1.
యుగ యుగాల భగభగలన్నీ
మంచు శిలల్లా ఘనీభవించాయని
చదివిన చరిత్ర పాఠాలన్నీ కంఠోపాఠమై
దాటి వచ్చిన దారుల్లోకే
తిరిగి వెళ్ళాలన్న మనిషి తపనంతా
నాగరికమై ప్రయాణం కట్టేసింది
2.
అసంకల్పిత విపత్తులంటూ లేవని
వచ్చేవన్నీ మానవ నిర్మిత ప్రళయాలంటూ
మనిషి చెవిలో పోరుపెట్టే ధైర్యం
ఇంకా ఏ నొసటన రాయబడినట్లు లేదు
3.
పంచ భూతాల ఓపికకూ
సరిహద్దుల లెక్కలుంటాయన్న
ఎరుకేలేని యుగాన
అన్ని ఊపిర్లకీ ఒకటే ముగింపుని
లిఖించుకోవడం
మనిషి స్వహస్తాలతో రాసుకున్న శాపవచనం
4.
నేడు వేడెక్కిన నేలనడిగితే చెప్తుంది
రేపటి రోజున విచ్ఛిన్నమయ్యే
మన అడుగుల జాడల ముద్రల భవితవ్యాన్ని
5.
జీవ విధ్వంసమెంత గుండె శోకమో
మనిషి సారాంశమంతా నింపుకున్న
మట్టి గర్భానికే తెలుసు
ప్రళయాలన్నిటిలో ముగిసిన ప్రాణాల లెక్క
తెలిసిన ఒకే ఒక్క సాక్షి తానేగా మరి
6.
ఎవరికి వారు
గంట కట్టుకోవాల్సిన సమయమిది
లేదంటే
ప్రళయాంతర జీవానికి
నేటి మనిషే కర్బనం







0 comments:
Post a Comment