మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 18 September 2016

కొన్ని అడుగులంతే



ఎండమావుల వాకిట్లో, వెచ్చగా మునిగిన
తడి కలల నావలన్నిటినీ
వాస్తవ తీరం చేర్చడానికి
గాలికి ఎదురొడ్డి నిలబడే
చిరగని తెరచాప కుట్టగలిగే ధీశాలి
అడుగుల చప్పుడొక్కటి చాలు
లోకం కొత్త బాట పడుతుంది

నిజం…
కొన్ని అడుగులంతే !
ఎక్కడ నుండి మొదలైతేనేం
గడ్డకట్టిపోయిన కొన్ని నడకలకి ఊతమౌతూ
అచలనపు చరణాలకి కొన్ని గమ్యాలని అంటుగడుతూ
మెత్తగా... సుతి మెత్తగా... తమ ముద్రల్లో
కొన్ని విజయాల్ని దాచి పెడుతూ
ఒక్క ధైర్యాన్ని దారంతా పరిచేస్తాయి

ఇప్పుడు ఆ ధీశాలి ఎవరంటే
చెప్పలేకపోవటానికి ఏముంది
నా నడకలకి కొత్త అడుగుల జతవై
ఒక జీవితపు దూరమంత తోడుగా
మారిన ‘నిన్ను’ చూస్తూ కూడా


Saturday, 17 September 2016

ఇంద్ర ధనుస్సు



ఎండా వానల కలబోత కాదురా
ఇంద్ర ధనుస్సు అంటే...

నే పారేసుకున్న ఆ కొన్ని
నవ్వుల్ని పట్టి తెస్తావు చూడూ
అప్పుడు రాలే కొన్ని చినుకులు
జీవితపు రంగుల్ని వల్లెవేస్తూ
రాసిన తడి విల్లు అది

నువ్వు రాసిన కొన్ని మౌనాలు
నన్ను శబ్దిస్తాయి చూడూ
అప్పుడు గుండెల్లో మొదలై
కళ్ళపై పరచుకునే
విస్తృత ఇంద్రజాలమది


Friday, 16 September 2016

నవ్వు



ఏయ్… ఆత్మైషీ !
ఇంకా అక్కడే ఉన్నావేం !
ఒక్కసారి
ఇక్కడకొచ్చి చూడవోయ్

అప్పుడు నువ్వు నాటి వెళ్ళావే...
ఓ చిన్ని నవ్వు !!

ఇప్పుడది నందనవనమైంది
కొన్ని అస్తిత్వాలకి వసంతాన్నద్దుతూ
వెన్నెల్లో మగ్గిన అరుదైన మెరుపుల్ని
గుత్తులు గుత్తులుగా అందిస్తూ !!

Thursday, 15 September 2016

ఏకాంతాల సాక్షిగా



అలసిపోయావుగనుక
సనసన్నని పారిజాతపు జల్లునై
నీలోకంకితమైపోవాలనిపిస్తుంది

తడసిపోయావుగనుక
నులి వెచ్చని ఊపిరుల ఉధృతాన్ని
అరువిచ్చి ఆరబెట్టాలని ఉంది

వెతుకుతున్నావుగనుక
కావడినై అహరహం నీ కాలాన్ని
నా రెప్పల్లో మోస్తూ ఉండాలనిపిస్తుంది

మెత్తగా సుతిమెత్తగా కనులపై
కలల ప్రవాహం కొనసాగుతుంటే
పాలపుంతనై నిన్నే నినదించాలని ఉంది

నిన్ను తెలుసుకున్న ఆ కాసేపూ
నిలువరించలేని ఏకాంతాల సాక్షిగా
నేనుగా దొరికిపోవాలనిపిస్తుంది

అలసిన పాదాన్ని తాకిన అలలా
శతాబ్దాలుగా శిలలో ఒదిగిన నిశ్శబ్దంలా
నీ మనసంచు చుట్టూ తోరణమై
నేనున్నానురా… నేనున్నాను
నీకెప్పుడూ నేనున్నాను
మన ప్రతి క్షణాన్నీ ఆపి దీర్ఘం చేస్తూ
ఒక జీవిత కాలపు భరోసాగా
ఒక స్వచ్ఛత చేసే మృదువైన ధ్వనిలా...
ఒక్క నీకోసమే రాయబడ్డ ఇతిహాసంలా !!


Wednesday, 14 September 2016

శీతల సాన్నిధ్యం



ఎలచిగుళ్ళ వసంతాన్ని రాసుకున్న
ఎద భావపు లిఖితాలపై
పచ్చదనాన్ని అద్దిన
వనహంసల రెక్కల్లా
నీ పలుకులు నా అణువణువులో
పరావర్తనమై వ్యంజితమవుతుంటే
తుషార రాపిడినద్దుకున్న
మనఃమధ్య రేఖ పొడుగూతా
నువ్వొక శీతల సాన్నిధ్యమై
అంకురిస్తున్న సమయపు సంజ్ఞల్లో
ఆత్మైషి నిర్వచనమవుతున్న చప్పుడు

బయట మాత్రం
ప్రణవం
ప్రణయంలోకి జారిపోయి
నిద్రపోతున్నట్లుగా అనంత నిశ్శబ్దం
భువనమంతటి ఏకాంతంలో
మనల్ని ఏక కణాన్ని చేస్తూ !!

Tuesday, 13 September 2016

తృషాయానం



లోలోపలే మూసేయబడుతున్న
నిజ వ్యక్తిత్వపు రణోద్విగ్నత
అస్తిత్వపు ప్రయోగశాలయై
వాస్తవాలన్నీ ఆంతర్యంలో ఘనీభవిస్తున్న
సమయాల సాన్నిధ్యమే
అడుగడుగునా కొనసాగుతుంటే
అంధత్వపు అఖాతాలే
అంతరంగంలో శాశ్వతముద్రలేసుకున్నప్పుడు
తన చిరపరిచితపు దేహపు
అపరిచితపు యాత్రగా మారిన ప్రతి నీడా
ఒక అపవిత్రపు రూపుగా మనలేని సడిలో
తనను తాను చెరిపేసుకునే విరమణ గా
ఒక దాహాన్ని ఆవిష్కరించుకుంటుంది

ఒక దీపపు వెలుగుని హత్తుకున్న
చురుకుదనం మొదలైనప్పుడు మాత్రం
సహజత్వాన్ని మరింతలుగా
హెచ్చించే తొట్టతొలి రూపమై
ఒక విశిష్టపు తోడుగా
తృషాయానం చేస్తుంది
ప్రపంచం ముగిసే ప్రళయం వచ్చేవరకూ

మరి ఇప్పుడు
దీపం వెలిగించ నువ్వు రావూ...


Monday, 12 September 2016

తూనీగ

మల్లెలాంటి వెన్నెలని చిలుకుతూ
ఒక వసంతాన్ని
వంటి మీదకు ఆవాహన చేసుకుంటూ
నెమ్మదిగా... నెమ్మదిగా...
అతి నెమ్మదిగా
ఒక తేలికపాటి సమీరాన్ని
నాలోకి ప్రవహింపజేస్తూ
ఇదిగో
ఇక్కడో లేత నవ్వు చప్పుడు
మృదువుగా మొదలయ్యింది
మరి మనసేమో
ఇప్పుడు ఒక తూనీగయ్యింది
జీవితమంతా మందహాసపు
మధువుతో పొంగి పొర్లుతున్న
దృశ్యాన్ని రెక్కల్లో చిత్రించుకుంటూ


Sunday, 11 September 2016

కలలు అమ్మబడును


ఇక్కడ కలలు అమ్మబడును
అమ్మకానికి సరిపడా సరంజామా సిద్ధం
మీ రెప్పలకి కాసే కలలు కావివి
అంతకుమించి...
రాశులు రాశులుగా ఆకాశహర్మ్యాలు
నగరానికో విదేశాన్ని పండించే
ప్రభుత్వాల అంగట్లో కలలు అమ్మబడును

ఇక్కడ కాలం కొనబడును
మీ అరచేతుల్లోనే
అంతులేని మాటల వలలు వేసి
మోహపు పరదాలని పరచి
మీకు ఆలోచనలు చేసే శ్రమ కూడా లేనంతగా
పెట్టుబడిదారుల ముందుచూపులో
మీ కాలాన్ని ఉచితంగా కొనబడును

ఇక్కడ చిరునామాలు ఇవ్వబడును
నిన్ను నిన్నుగా నువ్వు గుర్తించేలోగానే
నీపై ఒక నటనాయకత్వం రుద్దబడును
నీకంటూ ఆశలు పుట్టేలోగానే
నీ కోరికల చిట్టా ఇదంటూ పంపిణీ చేయబడును
ఫలానా నాయకుడి అనుచరుడిగా
నీకో చిరునామా ఇవ్వబడును

ఇక్కడ తలలకి వెలకట్టబడును
మనిషికి మనిషి అపనమ్మకమై
వర్గ వైషమ్యమో జాతి శతృత్వమో కారణమై
నీ నమ్మకాలు తమ నమ్మకాలతో కలవని చోట
నువ్వొక విద్రోహివై
మానవత్వపు హద్దులు దాటబడి
నీ తలకి వెలకట్టబడును

ఇక్కడ తలరాతలు మార్చబడును
తమ ఊహలు వాస్తవాలవ్వని
సమయాలని దాటేసిన ముందు తరం
నీ ఇష్టంపై ఆత్మీయతా బంధనాలు వేసిన
జీవితపు లెక్కల్లో
తడబడిన అడుగుల నడకలలో
నీ తలరాతలు మార్చబడును

ఇక్కడ అవకాశాలంటూ
ఇంకేమీ మిగలలేదు మిత్రమా
నిన్ను నువ్వు సమాధాన పరచుకోవటానికి...
కళ్ళని తడిపే కొద్దీ
మరింత తడే ముంచేసే నేటి దృశ్యంలో
ఇప్పుడు చెయ్యవలసిందల్లా
నిన్ను నువ్వు థైర్యంగా రాసుకోవడమే !!