మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Tuesday, 22 April 2014

జ్ణాపకం

ఏయ్... ఏమిటా సందేహం...?
నేనెప్పుడైనా గుర్తొచ్చానా అంటూ...!
నిజం చెప్పనా...
నువ్వెప్పుడూ గుర్తురాలేదు
అసలెందుకు గుర్తుకొస్తావ్ నువ్వు?
అసలంటూ మర్చిపోతేనే కదా...!
నీవే నేనైపోయిన నాలో
నేనెప్పుడూ నాకు గతమే
నువ్వెప్పుడూ నా వర్తమానమే
నిన్ను కోల్పోతున్న ప్రతి క్షణమూ
చిరంజీవమై నా లోకే ఇంకిపోతుంది

Thursday, 5 December 2013

ఇదీ బాల్యమే




అమ్మ వడిలో వికసించిన మొగ్గలు మీరైతే 

కుప్ప తొట్టెలో కుసుమించిన పుష్పం నేను


మీ ముద్దుచేష్టలతో మీవారు మురిసిపోతే 

ఏ తోడూ లేక బేల చూపులతో నేనవసి పోయా


గోరుముద్దలు వద్దంటూ నువ్వు మారాం చేస్తున్నప్పుడు  

ఆకలిబాధ తాళలేక వీధి పంపు నీళ్ళు త్రాగాను నేను 


బడి దారిలో పుస్తకాల సంచీ మీరు మోస్తుంటే 

బతుకు బడిలో మట్టి తట్టలు మోసాను నేను 


బామ్మ చెప్పే పేదరాసి పెద్దమ్మ కధలు మీరు వింటున్నప్పుడు  

బరువులు మోసి బొబ్బలెక్కిన అరచేతులని ఊదుకున్నా


తిరునాళ్ళకెళ్ళి రంగుల రాట్నంలో మీరు తిరిగితే 

గానుగ చక్రం చుట్టూ తిరుగుతూ సున్నాన్ని తీశాను నేను 


పిల్ల కాలువలో సరదాగా మీరు ఈతకొడుతున్నప్పుడు

పంటకాలువలో ఏతమేసి నీరు తోడాను నేను 


కోతికొమ్మచ్చి... కోలాటాలు మీరాడుతున్నప్పుడు

కొడవలి పట్టి కోతకోయడానికి చేనుకెళ్లాను నేను 


మీ మధురస్మృతుల అందమైన బాల్యం మళ్ళీ మీక్కావాలి

జీవితంతో పోటీపడుతూ మీరు అలసిపోతున్నారు కాబట్టి


అందమైన గతంలేని నా బాల్యమంటే నాకిష్టం 

జీవితంతో పోరాడటం నాకు నేర్పింది కాబట్టి…!

Tuesday, 3 December 2013

నా హృదయపు దారుల్లో



నడచి నడచి చూడు 
నా హృదయపు దారుల్లో
దారంతా నీ తలపుల చిత్తరువులే 

తరచి తరచి చూడు 
నా కనుపాపల అద్దాల్లో 
ఎప్పుడూ కనిపించేది నీరూపమే 

తడిమి తడిమి చూడు
నా మది భాండాగారంలో 
నీ జ్ఞాపకాల సువర్ణ నిధులే 

తడచి తడచి చూడు 
నా ఊహల సెలయేటిలో 
నీ నవ్వుల గలగలలే 

మనసు రెప్పలు తెరచి చూడు 
నా హృదయ రాగాల్లో
నీ నామమే ధ్వనిస్తుంది 

                                                                 ... సురేష్ రావి

Saturday, 30 November 2013

స్వస్తిత్వం



నాది కాని తత్వమేదో 

మీరంతా నాలో చూస్తుంటే

నేనో అద్దంలా మారిపోయానేమో అనిపిస్తుంది 

నన్ను చూడాల్సిన చోట 

మిమ్మల్ని మీరు చూసుకుంటూ 

అది నా రూపమనుకుంటుంటే 

నేనేమిటో తెలిసేదెలా? 

మీ మనసొక ప్రతిబింబమై 

నాలో ప్రతిఫలిస్తుందంటే 

నేనొక అద్దమనే కదా అర్థం!


నన్ను చూసినప్పుడల్లా 

మీకు కనిపించేదంతా 

మీ ద్వేషం 

మీ స్నేహం 

మీ దుఃఖం  

మీ సంతోషం 

నాలో మీకు కనిపిస్తున్న 

కష్టం, సుఖం, కోపం, శాంతం 

అన్నీ మీవే… 

అవును అన్నీ మీవే

నా ప్రతి చర్యా మీకు ప్రతి చర్యే 


మీ ఊహలు నావిలా మీకనిపిస్తుంటే 

నాక్కనిపించని అజ్ఞాతపు నీడేదైనా 

నాలో ఉందేమో అని తరచి తరచి చూసుకుంటూ 

నేను మీ నీడగా మారిపోయి 

నాలో నుండి మాయమవుతానేమో 

అన్న ఓ భ్రమ కదలాడుతుంది నాలో 


మీ పుస్తకంలో రాసేసిన పుటను కాను 

మీరు రాసుకున్నట్లు చదివెయ్యటానికి….   

మీ కళ్ళు రాస్తున్న నవీన వేదాక్షరాలనుండి 

మీ మనసు చిత్రిస్తున్న మాయా చిత్తరువులనుండి 

నన్ను నేను వెలివేసుకుని 

స్వంత అస్తిత్వాన్ని ఆవిష్కరించుకున్న 

నిలువెత్తు అహాన్ని 


నన్ను నన్ను గా తెలుసుకోవాలంటే 

మీ మనసో తెల్లకాగితం అవ్వాలి...


Tuesday, 26 November 2013

నీ స్నేహం

ప్రభాతపు పలకరింపులో పెదవి మీది చిరునవ్వులో
ఏకాంతపు మౌనంలో నిశీధి నిశ్శబ్దం లో
కంటిచుక్కని జార నివ్వని చేతి స్పర్శలో
తప్పొప్పుల ఎంపికల మందలింపులో

కలలారని కనుపాపపై చిత్తరువై
మౌనాన్ని చదవగలిగే మది భాషవై
ఓటమి బాధలో ఊరడింపువై
విజయపు ఆనందం లో మృదుస్పర్శవై

క్షణ క్షణమూ నా పరవశానివై
గమ్యం చూపే మార్గానివై
నా ప్రతి అడుగులోని సాహసానివై
భయమంటే తెలియని నా ధైర్యానివై

ఊహవై  నా  ఊపిరివై శ్వాస వై  నా సర్వం నువ్వై
అనుక్షణం నా తోడుగా నీడగా  ఉన్న నీ పేరు స్నేహమేగా?

Sunday, 15 September 2013

వెన్నెల కుసుమం - 9

పున్నమి వెన్నెల రోజున ... పర్వత సానువుల నుండి మలయ మారుత పవనాలు మనని తాకుతుండగా పచ్చటి అడవి సీమలలో సెలయేటి గలగలల మధ్య నీవు నేను లతల్లా అల్లుకు పోతుండగా చూసినే చందమామ సిగ్గుపడి మబ్బుచాటుకి తప్పుకుని మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాల చెంతన చేరి సరాగాలడుతుంటే ఆ నక్షత్రాలు కృతజ్ఞతా భావంతో మనమీద అమృత కిరణాలని ప్రసరిస్తుంటే ఆ సమయం లో ఆ సెలయేటి సవ్వడుల మధ్య నేవు నేను ఒక్కటిగా కలసిపోదాం.
వెన్నెలల కాంతులీనే నీ చెక్కిలి మీద చిరుముద్దు ఇవ్వాలని ఉంది. నీ కళ్ళల్లో కళ్ళుంచి కళ్ళతోనే మాటలు చెప్పాలని ఉంది. నీ ఆధర సుధలని నా ఆధరాలతో గ్రోలాలని ఉంది. ఏమిటో నా మనసున దాగిన భావనకు రూపం వచ్చీ రాక మునుపే నీ ముందుకి రావాలనిపిస్తుంది.
ప్రియా నీవులేని నా జీవితం వెన్నెల లేని పున్నమి. నీవు లేని తలపులు నన్ను బంధించిన గది తలుపులు. నీవు వలదన్న నా వలపు వల్లకాడే...
నా తలపుల్లో ఊహల్లో అనునిత్యం నీవే ఉండాలి. నీవు లేని  నా బ్రతుకు సారధి లేని రధం. నా జీవితాన నీ పాదం మోపి నిండు పున్నమి రేయిలా...  వెన్నెల విరబూసిన జాబిల్లిలా... స్వేచ్చా వీచికలని ఎగరవేసే కపోతం లా... ఒక స్వర్గం లా మార్చుతావని నా ఆశ.
విరబూసిన గులాబీ లాంటి నీ సోయగం నా కలల్లోన కవ్విస్తుంది. నాలోని చిలిపి ఊహలని కవ్విస్తే నీ పరువానికే ప్రమాదం ప్రియా...

Thursday, 5 September 2013

నేతి నైవేద్యాలు

దేవుడున్నాడనేది నిజం అని ఆస్తికుల నమ్మకం
దేవుడులేడనేది నిజం అనేది నాస్తికుల నమ్మకం 
ఉన్నాడన్న నమ్మకమే భూషణమై 
గుళ్ళో భోషాణాలు నింపేవారు ఆస్తికులు
లేడన్న నమ్మకమే పునాదిగా 
రుజువు చూపితే కోట్లు ఇస్తామనేది నాస్తికులు

రాతి బొమ్మలకి రంగురాళ్ళ ఉంగరాలు 
నిశ్చల విగ్రహాలకి నేతి నైవేద్యాలు 
భావజాలపు నమ్మకాలకి జేజేలట
రుజువు చూపితే చాలట నోట్లకట్టలేనట

మనిషి ఉన్నాడనేది జగమెరిగిన సత్యం
మరి మనిషికి మనిషి ఉన్నాడన్నది నిజమా?
జగంలో ఓ వంతు జనం ఎండిన డొక్కలతో
మరో వంతు జనం అర్ధాకలితో ఉంటున్నారనేది
అందరికీ తెలిసిన ఎవరూ కాదన లేని నిజం

రంగురాళ్ళ ఉంగరాల అవసరం లేదు
తిన్నా అరగని ఆ నేతి నైవేద్యాలు వారికొద్దు
మనఃశాంతి పోగొట్టే నోట్ల కట్టలసలే వద్దు
నోట్లో కి నాలుగు వేళ్ళు వెళ్ళే సాయమే ముద్దు

Tuesday, 27 August 2013

ఎచ్చట చూసినా నీవే

చందమామ చందనాలు పంచుతున్న వేళలో
తొలి వెన్నెల కిరణం నా హృదయం చేరెనే
మల్లె మొగ్గ మరువపు రెమ్మ జతకట్టిన వేళలో
తొలి పరిమళం  నా మనసుకు తాకెనే

నా కన్నుల కాంతుల్లో తొలి వెలుగు నీవులే
నా ఆశల పందిరిలో తోలి అడుగు నీదిలే
నా ఆధరాల దరహాసం తుదికంటా నీవేలే
నా హృదయాన మధుమాసం నీ తోడుగానే
నా ఎదలోని మంత్రం నీ నామధ్యానం
నా దరిరారు ఎవరూ నీ సన్నిధి లోన
నిడురన్నది నను చేరనంటున్నది
రెప్పవాల్చితే నీ రూపు కరుగుతుందని
మరచి పోయానులే నాకంటూ ఓ  మనసుందని
తెలుసుకున్నానులే అది నీకు జతగా చేరిందని

నా భావనలో నీవు నేను ఒకటై అంబర వీధిలో తేలియాడగా
నా తలపులలో నీ రూపే  నిండి తొలిప్రేమనే జనియింపగా
కలలో నైనా ఎడబాటెరుగక  నిన్ను తలుస్తూ
నా మనసుతో  నీ ఊహలే  ఊసులాడుతుండగా
నా వడిలో నీ వలపులనే బంధించగా
ఉదయం మొదలు సాయం సంధ్య వరకూ

ఎచ్చట చూసినా నీవే ఇంకేవీ కానరావే