ఒక మౌనాన్ని అల్లేసుకున్న అలసట
నిశ్శబ్దంగా సేద తీరుతున్న చోట
ఒక్కొక్క జ్ఞాపకమూ ఒక్కొక్క నెమలీకగా అరవిరుస్తూ
నిన్నటి స్మృతుల మయూరం పురివిప్పుకుంది
ఒక అడుగుగా నువ్వు మొదలైన క్షణం
మట్టికి ప్రణమిల్లాల్సిన సందర్భాన్ని వెంట తెచ్చింది
ఒక చినుకులా నువ్వు తడిపిన స్పర్శ
నీటిలో కరిగిపోయే హాయిని నేర్పింది
ఒక మలయసమీరంగా వినవచ్చిన నీ నవ్వు
గాలితో ప్రయాణించటం అలవాటు చేసింది
ఒక తెలిమంచులో చలిమంటలా హత్తుకున్న నీ తలపు
వెచ్చనైన నిప్పులో నేను ప్రవహించటం చూసింది
ఒక కాంతిని నువ్వు పలుచగా నాలోకి పోతపోసిన దృశ్యం
ఆత్మీయంగా ఆకాశాన్ని దగ్గర చేసింది
నిన్నటి పుటలోకి
నేను నడచి వెళ్లినప్పుడల్లా
ఒక్క నువ్వే
పంచభూతాల సావాసమైన సవ్వడే వినవస్తుంది
పంచభూతాలంటే
పురివిప్పిన విశ్వమే కదా మరి







0 comments:
Post a Comment