Sunday, 4 January 2015
దేవుళ్ళూ…
Friday, 2 January 2015
నీ సమక్షపు నా తొలి క్షణం
Monday, 22 December 2014
నాలోకి నేనే
బద్దకాన్ని అద్దెకితీసుకున్న తొలిపొద్దులో
ప్రత్యూష పవనానివై చల్లగా వాలిపోతూ
రవి కిరణానివై వెచ్చని లేపనం పూస్తుంటే
నిన్నటి పచ్చి గాయాలని రాల్చుకుంటున్నా...
మోడై పోయానని నిన్న బద్దలై పోయిన ఆ గాలి తరంగాలకి
ఆకుపచ్చని ఊపిరి పోసి మలయ మారుతాన్ని అఘ్రాణిస్తూ
నిత్య వాసంతానివై నువ్వు నాపై శ్వాసిస్తుంటే
నీ వెనకే నడుస్తూ నాలోకి నేనింకిపోయా...
జాబిల్లివై వెన్నెలగింతలు పెడుతూ
తన్మయత్వమై తనువునద్దుకుంటుంటే
నిన్ను నాకు బహుమతి చేసుకుంటూ
రాత్రంతా మత్తిల్లుతూనే ఉన్నా....
జత తనువుల ఆలింగనంలో కరిగిపోతూ.
ఒంటరితనానికి ఏకాంతపు శిక్ష వేసి
ఏకాత్మగా మారిన నువ్వూ...నేనూ...
మనలో ఎవరు ఎవరమో కనిపెట్టు చూద్దాం...!
Thursday, 18 December 2014
ఏయ్… అంతరాత్మా…!
ఏయ్…
అంతరాత్మా…!
అందరూ నన్ను నన్నుగా చూపించే అద్దం నువ్వే అంటూ ఉంటారు? నిజమే కాబోలు అనుకున్నా....
తరచి తరచి చూస్తుంటే అసలు నువ్వు నన్ను నన్నుగా చూడగలుగుతున్నావా అన్న సందేహం వచ్చేస్తుంది…!
అసలు నాలోపల నువ్వు నిజంగా పనిచేస్తున్నవా? మసక బారి పోయి రేఖా మాత్రపు చిత్త భ్రమలనే నా నిజమైన భావాలుగా చూపిస్తున్నావా? నా ఉనికిని నీ మాయాజాలంతో కమ్మేస్తున్నావా?
రెండోదే నిజం కదూ….
అందరికీ అర్థం అయ్యేలానే నన్ను చూపిస్తున్నావనుకుంటూ ఉంటాను. కానీ ఎవరికీ అర్ధంకాని శేష ప్రశ్నలా నన్ను మార్చేస్తున్నావని తెలుసుకున్నాను. నేను చేసే ప్రతి పనీలో నాకు సంతోషం ఉంటుంది అనిపించేలా చేస్తావ్. కానీ ఆ సంతోషాలేవీ మనసుని స్పర్శించవే? ఆ కాసేపటి ఆనందం నాలో చూడటం కోసం నన్ను మాయల్లోకి నెట్టేస్తున్నావా? నిజం చెప్పు.. నన్ను నా నుండి దూరం చేసి నువ్వు పొందే తృప్తి ఏమిటి?
మదిలో శాశ్వతముద్రలేసే నిజమైన ఆనందాల వైపుగా నా ఆలోచనలు ఎందుకు మళ్ళించవూ? తాత్కాలిక ఆనందాల మాయా ప్రపంచంలోకి నన్ను ఒంపేస్తూ నువ్వు బాపుకునేదేమిటి?
ఎంతగా చదువుదామని చూస్తానో నిన్ను… చదివినప్పుడల్లా భలే అర్ధం అయినట్లే ఉంటావ్… కానీ నువ్వో అర్ధం కానీ బ్రహ్మ పదార్ధానివని మళ్ళీ తరువాత ఎప్పుడో తెలుసుకుంటూ ఉంటా…!
కానీ ఏమి లాభం... తప్పదు కదా... మళ్ళీ మళ్ళీ నీతోనే సంభాషిస్తా…!
అంతకన్నా ఏమి చెయ్యగలను మరి నా గురించి నువ్వే అన్నీ చూసుకోగలవ్ అని అనుకుని ఏ స్నేహాన్ని వరించని పుట్టుకనయ్యా…! ఎవరి లోచనాలతో వారు నన్ను తెగ చదివేసుకుని కొత్త కొత్తగా అర్ధం చేసుకుంటుంటే ఒక్క మనిషిని ఇన్ని రకాలుగా అర్ధం చేసుకోవచ్చు అన్న సంగతే బహు వింతగా అనిపిస్తుంది. నేను ఒక్కడినే కానీ, నీ పుణ్యమా అని లోకానికి వంద రూపాలుగా కనిపిస్తున్నాను.
ఇన్ని రకాల అర్ధాలు పుడుతున్నాయంటే నన్ను నేను సరిగ్గా ఆవిష్కరించుకునేలా నువ్వు చెయ్యలేదు అనే కదా....
అసలు వారికి ఏమి అర్ధం అవుతుందో తర్వాత సంగతి… నేనెంటో నాకే అర్ధం కానంత మాయాజాలాన్ని నా చుట్టూ పరిచేసావ్ కదా…
అప్పుడప్పుడూ నవ్విస్తావ్… ఎందుకు నవ్వానో తరువాత నాకే అయోమయం…
ఇంకోసారి ఏడిపిస్తావ్… నువ్వుండీ నేను ఎందుకు ఏడవాలి అన్నది నాకెప్పుడూ అంతు చిక్కని ప్రశ్నే…?
అవసరం లేనప్పుడు కోపం…! జనాలందరూ దూరం…
మోసమని తెలిసినా జాలి…! తరువాత జాలి చూపటానికి మిగలని హితులు...
సమస్య పుడుతుందంటే తలుపు తట్టే భయం… భీరువుగా నా మీద నాకే అసహ్యం...
అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నేనున్నాననే ధైర్యం.... అవసరపడనంత ధీరోదాత్తతతో ఎనలేని స్థైర్యం…కాలం కలిసి రానప్పుడు పారిపోయే పిరికివాడిలా, అంతా సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యానికి నిర్వచనంలా నన్ను నటింపజేస్తున్నావు
ఎక్కడ ఏది అవసరమో అది మనసుకి తట్టనివ్వకుండా నువ్వాడే అంతరాంతపు మాయాటలో నన్నో సమిధలా వాడుకుంటున్న నీ శక్తిని ఎంత తెగిడినా తక్కువే కదూ….
నాలో నీడగా ఒదిగిన నా తోడువనుకున్నా ఇన్నాళ్ళూ… కానీ నువ్వు తోడువి కాదు, నా ఎదుగుదలకు అడ్డుపడే గోడవి.
మనసుని అతలాకుతలం చేసే చీడవని మనిషి ఆలోచనల్ని తుడిపేస్తున్న పీడవని తెలిసీ ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో కూరుకుపోయా… అంతగా నన్ను లోబరుచుకున్నావ్ మరి…
అంతరంగ ప్రక్షాళన జరిగితే చాలు కదా బహిరంగం బ్రహ్మాండం అవ్వటానికి?
అందుకోసం ముందుగా ప్రక్షాళన చెయ్యల్సింది నిన్నే కదా… ఇంతగా మకిలి పట్టేసిన నిన్ను శుభ్రం చెయ్యాలంటే ఏమి చెయ్యాలో?
నిజమే… నువ్వు బాగు చెయ్యలేనంతగా మకిలి పట్టేసావ్…
నువ్వు మసి బారిన అద్దానివి… నీకు ఏ చదువులూ రావు… మనసుకీ మనిషికీ అంతరాలు పెంచే కలహాలు తప్ప…!
నిన్ను సమాధి చేస్తే కానీ నన్ను నేనుగా లోకానికి పరిచయం చేసుకోలేనేమో....!
నా ప్రతి ఆర్ద్రతా తన స్థాయిలో తాను బయటకి రావాలంటే అనుభూతులకి నువ్వేసిన కవచాలు బద్దలు కొట్టాలి…
నీ ఆటలకి తోలుబొమ్మ అవుతూ…
పదుగురు మాటలకీ కేంద్రబిందువవుతూ…
అవమానాలలో
తడచిపోతూ
పాపం బహిరంగమెప్పుడూ
పిచ్చిదే...
నిజం నివురుగప్పి నిప్పులా రగులుతున్నా...
నీ
కపటపు తెరల చాటున మౌనంగా విలపిస్తున్నా...
లోపలి
సత్యం బయటపడక,
బయటి
నటనకు జీవం లేక...
రెండింటి
మధ్య నలిగిపోయే ఈ బ్రతుకు...
ఒక
అర్థం లేని అరణ్యరోదనే!
నిలువునా
నిశ్శబ్దపు చితిపై కాలుతూ...
నిజాయితీ
గొంతుకను నీ పాదాల కింద నలుపుతూ...
కన్నీటి
సాక్షిగా లోపలి మనిషిని చంపుకుంటూ...
నీ
మాయాజాలపు తెరల చాటున బందీనై మిగిలిపోతున్నాను!
అద్దం
ముక్కలై అరిచే కేకలు నీకు వినబడవా?
ఆత్మను
అమ్ముకున్న నిస్సహాయత నీకు కనబడదా?
లోపలి
యుద్ధంలో ఓడిపోయిన నేను...
బయటి
లోకానికి గెలిచినట్టు నటిస్తూ...
అస్థిత్వం
లేని ఒక శూన్యంలా
నీ
నీడలో కరిగిపోతున్నాను!
కప్పి
ఉంచిన నిజాన్ని నువ్వే కడతేరుస్తూ…
కనిపించని
సంకెళ్లతో నన్ను బంధిస్తున్నావు…
నీ
నీడలో బ్రతకడం కంటే
నీ
నుంచి వేరై మరణించడమే మేలనిపిస్తోంది!
అవును…
ఈ మకిలి పట్టిన అంతరాత్మను చీల్చుకుని
నా స్వచ్ఛమైన మౌనంలోకి
నేను నిష్క్రమించాలనుకుంటున్నాను!
అవును.. ఆ మౌనంలోనే నా అసలైన ఉనికి దొరుకుతుందని ఇప్పుడు అర్థమవుతోంది. అందుకే ఇక చాలు! ఈ కపట నాటకానికి స్వస్తి పలికే సమయం వచ్చింది. నా లోపలి మనిషీ బయటి మనిషీ ఒక్కటిగా మహోన్నత మానవీయతకు తావవ్వాలి…
అదే నా
కోరిక… అందుకోసం అపార్ధపు వలువలు కట్టుకున్న నిన్ను త్వరగా పాతరెయ్యబోతున్నా…
నీ నీడ
నుండి విముక్తి పొంది, నా స్వచ్ఛమైన వెలుగులో నేను నడవాలి.
ఇక నుండి
నేను నేనే...
ఇట్లు…
నేను
బాల్యం ఉండిపోతుంది
మీరు తాగగలరా?
నేను తాగినంత పసితనాన్ని...!
ఎన్నికేరింతలున్నాయో అక్కడ
మీరు కురియగలరా?
నేను కురిసినన్ని నవ్వులు...!
ఎంత భయం పాకుతుందో ఇక్కడ
మీరు ఆడుకోగలరా?
నేను ఆటవస్తువుగా ఆడుకునే దీనితో...!
ఎన్ని మట్టి తావులున్నాయో అక్కడ
మీరు పడుకోగలరా?
నేను పరవశిస్తూ మత్తిల్లి పడుకునే ఆ పడకలో...!
కావాలంటారుగా గడచిపోయిన బాల్యాన్ని
పెద్దరికపు తెరలో మీరుకప్పేసిన
పసితనాన్ని బయటకు తియ్యండి
కాసేపు ఈ బతుకుని ఆపేసి
అక్కడ జీవించి చూడండి
మళ్ళీ మళ్ళీ బాల్యం మీ చెంతనే ఉండదూ...!












