కాలాకాలాల అలౌకికతని దాటేసిన ఓ దగ్గరితనం ఎప్పుడూ అలరించేదే. తలచుకుంటే చాలు లిప్తపాటులో నేను నీలో వాలిపోవటం... నువ్వు నాలో లీనమవ్వటం… ఎంత మధురమో కదూ ఈ దగ్గరితనం.
ఒక దగ్గరితనాన్ని మనసారా హత్తుకోవాలంటే చేసే ప్రయాణపు దూరమెంత అంటే ఏమి చెప్పగలం?
మరి ఎన్ని యుగాల దూరాల నుండి నువ్వు దగ్గరవుతూ వచ్చావో నాకేం తెలుసని?
ఇప్పుడైతే నాకు తెలుస్తుంది ఒక్కటే... ఒక ఇష్టమైన దగ్గరితనం లోని అణుమాత్రపు దూరాన్నీ క్షణమాత్రమూ తట్టుకోలేనని. ఎవరికి తెలుసు... ఒక్క ఎడబాటు దిగంతాల దూరంలోకి నెట్టివెయ్యవచ్చేమో?
నిజానికి అత్యంత ఇష్టం అయిన అదే దగ్గరితనం అంటే నాకెంత భయమో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఏమి చెప్పగలను? దూరమయ్యే దగ్గరితనాల గురించిన అపరిమిత భయం అనా? దరికి చేరిన దగ్గరితనాల నిర్లిప్తతని ఏ మాత్రం తట్టుకోలేని చిట్టిగుండెని తలచుకుని అనా?
ముక్కు కొనను స్పర్శించేంత చనువులోనూ మృగ్యమైపోయిన దగ్గరితనపు కొలతల దూరాల లెక్కల క్లిష్టత రోరోజుకూ ఎన్ని చూడటం లేదూ..?
నిప్పుల్లో వేగిపోతున్నంతగా దహించేదంటూ ఏమైనా ఉంటే ఒక దగ్గరితనపు సుదూరతే.
నిజం మనిషన్నవాడికి అత్యంత వేదనాభరిత విషయాల్లో ప్రధానమైనది దగ్గరితనపు దూరం… అదే ఇక అపరిమిత శూన్యం.
నా దూరాలన్నిటినీ దూరం చేసే ఒకే ఒక్క దగ్గరితనం చాలు ఈ ప్రపంచంతో నేను జతకలవడానికి.
చివరిగా ఒకటి చెప్పు.. అన్ని రహస్యాలనూ వదిలేసుకున్నంతగా చేరువకావటం కన్నా దగ్గరితనం ఏముంది? అందుకు మనల్ని మించిన ఉదాహరణ ఏముంది?







0 comments:
Post a Comment