ఇదిగో…
నీ హృదయం నుండి జారుతున్న ఈ చిన్ని ఉప్పు నీటి చినుకుని చూడు… ఈ అనంతానంత విశ్వపు రచనలో… నీలో రేగిన కల్లోలాన్ని ఋజువు పరుస్తూ చెక్కిలి మీద తేమరాతని రాస్తూ సాగుతున్న ఈ నీటి అక్షరపు ఊపిరి యొక్క ఉనికి ఎవరికని చేరుతుంది. ఎవరికో ఎందుకు… అసలు మళ్ళీ నీకు దొరుకుతుందా తన ఉనికి?
ఎందుకు దొరకదు ?
చెక్కిలి మీద ఆవిరైన ఆ తడి బిందువు ఎన్ని కోట్ల కోట్ల ఆర్ద్రతా కణాలుగా మారి ఈ లోకం మీద తన ఉనికిని పరచుకుంటూ వెళుతుందో కదా! ఏ చిన్ని హృదయం మీదకో చేరిన ఒక అణువంత రేణువు చాలు… నిన్ను ఒక రచనగా మలచటానికి. నీ ఉనికిని విశ్వమంతటికీ పరిచయించటానికి.
నిజానికి, ఆదీ అంతమూ తెలియని ఈ విశ్వంలో నువ్వెంత ? నీ ఉనికెంత ?
నిజంగా తరచి చూస్తే ఈ ప్రపంచం… ఒక మాయా మోహనం. తన ఉనికినే… తన కొలతనే… తానెప్పుడూ గుప్పెట విప్పదు మరి. ఇది నిజంగా నిజం…
ఎలా అంటారా?
ఈ ప్రపంచం చాలా పెద్దది. చాలా అంటే చాలా… ఒక్క సారి తప్పిపోతే మనకి మనం దొరకనంత… ఈ ప్రపంచం చాలా చిన్నది… చాలా అంటే చాలా… కోట్లకోట్ల నక్షత్రాల ఆచూకీ మన కంటి చూపుకి అందేంత…
ఇంతకూ ప్రపంచం పెద్దదా… చిన్నదా… ? ఏమో ఎవరికి తెలుసు ? ఎప్పటి మనఃస్థితికి ఏమని అనిపిస్తుందో… నిజం చెప్పాలి అంటే ప్రపంచం చిన్న్దదో పెద్దదో కాదు… నువ్వు ప్రపంచాన్ని చూసిన క్షణపు కొలత అది.
ఆ క్షణం లో మిగిలిన అన్ని సమయాలూ… పరిమాణాలూ… గడ్డ కట్టుకు పోయి ఉంటాయి. అసలవి నీ దగ్గరకు రావు కూడా !
ప్రపంచానికి నువ్వు పెద్దగా తెలియాలంటే… అసలు నువ్వెంత పెద్దనో నీకు తెలియాలి. నీకు నువ్వే చిక్కనప్పుడు ప్రపంచానికి నువ్వెక్కడ తగులుతావ్… అందుకే నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకుంటూ ఒక స్వఛ్చతా దీపంలా నువ్వు ప్రజ్వరిల్లాలి. దానికోసం నీకు నువ్వే ఇంధనంగా మారాలి.
ఈ ప్రపంచపు పాంచ భౌతిక స్వరూపంలో ఒక రేణువంతనే నువ్వుండనీ… తన ఆత్మానుగత స్వరం నుండి నువ్వు వినిపిస్తే… ఇక నువ్వూ… ప్రపంచమూ… ఏది ఎవరు?
ప్రతి సామాన్యతలో ఒక అసామాన్యత ఒదిగి ఉంటుంది. నీకు నువ్వుగా తనని ఎప్పుడు తెలుసుకుంటావా అని వేచి చూస్తుంది తప్ప తనకి తానుకు అది బయట పడదు.
మరి నీకు నువ్వు తెలియాలంటే…?
అంత సులభమా… నిన్ను నువ్వు చదవాలి… అహరహం అకుంఠిత దీక్షతో. అంతా కొత్తగా ఉండవచ్చు… మరంతే కదా! నీకు నువ్వు పరిచయం అవ్వటం ఇప్పుడే కదా ! అలానే ఉంటుంది. అయినా సరే… ఇక ఆగమన్నా ఆగవు.
అదంతే మరి!
వేవేల కావ్యాలు … వేదాలు… ఉపనిషత్తులు… ఇతిహాసాలు… పేరేదేతైనేం వాటిన్నిటి సారం నువ్వే… అవన్నీ చెప్పేది నీ గురించే… నీలో నువ్వెంతగా వ్యాపితమయి ఉన్నావో తెలిసి వచ్చే కొద్దీ బహిరంగపు ఆసక్తులన్నీ అనాసక్తులై నీకు నువ్వే ఒక నిరంతర ఆసక్తిగా కొనసాగుతూనే ఉంటావు.


















