Sunday, 4 January 2015

దేవుళ్ళూ…

దేవుళ్ళూ…

మీరున్నారు… నిజమే మీరున్నారు…!  

ఇంతకు ముందులా  దేవుడున్నాడా లేడా అన్న సందిగ్ధత  నాలో ఇప్పుడు లేదు. కాకపోతే మీరున్నారన్న జ్ఞానోదయం  కాస్త ఆలస్యంగా అయ్యింది స్వామీ… ఈ అల్ప జీవిని క్షమించెయ్యండి.

ఇంత అకస్మాత్తుగా  వీడికీ జ్ఞానోదయం ఏలనో అనుకుంటున్నారు కదూ…?  

కోళ్ళ కాళ్ళకి కత్తులు కట్టి కోడి పందాలాడుతూ పండగ  సంబరాలు చేసుకునే మనుషులం మేము.  అలా చేస్తున్నప్పుడు  మా కళ్ళల్లో  ఎంత ఆనందం... ఎంత  సంతోషం...  మేమలా చెయ్య గలుగుతుంది అవి  మా కన్నా అల్ప జీవులు కాబట్టే కదా… ఒక స్వజాతి  వాటిలో అవి కలహించుకుంటుంటే దానికైనా మెరుగైన జాతికది వేడుక  అనే కదా దీని అర్ధం.

మరి మీరు మాకన్నా బుద్ధి జీవులేగా.... మాలో మేము కలహించుకుంటుంటే మీకెంత వేడుకగా ఉండి ఉంటుందో కదా… 

మేము కోళ్ళకి కత్తులు కట్టి బరిలోకి  దింపినట్లు… పశువులకి ఎర్ర గుడ్డ చూపి ఒకదాని మీదకి ఉసిగొల్పినట్లు… గుర్ర్రాలనైతే డొక్కల్లో తన్ని పందెపు సవ్వారీ చేయిస్తున్నట్లు… మనుష్యులమైన మాకు కొన్ని మతాలు… కులాలు… వర్ణాలు… ప్రాంతాలూ అంటగట్టి ఒకరి మీద ఒకరు చేసుకునో మారణ హోమం మీకు  భోగి మంటలంత పసందుగా ఉంటాయనుకుంటా కదూ…

రక రకాల విద్వేషాలతో మనుష్య జాతి ఒకరినొకరు చంపుకుని చావటం మీకు క్రీడా వినోదమే కదూ… నిజంగా మీకు మేము ఆట వస్తువుల్లాంటి వాళ్ళం కాకపోతే ఎందుకు ఇన్నిన్ని మతాలూ… వాటిల్లో మరిన్ని శాఖలు… 

అన్ని మతాల సారమూ ఒక్కటే అంటారు…  ఏ మతానికి ఆ మతమే గొప్పదని  కొట్టుకు చస్తుంటారు. డబ్బుతో ఒకడు… హింసతో మరొకడు… సనాతనధర్మమంటూ ఇంకొకడు…. ఎవరికి వారు  తమలోకి కొత్త మనుషుల్నిలాక్కోవటం ఎందుకు?  నిజంగా మనిషి మనస్ఫూర్తిగా ఇష్టపడి ఎవరిని నమ్మితే ఏమి అనుకోరెందుకు…

‘ఇంత మంది అల్ప జీవులు మా  వెనక ఉన్నారని చెప్పుకుంటూ’ మీ లోకంలో ఆధిపత్యం కోసం  వెంపర్లాడే  రాజకీయ నాయకులేమో కదూ…

‘ఈ మనుషులున్నారు చూసారూ...  మన పేరిట రాళ్ళకి  రత్నాలు  తొడుగుతారు… చర్చికి విరాళాలు ఇస్తారు… మసీదుల్ని అలంకరింపచేస్తారు… కానీ వాళ్ళ తోటి వాళ్ళకి ఆకలేస్తే పట్టెడన్నం పెట్టేదెంతమందో చూడండి” అని మీలో మీరే మా గురించి నవ్వుకుంటారు కదూ… 

కాదంటారా చెప్పండి…?   

నిజంగా  మానవ జాతి క్షేమం కోసమే మేమున్నాం… మిగిలినవన్నీ మధ్యలో మనిషి కల్పించుకున్నవే  అని అంటారా? అలాంటప్పుడు మనిషికి మీరెందుకు? 

దారి తప్పుతున్న మనిషిన గాడిన పడెయ్యలేని దేవుళ్ళు మాకెందుకు?  

రోడ్డున నడవాలంటే భయం 
పార్కులో కూర్చోవాలంటే భయం
బడికి వెళ్ళాలంటే భయం
గుడికి వెళ్ళాలంటే భయం 
బొట్టు పెట్టుకుంటే భయం
టోపీ పెట్టుకుంటే భయం 
నల్లగా ఉంటే భయం 
తెల్లగా ఉంటే  భయం 
ఇన్ని భయాల మధ్య ఏ ధైర్యంతో  మీ మీద నమ్మకం పెట్టుకోవాలి… 

అప్పుడెప్పుడో భూమి మీద తెగ తిరిగేవాళ్ళట కదా మీరు… మరి ఇప్పుడు రండి  భూమి మీదకి… 

ఒక్కొక్కరుగా కాదు … 
ఒక్కొక్క యుగంలో కాదు…. 
ఒక్కొక్క ప్రాంతంలో కాదు…

అన్ని మతాలకీ  ప్రాతినిధ్యం వహిస్తున్న  అందరు దేవుళ్ళూ ఒకేసారి రండి… 

వీలైతే మీరంతా ఒక్కటే అని చెప్పండి… 

లేదా మీలో మీరు పోరాడండి... గెలిచిన దేవుడికే మానవజాతి సమస్తం ఊడిగం చేస్తుంది.  అంతే  కానీ   ఎన్నడూ  కానరాని మీకోసం మాలో మేము ఎందుకు  నరుక్కు చావాలి?

ఇట్లు...

ఒక మానవుడు 

4 comments:

Thanks Padmarpita garu.. Inkaa PK movie choodaledu. ademito choodaali

Post a Comment