మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Wednesday, 27 January 2016

మాయా దర్బారు


తరాల తప్పులన్నిటిని తరాజులో కొలవటమే పాపమన్న కొత్త నినాదంతో
కొంగ్రొత్త కుబుసాన్ని కప్పుకుంటూ కొందరు
నైతికసూత్రాల తక్కెడలో ప్రతి తూకమూ పాపమనే కార్పణ్యాలతో
ఇజాల మాటున సామాజిక చిత్రాన్ని చిధ్రం చేస్తూ మరి కొందరు
విభేదాలని విద్వేషాలుగా మార్చుకునేంతగా
మనిషితనపు విభజన జరిగిపోయాక
ఎంతగా విభజించబడినా చలించని శిలా ఫలకాల మౌనంలోకి జారిపోయిన
యాంత్రిక జీవజాతిగా అనేకానేక మస్తిష్కాలు నిద్రను కావలించుకుంటున్నాయ్

హద్దు హద్దుకూ మారుతున్న భావజాత్యపు పోకడల లోకంలో
చరిత్రనిండా రక్తాన్నే తాగిన నేలకీ ఆ నెత్తురే వ్యసనమయ్యిందేమో
నెత్తుటి తడి తప్ప అన్ని తడులనీ వెలివేసేస్తుంది కన్నీటి తడితో సహా
అప్పుడప్పుడూ తనని తానూ వెలివేసుకుంటూ
పచ్చని ఉరికొయ్యలకి ఆదరువుగా పరచుకుంటూ
ఎక్కడికక్కడ వధ్యశిలల పంట పండిస్తున్నట్లుంది

రాజకీయ క్రీడలకి సమయాన్ని మోసుకొస్తుంటాయేమో
కొన్ని మరణాలే సంచలనాలవుతాయ్
మేధావుల అసహనాలని పీల్చుకుంటాయేమో
కొన్ని ఊపిర్లకే విలువలు శ్వాసిస్తాయ్
బతుకులోనూ  మరణంలోనూ
కులమతాలే  సరిహద్దులైన చోట
కొన్ని మరణాలప్పుడూ రణరంగమే
మరి కొన్ని మరణాలదెప్పుడూ నీరవ నిశ్శబ్దమే

మరణమొక అంతిమరణమయ్యాక
అరేయ్ తమ్ముడూ
నీ దారెంత పదునుగా ఉందో
అక్కడ నడిచే నీ నగ్నపాదాలకే ఎరుక
నీకోసం యుద్ధరంగమూ లేదు
మేధాపరివారమూ లేదు  
అయితేనేం యుద్ధం తప్పదు నీకు

ఈ యుద్ధానికి ఎక్కడ ముగింపో
నీ కథ ఎక్కడికి చేరుతుందో..
పంచవర్ష కిరీట క్రీడారామంలో
అంతిమ విజేత మాయా దర్బారులో అడగాల్సిందే

Monday, 25 January 2016

రణం



మనసుకందని సమాధానాల వెల్లువలో 
ఒక నిశ్శబ్దం ఇంతగా శబ్దిస్తుందని 
ఎప్పుడూ అనుకోలేదురా 
అల్లుకుపోతున్నఒక  మౌనంలో 
చిక్కుకుపోవటమెంత నరకమో 
అక్షరాలకి అందటం లేదురా
అయితేనేం 
నీకందితే చాలులే  
ఇక ఇప్పుడైతే 
అలవాటైన ఖాళీతనాల వెంపర్లాటలో 
తళతళలాడుతున్న కన్నీటి జలపాతాలలో
గరళాలన్నీ గుండెల్లో వర్షిస్తుంటే
మళ్ళీ ఒక రణం పిలుస్తోందిక్కడ 
మళ్ళీ ఒక ' 'రణం పిలుస్తోందిక్కడ

Sunday, 24 January 2016

రాత్రిదనం


ఒక నడిచే శూన్యం గుప్పిట్లో 
చిక్కిన మౌనంగా 
కొనసాగుతున్న చిక్కని రాత్రి ఒకటి  
ఎప్పటి నుండో నన్ను దాచుకుంటూ వస్తుంటే
నా మీద ఎంత ప్రేమో అనుకున్నా 
నేనో అనంతమైన చీకటి కడలినని తెలిసి 
నిశికి కాటుకలా నన్నద్దుకుంటూ తన రాత్రిదనాన్ని 
మెరుగుపరచుకుంటున్న స్వార్ధమని తెలియక


ఇమిటేషన్

హాయ్ రా..

పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ మనిషన్న వాడు మాయమైపోతున్నాడని కళ్ళ తడిని అద్దుకుంటూ నువ్వన్న దగ్గరినుండీ నాలో అలవిమాలిన ఆలోచనలురా… ఆ ఆలోచనలు ఎంతవరకూ సబబుగా ఉన్నాయో నాకూ తెలియదు కానీ అవి నీతో  పంచుకోకుండా ఉండలేక పోతున్నాను. 

ఎక్కడి కథలకో ఎవ్వరి వ్యధలకో మన కళ్ళు తడిదేరుతున్నాయంటే ఇంకా కొంచెం మనంగా మిగిలి ఉన్నామనే. 

నెమ్మదిగా అయినా నిండైన మనిషితనం తట్టకపోదు అన్న ఒక్క ఆశ చాలు ప్రపంచం మనిషి మీద నమ్మకం మిగుల్చుకోవడానికి. మనందరికీ సమకాలీకులుగా 800 కోట్లకు పైగా జనం ఉన్నారు. అందులో మనకి పరిచయస్తులెంతమంది? వాళ్ళలో మనకి సంపూర్ణంగా తెలిసింది ఎంతమంది? మహా సింధువులో ఓ చిన్ని బిందువంత. మన గురించే మనకి పూర్తిగా తెలియనప్పుడు ఏ లోతులని స్పృశిస్తూ మనం అందరినీ అంచనా వేయగలం? 

ఏదో అనుకుంటున్నాం కానీ లోకం ఇంకా అంతగా చెడిపోలేదురా. కొందరింకా ప్రకృతి లాగానే  ఉన్నారు. మనుషుల్లో మనుషులింకా కనపడుతూనే ఉన్నారు. ఎక్కడో ఎందుకు? 
మనిషి ఎక్కడ మనిషి ఎక్కడ అంటారే కానీ తమ ప్రశ్నకి తామే సమాధానంగా ఎందుకు మారరు? 

మనిషి అనబడే లక్షణాలేవో వాళ్ళకి బాగానే తెలిసి ఉండాలి కదా? మరెందుకు తమలో తామే ఆ లక్షణాలని పెంచుకునేలా చేసుకోరు. పక్కవాటి మీద ఉన్న ఆసక్తి తమ మీద తామెందుకు పెట్టుకోరు? 

నిజానికి మారాల్సింది మనం చూసే దృష్టి. మనం చేస్తే ఆచారం  మరొకడు చేస్తే అపచారం  అని అనుకున్న వాళ్ళు ఉన్నంత కాలం ప్రకృతి మీద వికృతి ముసుగే కనిపిస్తుంది. మనిషి నడకతోనే ప్రకృతి అయినా మరి వికృతి అయినా. కాలపు ప్రస్థానంలో ఆయా సామాజిక పరిస్థితులని బట్టి వచ్చిన విశ్వాసాలని నేటి పరిస్థితులకి తగ్గట్లుగా సంస్కరించుకోవటంలో విజ్ఞత చూపించటం మనిషితనం అవుతుందేమో కానీ ‘నేటి’ని  ‘నాటి’ రోజుల్లోకి తీసుకు వెళ్ళటం అంటే వాడు అక్కడ మనిషిగా ఆఖరు అయిపోయినట్లే. 

నిజానికి మనిషితనం గతి తప్పినప్పుడల్లా ప్రకృతి చిన్న చిన్నని హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. ఎవరికి వారు తమదాకా వచ్చేదే ఉత్పాతం అనుకున్నన్నాళ్ళూ తమ అదృశ్యానికి తామే తెరతీస్తూ ఉన్నట్లే అని ఎరుక మాత్రం ఏ  కొందరిలోనో. ‘అదాటుగా ఒక్క సారిగా ఇప్పుడు మానవ జాతి అనబడుతున్న నా జాతికి కాస్త విచక్షణ వచ్చేస్తే ఎంత బాగుండు ‘. నిజమే,  ఇప్పుడు నిజంగా మనిషిలో కొరవడింది విచక్షణాజ్ఞానమే.  అదొక్కటి పెంచుకుంటే చాలు మనిషికి మనిషి దొరకటం మొదలవుతుంది. 

మనిషి మనసన్నది అంత తేలికగా  అర్ధం అయ్యేదే అయితే లోకమెప్పుడూ అపార్ధాల బాట పట్టదు కదా.  గమనించి చూడు, నిజానికి మన అభిప్రాయాలని ప్రభావితం చేసేదేమిటో తెలుస్తుంది.  నీ ఇంట్లోనో, వీధిలోనో, పత్రికల్లోనో & నాయకుల మాటల్లోనో కనిపించే  ఆ కొన్ని అభిప్రాయాలే మనం లోకాన్ని అర్ధం చేసుకునే ఉపకరణాలు. నిజానికి మనకి ఉండాల్సింది లోకమంటే భయం కాదు దాని మీద అపరిమితమైన ఇష్టం. 


కానీ నిజంగా నేటి మనిషిలో ఆ ఇష్టం ఎక్కడా లేదురా...

ఇలా ఉంటే నలుగురూ నవ్వుతారనో, అలా చేస్తే అందరూ ఏమంటారు అనో భయపడుతూ బతుకుతూ లోలోపల ప్రతి ఒక్కడూ ఒక ఒంటరితనంతో కుమిలి పోతున్నాడు. విన్నవీ, చదివినవీ మాత్రమే లోకం మొత్తం నిండిన ఆలోచనలుగా భ్రమ పడుతున్నాడు. తను ఆ అందరిలా లేనేమోనన్న ఆలోచనతో తానుకూడా అదే ముసుగేసుకునే మాట్లాడుతున్నాడు. ప్రవర్తిస్తున్నాడు. 

నిజం ఇప్పుడు ప్రపంచమంతా ఒక ఇమిటేషన్. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకుంటూ నకిలీ ఆనందాలని లోకంలో పరిచేస్తూ, నిండైన ఒంటరితనాన్ని తనలో కొనసాగించుకుంటూ… ప్రతి ఒక్కరూ మహా నటులై ఈ భూ ప్రపంచాన్నేవిశ్వంలోనే  అతి పెద్ద రంగ స్థలంగా మార్చేస్తున్నారు.

మాట్లాడుకుందాం గుండెలోతుల్లో నుండి, మనసుపై పేరుకు పోయిన అన్ని మాయాపొరలు కరిగి పోయేలా. పోయేదేముంది మహా ఐతే మనిషన్న వాడిమీద పేరుకుపోయిన మకిలి తప్ప?   

రోజుకి 24 గంటలూ మనిషితనం పూసుకుని ఎవ్వరూ కనిపించరు. స్పందించాల్సిన తీవ్రతని బట్టి ఆయా సందర్భాలలో అది వెలికి వస్తుంది. గమనించి చూస్తే వేదన అయినా. సంతోషం అయినా కూడా అంతే కదా? కాకపోతే మనిషిగా మనం గమనించుకోవాల్సింది ఒక్కటే భవిష్యత్తులోనూ మనిషిని కొనసాగించగలగటం, అందుకోసం ప్రకృతి మీద మరింత ప్రేమని పెంచుకోవటం.  

ఎవరికీ వారు తమకున్నదేదో ఇవ్వటం మొదలు పెట్టి చూస్తే, మనకి అవసరం అయినదేదో మరొకరి ద్వారా మనకు చేరక మానదు. ముందు మన ఆలోచనలను మార్చుకుందాం.  ఆపై వేచి చూద్దాం ఆ  తరువాత వచ్చే మార్పుల కోసం. మనిషి అన్నవాడు జ్ఞాని అనే అనుకుంటున్నాను. తను నడిచే దారి పొరపాటు అని అర్ధం అయిననాడు, అది మనసుకు చేరిన నాడు తను దారి మార్చుకోక ఉండడు కదా?

చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటేరా… 

‘ఈనాటికి కాకపోతే రేపటికైనా మనిషికి మనిషే మందు.’ 

ఈ విషయం లో వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదంతే…

ఏదైనా ఉంటే నాకు చెప్పటానికి నువ్వున్నావ్ గా  :)  

నీ

స్నేహితుడు  

Friday, 22 January 2016

అప్పుడప్పుడూ ఒక చినుకు - 5



కాలాకాలాల అలౌకికతని దాటేసిన ఓ దగ్గరితనం ఎప్పుడూ అలరించేదే. తలచుకుంటే చాలు లిప్తపాటులో నేను నీలో వాలిపోవటం... నువ్వు నాలో లీనమవ్వటం… ఎంత మధురమో కదూ ఈ దగ్గరితనం. 

ఒక దగ్గరితనాన్ని మనసారా హత్తుకోవాలంటే చేసే ప్రయాణపు దూరమెంత అంటే  ఏమి చెప్పగలం? 

మరి ఎన్ని యుగాల దూరాల నుండి నువ్వు దగ్గరవుతూ వచ్చావో నాకేం తెలుసని? 

ఇప్పుడైతే నాకు తెలుస్తుంది ఒక్కటే... ఒక ఇష్టమైన  దగ్గరితనం లోని అణుమాత్రపు దూరాన్నీ క్షణమాత్రమూ తట్టుకోలేనని. ఎవరికి తెలుసు... ఒక్క ఎడబాటు దిగంతాల దూరంలోకి నెట్టివెయ్యవచ్చేమో?

నిజానికి అత్యంత ఇష్టం అయిన అదే దగ్గరితనం అంటే నాకెంత భయమో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఏమి చెప్పగలను?  దూరమయ్యే దగ్గరితనాల గురించిన అపరిమిత భయం అనా? దరికి చేరిన దగ్గరితనాల నిర్లిప్తతని ఏ మాత్రం తట్టుకోలేని చిట్టిగుండెని తలచుకుని అనా? 

ముక్కు కొనను స్పర్శించేంత చనువులోనూ మృగ్యమైపోయిన దగ్గరితనపు కొలతల దూరాల లెక్కల క్లిష్టత రోరోజుకూ ఎన్ని చూడటం లేదూ..? 

నిప్పుల్లో వేగిపోతున్నంతగా దహించేదంటూ ఏమైనా ఉంటే ఒక దగ్గరితనపు సుదూరతే. 

నిజం మనిషన్నవాడికి అత్యంత వేదనాభరిత విషయాల్లో ప్రధానమైనది దగ్గరితనపు దూరం… అదే ఇక అపరిమిత శూన్యం. 

నా దూరాలన్నిటినీ దూరం చేసే ఒకే ఒక్క దగ్గరితనం చాలు ఈ ప్రపంచంతో నేను జతకలవడానికి. 

చివరిగా ఒకటి చెప్పు.. అన్ని రహస్యాలనూ వదిలేసుకున్నంతగా చేరువకావటం కన్నా దగ్గరితనం  ఏముంది? అందుకు మనల్ని మించిన ఉదాహరణ ఏముంది?

Saturday, 16 January 2016

అన్ని వేళలకూ



ఆరు ఋతువుల సూత్రాన్ని వసంతంతో చెదరగొట్టి
ప్రకృతి ధర్మాలతో పరాచకాలాడిన
అనుభూతుల నజరానా ఒకటి 
స్మృతుల మంజూషంలో అగ్రాసనమేసుకుంది 

నిన్నటి శూన్య ప్రదర్శనల వేదికలన్నీ రూపుమార్చేసుకుని 
తానో విపంచిగా విశ్వగీతాన్ని నాలో శృతి చేసే దివ్యధామాలైన ఏకాంతాన 
నా మాటలన్నిటికీ మనసే మౌన మైదానమయ్యింది 
తన సమయాలన్నిటినీ నాలో వల్లె వేసుకుంటూ
నెత్తావినద్దుకుందో  ప్రయాణం
తన అడుగుల స్పర్శలోకి రాలి పడగానే

ఇంకాస్త వెనక్కి వెళ్లి చూస్తే  
ఒక వ్యసనం ఎలా మొదలవుతుంది?’ 
ఎప్పటి నా ప్రశ్నకో.. ఇప్పుడు సమాధానం నాలోనే
ఒక నవ్వుగానో.. 
ఒక చూపుగానో.. 
ఒక మాటగానో.. 
ఒక పరిచయం ప్రవహించీ ప్రవహించీ 
ఒక జీవితంగా  మారేంత వ్యసనమౌతుందని  
అనంత పథికుడినై 
నా కాలమంతా తనను స్వీకరిస్తూ నడుస్తున్నా   
ఎప్పటికప్పుడు గుమ్మపాల తావిలా  కదలాడుతూ
తనే వ్యసనమయ్యింది 
అవుతూనే ఉంది 
నా అన్ని వేళలకూ 

Friday, 15 January 2016

విశ్వమయూరం


ఒక మౌనాన్ని అల్లేసుకున్న అలసట 
నిశ్శబ్దంగా సేద తీరుతున్న చోట 
ఒక్కొక్క జ్ఞాపకమూ ఒక్కొక్క నెమలీకగా అరవిరుస్తూ 
నిన్నటి స్మృతుల మయూరం పురివిప్పుకుంది

ఒక అడుగుగా నువ్వు మొదలైన క్షణం 
మట్టికి ప్రణమిల్లాల్సిన సందర్భాన్ని వెంట తెచ్చింది 
ఒక చినుకులా నువ్వు తడిపిన స్పర్శ  
నీటిలో కరిగిపోయే హాయిని నేర్పింది 
ఒక మలయసమీరంగా వినవచ్చిన నీ నవ్వు 
గాలితో  ప్రయాణించటం అలవాటు చేసింది 
ఒక తెలిమంచులో చలిమంటలా హత్తుకున్న నీ తలపు 
వెచ్చనైన నిప్పులో నేను  ప్రవహించటం చూసింది 
ఒక కాంతిని నువ్వు పలుచగా నాలోకి పోతపోసిన దృశ్యం
ఆత్మీయంగా ఆకాశాన్ని దగ్గర చేసింది 

నిన్నటి పుటలోకి 
నేను నడచి వెళ్లినప్పుడల్లా    
ఒక్క నువ్వే 
పంచభూతాల సావాసమైన సవ్వడే వినవస్తుంది 
పంచభూతాలంటే 
పురివిప్పిన విశ్వమే కదా మరి 

Thursday, 14 January 2016

అప్పుడప్పుడూ ఒక చినుకు - 4



నే మనసారా నవ్విన క్షణాలన్నీ బాల్యంలోకి వెళ్లినట్లున్నాయ్.. ఇప్పుడూ నవ్వుంది కానీ ఆ నవ్వులో బాల్యమే లేదు. బాల్యం లేని నవ్వులో ఏ స్వచ్ఛతని వెదకగలం? కష్టం కదూ..

24 గంటలకోసారి బాల్యంలో మునకలేస్తున్న రేయింబవళ్ళని చూస్తుంటే ఎంతటి అసూయ వచ్చేస్తుందో.. ఎవరికైనా చెపితే నవ్వుతారేమో కదూ ! తాను పుట్టానని తెలిసిన అనుభూతి ఇప్పటికీ వెంటాడటం ఉంటే.. ఆ అనుభూతుల కొనసాగింపుకై క్షణానికో సారి కొత్తగా పుట్టటం.. ఓహ్! తలచుకుంటే మధురానుభూతి మాత్రమే కాదు ప్రపంచాన్ని మనిషి చూసే చూపూ మారుతుందనే ఆశ కూడా పుట్టేస్తుంది.

ఒక పసితనంలోకి జారినప్పుడల్లా ఏ కల్మషంలేని నవ్వులు జాలువారుతుంటాయ్ కదా.. మరి కల్మషం కానరాని ఆ నవ్వుల్లోని నిర్మల్యం అర్ధం అయిన మనిషి మారటం ఎంతసేపు?

మనకు బాల్యం మిగలక పోతేనేం. కాసేపలా పెద్దరికాలని రద్దుచేసి మన పిల్లల బాల్యంలో మనమూ మునకలేసి చూద్దాం... మీరేమంటారూ...?

ఏయ్… ఇక మీరంతా ఫ్రీజ్ అయిపోండి.

నాతో దాగుడుమూతలాడటానికి నా ‘పాప'గా ఒక పసితనం పరిగెత్తుకొచ్చేస్తుంది. :)