చంద్ర కిరణానికి సోయగాలు నేర్పిన నీ
అందాల పాల చెక్కిళ్ళు
నక్షత్రాలకి మెరుపులు అరువు ఇచ్చేలా
ఉన్న నీ నీలాల నయనాలు
చీకటికన్య అసూయ పడేలా ఉన్న నీ మరాళ
కుంతలాలు
తుంబురుని నాదస్వరంలా ఉన్న నీ కంఠస్వరం
దేవ నర్తకీమణులు రంభ. ఊర్వసి, మేనక, తిలోత్తమలకే నాట్యం నేర్పే నీ
కాలిఅందియల వయ్యారం
దొండపండ్లకి గులాబీ చూర్ణం
అద్దినట్లున్న నీ అందాల అధరాలు
వీటన్నిటినీ తన అమ్ముల పొదిలో దాచుకుని
ఒక్కో సొగసుని శరంగా చేసుకుని మన్మధుడు
ఎక్కుపెట్టిన పుష్ప గాండీవానివి నీవు.
పదునాలుగు లోకాలకీ నిన్ను అతిలోక సుందరిని చేసి
భూమాత వడిలో నిన్ను పెరగమని ఈ లోకానికి అతిధిని చేసాడు ఆ చతుర్ముఖుడు.
అనంత దిగంతాల నుండి నాకోసమే దిగివచ్చిన
అతిలోకసుందరీ నీవు నాకు తారస పడటమే నా అదృష్టం. ఇది కూడా బ్రహ్మ అభీష్ఠి మేరకే జరిగి ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ
చేసిన నీ అందాల రూపాన్ని నాకు తారసపడేలా చేయటంలో బ్రహ్మ మనసులోని ఉద్దేశ్యం ఏమిటో..?
ఈ విశాల విశ్వం లో ప్రేమకున్న శక్తి
ఎలాంటిదో చెప్పటానికే నిన్ను నన్ను ఏకం చేసి ఉండి ఉంటాడు... ప్రేమమయ ప్రపంచాన్ని
సృష్టించటానికి ప్రేమయుగకర్తలుగా మనల్ని
సృష్టించినాడనుకుంటా.
ఓ పైడి బొమ్మా...
ప్రకృతి చిత్రించిన అపురూప చిత్రం
నీవు...
ప్రపంచం అచ్చెరువొందే అందం నీది
ప్రాణమున్న పసిడి పంటవు నీవు
ధవళకాంతులీనుతున్న తనూ లావణ్యం నీ
సొంతం...
వేదాలని సృష్టించిన బ్రహ్మ అందానికి
నిర్వచనం వేదాలలో చెప్పకుండా ఆ అవకాశం నాకిచ్చాడు. అపురూప సౌందర్య రాసివైన నీ చెంతన
తిరుగాడే అదృష్టం కోసం ఏంతో మంది ఎదురుచూస్తున్నా నీ సామీప్యాన్ని పొందగలిగింది
నేనొక్కడినే కదా...
నీ ప్రాణం అమరమైనా నా జీవం నీతోనే...






2 comments:
ప్రకృతి చిత్రించిన అపురూప చిత్రం నీవు...
ప్రపంచం అచ్చెరువొందే అందం నీది
enta bhavukata undo , bagundi sir
కృతజ్ఞతలు ఫాతిమా గారు
Post a Comment