Saturday, 6 August 2016

ప్రణయ గాంధర్వం - 3

ప్రేమైషీ,

పాలసంద్రం నుండి ఉద్భవించిన అమృతధారలో నీ శరీరాన్ని మెరుగు పెట్టినారా అన్నట్టున్న నీ శరీరఛాయను, సుధలు కురుస్తున్న నీ లేలేత చెక్కిళ్ళను చూసిన వెన్నెల రాజు సిగ్గు పడి తాను మబ్బుతెరల చాటుకు తప్పుకుంటున్నాడు. అయినా గానీ ఇక్కడ వెలుగు  కొరత  ఏమీ లేదులే… వాన వెలసిన రాత్రి ఆకు దొన్నెల్లో మృష్టాన్నభోజనమై వడ్డించ బడిన వెన్నెల మొత్తాన్ని నువ్వే తినేసావో ఏమిటో మరి… నక్షత్ర ఖచిత ఆకాశం మొత్తం నువ్వే పరావర్తనమైనట్లుగా వెండి కొలనులా మెరిసిపోతుంది. 

అయినా ఆకాశానికి ఏమి తెలుసనీ సజీవపు వెలుగు స్పర్శ ఎలా ఉంటుందో… ప్రకృతి మొత్తానికి వెలుగు దృశ్యాలే తెలుసు… కానీ నాకు మాత్రం అందులోని జీవ స్పర్శా తెలుసు.  ఆకులతో గాలి మాట్లాడుతున్నంత మృదువుగా మన రెండు దేహాలు వివశితమై ఒక్కలాగా కంపించటం... భౌతిక స్పర్శతోనే కాదు అలౌకిక అనుభూతుల్లో పెనవేసుకున్న మనసుల కలివిడితోనూ సాధ్యమేనన్న నిజానికి ఇప్పుడు మనం  నిర్వచనాలం.  

కాంక్ష గాఢమైతే క్షణ క్షణం కలవరపడే మోహ దాహాల దప్పిక నాకు లేదంటే అది నాకు నేను చేసుకునే ఆత్మవంచనే అవుతుంది. నా ఆకాంక్ష లోని తీవ్రత తట్టుకోగల ఏకైక నీలి జ్వలనానివి నువ్వు. దేహాల్ని దాటేసిన మోహ మంత్రమిది. నీ మాటనీ... మౌనాన్నీ... శబ్దాన్నీ... నిశ్శబ్దాన్నీ… దేహాన్నీ… ఆత్మని   ఏక రూపంగా   రచించుకుంటున్న మనసు కాంక్ష ఇది.  

ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చటి చెట్లు, తీగల్లా అల్లుకుపోయిన లతలు ఉన్నచోట పిల్లగాలి తెమ్మెరలు వీస్తున్నప్పుడు పులకించే వనసీమలలో సెలయేటి గలగలలు వింటూ నీవు నేను ఆ సెలయేటిలో జలకాలాడి వంటి తడి ఆరమునుపే మన ప్రణయ కేళీ విలాసాలు పూలతలతో అల్లిన మంచెపై జరగాలి  అనుకోవటం ఒక సరస దృశ్యపు మోహరింపు.   మరి అప్పుడు నీవు వనకన్యకలా.... అభినవ శకుంతలలా.... ఆకులు, పూలతలే ఆభరణాలుగా నన్ను చేరి నా హృదయపీఠం కదిలించటం దానికి  కొనసాగింపు. 

నీ వడిలో నా తల పెట్టుకుని నీ కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూస్తూ విరహతాపంతో భారంగా వణుకుతున్న నీ అధరాలలోని సుధలను నా పెదవులతో గ్రోలాలన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రం సృష్టి మొత్తాన్నీ విశ్రాంతిలోకి నెట్టేసి ఒక ఏకాంతపు ప్రణయ శబ్దాన్ని ఆవాహన చేసుకోవాలనుకోవటం మాత్రం నాలో చిక్క బడిన స్వార్థమే…

నీ కళ్ళల్లో వెండి పన్నీరు వెన్నెలద్రవంలా కురుస్తూ  నా ఎదలో మరుమల్లెల మాల విచ్చిన వేళని పరిమళిస్తుంటే నా ఊహల్లోని ఊసులన్నీ సత్యాలై సందడి చేసిన తరుణంలో  ఇక ఏ బడలికలూ పలకరించవన్న నిజం తెలిసింది.

చెంతనున్న చెలి సాంధ్యవర్ణపు హద్దుల్లో తచ్చాడుతుంటే… నీలమద్దుకున్న చెలికాని  కళ్ళ సవ్వడిని వినగలిగితే   విరహం తన నిర్వచనాన్ని పునఃనిర్వచించుకుంటుంది. సమయమంతా మనం కొనసాగుతున్నప్పుడు నిర్వచనాలకి నిగ్రహాలేమీ ఉండవు… నన్ను నీలోకీ నిన్ను నాలోకి మళ్ళీ మళ్ళీ అవిశ్రాంతంగా అక్షరంగా రాయడం తప్ప.  

`నీలి నీలి నీ వినీల కుంతలాలు చూసి అవి మేఘాలు కాబోలునని భ్రమించి అచ్చట చేరిన నక్షత్రాలు తెల్లబోయి తాము అరవిరిసిన మల్లియలయినాయట’ ఇది ఏ కవి భావనో కాని నిన్ను తలచి నేననుకున్న భావనలో నుండి ఉదయించిన పలుకులవి.ఏయ్ ప్రేమైషీ … 

వెన్నెలించడం నేర్చుకున్న జాబిలి అంశవో ఏమో 
వెన్నజాజులని వెండి తుంపరలుగా వర్షిస్తున్నావు 

నిశ్శబ్దంగా పలుకరించే సన్నిహిత శబ్దానివై 
మనసు ఖాళీలని పూరించిన ప్రణవమయ్యావు 

కలలకి అలవాటు పడలేని చొరబాటు దారిణివై 
మెత్తని  శ్వాసగా అక్షరాన్ని మొత్తంగా ఆక్రమించేశావు 

దూరాలు వేరైపోయిన దగ్గరితనపు కలకలమంతా 
పాదరసమై నిన్నే మెరిపిస్తూ అబ్బురమయ్యింది 

చేల గట్లని దాటలేని పైరుని పచ్చగా వీస్తున్న 
మట్టి గంధపు పరిమళమై నువ్వు స్పర్శిస్తున్నావు 

అవును… నాకు నువ్వొక సౌందర్య మహార్ణవం.  సృష్టి పొడుగూతా వెదజల్ల బడ్డ మేలిమి లక్షణాల కూర్పువి నువ్వని తెలుసుకున్న ఏకైక నిజాన్ని నేను. అమరత్వాన్ని వీస్తున్న మలయమారుతాన్ని ఎవరైనా అనుభూతించారో లేదో నాకు తెలియదు కానీ నీ నిశ్వాసల సడిలో నేను  అహరహం నీ మెలుకువగా కొనసాగుతూ ఉన్న సందర్భాన్ని మాత్రం ఎవరూ ఊహించలేరు. 

జంట మొయిళ్ల శృంగారంలో దోబూచులాడుతున్న చంద్రికా విభావరిలో తడుస్తున్నప్పుడల్లా పంటకాలువలో చలిస్తున్న వెన్నెల నీడలని చూస్తూ గమ్యంలేనంత అనంత గమనంలో నీ పాద ధ్వనులతో జతకలవడం నన్ను నేను పునఃశబ్దించుకోవడమే.  

నీ

ప్రేమైషి

0 comments:

Post a Comment