మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Tuesday, 8 January 2019

వ్యాకరణం




చీకటిని పులుముకోవటం
ఎంత  తేలికో అర్థమయ్యింది.
నక్షత్రాలు నవ్వుతా యేమోనని
ఆరుబయట మంచం వాల్చడానికి
సిగ్గుపడుతున్న మనిషిని చూసాక


***


అందం కోసమంటూ
ఇంటి ముందున్న
పచ్చని చెట్టుని నరికి
మోడైన చెట్టుగా
నగిషీలు పట్టడం చూసాకే తెలిసింది
ఎడారులనీ పండిస్తారని!!

***


మనిషి తనకన్నా 

మట్టికే ఎక్కువ విలువని కట్టాడని తెలిసింది

తన విలువ పెంచుకోవటం కోసం  

మట్టిలోని రాళ్లని  

మెడలో హారంగా వేళ్ళాడదీసుకుంటుంటే! 




***


పరాయి  కలలని
పహారా కాసే
బేహారులున్నారని అర్థమయ్యింది
తమ కల పండటం కోసం    
వారు  మర్చిపోయిన కలలనీ
మళ్ళీ మళ్ళీ తట్టిలేపుతూ…
ఎన్నెన్ని”కళ”లనో   చూపిస్తుంటే


***


గాయాలనే గంథం అనుకుని
తన అంతిమ వ్యాకరణం
తానే రాసుకునే చోట
నా నడక ఆగిపోయింది

అక్కడున్న మనిషనే లేఖకుణ్ణి  చూస్తూ…

Tuesday, 1 January 2019

నీలి మెత్తని జల

ఇంద్రనీల శిలకి దైవత్వాన్నిచ్చిన
గుళ్ళో దేవుడిని కాకుంటేనేం
గులకరాళ్ళనీ అభిషేకించవచ్చన్నట్లుగా
తాకుతున్న నీలి మెత్తని జల
ద్రవరూపం దాల్చిన నందివర్థనాలు చేస్తున్న
నిరాణమైన ఒక తపస్సులా సాగిపోతుంటే
నా చిన్ని దోసిలితో కాస్తంత ప్రకృతిని తడిపాను


దేశాంతరం వెళ్లి వచ్చేసరికి...
రాదారుల వెంట నీడల కాపు కాస్తూ
ఇక్కడంతా పచ్చని తోట


Tuesday, 13 November 2018

ఉలి దెబ్బ

దేవుడిగా
పీఠమెక్కాలన్నా
గాయాలు తప్పనిసరి అని  
తెలిసి వచ్చింది  


ఉలి దెబ్బ తగిలి
కొండరాయి మీద
నిశ్శబ్దమొకటి

పగిలినప్పుడు


Thursday, 8 November 2018

గతమంతా ఇదేగాథ...


ఇదే సమయంలో
ఇలాంటి మరణాలే మరికొన్ని
మబ్బుల్ని కప్పుకుని ఉంటాయి

ఇదిగో
ఇదొక్క మరణమే మంటవుతుంది

అగ్గి రాజెయ్యటానికి
రాజకీయమో నిప్పుపుల్లవుతుంది

అవును
ఇదేమీ కొత్త కథ కాదు

గతమంతా ఇదేగాథ

కొన్ని మరణాలే ప్రముఖాలవుతాయి
చరిత్ర పుటల్లో ముద్రితమవుతాయి



Wednesday, 7 November 2018

ఇక్కడి సూర్యుడు కూడా...


ఇక్కడి సూర్యుడు కూడా అక్కడిలాగానే
తూర్పు నుండి పడమరకే  ప్రయాణం కడుతున్నాడు
కాకుంటే
పొద్దున్నే ఒక్క గోరు వెచ్చని స్పర్శని ఇవ్వలేక
మేడల కావలే తచ్చాడుతున్నాడు

ఇక్కడి నీరు కూడా అక్కడిలాగానే
పల్లం వైపే పరుగెడుతోంది
కాకుంటే
గొంతు తడుపుదామనుకుంటే
ఆమ్లంలా పొగలు గ్రక్కుతుంది

ఇక్కడి గాలి కూడా అక్కడిలాగానే
ఊపిరికి శ్వాసనిస్తుంది
కాకుంటే
ఇక్కడి గాలి
చాలా రంగుల్నద్దుకుని వీస్తుంది

ఇక్కడి నేల కూడా
అక్కడిలాగానే సమతలంగానే ఉంది
కాకుంటే
ఇంత వరకూ ఇక్కడి మనిషికి
మట్టిస్పర్శ కూడా తెలియదు

***
పట్టణమో ప్రదర్శన శాల
పల్లేమో  జీవధార



Saturday, 3 November 2018

ఎడారి పక్షి

నా పగటిని నేసినదెవరో కానీ
కాసిని వెలుగుపోగులని
కూర్చడం మరచిపోయినట్లున్నారు


నన్నే విడిదిగా మార్చుకున్న రాత్రేమో
నన్నే తన స్థాన బలిమి అనుకుందేమో
ఎడతెగకుండా చీకటిని నింపుకుంటూనే ఉంది


నిద్రలోనే కరిగిపోతున్న కలలన్నీ
పారదర్శక చీకటికి చిక్కదనాన్ని ఇస్తుంటే  
రెప్పల క్రిందనున్న
కన్నీళ్ల ఊబినుండి బయట పడటానికి
ఏ పాదరసపు అంశా తోడు రాక
అన్ని మెలకువల్లోనూ
పొలిమేర దాటని చీకటి ఒకటి
రాత్రికి ప్రతీకగా పగటికి నను తాపడం చేస్తూ ఉంటుంది


చీకటంటే
ఏ బిడారుల నుండో
నాలోకి శాశ్వతంగా  వలస వచ్చిన ఎడారి పక్షి
అయినందుకేనేమో
తనకో వాగ్దానంగా కుదురుకున్నాను
నేను తనకో వెలుగయ్యాననే రాజసంతో


Friday, 22 September 2017

తెల్లకాగితం

అక్షరం రాయబడని  కాగితంపై
పరుచుకున్న మనసుని  చదువుతున్న తనని చూసి
విషాదం విరిగిపోతున్న చప్పుడు కరిగించేస్తున్న  
నిశ్శబ్దంలో నుండి
గుండె కిందగా
ఒక నవ్వు మొదలవుతున్న సవ్వడి వినగానే
ఇందాక  
తెల్లకాగితంపై రాలిపడ్డ
రెండు కన్నీటి చుక్కలు
ఇప్పుడు నవ్వుల చిగుర్లు వేసుకుంటూ
తడి తడిగా  మనసుని  అల్లుకుంటున్నాయి
కంటి నిండుగా  వెన్నెల పూలని పుష్పిస్తూ


Thursday, 21 September 2017

పురాతనమంతా

మట్టికుండ లాంటి
పురాతనమంతా పరిమళమే
అనుకున్నంత సేపూ
ఈ లోకం నచ్చకపోవడం  పెద్ద వింతేమీ కాదు

మరకతాలు పొదిగినవన్నీ
అలంకారమే  అనుకుంటున్నామంటే
మనం నేర్చినవన్నీ  మర్చిపోయి
మరోసారి  కొత్తగా  లోకాన్ని చదవాల్సిందే

మనసు పాత్ర మారనంత వరకూ
మట్టి కుండ అయినా
మరకతాలు పొదిగిన కలశమైనా
ఒకే ఆనందాన్ని నింపుకుని ఉంటాయి

అనంతమైన కాంతినీ…
గాడాంధకారాన్ని
ఆప్తంగా  హత్తుకునే  మనసే

నీ లోకాన్ని వెలిగించే  ఆనంద దీపం