Sunday, 24 January 2016

ఇమిటేషన్

హాయ్ రా..

పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ మనిషన్న వాడు మాయమైపోతున్నాడని కళ్ళ తడిని అద్దుకుంటూ నువ్వన్న దగ్గరినుండీ నాలో అలవిమాలిన ఆలోచనలురా… ఆ ఆలోచనలు ఎంతవరకూ సబబుగా ఉన్నాయో నాకూ తెలియదు కానీ అవి నీతో  పంచుకోకుండా ఉండలేక పోతున్నాను. 

ఎక్కడి కథలకో ఎవ్వరి వ్యధలకో మన కళ్ళు తడిదేరుతున్నాయంటే ఇంకా కొంచెం మనంగా మిగిలి ఉన్నామనే. 

నెమ్మదిగా అయినా నిండైన మనిషితనం తట్టకపోదు అన్న ఒక్క ఆశ చాలు ప్రపంచం మనిషి మీద నమ్మకం మిగుల్చుకోవడానికి. మనందరికీ సమకాలీకులుగా 800 కోట్లకు పైగా జనం ఉన్నారు. అందులో మనకి పరిచయస్తులెంతమంది? వాళ్ళలో మనకి సంపూర్ణంగా తెలిసింది ఎంతమంది? మహా సింధువులో ఓ చిన్ని బిందువంత. మన గురించే మనకి పూర్తిగా తెలియనప్పుడు ఏ లోతులని స్పృశిస్తూ మనం అందరినీ అంచనా వేయగలం? 

ఏదో అనుకుంటున్నాం కానీ లోకం ఇంకా అంతగా చెడిపోలేదురా. కొందరింకా ప్రకృతి లాగానే  ఉన్నారు. మనుషుల్లో మనుషులింకా కనపడుతూనే ఉన్నారు. ఎక్కడో ఎందుకు? 
మనిషి ఎక్కడ మనిషి ఎక్కడ అంటారే కానీ తమ ప్రశ్నకి తామే సమాధానంగా ఎందుకు మారరు? 

మనిషి అనబడే లక్షణాలేవో వాళ్ళకి బాగానే తెలిసి ఉండాలి కదా? మరెందుకు తమలో తామే ఆ లక్షణాలని పెంచుకునేలా చేసుకోరు. పక్కవాటి మీద ఉన్న ఆసక్తి తమ మీద తామెందుకు పెట్టుకోరు? 

నిజానికి మారాల్సింది మనం చూసే దృష్టి. మనం చేస్తే ఆచారం  మరొకడు చేస్తే అపచారం  అని అనుకున్న వాళ్ళు ఉన్నంత కాలం ప్రకృతి మీద వికృతి ముసుగే కనిపిస్తుంది. మనిషి నడకతోనే ప్రకృతి అయినా మరి వికృతి అయినా. కాలపు ప్రస్థానంలో ఆయా సామాజిక పరిస్థితులని బట్టి వచ్చిన విశ్వాసాలని నేటి పరిస్థితులకి తగ్గట్లుగా సంస్కరించుకోవటంలో విజ్ఞత చూపించటం మనిషితనం అవుతుందేమో కానీ ‘నేటి’ని  ‘నాటి’ రోజుల్లోకి తీసుకు వెళ్ళటం అంటే వాడు అక్కడ మనిషిగా ఆఖరు అయిపోయినట్లే. 

నిజానికి మనిషితనం గతి తప్పినప్పుడల్లా ప్రకృతి చిన్న చిన్నని హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. ఎవరికి వారు తమదాకా వచ్చేదే ఉత్పాతం అనుకున్నన్నాళ్ళూ తమ అదృశ్యానికి తామే తెరతీస్తూ ఉన్నట్లే అని ఎరుక మాత్రం ఏ  కొందరిలోనో. ‘అదాటుగా ఒక్క సారిగా ఇప్పుడు మానవ జాతి అనబడుతున్న నా జాతికి కాస్త విచక్షణ వచ్చేస్తే ఎంత బాగుండు ‘. నిజమే,  ఇప్పుడు నిజంగా మనిషిలో కొరవడింది విచక్షణాజ్ఞానమే.  అదొక్కటి పెంచుకుంటే చాలు మనిషికి మనిషి దొరకటం మొదలవుతుంది. 

మనిషి మనసన్నది అంత తేలికగా  అర్ధం అయ్యేదే అయితే లోకమెప్పుడూ అపార్ధాల బాట పట్టదు కదా.  గమనించి చూడు, నిజానికి మన అభిప్రాయాలని ప్రభావితం చేసేదేమిటో తెలుస్తుంది.  నీ ఇంట్లోనో, వీధిలోనో, పత్రికల్లోనో & నాయకుల మాటల్లోనో కనిపించే  ఆ కొన్ని అభిప్రాయాలే మనం లోకాన్ని అర్ధం చేసుకునే ఉపకరణాలు. నిజానికి మనకి ఉండాల్సింది లోకమంటే భయం కాదు దాని మీద అపరిమితమైన ఇష్టం. 


కానీ నిజంగా నేటి మనిషిలో ఆ ఇష్టం ఎక్కడా లేదురా...

ఇలా ఉంటే నలుగురూ నవ్వుతారనో, అలా చేస్తే అందరూ ఏమంటారు అనో భయపడుతూ బతుకుతూ లోలోపల ప్రతి ఒక్కడూ ఒక ఒంటరితనంతో కుమిలి పోతున్నాడు. విన్నవీ, చదివినవీ మాత్రమే లోకం మొత్తం నిండిన ఆలోచనలుగా భ్రమ పడుతున్నాడు. తను ఆ అందరిలా లేనేమోనన్న ఆలోచనతో తానుకూడా అదే ముసుగేసుకునే మాట్లాడుతున్నాడు. ప్రవర్తిస్తున్నాడు. 

నిజం ఇప్పుడు ప్రపంచమంతా ఒక ఇమిటేషన్. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకుంటూ నకిలీ ఆనందాలని లోకంలో పరిచేస్తూ, నిండైన ఒంటరితనాన్ని తనలో కొనసాగించుకుంటూ… ప్రతి ఒక్కరూ మహా నటులై ఈ భూ ప్రపంచాన్నేవిశ్వంలోనే  అతి పెద్ద రంగ స్థలంగా మార్చేస్తున్నారు.

మాట్లాడుకుందాం గుండెలోతుల్లో నుండి, మనసుపై పేరుకు పోయిన అన్ని మాయాపొరలు కరిగి పోయేలా. పోయేదేముంది మహా ఐతే మనిషన్న వాడిమీద పేరుకుపోయిన మకిలి తప్ప?   

రోజుకి 24 గంటలూ మనిషితనం పూసుకుని ఎవ్వరూ కనిపించరు. స్పందించాల్సిన తీవ్రతని బట్టి ఆయా సందర్భాలలో అది వెలికి వస్తుంది. గమనించి చూస్తే వేదన అయినా. సంతోషం అయినా కూడా అంతే కదా? కాకపోతే మనిషిగా మనం గమనించుకోవాల్సింది ఒక్కటే భవిష్యత్తులోనూ మనిషిని కొనసాగించగలగటం, అందుకోసం ప్రకృతి మీద మరింత ప్రేమని పెంచుకోవటం.  

ఎవరికీ వారు తమకున్నదేదో ఇవ్వటం మొదలు పెట్టి చూస్తే, మనకి అవసరం అయినదేదో మరొకరి ద్వారా మనకు చేరక మానదు. ముందు మన ఆలోచనలను మార్చుకుందాం.  ఆపై వేచి చూద్దాం ఆ  తరువాత వచ్చే మార్పుల కోసం. మనిషి అన్నవాడు జ్ఞాని అనే అనుకుంటున్నాను. తను నడిచే దారి పొరపాటు అని అర్ధం అయిననాడు, అది మనసుకు చేరిన నాడు తను దారి మార్చుకోక ఉండడు కదా?

చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటేరా… 

‘ఈనాటికి కాకపోతే రేపటికైనా మనిషికి మనిషే మందు.’ 

ఈ విషయం లో వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదంతే…

ఏదైనా ఉంటే నాకు చెప్పటానికి నువ్వున్నావ్ గా  :)  

నీ

స్నేహితుడు  

0 comments:

Post a Comment