ఏ సమయానికి ఆ సమయం
ఆకాశం నుండి వచ్చే సందేశం కోసం ఎదురుచూస్తూ
ఆశల పందిరి తోరణాల
లెక్కల్లో తలమునకలుగా
తర్జన భర్జన పడటంలో నువ్వుంటే
నీదైన కాలం నిన్ను దాటేసిన సత్యం
నీకెప్పటికీ తెలియదు
తీరని ఆశలన్నిటికీ
నువ్వు రాసుకున్న ఖర్మ సిద్ధాంతాలలో
నువ్విప్పటికే చోటునిచ్చేసావు కాబట్టి
తీసుకున్న విశ్రాంతిక చాలని
ఇక రాయబడే సిద్దాంతాలన్నీ
శ్రమాసముద్రుల పునరుత్పత్తికే ఊతమవ్వాలనీ
నరం నరం ఘోష పెట్టేలా
మనఃమధనం మొదలు పెట్టి చూస్తే
ప్రేమాక్రాంతమయ్యేది ప్రపంచమే కాదు
నిన్నాడంబరం చేసుకునే కాలం కూడా
తలుపు తెరిచినప్పుడే కాదు మూసినప్పుడూ
కాలం వీస్తూనే ఉందని తెలిసిన వాడికి
అదే కాలం పొడుగూతా
ప్రయాణం చెయ్యటమూ
బహుసులువన్న సత్యమొక
ప్రియమైన అలజడి అవ్వటం
జీవితానికి ఒక క్రొత్త పరిమళపు వ్యాకరణమే







0 comments:
Post a Comment