Sunday, 7 December 2014

హేమంత స్పర్శ - 2

నా  జీవన హేమంతమా….

కాలానికి అలుపు తెలియదు నా  మనసుకి పరుగు తెలియదు. పరిగెడుతున్న ఆ కాలంతో పని లేకుండా నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నిలబెట్టేసింది నన్ను నా మనసు...

అసలే హేమంతమాయే... తెల్లగా మంచు కంబళి కప్పుకున్న నులి వెచ్చని ప్రకృతితో పాటుగా నడవటం నాకెంత ఇష్టమో తెలుసా? 

ఎందుకంటావా? 

ప్రతి నీ తలపూ గోరువెచ్చగా తాకుతూ  నన్ను నీ మాయలోకి లాగేసుకునే సుప్రభాత లోగిలిలా అనిపించే మధుర క్షణాల సవ్వడిని అనుభూతించే పరవశాల వేదిక కదా అది. 

పుప్పొడి రేణువుల్లా కురుస్తున్న నీ ఊహల జతులలో తాళం వేస్తూ తలపుల నెగళ్లు అంటించుకుని వెచ్చగా సేద తీరటం ఎంత మంచి అనుభూతో మాటల్లో చెప్పటం చాలా కష్టం అనుకుంటా... 

ప్రకృతి పరచిన మంచుతెర మాటు నుండి అకస్మాత్తుగా నీ పాదాల అలికిడి వినవస్తే అటుగా నడచిన నాపై... నీ అడుగు తాకిన ఆ మట్టిముద్రలో ఒదిగిన ధూళి మంచి గంధపు పొడిలా పరిమళాలు విసిరేసింది. 

రాత్రంతా రాలిన హిమం గడ్డిపూలని వెండి సుమాల్లా భ్రమింప చేస్తుంటే సాంబ్రాణి  ధూపంలా  రాలుతున్న మంచు తుంపరలు మట్టిబాటకి వేసిన రజత వర్ణంపై నగ్న పాదాలతో నువ్వు నడుస్తూ వెళుతున్న చప్పుడులో  నా గమనపు మార్గాన్ని ఆలకిస్తున్నాను.

నీ నిశ్శబ్దాల గిలిగింతల్ని అక్కడ కుమ్మరించి పోయావనుకుంటా నా పెదవులపై నీరాజనాలు పలికిస్తున్నాయి. నీ నవ్వుల వ్యాకరణాలని అద్దుకొచ్చిన శీతల సమీరం  నా గుండెల్లో కురిపించే తుషార బిందువుల్లో తడసి ముద్దవుతూ పచ్చని గరిక మీద నువ్వేసిన పాద చిత్రాలని అనుసరిస్తూ అలుపూ సొలుపూ లేకుండా ఒక జీవితాన్ని నడవగలను. 

నువ్వేసిన అడుగుల అడుగున నేల ఎంత పులకించిందో ఏమో  నీ అడుగుల్లో నేను అడుగు వేసినప్పుడల్లా  నీ  స్పర్శని నా అరి పాదాలకి  వెన్నలా  అద్దుతుంది . 

నిజమే నిన్ను అనుసరించటం అంటే నాకెంత ఇష్టమో … ఏ కష్టమూ లేకుండా  నీ  దారిలో  నే  గమనిస్తూ  వచ్చేయనూ నువ్వే గమ్యంగా… 

అసలంటూ చెప్పాలంటే నాకు నీలో పూర్తిగా ఇంకిపోవాలని ఉంది… నా ప్రతి శ్వాసని  నీ ఊపిరితో  ఊసులాడుతూ రమ్మని చెప్పాలని ఉంది. 

నువ్వే  గమ్యంగా నేను నడుస్తూ ఉన్నప్పుడల్లా నీ మాటలే నా మనసులో ప్రతి ధ్వనిస్తూ ఉంటాయ్… నీ మాటల వెనుక ప్రతి అర్ధాన్ని తరచి తరచి చూసుకుంటూ ఉంటాను… 

నీ 

సురేష్ 

1 comments:

ప్రేమ పెల్లుబికిన వేళ...

Post a Comment