్న చెలి సాంధ్యవర్ణపు హద్దుల్లో తచ్చాడుతుంటే… నీలమద్దుకున్న చెలికాని  కళ్ళ సవ్వడిని వినగలిగితే   విరహం తన నిర్వచనాన్ని పునఃనిర్వచించుకుంటుంది. సమయమంతా మనం కొనసాగుతున్నప్పుడు నిర్వచనాలకి నిగ్రహాలేమీ ఉండవు… నన్ను నీలోకీ నిన్ను నాలోకి మళ్ళీ మళ్ళీ అవిశ్రాంతంగా అక్షరంగా రాయడం తప్ప.  

`నీలి నీలి నీ వినీల కుంతలాలు చూసి అవి మేఘాలు కాబోలునని భ్రమించి అచ్చట చేరిన నక్షత్రాలు తెల్లబోయి తాము అరవిరిసిన మల్లియలయినాయట’ ఇది ఏ కవి భావనో కాని నిన్ను తలచి నేననుకున్న భావనలో నుండి ఉదయించిన పలుకులవి.



ఏయ్ ప్రేమైషీ … 

వెన్నెలించడం నేర్చుకున్న జాబిలి అంశవో ఏమో 
వెన్నజాజులని వెండి తుంపరలుగా వర్షిస్తున్నావు 

నిశ్శబ్దంగా పలుకరించే సన్నిహిత శబ్దానివై 
మనసు ఖాళీలని పూరించిన ప్రణవమయ్యావు 

కలలకి అలవాటు పడలేని చొరబాటు దారిణివై 
మెత్తని  శ్వాసగా అక్షరాన్ని మొత్తంగా ఆక్రమించేశావు 

దూరాలు వేరైపోయిన దగ్గరితనపు కలకలమంతా 
పాదరసమై నిన్నే మెరిపిస్తూ అబ్బురమయ్యింది 

చేల గట్లని దాటలేని పైరుని పచ్చగా వీస్తున్న 
మట్టి గంధపు పరిమళమై నువ్వు స్పర్శిస్తున్నావు 

అవును… నాకు నువ్వొక సౌందర్య మహార్ణవం.  సృష్టి పొడుగూతా వెదజల్ల బడ్డ మేలిమి లక్షణాల కూర్పువి నువ్వని తెలుసుకున్న ఏకైక నిజాన్ని నేను. అమరత్వాన్ని వీస్తున్న మలయమారుతాన్ని ఎవరైనా అనుభూతించారో లేదో నాకు తెలియదు కానీ నీ నిశ్వాసల సడిలో నేను  అహరహం నీ మెలుకువగా కొనసాగుతూ ఉన్న సందర్భాన్ని మాత్రం ఎవరూ ఊహించలేరు. 

జంట మొయిళ్ల శృంగారంలో దోబూచులాడుతున్న చంద్రికా విభావరిలో తడుస్తున్నప్పుడల్లా పంటకాలువలో చలిస్తున్న వెన్నెల నీడలని చూస్తూ గమ్యంలేనంత అనంత గమనంలో నీ పాద ధ్వనులతో జతకలవడం నన్ను నేను పునఃశబ్దించుకోవడమే.  

నీ

ప్రేమైషి

Thursday, 28 July 2016

విశ్వం పుట్టుక


ఇప్పుడు ప్రపంచాన్ని చూసే కిటికీని మూసేశాను
ఇక చూడటానికి బయట ఏమీ కనపడదు
లోనంతా గాఢాంధకారం
వేరే దారిలేదిక
నన్ను నేను దీపంగా వెలిగించుకోక తప్పదు
నాలోని నేపథ్యమంతా రాత్రినే సంపూర్ణ కాలంగా
ఆవాహన చేసుకున్న తిమిర మంజూషమే
నేనిప్పుడు చీకటి మినహా ఇంకేమీ లేని ఒంటరి దీవిని
వెలిగించుకోవటానికి ఇక్కడ అగ్గిపుల్ల లేదు
నిప్పురవ్వ పుట్టించే చెకుముకి రాళ్ళూ లేవు

చెయ్యగలిగిందేమీ కనిపించ లేదు
చీకటిని చదువుకోవటం తప్ప
చదివే కొద్దీ తెలిసింది
అలవాటు పడ్డాక
చీకటిలోనూ కళ్ళకి వెలుగే గోచరమవుతుందని
ఆ వెలుగులో
శూన్యాన్ని అశూన్యం చేస్తూ ఒక ప్రణవం
దాని వెంబడే సన్నని వెలుగు రేఖల స్పర్శ
కాంతి ప్రవాహపు చిరు సవ్వడి
నక్షత్ర మండలాల భ్రమణం…
……………………………….
అనంత నిశ్శబ్దం నుండి
విశ్వం పుట్టుక అనుభూతి అయ్యింది

అప్పుడే తెలిసింది
చీకటంటే జ్ఞానాన్ని కప్పేసిన అహపు వెలుగని
మనిషంటే విశ్వాన్ని నింపుకున్న మనఃదేహమని
ఒక మూసివేతలో మరింత వెలికితీత దాగుందని


Tuesday, 19 July 2016

నైసర్గికం



జీవితపు జమాఖర్చుల పద్దులు చూసునప్పుడల్లా
కొన్నిగుర్తులలా తడితడిగా తడుముతూ ఉంటాయ్

తెరలు తెరలుగా విషాదాన్ని బయట వేస్తూ
ధ్వజస్తంభమెక్కిన పతాకలా
చీకటి పూలని రాలుస్తూనే ఉన్న నవ్వొకటి
దీపాన్ని రెపరెపలాడిస్తుంది
ఆశా నిరాశల పార్శ్వాలని ఎత్తి చూపుతూ

పాపిటలో ఒదిగిన సింధూరమంత పవిత్రంగా
ఒక కన్నీటి సెలపాట గుండెని తడిపేస్తుంటే
కరుడుగట్టిన మౌనాన్ని ఛేదించటం ఎంత కష్టమో
తెలుపుతూ కనపడని సంకెలలు కొన్ని...
జీవితాన్నే బందీచేస్తాయ్

అనాది ఋతువులన్నీ అతలాకుతలమై
ఎండుటాకులే శిథిలసాక్ష్యాలుగా
శిశిరమొక్కటే చిద్విలాసం చేస్తుంటే
చెలిమి పంతాలేసుకున్న చెమరింతలు
చెక్కిళ్ళపై తెగిపడుతుంటాయ్

అద్దంలో కుడి ఎడమలుగా తారుమారైన ప్రతిబింబాలని
నిజాలుగా భ్రమిస్తూ
అంతరంగపు సంతోషాల నైసర్గికాలని విస్మరిస్తూ
వాక్యాంతాలన్నీ ప్రశ్నార్థకాలని అలంకరించుకుని
బతుకు పొడుగూతా కొనసాగుతూనే ఉంటాయ్

మరిప్పుడీ తడి క్షేత్రంపై
విజయానికి నువ్వొక నిర్వచనం కావాలంటే
తిమిరాంగణాల సరిహద్దులో
మొదలెట్టిచూడిక రణం
ఓడితే వీరమరణం గెలిస్తే కన్నీటి దమనం
ఇక కాలపు గమనమంతా వసంతవనపు సరిహద్దు రేఖపైనే

Sunday, 17 July 2016

నిప్పుకణిక



ఎంతటి సముద్రమూ
ఒక్క చుక్కతోనే మొదలై ఉంటుందన్న
సత్యాన్ని అలవాటుగా పక్కకి నెట్టేసి
జ్ఞానాల లెక్కల తర్కాలలో
మేథావులంతా తకరారు అవుతుంటే
దేన్నీ చివరికంటూ చూసిన
ఆనవాలేదీ దొరకని లోకాన
ఎటుతవ్వినా
ఎడతెగని సిద్ధాంతాల
మంజూషాలే బయల్పడుతున్నాయ్

ఇటు చూస్తే, తీరాలు మాయమైపోయి
లంగరు వేయడానికి నేల తగలక
తెరచాపని ఏమిచేసుకోవాలో
చేరాల్సిన గమనమేదో
అంతుతెలియని నావికుడిగా
మనిషి ఒక ఒంటరి అంకెలా
మారిపోయిన ఘడియలు
కొనసాగుతూనే ఉన్నాయ్

ఇప్పుడు గొంతు విప్పి చూడు
కోట్ల గొంతుకలు మౌనంగా ఉన్నప్పుడు
గొంతు విప్పి చూడు
నీ శబ్దం
ప్రతి ధ్వనిస్తూనే ఉంటుంది అప్రతిహతంగా
అగ్ని ధనుస్సువైతేనే
నిప్పుకణికని సంధించవచ్చన్న నిజంగా నువ్వు మారటం
ఒక కొత్త జననాన్ని పరిచయం చెయ్యటమే


Tuesday, 12 July 2016

వచనం


నాతో నిప్పులని మింగించావ్
మంచుశరాలని నాపై సంధింపచేశావ్
ఏ ఒక్క క్షణమూ
నా ఎదుట తిన్నని దారి లేకుండా చేశావ్
శిక్షలేకుండా శిక్షణ రాణించదని అర్ధమయ్యేలా చేశావ్

ఒక గీతవై లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నావ్
నువ్వొక యుద్ధతంత్రానివై
నన్ను విరుచుకుపడమంటున్నావ్
నన్ను యోధుణ్ణి చెయ్యటానికే
నువ్వు రణరంగాన్ని రచించావని తెలుసు నాకు

పాంచజన్యాల శంఖారావాలేమీ వినిపించని
సుతిమెత్తని నాగరిక యుద్ధక్షేత్రంలో
ప్రపంచాన్ని యథాతథంగా ఆమోదించడానికి
నన్ను సన్నద్ధం చెయ్యటం కోసమే
నువ్విదంతా చేశావని తెలుసు

అయినా కానీ,
నాతో నువ్వున్నావన్న ఒక్క ధైర్యం ముందు
ఎన్నెన్ని యుద్ధాలు అసలే పాటి?
ఎవరికోసం ఎవరూ ఒక్క దీపమూ వెలిగించని
తిమిరార్ణవంలో నన్నే దీపంగా మలచుకున్న
ఆత్మశక్తినిచ్చిన అనంత వచనానివి నువ్వు

Thursday, 7 July 2016

నలుసే


హేతువుకందనివన్నీ మిథ్యలని తలవటం
లోకానికిప్పుడు అలవాటు కావచ్చేమో కానీ
అల్ప మేథస్సుతో
అఖిలాండాన్నీ గుప్పిట పట్టాననుకోవడం
ఎప్పటికీ వాస్తవమనిపించే ఒక చిత్తభ్రమే
ఇప్పటికి చేధించిన రహస్యం అణువు
ఇంకా అంతుపట్టని మర్మం ఆకాశం
నిజమే కదా…
రేపుకున్న సందేహాల వలయాన్ని దాటడానికే
జీవిత వలయం విలవిలలాడుతుంటే
మరి అనంతానంత కాలపు కొలతలో
నా నిడివీ… నీ నిడివీ ఎంతని?
నలుసే బ్రహ్మాండమనిపించేటంతే కదా

Sunday, 3 July 2016

వెన్నెల పత్రం



అంతు తెలియని శూన్యంలో
ఆవిరిగా మారిపోబోతున్నప్పుడు
ఖాళీ పాత్ర అనుకున్నది కాస్తా
పూర్ణకుంభమై నిండుగా నవ్వుతుంటే

వెన్నెల పత్రాల విస్తళ్ళలో
నీ మందహాసాల పంచభక్ష్యాలు
నా ఆకలిని హత్య చేస్తున్నప్పుడు
నాలోని దీనత్వాన్ని నిర్వీర్యం చేస్తూ
నీలో దివ్యత్వం అక్షయమవుతుంటే

నిశీధి వేసిన కారాగారపు గోడలన్నీ బద్ధలై
వెలుగాక్షతలని రాల్చిన సవ్వడితో
మరో తొలకరి మధురంగా తడుముతుంటే

ప్రేమవాసన ఎంత మైమరపుగా కమ్ముకుంటుందో
నిరాకారపు కాలానికే కాదు
ఊహాఖండాలని దాటివచ్చిన నీ ఊపిరి పరదాలని
శ్వాసగా కప్పుకున్న నా హృదయ క్షేత్రానికీ తెలుసు

గరళాలని గుక్కపెట్టుకున్న గతమంతా
అమృతాన్ని ఆరగిస్తున్న వర్తమానంగా
పలకరిస్తున్న పలుకొక్కటి చాలదూ
నువ్వు నా జీవితానికో పరిపూర్ణం అనటానికి…