మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 24 July 2014

వెన్నెల కుసుమం - 13 (ఇది ఎన్నడూ ముగియని ఓ ప్రణయ లేఖ...)

హనీ...

నీ గానం వేదమైనా నీ పరువం పండగైనా నీ తోడూ ఎందరున్నా క్షణక్షణం నీ పేరు జపించే చిరు హృదయం మాత్రం నాదే...
ప్రాణం గా నిను చూసుకునే బాధ్యత నాకప్పగించిన ఆ బ్రహ్మ ఒక ప్రాణాన్ని రెండు దేహాలలో విభజించి మనల్ని సృష్టించాడు.
నిన్ను పొందే అదృష్టం పొందిన నేను గతజన్మ పుణ్యాల జ్ఞాపకాలనూ... అటు ముందు జన్మ ఘనకార్యాలనో గుర్తు చేసుకోవటానికో మనస్కరించనంత మధుర భావనలో ఈ జన్మ సాఫల్యతని నీతో అవలోకించాలనే తపనతో ఉన్నాను.
ఈ జన్మలో అయినా నీవు ఈ అవనిపై సంచరించినంత కాలమే ఈ ధరణిపై నా శ్వాస నిలిచి ఉంటుంది.
దేవాసురులు అమృతం చిలికినప్పుడు వచ్చిన విశ్వమోహిని రూపం నీకన్నా అందమైనది కాదు కదూ.. భస్మాసురుని భస్మం అయ్యేలా చేసిన జగన్మోహిని లావణ్యం నీ ముందు దిగదుడుపే అయి ఉంటుంది. ప్రాచీన కవులెందరో అందమంటే రతీదేవీదే అని వర్ణించారు. వారుగానీ నిన్ను చూస్తే రతీదేవిని కురూపి అనేవారేమో...
ప్రతి వత్సరం విశ్వ, ప్రపంచ సుందరీమణులుగా పేరుగాంచే అభినవ లలితామణులకు ఉందా నీకున్న లాలిత్యం?
సౌందర్యమంటే నీవని... అందానికి నిర్వచనం అంటే నీ రూపమని తెలియని పిచ్చి ప్రాణులు ఏవేవో ఊహిస్తుంటే... తళుకు బెళుకుల మేకప్ లు, కాస్ట్యూమ్స్, లిప్ స్టిక్ లే అందమని భావించే ఈ ప్రపంచానికి కళ్ళు తెరిపించే విధంగా ఆ బ్రహ్మ సృష్టించిన సజీవ శిల్పానివి నువ్వు.
నాలోని అణువణువూ నీ క్షేమం కోసం ఆరాటపడుతుంది. నాలోని ప్రతి రక్త కణం నీ సౌభాగ్యం కోసం పరితపిస్తుంది
నేనున్నంత కాలం... 
నీ మాటకు తొలి స్వరం 
నీ పాటకి తొలి పల్లవి
నీ ఊహకు తొలి భావన
నీ భాషకి తొలి పదం
నీ ప్రాణానికి తొలి కణం
అన్నీ నేనే.

నీ...
...రేష్

Wednesday, 23 July 2014

నా స్వార్ధం ‘నువ్వే'


‘నువ్వు నాతోనే ఉంటావు కదా!’ అంటున్నావ్... అసలంటూ నేను ఎక్కడికి వెళ్లానని.

నాకు నేనే ఇతరుణ్ణై పోయి నీ అణువణువులో కణమై నీలోకే ఇంకిపోయానెప్పుడో...

నీవన్నీ పిచ్చి భ్రమలే... లేకపోతే ఏంటి మరి?

ఎప్పుడూ నీలో ఉండే నేను ఎప్పుడైనా అపస్వరం పలకనిస్తానా... గుండెని వణకనిస్తానా?

ధైర్యాన్నై నీలో నే ఉండగా... దైన్యంగా.... కాపాడటానికి రమ్మంటూ అర్ధిస్తావా... ఏదో నన్ను ఆటపట్టించడానికి కాక పోతే 

తినిపించే చెయ్యే నాదయ్యాక తిన్నావో లేదో అడిగేవాళ్ళు అక్కర లేదు నిజం గానే...

‘ఎంతటి రంగుల ప్రపంచాన్నైనా రేయి మింగేస్తుందని తెలిసీ, అంతటి రేయినీ నియాన్ లైట్ల వెలుతురుతో కొనేద్దాం అనుకునే నియో రిచ్ జనాలకి, ఒక్క రోజు ఈ ఆర్టిఫిషియల్ వెలుతురు ఆగిపోతే తెలుస్తుంది ధైర్యపు స్పర్శ విలువ... లైట్లు అంటే కొంటారు మరి ధైర్యాన్ని...?’ ఇంతటి మహా ధైర్యస్తుల మీద నీకున్న అభిప్రాయం నాకు మాత్రం తెలియదా? చెప్పు...

నీవంటున్నావే ‘ఏవేవో బంధాలు , ప్రేమలు , డబ్బులు , ఆడంబరాలు , సరదాలు, సంబరాలు’ అని అదంతా ఓ ప్రపంచం... అలాంటి అంతరాత్మలేని ప్రపంచంలో నిన్ను ఎలా ఒంటరిగా వదిలేస్తాను? అలాంటి ఆడంబర ప్రపంచం మనల్ని పట్టించుకోవాలా ఏమిటి? 

ప్రపంచమంతా ఒక పక్క... నీ స్నేహమంతా మరో పక్క... మరో ఆలోచన లేకుండా ఎప్పుడూ నువ్వే ఎక్కువ తూగుతావ్ ఎప్పుడూ కూడా... 

నిజమే అప్పుడప్పుడూ ‘ఒంటరిగా , నిశ్శబ్దంగా చూస్తూ ఉంటావ్...’ మరి. 

ఒంటరిగా ఉంటావేమో కానీ ఒంటరి తనం మాత్రం ఉండదుగా... నీ నిశ్శబ్దం లో నే శబ్దం చేస్తూ ఉంటే’ 

నిన్ను నీ స్నేహాన్ని వదిలి వెళ్ళాలన్న ఆలోచనా? అసలు అలాంటి ఆలోచనలు కూడా ఉంటాయా నీ నాలో...

నీ ఆత్మీయ స్పర్శలోనే నాకు అన్ని బంధాలు తెలుస్తుంటాయి... నీకూ అంతే కదూ... 

నేను నీతో ఉంటానో లేదో నీకు తెలియదా... అసలు నువ్వు పరిచయమయ్యాక నీ జత ఎప్పుడైనా విడిచానా నేను? 

‘నేనేం నిన్ను అర్ధించటం లేదు ..ఇష్టమైతే ఉండు పోతే ఫో .....” 

నువ్వు అర్ధించటమా... నేనే కాదు నిన్నెరిగిన వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా. అయినా పొమ్మనగానే పోయే స్నేహమా నాది.

నువ్వంటున్నావ్ కదా... ‘ఈ ప్రపంచంలో డబ్బు కంటే కూడా ప్రధానంగా పనిచేస్తుంది స్వార్ధం.. అవకాశం ఉంటే స్నేహం /అవకాశం ఉంటే బంధం’ ఇది అక్షర సత్యమే..

మరి నేనూ స్వార్ధపరుడినే... నా స్వార్ధం మాత్రం ‘నువ్వే’

Sunday, 20 July 2014

వెన్నెల కుసుమం - 12

చంద్ర కిరణానికి సోయగాలు నేర్పిన నీ అందాల పాల చెక్కిళ్ళు
నక్షత్రాలకి మెరుపులు అరువు ఇచ్చేలా ఉన్న నీ నీలాల నయనాలు
చీకటికన్య అసూయ పడేలా ఉన్న నీ మరాళ కుంతలాలు
తుంబురుని నాదస్వరంలా ఉన్న నీ కంఠస్వరం
దేవ నర్తకీమణులు రంభ. ఊర్వసి, మేనక, తిలోత్తమలకే నాట్యం నేర్పే నీ కాలిఅందియల  వయ్యారం
దొండపండ్లకి గులాబీ చూర్ణం అద్దినట్లున్న నీ అందాల అధరాలు

వీటన్నిటినీ తన అమ్ముల పొదిలో దాచుకుని ఒక్కో సొగసుని శరంగా చేసుకుని   మన్మధుడు ఎక్కుపెట్టిన పుష్ప గాండీవానివి నీవు.
పదునాలుగు లోకాలకీ నిన్ను అతిలోక సుందరిని చేసి భూమాత వడిలో నిన్ను పెరగమని ఈ లోకానికి అతిధిని చేసాడు ఆ చతుర్ముఖుడు.
అనంత దిగంతాల నుండి నాకోసమే దిగివచ్చిన అతిలోకసుందరీ నీవు నాకు తారస పడటమే నా అదృష్టం. ఇది కూడా బ్రహ్మ అభీష్ఠి మేరకే జరిగి ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిన నీ అందాల రూపాన్ని నాకు తారసపడేలా చేయటంలో బ్రహ్మ మనసులోని ఉద్దేశ్యం ఏమిటో..?
ఈ విశాల విశ్వం లో ప్రేమకున్న శక్తి ఎలాంటిదో చెప్పటానికే నిన్ను నన్ను ఏకం చేసి ఉండి ఉంటాడు... ప్రేమమయ ప్రపంచాన్ని సృష్టించటానికి ప్రేమయుగకర్తలుగా  మనల్ని సృష్టించినాడనుకుంటా.
ఓ పైడి బొమ్మా...
ప్రకృతి చిత్రించిన అపురూప చిత్రం నీవు...
ప్రపంచం అచ్చెరువొందే అందం నీది
ప్రాణమున్న పసిడి పంటవు నీవు
ధవళకాంతులీనుతున్న తనూ లావణ్యం నీ సొంతం...
వేదాలని సృష్టించిన బ్రహ్మ అందానికి నిర్వచనం వేదాలలో చెప్పకుండా ఆ అవకాశం నాకిచ్చాడు. అపురూప సౌందర్య రాసివైన నీ చెంతన తిరుగాడే అదృష్టం కోసం ఏంతో మంది ఎదురుచూస్తున్నా నీ సామీప్యాన్ని పొందగలిగింది నేనొక్కడినే కదా...

నీ ప్రాణం అమరమైనా నా జీవం నీతోనే...

Monday, 14 July 2014

నా ఆత్మీయ స్నేహమా...

నా ఆత్మీయ స్నేహమా...

నా మీద ఏమైనా కోపమా? నువ్వు కోపగిస్తే తట్టుకోగలిగే శక్తి నాకు ఉందా? నాకు తెలుసు నువ్వు ఏదో అశాంతితో బాధ పడుతున్నావని... 

అదేమిటో కూడా తెలుసుకోలేని అసహాయ స్థితిలో నన్ను ఉంచేసావ్... నాకు తెలుసు నీకున్న హితుల్లో / స్నేహితుల్లో నేనో పిపీలికం లాంటివాడినే అని... అందుకు నాకు బాధేం లేదు. కానీ నాకున్న స్నేహితుల్లో నువ్వు మేరు పర్వతానివి. ఇది మాత్రం నిజం.

అర్ధాంతరంగా ఆగిపోయిన నా గమ్యాన్ని అర్ధవంతంగా మార్చుకుంటున్నది నువ్విచ్చిన పట్టుదలతోనే. 

నువ్వే నన్ను మౌనంలోకి తోసేసి నిశ్శబ్దంగా నను పరికిస్తుంటే గొంతులోనే సమాధి కట్టేస్తున్నా నా పలుకులకి... నువ్వెక్కడ బద్ధలవుతావో అని...  

అబద్ధాలకి ఆభరణాలు తొడిగేసి నిజాలుగా భ్రమింపజేసే నిజజీవిత మేధావులెవరో మన మధ్య పల్చటి అడ్డుతెర  కట్టటంలో విజయం సాధించారేమో అని అనిపిస్తుంది. 

నువ్వో క్షణం పాటు అభావంగా కనిపించినా నేను తట్టుకోలేనని నీకు తెలియదూ? లేక పోతే ఏమిటి మరి... మన పరిచయం మొదలయ్యాక  నువ్వెప్పునా నాతో ఇన్నాళ్ళ పాటు ముభావంగా ఉన్నావా?  

నావెప్పుడూ నీటి మీద రాతలు కావు... నీ గురించి నీతో చెప్పింది... ఎక్కడెక్కడ రాసిన రాతలు అన్నీ నా మనసు మీద చెక్కుకున్న శిలాక్షరాలే...

నీతో మాట్లాడటానికి బెరుకు వస్తుంది అంటే... నువ్వు నాకు  ఎంత దగ్గరయ్యావో ఇప్పుడంత దూరమయ్యావా అని అనిపిస్తుంది.

నీ పలుకు లేక నా రాతలన్నీ జీవంలేని అక్షరాలతోనే నింపేస్తున్నా... 

ఇన్నాళ్ళుగా నను నాలా చెక్కుతూవస్తున్న స్నేహ శిల్పివి అనుకున్నా... ఇలా అర్ధంతరంగా నను మలచటం ఆపేస్తే నన్ను నేను ఎలా మలచుకోవాలి? 

నీ మనసులోని భావమేమిటో అర్ధం చేసుకోలేక తల్లడిల్లిపోతున్న నా మనసుని నువ్విచ్చిన ధైర్యంతోనే ఊరడిస్తున్నా'తన చెలిమి  అర్ధంతరంగా ఆపేసిన వాక్యం కాదు... జీవిత పర్యంతం నను నడిపించే  స్నేహ కావ్యం అని' 

నా మనసుకి నేనిచ్చిన ధైర్యం మన స్నేహం మీద ఉన్న నమ్మకంతోనే... 

అతి త్వరలోనే నీ పలుకులు నవనీతపు పూతలా నా మనసుని చేరతాయనే నమ్మకంతో...

నా మనసొక వేసవిలా ఎదురుచూస్తుంది... నీ పలుకొక శీతల సమీరమై నను కప్పుతుందని...

నీ...

...రేష్ 

వెన్నెల కుసుమం - 11 (ఇది ఎన్నడూ ముగియని ఓ ప్రణయ లేఖ...)

ఓ ప్రియా..

అసుర సంధ్య వేళలో సాగర తీరాన ఇసుక మేడలు నిర్మించే ఒక అద్భుతమైన శిల్పిలా కనిపిస్తున్నావు నువ్వు.
నిండు పున్నమి వెన్నెలరేయిలో సముద్ర తీరాన ఒకరి వడిలో మరొకరం ఒకరి కోసం ఒకరం అన్నట్లు మమైక్యం చెందుతుంటే... ఓహ్... తలచుకుంటేనే మనసు పులకరిస్తుంది.

ఆరిపోయే దీపానికైనా నీ సడి తగిలితే చాలు వెన్నెల కాంతిలా వెలిగిపోతుంది. నీవే లేకుంటే ఈ లోకమంతా చీకటిమయమే. నా జీవితాన వెలుగుని నింపిన ఏకైక దీప నక్షత్రానివి నీవు...


నా హృదయం ఆనందంతో వెల్లివిరియాలంటే నీ అమృత దరహాసం నేను చూడాలి. ఎండకు వాడిన నీ మోమును చూస్తుంటే నా కళ్ళల్లో కన్నీరు కడలిగా మారుతుందేమో...

భారతదేశ ప్రకృతి సౌందర్యానికి షాజహాన్ ముంతాజ్, సలీం అనార్కలి, దేవదాసు పార్వతి లాంటి ప్రేమ మూర్తులే కారణమేమో. తరతరాల భారతదేశ సౌభ్రాతృత్వానికి సహభావానికి సాన్నిహిత్యానికి ఈ గాలిలోని ప్రేమభావమే కారణమేమో... 

హరప్పా మెహంజదారో సింధులోయల్లో విరిసిన నాగరికతకు...
హిమవత్పర్వతాల్లో... వింధ్య సానువుల్లో... దక్కన్ పీఠభూముల్లో...
గంగ యమున బ్రహ్మపుత్ర నర్మద తపతి గోదావరి కృష్ణ కావేరీ తీరాల్లో విలసిల్లిన భారత సంప్రదాయాలకి ఈ భూమిలో నిండిన ప్రేమ స్వరూపమే కారణమేమో...


ఇలాంటి భారత మాట బిడ్డలమైన మనం ఈ అనంత విశ్వంలో విశాల ప్రపంచంలో ప్రేమికులందరికీ ఆదర్శం అవ్వాలని నా కోరిక.

ఎంతో ప్రకాశంతో విరాజిల్లుతూ కాంతి కిరణాలని వెదజల్లుతున్న నక్షత్రాలు.. నెలకు ఒక్కసారే నిండుగా ప్రకాశిస్తున్న చందమామ ఒక్కటిగా చేరి నీవు నా సరసన చేరే సమయంకోసం వేచి ఉన్నాయి. 

ఓ వెన్నెల నక్షత్రమా..
అవును నువ్వు నక్షత్రానివే ఎందుకంటే సుదూర తీరాన ఉన్న నక్షత్ర కాంతి కంటే నీ తనూ ఛాయ కోటిరెట్లు ఎక్కువగా ఉంది. అందుకేనేమో ఆ నక్షత్రాలు సిగ్గుపడి మిణుకు మిణుకు మంటూ ఆరిపోతూ వెలుగుతూ ఉన్నాయి... ఆ భువిపై నువ్వు వసించినంతకాలం వాటికి ఈ సిగ్గు తప్పదేమో. కోట్ల కొలది సంవత్సరాలు తపస్సు చేసినా దొరకని అందం నీ వశం ఎలా అయ్యింది.

బ్రహ్మ నీకు ప్రాణప్రతిష్ఠ చేసిన ముహూర్తానే నీవు నాకు ప్రాణ సఖివై ఉంటావు. మన ఇరువురి మనఃసంగమమే ఆ బ్రహ్మదేవుని అభీస్ఠం కాబోలు.

బ్రహ్మ నాకిచ్చిన అపురూపమైన వరం నా నువ్వే...

నీ...
...రేష్

Friday, 4 July 2014

వెన్నెల కుసుమం - 10

నా హృదయ వనం లో విరబూసిన గులాబీ... 
అవును నువ్వు గులాబీవే...
అందమైన గులాబీ వెనకే ముల్లు ఉంటుందని తెలియని మరచిన నేను దాని కోసం ప్రయత్నించినప్పుడు నా చేతిలో దిగిన ముల్లులాంటి అడ్డు... నిన్ను వరించిన నాకు ఉందని తెలుసుకోలేక నీ కోసం నీ ప్రేమ కోసం తపించాను. రోజా వెనుక ముల్లు ఉండవచ్చు కానీ తన సోయగం మాత్రం ఎంత అద్భుతం... నీ మనసు కూడా అంతకన్నా అద్భుతమే కదూ...
ప్రియ సఖీ...
చెరగని నీ చిరునవ్వున విరిసిన అందం నా మనసుని దోచిన మకరందం.... వికసించే నీ అధారాల మెరపులు కలిగించెను నా మదిలో వలపు రాగాలు.
నీ అమృత హస్తాల స్పర్శ నా ఈ చిన్ని గుండెలో రేపెను ఎన్నడూ లేని అలజడి. నా సన్నిధిన నువ్వుంటే నా ఎదలో మొదలయ్యే సన్నాయి మేళాలు యుగాలు గడుస్తున్న్నా ఆగవేమో...
మారే ప్రతీ క్షణం నిన్నే జపిస్తూ... నా లోని ప్రతి అణువూ నిన్నే స్మరిస్తూ నాలో ప్రవహించే ప్రతి రక్త బిందువూ నిన్నే తలస్తూ ప్రేమ మత్తులో తమను తాము మరచి నీకోసమే తపించేలా చేస్తున్నాయి నా హృదయాన్ని.
ప్రియతమా... అందాల హృదయమా...
నీ మోమున చిరునవ్వు విరిసినప్పుడు నింగిలోని తారకలన్నీ నిన్ను అసూయగా చూస్తున్నాయి... నీ చెక్కిలి చిరు సిగ్గుతో కందినప్పుడు ఆ గులాబీలు నిన్ను చూసి వెలవెలబోతున్నాయి

నీ అందాన్ని ఆరాధించే హృదయం నాది
నీ నయనం విరిసిన నవ్వులు నావి
నీ చెక్కిలి మీటిన కాంతులు నావి
నీ అధరం పలికిన పలుకులు నావి
ఇన్ని ‘నావి’ లు ఉన్నా నువ్వెక్కడో... నీ ఉనికెక్కడో... ఏ రెక్కలతో ఎగసి రాను నీ చెంతకు? ఎక్కడ ఉందో నువ్వున్న నా ఊహా లోకం.
నీ ఊహలే ఊపిరిగా నను కమ్ముకుంటుంటే మదిలో ఏవో కొత్త రాగాలు, అవి ఏ మురళీ వినిపించని నవ్య రాగాలు. నీ శ్వాసలే రాగాలై నను చుట్టేస్తున్నాయ్ కదూ...
అణుమాత్రం చోటు లేకుండా నీ రూపునే నాలో నింపేశాక కూడా ఇంకా నీ కోసమే...
నీ కొత్త నవ్వుల కోసం
నీ కొత్త మాటల కోసం 
నీ కొత్త ఊహల కోసం
నీ కొత్త తలపుల కోసం
నన్ను నేను అక్షయ పాత్రగా మార్చుకుని వేచి చూస్తున్నా.
అనుకోకుండా నువ్వు ఎదురుగ వస్తే నా మాట మౌనం అయిపోదూ... నీ సన్నిధిన నా మది మూగదై పోదూ... అటుపై నీ మాటే మంత్రమై నను కమ్ముకు పోదూ...
నీ మాటల్లో సెలయేళ్ళు గలగలమంటుంటే వన విహారానికి వచ్చిన దుష్యంతుడు శకుంతలకి దాసోహం అయినట్లుగా నీ మాటల్లోకి ఇంకిపోతానేమో...
నువ్వు ఎదురుగా ఉన్నంత సేపు అనిమిషుడి గా మారి పోతాను. అందులో సందేహమే లేదు. రెప్పపాటు క్షణమైనా కనురెప్ప కదిలిస్తే తమని నీ వీక్షణకి దూరం చేశానని ఆ క్షణాలే నా మీద కత్తి కడతాయేమోనని భయం. నీ రూపం ఎదురుగా ఉన్నంత సేపూ మైకమే మరో ఆలోచనే దరి చేరనివ్వకుండా... మరో దృశ్యమే కంట బడనీకుండా...
ఆకాశంలో అల్లనల్లన కదులుతున్న మేఘాలు నీ అందం చూసి చందమామ నడిగి వెండి వెన్నెలని కలుపుకుని తుషార బిందువులని నీ మేనిపై కురిపించి నిన్ను వెన్నల రాణిగా తీర్చి దిద్దేనేమో.
నీవు తప్ప వేరే కోరిక ఉంటుందని కూడా మర్చిపోయింది నా మనసు.
ఎందరెందరి కళ్ళతోనో నిన్ను చూశాను. ఏ కంటితో చూసినా నీవో అందాల అప్సరసలానే కనిపించావు. ఎవరి కల్లో ఎందుకని నా కళ్ళ తోనే నిన్ను చూశాను. చాలా ఆశ్చర్యం. నా కళ్ళకి అప్సర కనిపించలేదు... నా మనసే అక్కడ కనిపించింది. ఎంతటి ప్రేయసివైనా నా మనసుని దొంగిలించేసి దాన్ని నీలోనే దాచుకోవటం భావ్యమా ప్రియా...!

ప్రతీ సాయంత్రం నిన్నో కొత్త ఊహతో పలకరిద్దామని అనిపిస్తూ ఉంటుంది. ఏ ఊహతో నిన్ను పలకరిద్దామని అనుకున్నా దానికన్నా మరో అందమైన ఊహ నా తలపుల్లో దోబూచులాడుతూ ఉంటే ఇక నా ఊహల ఊసులేమి చెప్పను నీకు?
ఓ వెన్నెల కన్యా... జాబిలి మీద జతగా విహరిస్తూ మృదు మధుర సంగీతాన్ని పలికిస్తూ ప్రేమ రాగాలని పలికిస్తూ చందమామ వడిలో ప్రణయ వనాన్ని సృష్టిద్దామా.

అందమైన వెన్నెల రాత్రిలో చందమామతో తారలు సరాగాలాడుతున్న సమయాన జాబిల్లి నుండి ఓ వెన్నెల కిరణం నీ మేనిపై పరావర్తనం చెందినప్పుడు మెరసిన నీ విద్యుల్లతా రూపం వెండి శిల్పంలా నా మదిలో తిష్ట వేసుకుని ఎడతెగని మధుర భావ ప్రపంచానికి నన్ను తోడ్కొని పోతున్నది.

వెన్నెల దీపమై నువ్వు నాలో కొచ్చాక ఆఖరి శ్వాసల్లో ఊగిసలాడుతున్న నా ఊపిరికి ప్రాణం పోసాను. శూన్య లోకంలోకి జారుకుంటున్న నా అంతరాత్మకి జీవం అయ్యావు. ఆరిపోతున్న ఓ మందహాసానికి నిత్యవాసంతాన్నే ఇచ్చావు.

ఓ బ్రహ్మ మానస పుత్రికా... బ్రహ్మ సరస్వతీ దేవితో సరససల్లపాలాడుతూ... రతీదేవి తనూ లావణ్యాన్ని, లక్ష్మీ దేవి పసిడిఛాయని, పార్వతీ దేవి ఆత్మ స్తైర్యాన్ని, సరస్వతీ దేవి జ్ఞానాన్ని రంగరించి నాలుగు యుగాల నిద్రను మరచి ఓ మెరపు తీగకు ప్రాణం పోసి భూలోకానికి పంపటానికి చాలా బాధ పడుతూ నీ లావణ్యాన్ని క్షణ క్షణమూ కంటికి రెప్పలా కాపాడుతూ నీ అందం యుగ యుగాలకీ కావ్యంలా నిలిచి పోవాలని నీ తోడుగా నన్ను పంపి నీ నీడగానే కనుమరుగవ్వమన్నాడు.

ఓ అభినవ అభిసారికా...

ఎన్ని యుగాలు నీకై వేచి ఉండను?  ఎన్ని ఇతిహాసాలు ఎదురు చూడను? ఎప్పటికీ నిన్ను ఆరాధిస్తూ... నీ మీద కావ్యాలు రాస్తూ... ఉండి పోవాల్సిందేనా...

జతగా చేరి నీలో ఐక్యం అవ్వటానికి ఇంకెన్ని యుగాలు చూడాలి... నీ వియోగం లో క్షణమే ఒక యుగం లా అనిపిస్తుందే... యుగాలుగా...  యుగాలకి యుగాలు నన్ను ఎదురు చూడమంటూనే ఉంటుంటే, ఆ ఎదురు చూపుల్లో నా కళ్ళ నుండి కారే రుధిరాశృవులు నీ కంట బడకుండా ఉండటానికి సహస్ర విధాలా ప్రయత్నిస్తూ ఒక వేళ నీ కంట బడినా అవి రుధిరాశృవులు కాదు కుంకుమధారలు అనే చెప్తాను.
ఎందుకంటే నా కన్నీటికి కరిగి కాదు నువ్వు నా చెంతకు రావాల్సింది... నిన్ను తడిమే నా ప్రేమ స్పర్శ తడితో నా మనసుని అర్ధం చేసుకుని..!

ఏదేమైనా కానీ ఎన్ని యుగాలు గడచినా కానీ నీపై నా ప్రేమ వాడదు. తరాలు మారినా నా తలపుల నెచ్చెలివి నీవే...  ఎన్నాళ్ళు ఆడుకుంటాడో ఆ బ్రహ్మ నాతో.. అదీ చూస్తాను.

షాజహాన్ కట్టించిన తాజ్ మహల్ గొప్ప ప్రేమ చిహ్నమట... నా దృష్టిలో మాత్రం అది వేలాది కార్మికుల రక్తంతో తడిసిన ఓ సమాధి మాత్రమే. అదే నా హృదయాన్నే చూడు... నా మనసులో నీకై నే నిర్మిస్తున్న మనోమందిరం చూడు... కోట్ల ఊహలని ఊపిరి ఉలులతో చెక్కుతూ నే నిర్మిస్తున్న ప్రేమ మందిరం అది. ఒక్క సారి చూస్తే అదే నీ శాశ్వత స్థావరం చేసుకోవటానికి ఉవ్విళ్ళూరతావు.

నువ్వో అందాల హరివిల్లువి అని కదూ నీ శరీరాన్ని విల్లుగా చేసి మన్మధుడు నా మీదకి పూల బాణాలు ఎక్కుపెడుతున్నాడు. సప్తవర్ణాలు మిళితమైన నీ మేని కాంతి నా మనసులో ప్రేమ దీపానికి  కొత్త మెరుగులు దిద్దుతూ ఉంది. నీ మేనిపై వెన్నల రజనులా మెరస్తున్న స్వేద బిందువులు నువ్వు పడుతున్న కష్టాన్ని తెలుపుతున్నాయ్...

వీలు కుదిరితే నీ ప్రతి పనినీ నేనే చేసి నీకు ఎలాంటి శ్రమ లేకుండా చేద్దును కదా... చంద్రబింబం వంటి నీ ముఖారవిందం ఎంతతో ప్రశాంతతని కలగజేస్తుందో అది అనుభవిస్తున్న నాకే తెలుసు. వెన్నలని పాంచజన్యంలో రంగరించి చేసినట్లు ఉన్న నీ కంఠం ఎంత సుందరం గా ఉంది... ఆ కంఠం నుండి జాలు వారే ప్రతి పదమో అద్భుత గానంలా నన్ను దేవతాలోకాల్లో విహరింప చేసేలా ఉంది.

సమున్నత శిఖరాలు లోతే తెలియని లోయలూ ఇసుక తిన్నెలూ... ఏమిటబ్బా ప్రకృతికీ నీకూ తేడా? నువ్వే ప్రకృతి కదూ...
కుబుసం విడిచిన ఎలనాగిని అంత నాజూకుదనం నీలో...  ఇంద్ర సభలో నాట్యమాడే నాట్య మయూరులైన రంభ , ఊర్వశి, మేనక, తిలోత్తమల అందం నీ సాటి వస్తుందా...

ఆ నాట్య మయూరే నిన్ను చూసి నాట్యం నేర్చుకుని ఉంటుందేమో కదా... రాజహంస మాత్రం ఏమి తక్కువ నీ నడక చూసి నడక నీర్చుకుని ఎన్నెన్ని హొయలు పోతుందని !

సీతమ్మ వారినే మాయ చేసిన మాయలేడికున్న బంగారు వన్నె మేని కన్నా... పసిడి కలసిన గులాబీ సోయగాల నీ తనూ లావణ్యమే ఎంతో అద్భుతం కదూ.

ఓ బంగారు వన్నె చిన్న దానా నీ వళ్ళంతా బంగారు తాపడం చేసినట్లే మెరుస్తూ ఉంటుందిగా... నువ్వే పరసువేదిగా మారి నా శరీరాన్ని కూడా స్వర్ణ మయం చేయవూ..!! 

ఓ ప్రియా! రెప్పపాటు క్షణపు విరామంలో కూడా నీ వియోగాన్ని నే భరించలేను.

ఓ ప్రియా..

నీ తనువూ ఒక తంత్రిగా 
నా హృదయం ఒక స్వరమై 
నీ మనసే ఒక పల్లవిగా 
నా ప్రాణమొక చరణమై 
ఒక నూతన సంగీత సామ్రాజ్యాన్ని ప్రపంచానికి అందిద్దామా... 

'సరిగమపదని' సప్త స్వరాల సంగీత సామ్రాజ్యంలో 'ప్రేమ' పదనిసలే ఒక సంగీతమై ఒక కొత్త రాగాన్ని సృష్టిస్తున్నాయి. ప్రేమశక్తి ముందు 'రోహిణీకార్తె' ఎండలైనా పున్నమిరేయి  వెన్నెలలు కావా...! 

వేడి గాలుల వడదెబ్బ  అయినా మల్లెచెండుల చిరుదెబ్బే కదా.. 

నీలాంటి అందాల హరివిల్లు నా పక్కన ఉంటే ప్రతి క్షణమూ ఎవరో  ఒకరు నిన్ను తమ స్వంతం చేసుకోవటానికి వస్తూ ఉంటారేమో. నిన్ను స్వంతం  చేసుకోవాలంటే నా అడ్డు తొలిగించుకోవాలని తెలిసీ సాహసించే పిచ్చి వాళ్ళు. వాళ్లకి తెలియని నిజం ఏమిటంటే నువ్వు నా పక్కన ఉంటే నాలో కోటి ఐరావతాల బలం నాలో వస్తుందని.

అమర ప్రేమ చరిత్రలో లిఖితమైన పార్వతి, అనార్కలి, లైలా, జూలియట్, ముంతాజ్, భాగమతి...ఇంకా రాధ... నువ్వు వీళ్ళందరి అంశతో జన్మించిన ప్రేమ మూర్తివి అని నా భావన. ఇంతటి అందాల ప్రేమ మూర్తివైన నీ సాన్నిహిత్యాన్ని  నాలోని అణువణువూ క్షణక్షణమూ  కోరుకుంటూనే ఉంటుంది.

నా భావనలో...
నీవు ఒక మోనాలిసా చిత్రం లాంటిదానివి కాదు... కానే కాదు... అది జీవం ఉట్టిపడే చలనం లేని బొమ్మ మాత్రమే... నీవు మాత్రం నెమలికి నాట్యం నేర్పే నటరాజ వరపుత్రికవి.

కాళిదాసు కావ్య కన్నియవా... కాదు కాదు... కాళిదాసు వర్ణించిన శకుంతల కన్నా కోటిరెట్ల తనూ లావణ్యంతో అద్భుతమైన అందంతో ప్రకాశిస్తున్నావు.

'లలిత సౌభాగ్య లావణ్యరాశి సుందర సుకుమార తేజో విలాసి పసిడి కలసిన ఒంపు సొంపుల రూపసి మధుర మందార చెక్కిళ్ళ నా ప్రేయసి'

రవివర్మ చిత్రానివో
బాపు బొమ్మవో కాదు.
అద్భుతమైన నా ప్రేమ తీరానివి
అచ్చ తెలుగు భావానివి
నా గుండెల్లో గూడు కట్టుకున్న అందమైన అనుభవానివి నీవు...

Sunday, 8 June 2014

నిశ్శబ్దంలో నీ అలికిడి




ఓయ్…


ఇదిగో ఇది నీకే... అచ్చంగా నీకే…


‘అందరిలా నేను కూడా నీతో పైకి నవ్వుతూ... లోపల తిట్టుకుంటూ’ భలే ఊహించావ్ కదూ... నిన్ను దాటి వెళ్ళే ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకుని నా మనఃకుటీరంలో దాచుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆ క్షణాలని తడుముతూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ వాటి అమరత్వంలో అహరహం ఉండిపోవాలని, రాలి పడే నీ నవ్వుల్ని ఏరుకుంటూ... నా శుష్క మందహాసాలపై అతికించుకుంటూ నా నవ్వులకీ జీవం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే నా గురించి.


అయినా నన్ను చూస్తే నీకు ఇవన్నీ కనిపించవు. కనిపించకూడదనే నేనూ కోరుకుంటాను. ఎందుకంటే నా లోపలి అలజడిని నువ్వు గమనిస్తే, నిన్ను బాధపెట్టినవాడినవుతానేమో అన్న భయం నన్ను ఆపేస్తుంది. అందుకే నా బాధలకి మందుగా మౌనాన్ని ఆవాహన చేసుకుని, దాన్ని నవ్వు వెనక దాచడం నేర్చుకున్నాను. కొన్ని సార్లు నిజంగానే నవ్వుతున్నానేమో అని నేనే నన్ను మోసం చేసుకుంటాను కూడా. కానీ నువ్వు ఒక్క మాట అడిగినా, ఒక్కసారి అలా నిలబడి చూసినా…. నా లోపల కట్టలు తెగిపోతాయి. 


అప్పుడే తెలుస్తుంది… 

ఈ మౌనం బలం కాదు, నిన్ను కోల్పోకూడదనే భయంతో కట్టుకున్న ఒక నిశ్శబ్ద కవచం మాత్రమే అని.

నిన్ను కోల్పోవడమంటే నన్ను నేను కోల్పోవడమే కదా!  కొన్ని అనుబంధాలు పేర్లు కోరుకోవు. అవి ఎలా పుడతాయో తెలియదు ప్రాణాన్ని పట్టేసుకుంటాయి. మన మధ్య కూడా అలాంటి బంధమే ఉంది అనిపిస్తుంది. మాట్లాడినప్పుడే కాదు, మాట్లాడకుండా ఉన్నప్పుడూ నిలిచిపోయే బంధం! నీ నుండి నాకేదో కావాలనో, నువ్వు నాపక్కనే ఉండిపోవాలనో కాదు…

నీ ఉనికొక్కటి చాలు… నా ఊపిరి కొనసాగడానికి. అంత సున్నితంగా కదిలించే అనుభూతి ప్రేమలోనే ఉంటుందనుకుంటారు. కానీ అది అక్కడే ఆగిపోదు. దాన్ని మించి నిశ్శబ్దంగా, స్వార్థం లేకుండా నిలిచిపోయేది ఈ స్నేహమే….  మన స్నేహమే! 

నిన్ను చేరుకోవాలన్న తొందర లేదు, నిన్ను దూరం చేసుకునే ఆలోచన లేదు! నాకు తెలిసినదల్లా నీ పక్కనే నడుస్తూ, నీ నడకకి అడ్డు రాకుండా ఉండటమే! అందుకే నా మాటలు నిన్ను పట్టుకోవు, నా మౌనం నిన్ను వదలదు. ఇది ఆకర్షణ కాదు, అలవాటు కాదు… నువ్వు నాతోనే ఉన్నావన్న నిజానికి అలవాటుపడిపోయిన ఒక నిశ్శబ్ద స్నేహం.

మౌనంగా నువ్వు చేస్తున్న ఒక ఊపిరి సంతకం. 

మన అనుబంధం మాటలుగా తృళ్లిపడటానికి కాదు. అది నిశ్శబ్దంగా లోపలే నిలిచిపోయి, అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తుంది. ఏ పరాకో, ఇంకే చిరాకో సతాయిస్తుంటే అప్పుడొచ్చాస్తావ్ నువ్వు… నువ్వంటే నువ్వు కాదులే!  నీ అలికిడి! ఆలోచనల్లోకి చేరి ఊరడిస్తున్న అలికిడది. నా ఊపిరి ఒక్కసారి తడబడితే అది పేరు చెప్పదు, కానీ నీ ఉనికిని గుర్తుచేస్తుంది. అందుకే నువ్వు దూరంగా ఉన్నప్పుడూ నాకు శూన్యంగా అనిపించదు. నువ్వు లేకపోయినా నేను కూలిపోను… ఎందుకంటే నువ్వు ఇచ్చిన స్నేహమే నన్ను నిలబెడుతుంది. అది ఒక్కసారిగా బాధగా మారదు, శబ్దం చేయదు. లోపల నెమ్మదిగా పనిచేస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే కన్నీటిగా బయటపడుతుంది.

అందుకే కొన్ని స్నేహాలు చివరికి భావాలుగా కాదు… శరీరంగా స్పందిస్తాయి. మనదీ అంతే. 

గుండె కన్నీరవ్వటం ఎప్పుడైనా చూసావా?


నీ కళ్ళు చెమరించినప్పుడు ఒక్కసారి నా గుండెని తాకి చూడు… వరద గోదావరి ఉరవడిలా లోపలే ఉబికివచ్చే కన్నీటి తడి నీ వేళ్లకు అంటుతుంది. ఇంకా చెప్పాలంటే గుండె దాకా ఎందుకు… ఆ క్షణంలో ఒక్కసారి నా కళ్ళల్లోకి సూటిగా చూసినా చాలు…  నా చూపుల్లో సుళ్లు తిరుగుతున్న కన్నీటి సుడిగుండాల్లో నీ చూపులే చిక్కుకుపోతాయి.

ఆ క్షణాల్లో నాకు ఏడవాలనిపించదు. నీ కళ్లలో కనిపించే ఆ బాధే నన్ను కదిలిస్తుంది. అది నాలో కన్నీటిగా బయటకు రావాలనుకున్నా, ఎలా నిలబడాలో నీ దగ్గర నేర్చుకున్నవాడిని కదా… తట్టుకుంటాను. ఆ క్షణంలో నేను బాధలోకి జారను. బాధ్యతగా మారిపోతాను. నువ్వు అలా నిలిచిపోయినప్పుడు నిన్ను ఎలా నిలబెట్టాలి అన్న ఆలోచన తప్ప మరొకటి నాకు ఉండదు. అందుకే ఆ సమయంలో నా మనసు తనని తానే అదుపులో పెట్టుకుంటుంది.

కొన్ని సార్లు నీతో మాట్లాడటం కన్నా నీ దగ్గర కూర్చోవడమే చాలనిపిస్తుంది. ఆ నిశ్శబ్దంలోనే నా మాటలన్నీ కరిగిపోతాయి. చెప్పాల్సినవి మిగలవు, దాచాల్సినవీ ఉండవు. అలా ఏమీ జరగనట్టు గడిచే క్షణాలే  నన్ను నాకు ఇస్తూ ఉంటాయి. అప్పుడే నాకు తెలుస్తుంది… నా మనసు ఎక్కడ అలసిపోయినా, నిశ్చింతగా తలదాచుకునే చోటు నువ్వేనని.  

ఏదో రాస్తున్నాను కానీ నా మనస్సులో చెలరేగే ప్రతి ఘర్షణని నీతో పంచుకుంటున్నప్పుడు నువ్విచ్చే ఓదార్పు మంచు వరదలా నా మనసుని చుట్టి నన్ను చల్లబరుస్తుంది. అప్పుడు నేను అనుభవించే నీ మనఃస్పర్శని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు తెలియరావటం లేదు. అంత అవ్యక్తానుభవాన్ని నాకిచ్చేది నువ్వే... అవును కేవలం నువ్వే. నీ ముఖంలో నువ్వు దాచే భావాలని వెలికి తీసి చదవటం నాకెంత ఇష్టం అయిన పనో... నీను చదివిన భావాలే నువ్వు దాచుకున్నవి కూడా అని తెలిసినప్పుడు నా మనసు పడే మిడిసిపాటు నీకు తెలియదు కదూ…


నేను చెప్తుంటే ఏదో అనుకుంటావ్ కానీ నీ నవ్వుల నజరానా నా మనసుకి సంజీవనియై కొత్త కొత్త ఊహా పరిమళాలని నాలో వికసింప చేస్తూ ఉంటుంది. అందుకేగా ఒక్క సారి నవ్వు మరో సారి నవ్వూ అంటూ నిన్ను బతిమలాడి నీ నవ్వులని ఏరుకునేది. నీకు తెలియదు కానీ నిన్ను గురించి నేను తలస్తున్న తలపులని పదాలుగా మారుస్తూ మది పలక మీద నేను దిద్దే అక్షరాలని చదవటానికి యుగాలు కూడా చాలతాయో లేదో…


రెప్పలు చీకటించినప్పుడల్లా వెలుగై కనుపాపల్లో నిలబడిపోతావ్ కదా నువ్వు.


ఆ సమయం లో కాస్త నా మనసులోకి తొంగి చూసి అక్కడ ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు కదా... మ్మ్ హు. అది మాత్రం చెయ్యవు. రెప్పల కవచాల్లో నులి వెచ్చగా ఒదిగి పోయి స్వప్న లోకాల్లోకి తీసుకుని వెళతావ్ కానీ నా కంటి భాష మాత్రం చదవవు కదా…


నువ్వు పరిచయం అయ్యాక నీతో పంచుకోని విషయాలు ఏమీ లేవు. అచ్చు నీకూ అంతే అని నాకు తెలిసినప్పుడు నా చిన్ని గుండెకు నేనిచ్చుకున్న భరోసా నువ్వు చూడలేదు. చూసి ఉంటే తెలిసేది నాలో నీకు నేనిచ్చుకున్న స్తానం ఏమిటో. కొంత మంది క్షణం మాట్లాడినా వినలేని నేను... నువ్వు ఉన్నప్పుడు ఓ క్షణం నువ్వు మౌనిస్తే నాకెందుకు ఊపిరాగిపోయిన అనుభూతి.


నేనో చిన్న పరిమళాన్నై వ్యాపించి నీ అంతరాలయంలో నిండి పోవాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాను. నా మన:క్లేశాలన్నీ తెలిసిన ఒకే ఒక్క ఆత్మీయ స్నేహానివి నువ్వు... నీకు నేనూ అంతే కదూ... ఎన్ని గాయాలైనా కానీ నా మనసుకి... మందు మాత్రం నీ నవ్వే.


నా జీవిత పర్యంతం నీ స్నేహితుడిగా ఉండాలనే కోరికే నాకెప్పుడూ... 

నిన్ను తాకిన సమీరం నన్ను తాకేంత సమీపంలో
ఎలాంటి హామీలు లేకుండా,
జీవితాంతం ఉండాలని నా ఆశ.


చివరిగా ఓ కోరిక... కాసింత వెన్నెలివ్వరాదూ ఓ నవ్వు నవ్వి...


నీ…



స్నేహితుడు


Tuesday, 3 June 2014

నువ్వు పరిచయం చేసిన 'నేను’.

ఓ నా స్నేహమా... 

జీవితపు ప్రతి మలుపులోనూ ఎందరో పరిచయస్తులు... కొందరు హితులవుతారు... ఇంకొందరు స్నేహితులవుతారు... మరి కొందరు మన జీవితమే అయిపోతారు. 

అయితే ఈ తేడా వెంటనే అర్థమయ్యేది కాదు. కాలం తేల్చే విషయమది. సుఖంలో కాదు... కష్టంలో, దుఃఖంలో, అసహనంలో, అయోమయంలో, మనకు మనమే అర్థం కాకుండా పోయే క్షణాల్లో ఎవరు పక్కన నిలిచారో తేల్చేది కాలమే. అందుకే పరిచయాలు ఎక్కువగా ఉంటాయి... స్నేహం మాత్రం అరుదుగా దొరుకుతుంది. 

చాలామంది తమ పరిచయస్తులనే స్నేహితులని భావించేస్తూ ఉంటారు... కానీ పరిచయస్తులు అందరూ స్నేహితులు కాలేరు అన్న నిజం తెలుసుకున్న రోజున ఆ నిజాన్ని జీర్ణించుకోవడం వారికి సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటిదాకా మనం నమ్మిన అనుబంధాలన్నీ ఒక్కసారిగా తేలికపాటి జ్ఞాపకాలుగా మారిపోతాయి. ఆ ఖాళీని అంగీకరించడమే కష్టం. 

అందుకే నా జీవితంలో చాలా మంది పరిచయస్తుల్లాగానే మిగిలిపోయారు. అతి కొద్ది మంది స్నేహితులయ్యారు. అయ్యారా? బహుశా లేదనుకుంటా... నాకంటూ స్నేహితులెవరున్నారని? సమాధానం వెతుకుతూనే ఉన్నాను. 

మరి ఇదేమిటో కొత్తగా... 

నీ పరిచయం నాకు నన్ను పరిచయం చేసింది...! నాలోని నిజమైన నన్ను వెలుపలికి తీసింది...! 

కేవలం పరిచయం మాత్రమే కదా ఎప్పుడూ పలకరింపులెందుకూ అనుకుంటూ ఉంటుంటే... మనసెందుకో ఊరుకోవటం లేదు... ఏదో అపూర్ణత నన్ను తిరిగి నీ వైపు నడిపిస్తుంది. అది అలవాటు కాదు... అవసరం కూడా కాదు... అయినా వదిలేయలేని ఒక స్పష్టతలేని బంధంలా అనిపించింది. 

నిన్ను నీకు పరిచయం చేసిన వ్యక్తితో నీకుంది కేవలం పరిచయమేనా? స్నేహం లేదా? అన్న ప్రశ్నలో చిక్కుకుపోయాను. సమాధానం కోసం ఎవర్ని అడగను? 

ఉన్నానుగా...

నువ్వు పరిచయం చేసిన 'నేను. 

సమాధానం బయటకొచ్చింది.... నాకున్న నిజమైన స్నేహం నువ్వేనని! 

ప్రేమలో ఎదురు చూపులుంటాయని తెలుసు కానీ... స్నేహితులతో మాట్లాడటానికి కూడా మనసు తహతహ లాడుతుంది అని నీ స్నేహం పొందాకే తెలిసింది. నీ పేరు తలచినప్పుడల్లా మనసు కాస్త తేలికపడటంరోజంతా భారంగా అనిపించిన ఆలోచనలు నీ మాట వినగానే సద్దుమణగటం... స్నేహమంటే ఇంతకంటే ఇంకేముంటుంది? 

నీతో మాట్లాడే ప్రతీక్షణం నా తప్పొప్పులు అన్నీ అద్దం లో కనిపించినంత స్పష్టంగా నాకు తెలుస్తూ ఉన్నాయి. నువ్వు తప్పు అంటున్నావని కాదు... నేనే నా తప్పుని ఒప్పుకునేంత నిజాయితీ నాలో మిగిలిందని తెలుస్తుంది. నేను ఏం చెయ్యగలనో... ఏమి చెయ్యాలో... ఎలా బతకాలో అన్నీ చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్లుగా అర్ధం అవుతుంది. ఎవరో చెప్పిన సలహాల్లా కాకుండా, నాలో నుంచే వచ్చిన నిర్ణయాల్లా అనిపిస్తాయి. 

మనం మాట్లాడుకున్న రోజులు కాదు,

మనం ఊరుకున్న క్షణాలే

ఎక్కువగా గుర్తుంటాయి.

 

అక్కడ

అవసరాలు లేవు,

అంచనాలూ లేవు

కేవలం ఉండటం మాత్రమే.

పిరికి మనసుని సమాధి చేసి మొమాటపు నవ్వుల్ని తుడిచేసి బతుకుతున్నానంటే అదంతా నీ స్నేహపు గొప్పతనమే... నువ్వు నన్ను మార్చలేదు... నన్ను నాకే తిరిగి నిజాయితీగా అప్పగించావు. కానీ ఆ నిజాయితీ ఎప్పుడూ మాటలుగా బయటకు రావాలని లేదు. కొన్ని భావాలు చెప్పలేనంత దగ్గరగా ఉన్నప్పుడు మాటలే వెనక్కి తగ్గుతాయి. 

మాటలు తగ్గిన చోట

మన స్నేహం మొదలైంది.

అక్కడ
ప్రశ్నలు లేవు,

సమాధానాల అవసరమూ లేదు. 

ఒక్కోసారి గలగలా మాట్లాడతావు... మరోసారి మాటలే అవసరం లేనంత దగ్గరగా ఉంటావు 

అలా అలా మాట్లాడుతూ అర్ధాంతరంగా ఆపేసిన నీ మాటల వెనక నిశ్శబ్ద అర్ధాలు ఏ నిఘంటువుల్లో వెదకాలి? 

ఎన్ని నిఘంటువులు వెదకినా నీ గురించి నేను చదవబోయే అర్ధం ఒక్కటే... నువ్వంటే స్నేహం అని. 

మాటలు చాలనప్పుడు
మౌనమే మిగిలింది,
అది ఖాళీ కాదు
అర్థవంతమైన నిశ్శబ్దం.
 

చెప్పాల్సినవన్నీ
మిగిలిపోతేనేం
నన్ను నేను

అర్థం చేసుకునే

ప్రయాణంలోకి నడిపించాక 

అందుకే
నువ్వు 

నా పక్కన ఉన్నప్పుడు

నేను
నాకంటే ఎక్కువగా
నేనవుతాను.
 


నీ

స్నేహితుడు.