Saturday, 16 January 2016

అన్ని వేళలకూఆరు ఋతువుల సూత్రాన్ని వసంతంతో చెదరగొట్టి
ప్రకృతి ధర్మాలతో పరాచకాలాడిన
అనుభూతుల నజరానా ఒకటి 
స్మృతుల మంజూషంలో అగ్రాసనమేసుకుంది 

నిన్నటి శూన్య ప్రదర్శనల వేదికలన్నీ రూపుమార్చేసుకుని 
తానో విపంచిగా విశ్వగీతాన్ని నాలో శృతి చేసే దివ్యధామాలైన ఏకాంతాన 
నా మాటలన్నిటికీ మనసే మౌన మైదానమయ్యింది 
తన సమయాలన్నిటినీ నాలో వల్లె వేసుకుంటూ
నెత్తావినద్దుకుందో  ప్రయాణం
తన అడుగుల స్పర్శలోకి రాలి పడగానే

ఇంకాస్త వెనక్కి వెళ్లి చూస్తే  
ఒక వ్యసనం ఎలా మొదలవుతుంది?’ 
ఎప్పటి నా ప్రశ్నకో.. ఇప్పుడు సమాధానం నాలోనే
ఒక నవ్వుగానో.. 
ఒక చూపుగానో.. 
ఒక మాటగానో.. 
ఒక పరిచయం ప్రవహించీ ప్రవహించీ 
ఒక జీవితంగా  మారేంత వ్యసనమౌతుందని  
అనంత పథికుడినై 
నా కాలమంతా తనను స్వీకరిస్తూ నడుస్తున్నా   
ఎప్పటికప్పుడు గుమ్మపాల తావిలా  కదలాడుతూ
తనే వ్యసనమయ్యింది 
అవుతూనే ఉంది 
నా అన్ని వేళలకూ 

0 comments:

Post a Comment