Friday, 2 January 2015

నీ సమక్షపు నా తొలి క్షణం

రేయ్ హనీ.... 
అమృతంలా కురిసే నీ పలుకులతో  ఎడారిలాంటి జీవితానికీ  సరికొత్తగా వసంతాన్ని అద్దుతూ వచ్చిన వసంత సేనవే కదూ నువ్వు…
నిన్ను అలా అలా చూస్తూ ఉండి పోవాలి అని ఉందిరా!” అంటూ ఉంటావ్…
నీ మనఃమందిరంలోకి ఒక్క సారి చూసుకుని నిజం చెప్పు.... రోజూ నువ్వు నన్ను చూడటం లేదూ… మరి అక్కడ ఉన్నాను గా నేను. 
నా గురించి నేను అలోచించుకోవటం మానేసి ఎన్ని రోజులయ్యిందో… ఎందుకంటావా... ?  నా గురించి ఆలోచించటానికి నువ్వున్నావనే నమ్మకంతో… కాదా  మరి...
నువ్వు రాకముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నాకు గుర్తు లేదు… నువ్వొచ్చాక  నేనేమిటో ఆలోచించటానికి  నాలో  నేనుంటే  కదా….
నీకూ నాకూ ఎంత దూరమో నువ్వూ నేను అంత దగ్గర… మరి కాదంటావా…. చెప్పు?  ఒకటేమో  భౌతికం  మరొకటి  మానసికం. 
ఎక్కడెక్కడి మౌనం మూర్తీభవించిన నాలో నీ దగ్గర మాత్రం మౌనం మూగబోతుంది… నువ్వు మాట్లాడే ప్రతి మాటకూ బదులు మాటలిస్తూ అసలు మాట్లాడేది నేనేనా అని నాకే అనుమానం వచ్చేస్తుంది.
నా జీవితమొక వెదురు గొట్టం లాంటిదే ఇంత వరకూ…  కానీ అది నిన్ను పరిచయించుకున్నాక  పిల్లనగ్రోవిలా  సరికొత్తగా మురళీరవాలు పలికిస్తుంది. 
శిశిరం లేని జీవితాన్ని చూడాలనుకుంటే నువ్వొచ్చాక నా జీవితాన్ని చూస్తే చాలు… ఆరారు ఋతువులు వసంతంలో పోతపోసుకుని వచ్చేస్తున్నాయి…
ఏమిటో అందరూ మధుర క్షణాలని భద్రపరచుకోవటానికి ఫొటోలు దిగుతూ ఉంటారు.   ఏ పదేళ్ళ  తరువాతో ఇరవై ఏళ్ల తరువాతో  వాటిని చూసుకుని మురిసి పోతూ అప్పుడలా ఉండేవాళ్ళం  అంటూ   మనవళ్ళకో మనవరాళ్ళకో చెప్పుకోవటానికే పనికి వస్తాయి.  
ఆస్వాదించే హృదయం అంటూ ఉండాలి  కానీ  ప్రియమైన వాళ్ళని చూసిన మొదటి క్షణం శాశ్వతమై మళ్ళీ మళ్ళీ అలా అలా ఊపిరి ఆగే వరకూ కళ్ళల్లోనే తేలియాడదూ… అలాంటి ఒక్క క్షణం చాలదూ  ఎవరికైనా జీవితం మీద  సరికొత్త ఆశ చిగురించటానికి? 
నీ తలపు నను తట్టిన ప్రతి క్షణమూ ఒక ఛాయా చిత్రం గా మారి మధురంగా మనసులో తిష్ట వేసుకుని నా జీవితాన్ని సుందరం గా వెలిగించటం ఉంది చూశావూ… అది అనుభవమైతే కానీ తెలియదులే...  
ఎప్పుడూ రణగొణధ్వనులతో హడావిడిగా బతుకుని ఈడ్చేస్తూ  ప్రకృతి  సహజ సిద్ధంగా ఇచ్చిన ఆనందాలని అర్ధం చేసుకోలేని యాంత్రికుల మధ్య  ఒంటరిగా జీవిస్తూ ఏకాంతంగా ప్రకృతిలో లీనమై పోతూ  నిన్ను నాలో వర్షించుకుంటున్న భావ వ్యసనముంది చూశావూ… వ్యసనమంటే  అదీ…
కొన్ని సాధారణాలని  అసాధారణంగా పరిణామం చెందేలా అందరి ఆలోచనలూ సాగుతుంటే నాకెందుకో నువ్వు తాకిన  కొంచెం నేల… నిన్ను తాకిన కొంచెం గాలి… నీ వంటి మీద కాసేపున్న మట్టి గాజు …. ఇలాంటివే అపురూపంగా అనిపిస్తూ ఆలోచనలు మొత్తం నీ చుట్టూనే  పరిభ్రమిస్తూ ఉంటాయి.   
ఎందుకోగానీ ఎప్పుడూ నువ్వు కలలోకి రావు… బహుశా కలలోకి వస్తే  నువ్వు వాస్తవం కాదని  నా మనసు భ్రమల్లోనే  నిన్ను చూసుకుంటూ అక్కడే ఉండి పోతుందని అంతరాంతరాల్లో ఎక్కడో భయపడుతున్నానేమో మరి…
ఎవరికి వారు వారి కోసం కొంచెం  తీరుబడిగా  చేసుకునే ఆలోచనల ద్వారా  మనసు  చేసే అద్భుతాలని తనకి నచ్చే అనందాలనీ తెలుసుకోగలితే  ప్రపంచం తీరు మారదూ సరి కొత్తగా… ఆ మారిన ప్రపంచంలో  నీ జతగా  సాగాలి  నా ఆలోచనల ప్రయాణం. 
బాల్యం  ఎంత బాగుందో అక్కడే ఆగిపోతే ఎంత బాగుండేదో కదా అనుకునే వాడిని…నిజంగా నేను  ఆ బాల్యంలోనే ఆగిపోయి ఉండి ఉంటే  ఎప్పటికప్పుడు నిన్ను నాలో ఒంపుకుంటూ పొందే ఈ  ఆనందం  నాకు  ఉండి  ఉండేదా… అసలు నువ్వు పుట్టిందే నాలో  ఈ  ఆనందాన్ని పోతపొయ్యటానికే  కదూ… 
అందుకే ఏ వయసులో ఉన్నప్పుడు అప్పటికి తగ్గ ఆనందం మనసుకు చేరవేయ గలిగితే  వర్తమానమెప్పుడూ మధురమే. 
ఎవరిని చూడగానే నా ఈ  మనస్సు స్పందించటం నేర్చుకుందో 
ఎవరిని తాకగానే నా  తనువుకీ  పులకరింతలు ఉన్నాయని తెలిసిందో 
ఎవరికోసం నేను  విసుగు విరామం లేకుండా యుగాలుగా నిరీక్షితుడిగా ఉన్నానో 
ఎవరిని చూడగానే ఆ  సమస్యలన్నీ మరచి అలౌకిక స్థితిలోకి అలా నడచి వెళ్లి పోతానో…
ఆ ఎవరు ఎవరో నేను తెలుసుకున్న తరుణం నిన్ను నేను చూసిన  నీ సమక్షపు నా తొలి క్షణం 
మనసులోని ప్రేమనంతా అక్షరాల్లో చూపించగలిగే  కావ్యశిల్పిని కాదుగా నేను… అందుకే  ఈ  చిన్ని చిన్ని పద  నీరాజనాలతో  సరిపుచ్చుకో....
నీ 
….రేష్ 

0 comments:

Post a Comment