మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 22 September 2016

ఇక్కడే నవ్వవోయ్



కొమ్మన పూసే
పూల వ్యాకరణంలా
వెన్నెల్లో మునిగిన
మధు వచనంలా
నంది వర్ధనపు
తెలుపంత స్వచ్ఛంగా
నిన్ను నువ్వు
రూపాంతరం చేసుకుంటూ
నన్నొక సమాంతర
రూపంగా హత్తుకుంటూ

ఏయ్…
ఇక్కడే నవ్వవోయ్
పెదవుల్లో దాపెట్టిన నక్షత్రాలని
నా మీదే రాయవోయ్
మనిషి మరచిన వాక్యాలన్నీ

ఎందుకంటే
నేనోనోయ్
ఇప్పుడు నువ్వు
జీవంగా మార్చాల్సిన
ఆ నిశ్చల శిలాకృతిని


Wednesday, 21 September 2016

కవాతు


ఇక్కడ ఇన్నాళ్లుగా నా కళ్ళల్లో
దాపెట్టుకున్న ఓ చిన్ని వసంతాన్ని
శిశిరంలా కమ్ముకుంటూ
ఆరని తడి రాస్తున్న వెచ్చని నిర్లిప్తత ఒకటి
కొత్త చిగుర్లు తొడిగేసుకుంది

గాజుకళ్ళ ద్రావకాలు
ఏ గుండెనీ తాకవని తెలియని
నిశానీ బతుకుని వెంటేసుకుని
పాతుకుపోయిన నిశ్చల దిమ్మరినైన
శిలా జీవనంలో
నన్ను నేను ఎదురుచూడటమంటే
మరేమీ లేదు
శూన్యానికి మరో పర్యాయపదాన్నై
నిఘంటువుకెక్కటం తప్ప

వానలు కురిసే దినాలలోనూ
పొడిబారిన మనసుకు తడి అద్దలేని
క్షణాల కవాతులో
అలసటని వెదుక్కున్న నిద్ర
ఎప్పుడూ కళ్ళ మీదకే నడిచొస్తుంది
ఒక్క సారి దానికి గుండె దారి దొరికిందా
దిగంతాల గమ్యం అందేసినట్లే
నేనేవరన్న ప్రశ్న కొనసాగుతున్నట్లే

Tuesday, 20 September 2016

లేఖనం



మనసంత బరువైన
అలసట ఒకటి పలకరించినప్పుడల్లా
మనసంతా నువ్వు ఆక్రమించుకోవడం
అరుదైన అనుభవమవ్వుతున్న నరకంలో
దిగంతాలనంటే జ్వలనం చుట్టుముట్టినా
తడి ఆరదెందుకో మనసు
జాబిల్లి వెన్నెలాంతరు వెలిగించి ఝామైనా
గుండెలని వెలుగు రేక తాకదెందుకో

నిన్నలన్నిటినీ చెరిపేస్తూ
రగిలిన ఎదల వీడుకోళ్లని హత్తుకుంటూ
నీడలుగానే చెరిగిపోతున్న
కొన్నిస్మృతులు
కన్నీళ్లని ఏరులై పారుతుంటే
అందిన దూరంలో నే ఉన్నా
అందని ఊపిర్ల లెక్కలే ఎక్కువైన వేళల్లో
తడిసిన మనసు వేదన లోతులు
చెక్కిళ్ళ పై తడి లేఖనాలకేమి తెలుసు

నువ్వు రాల్చి వెళ్ళిన
నిన్నలన్నిటినీ మళ్ళీ ఏరుకుంటూ
గుండె గొంతుకలో కొట్టుకలాడే నిశ్శబ్దమొకటి
అస్తిత్వానికి ఆఖరిగీతం లిఖిస్తున్న సవ్వడిలో
విషాదపు నవ్వొకటి మెలిపెడుతున్నప్పుడల్లా
ఆకాశం రెక్కలు తెగి మీద పడుతున్నంత యాతనతో
కొందరెప్పుడూ నాలానేనేమో
కనిపించని శూన్యంగా
బతుకుని పరిపూర్ణం చేసుకుంటూ


Monday, 19 September 2016

కాంతి రేఖ



ఎరిగిన తీరాలేమీ ఎదురవ్వని పయనంలో
తెరచాప ఏ దిక్కుకి నడిపిస్తేనేం
అనుకుంటున్న నిశ్శబ్దంలోకి
ఎరగని తీరంలా నువ్వెదురొచ్చావు

నిన్ను నువ్వు నివేదన చేసుకున్న
కొన్ని ఛాయల పలకరింపులో
తెలిసింది…
తెలియని చోటా కొన్ని గమ్యాలు
ఆనందాన్ని పరచి వేచి ఉంటాయని

నిన్నంటూ ఎరగకుంటేనేం
ఇప్పుడైతే
నువ్వొక కాంతి రేఖవి
నా ద్వీపపు సరిహద్దుగా పహారా కాస్తూ


Sunday, 18 September 2016

కొన్ని అడుగులంతే



ఎండమావుల వాకిట్లో, వెచ్చగా మునిగిన
తడి కలల నావలన్నిటినీ
వాస్తవ తీరం చేర్చడానికి
గాలికి ఎదురొడ్డి నిలబడే
చిరగని తెరచాప కుట్టగలిగే ధీశాలి
అడుగుల చప్పుడొక్కటి చాలు
లోకం కొత్త బాట పడుతుంది

నిజం…
కొన్ని అడుగులంతే !
ఎక్కడ నుండి మొదలైతేనేం
గడ్డకట్టిపోయిన కొన్ని నడకలకి ఊతమౌతూ
అచలనపు చరణాలకి కొన్ని గమ్యాలని అంటుగడుతూ
మెత్తగా... సుతి మెత్తగా... తమ ముద్రల్లో
కొన్ని విజయాల్ని దాచి పెడుతూ
ఒక్క ధైర్యాన్ని దారంతా పరిచేస్తాయి

ఇప్పుడు ఆ ధీశాలి ఎవరంటే
చెప్పలేకపోవటానికి ఏముంది
నా నడకలకి కొత్త అడుగుల జతవై
ఒక జీవితపు దూరమంత తోడుగా
మారిన ‘నిన్ను’ చూస్తూ కూడా


Saturday, 17 September 2016

ఇంద్ర ధనుస్సు



ఎండా వానల కలబోత కాదురా
ఇంద్ర ధనుస్సు అంటే...

నే పారేసుకున్న ఆ కొన్ని
నవ్వుల్ని పట్టి తెస్తావు చూడూ
అప్పుడు రాలే కొన్ని చినుకులు
జీవితపు రంగుల్ని వల్లెవేస్తూ
రాసిన తడి విల్లు అది

నువ్వు రాసిన కొన్ని మౌనాలు
నన్ను శబ్దిస్తాయి చూడూ
అప్పుడు గుండెల్లో మొదలై
కళ్ళపై పరచుకునే
విస్తృత ఇంద్రజాలమది


Friday, 16 September 2016

నవ్వు



ఏయ్… ఆత్మైషీ !
ఇంకా అక్కడే ఉన్నావేం !
ఒక్కసారి
ఇక్కడకొచ్చి చూడవోయ్

అప్పుడు నువ్వు నాటి వెళ్ళావే...
ఓ చిన్ని నవ్వు !!

ఇప్పుడది నందనవనమైంది
కొన్ని అస్తిత్వాలకి వసంతాన్నద్దుతూ
వెన్నెల్లో మగ్గిన అరుదైన మెరుపుల్ని
గుత్తులు గుత్తులుగా అందిస్తూ !!

Thursday, 15 September 2016

ఏకాంతాల సాక్షిగా



అలసిపోయావుగనుక
సనసన్నని పారిజాతపు జల్లునై
నీలోకంకితమైపోవాలనిపిస్తుంది

తడసిపోయావుగనుక
నులి వెచ్చని ఊపిరుల ఉధృతాన్ని
అరువిచ్చి ఆరబెట్టాలని ఉంది

వెతుకుతున్నావుగనుక
కావడినై అహరహం నీ కాలాన్ని
నా రెప్పల్లో మోస్తూ ఉండాలనిపిస్తుంది

మెత్తగా సుతిమెత్తగా కనులపై
కలల ప్రవాహం కొనసాగుతుంటే
పాలపుంతనై నిన్నే నినదించాలని ఉంది

నిన్ను తెలుసుకున్న ఆ కాసేపూ
నిలువరించలేని ఏకాంతాల సాక్షిగా
నేనుగా దొరికిపోవాలనిపిస్తుంది

అలసిన పాదాన్ని తాకిన అలలా
శతాబ్దాలుగా శిలలో ఒదిగిన నిశ్శబ్దంలా
నీ మనసంచు చుట్టూ తోరణమై
నేనున్నానురా… నేనున్నాను
నీకెప్పుడూ నేనున్నాను
మన ప్రతి క్షణాన్నీ ఆపి దీర్ఘం చేస్తూ
ఒక జీవిత కాలపు భరోసాగా
ఒక స్వచ్ఛత చేసే మృదువైన ధ్వనిలా...
ఒక్క నీకోసమే రాయబడ్డ ఇతిహాసంలా !!