Monday, 14 July 2014

వెన్నెల కుసుమం - 11 (ఇది ఎన్నడూ ముగియని ఓ ప్రణయ లేఖ...)

ఓ ప్రియా..

అసుర సంధ్య వేళలో సాగర తీరాన ఇసుక మేడలు నిర్మించే ఒక అద్భుతమైన శిల్పిలా కనిపిస్తున్నావు నువ్వు.
నిండు పున్నమి వెన్నెలరేయిలో సముద్ర తీరాన ఒకరి వడిలో మరొకరం ఒకరి కోసం ఒకరం అన్నట్లు మమైక్యం చెందుతుంటే... ఓహ్... తలచుకుంటేనే మనసు పులకరిస్తుంది.

ఆరిపోయే దీపానికైనా నీ సడి తగిలితే చాలు వెన్నెల కాంతిలా వెలిగిపోతుంది. నీవే లేకుంటే ఈ లోకమంతా చీకటిమయమే. నా జీవితాన వెలుగుని నింపిన ఏకైక దీప నక్షత్రానివి నీవు...


నా హృదయం ఆనందంతో వెల్లివిరియాలంటే నీ అమృత దరహాసం నేను చూడాలి. ఎండకు వాడిన నీ మోమును చూస్తుంటే నా కళ్ళల్లో కన్నీరు కడలిగా మారుతుందేమో...

భారతదేశ ప్రకృతి సౌందర్యానికి షాజహాన్ ముంతాజ్, సలీం అనార్కలి, దేవదాసు పార్వతి లాంటి ప్రేమ మూర్తులే కారణమేమో. తరతరాల భారతదేశ సౌభ్రాతృత్వానికి సహభావానికి సాన్నిహిత్యానికి ఈ గాలిలోని ప్రేమభావమే కారణమేమో... 

హరప్పా మెహంజదారో సింధులోయల్లో విరిసిన నాగరికతకు...
హిమవత్పర్వతాల్లో... వింధ్య సానువుల్లో... దక్కన్ పీఠభూముల్లో...
గంగ యమున బ్రహ్మపుత్ర నర్మద తపతి గోదావరి కృష్ణ కావేరీ తీరాల్లో విలసిల్లిన భారత సంప్రదాయాలకి ఈ భూమిలో నిండిన ప్రేమ స్వరూపమే కారణమేమో...


ఇలాంటి భారత మాట బిడ్డలమైన మనం ఈ అనంత విశ్వంలో విశాల ప్రపంచంలో ప్రేమికులందరికీ ఆదర్శం అవ్వాలని నా కోరిక.

ఎంతో ప్రకాశంతో విరాజిల్లుతూ కాంతి కిరణాలని వెదజల్లుతున్న నక్షత్రాలు.. నెలకు ఒక్కసారే నిండుగా ప్రకాశిస్తున్న చందమామ ఒక్కటిగా చేరి నీవు నా సరసన చేరే సమయంకోసం వేచి ఉన్నాయి. 

ఓ వెన్నెల నక్షత్రమా..
అవును నువ్వు నక్షత్రానివే ఎందుకంటే సుదూర తీరాన ఉన్న నక్షత్ర కాంతి కంటే నీ తనూ ఛాయ కోటిరెట్లు ఎక్కువగా ఉంది. అందుకేనేమో ఆ నక్షత్రాలు సిగ్గుపడి మిణుకు మిణుకు మంటూ ఆరిపోతూ వెలుగుతూ ఉన్నాయి... ఆ భువిపై నువ్వు వసించినంతకాలం వాటికి ఈ సిగ్గు తప్పదేమో. కోట్ల కొలది సంవత్సరాలు తపస్సు చేసినా దొరకని అందం నీ వశం ఎలా అయ్యింది.

బ్రహ్మ నీకు ప్రాణప్రతిష్ఠ చేసిన ముహూర్తానే నీవు నాకు ప్రాణ సఖివై ఉంటావు. మన ఇరువురి మనఃసంగమమే ఆ బ్రహ్మదేవుని అభీస్ఠం కాబోలు.

బ్రహ్మ నాకిచ్చిన అపురూపమైన వరం నా నువ్వే...

నీ...
...రేష్

0 comments:

Post a Comment