మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Wednesday, 1 May 2013

వెన్నెల కుసుమం - 6


ప్రాణానికి ప్రాణమా... 

నీ ప్రేమ స్పర్శ నా హృదయమంతా ఉందనే జ్ఞానంతో నా మనసుని ఎల్లప్పుడూ నీ ధ్యానం లోనే ఉంచేస్తున్నాను.

నా మనసున ప్రేమనే దీపాన్ని వెలిగించిన రూపం నీదని తెలిసి నీ పీఠం నా హృదయం లోనే  అని ఎరిగి ప్రతి ఊహలోనూ నీ ఊసుల్లోనే తేలియాడుతున్నాను.

ఒక జంటలో ప్రేమ అనేది ఏ ఒక్క మది లోనే  కలిగిన అనుభవమై మరో మనసు కి అది స్నేహమనే భావన అయితే ప్రేమ నింపుకున్న మనసుకి ఎంత కష్టం. జీవితాన అంతకన్నా నరకం అనేది ఆ మది మరి చూస్తుందా?

ప్రేమ అనేది ఒక అధ్బుతమైన  కావ్యం. ఏ కావ్యం లో అయినా ప్రతి పాత్రా రాణిస్తేనే అది మనసుల్ని కట్టి పడేస్తుంది. ప్రేమ కావ్యం అయినా అంతే... ఈ కావ్యం లో ఉండే రెండు పాత్రలూ  కూడా ఒకదాని కోసం ఒకటి ఉంటేనే దానికి జవ జీవాలు.

కల్లలు కాకూడదనుకునే కలల్లోకి వచ్చి నువ్వు కవ్విస్తుంటే నాకు కళ్ళు తెరవాలని అనిపించటం లేదు. కళ్ళు తెరిస్తే కల చెడి పోతుందనే భయం కదా మరి!

ప్రియా...

నీవు నన్ను కాదన్నా.. నీకేమైనా జరిగినా తట్టుకోలేక పిచ్చివాడిని అయిపోతానేమో... నీ ప్రేమ కోసం ప్రేమ పిచ్చివాడిగా ఇప్పటికే మారాను. నువ్వు నన్ను కాదంటే నిజం గా పిచ్చివాడిని అయిపోతానేమో...

నీవు నన్ను కాదనే ఊహని కూడా నా ఊహల్లోకి రానివ్వను. ప్రియ సన్నిధిని కోరేవానికి ప్రేమని మించిన ప్రాణమున్నదా? ప్రేమే దైవమని విశ్వసించే వారికి సఖిని మించిన తోడూ ఉన్నదా?

చెలి మోమున చిరునవ్వే కదా చెలికాని ఆనందం...

చిరుప్రాయం సిగ్గుపడి మొగ్గ తొడిగినప్పుడు నిన్ను చూసాను. మలిప్రాయం మొగ్గవిచ్చి మందారం అయినప్పుడు నిన్ను వలచాను.

నీమీద నా ప్రేమను గురించి రాస్తే ఒక కావ్యం పుడుతుంది. నా ప్రేమను పాటగా మార్చి పాడితే ఒక యుగ కాలం కూడా చాలదేమో...

నీమీద నా ప్రేమని కావ్యం గా మలచినా కమనీయం గా పాడినా నీవు నన్ను వలచి నా వడిలో  ఒదిగిన రోజున పొందేదే కదా ఆనందం అంటే...

నీ ఊహలతో... నిన్ను గురించిన తలపులతో నా ప్రతీక్షణం గడుస్తూ ఉంది. ప్రేమ ప్రకోపిస్తే కవిత్వం పుడుతుందేమో అనిపిస్తూ ఉంది ప్రియా...

నిన్ను గురించిన ఊహలు వచ్చినప్పుడు నా కష్టాలూ కన్నీళ్ళూ ఏమవుతాయో...నేను మనశ్శాంతిగా ఉండాలంటే నిన్ను తలచుకుంటే చాలు ప్రియతమా...

అందరాని అందాన్ని అందుకోవాలని నేనెంత ఆశపడుతున్నానో ప్రియతమా... కానీ ఆ అందం కేవలం భౌతికమైన అందం కాదు. అంతఃసౌందర్యాన్ని  మించిన అందం ఏముంటుంది. నీలో ఉన్న ఆ అంతఃసౌందర్యాన్ని ఆరాధిస్తూ ఉన్నాను. కానీ ఆ  అందం నా కోసం ఆరాటపడే క్షణం వస్తే నా సంబరం ఆ అంబరాన్ని తాకదా?

నీ ఊహలతోనే నాలో కలుగుతుంది ప్రేమోదయం
నీ తలపులతోనే నా ఊపిరి నిలుస్తుంది.
పదే పదే నిన్ను చూసి పరవశించే నా పరువం
ప్రియా ప్రియా అని నీకోసం పలవరించే నా హృదయం
సఖీ సఖీ సదా నీవాడినే అని పలికే నా మనస్సు
చెలీ చెలీ నీ ఆనందం కోసం నేను చేస్తా ప్రేమ తపస్సు

అది ఏమి వింతయో నీ నవ్వు చూడగానే కాలపురుషుడే  ఒక్క క్షణం  స్తంభించెను. ఇది ఎంత చిత్రం కాకుంటే నీ అందం చూడగానే  తన అందం మీద సందేహం వచ్చి ఆ చందమామే  సిగ్గుపడి మబ్బుతెరల చాటుకి పారిపోయెను. 


Tuesday, 5 March 2013

వెన్నెల కుసుమం - 5

సాగర మధ్యంలో అరవిరిసిన ప్రకృతి అందాలు చిందే అందాల దీవిలో నీవు నేను జంటగా ఆకుల్లో ఆకులమై, తీగల్లో తీగలమై ఒక్కటవ్వాలనీ సెలయేటి గలగలల్లో మన ప్రేమ సవ్వడి కలసిఫోవాలనీ, లేడి కూనలూ... కుందేటి పిల్లల మధ్య మనమిద్దరం దాగుడు మూతలాడాలనీ... ఎన్నో... ఎన్నెన్నో కోరికలు.


ప్రతిరోజు ఒక కల... అదేమిటో తెలుసా...


పసిడి పల్లకిని మోయుచున్న బోయీలు, ఆ పల్లకిలో బంగారు జలతారు పరదాల మాటున ఓ అపూర్వ లావణ్య సౌందర్యరాశి, దేవలోకం నుండి దిగి భువికి ఏతెంచిన దేవకన్యలా... ఇంద్ర సభలో నర్తిస్తున్న అప్సరాంగనలా... గంధర్వ రాజుపై అలిగి భూమికి దిగివచ్చిన గంధర్వ బాలలా... యక్షిణీ కన్యలా ఓ ముగ్ధ మనోహర సౌందర్య రాశి ఈ దీనుణ్ణి చూసి చల్లగా... మనోహరంగా నవ్వింది. కొంటెగా కన్ను గీటింది. 


ఎవరబ్బా ఈ అపురూప లావణ్య సౌందర్య రాశి అని ఆత్రంగా జలతారు పరదాలను  అడ్డుతీసి చూశాను. ఆమె ఎవరో తెలుసా? రోజూ కలలో కొచ్చి నన్ను కవ్విస్తున్న ఆ కన్యకా మణి... నా ఊహలలో ఊయలూగుతున్న నా ఊహా ఊర్వశి వైన నీవే...


అవును నిజం గా నీవే ఆ పల్లకిలోని అపూర్వ  సౌందర్య రాశివి.


రోజూ ఉదయాన్నే తుషార బిందువులు నీ జలతారు మేనిపై పడి నీ సాన్నిధ్యంలో కరిగి ఆవిరి అవుతాయి. ఆ మంచు బిందువుల పాటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో కదా...


నీ శిగలో తురిమిన మల్లెల పాటి భాగ్యం కలగాలంటే నేను కూడా మల్లెనై నీ శిగలో చేరాలని ఉంది. నువ్వు  వేసుకునే ప్రతి వలువా నేనే కావాలనీ... ఎప్పుడూ నీ సాన్నిధ్యంలో గడపాలని నా చిరు కోరిక. ఘల్లు ఘల్లుమనే నీ కాలి అందియల పాటి భాగ్యం నాకు లేదా...


`నీ మనసు పాడే మౌనగీతంలో ఓ అర్ధవంతమైన నిశ్శబ్దపు చరణం. డానికి ఓ అందమైన పల్లవిగా నేను మారాలి. ఆందుకు నేనేం చెయ్యాలి. శెలవియ్యవా ప్రియతమా?’ 



Monday, 4 March 2013

వెన్నెల కుసుమం - 4


`నీలి నీలి నీ వినీల కుంతలాలు చూసి అవి మేఘాలు కాబోలునని భ్రమించి అచ్చట చేరిన నక్షత్రాలు తెల్లబోయి తాము అరవిరిసిన మల్లియలయినాయట’ ఇది ఏ కవి భావనో కాని నిన్ను తలచి నేననుకున్న భావనలో నుండి ఉదయించిన పలుకులవి.

'నీ కళ్ళల్లో వెండిపన్నీరు వెన్నెలలా కురిసిన వేళ

 నా ఎదలో మరుమల్లెల మాల విచ్చిన వేళ

 మన జంట ప్రేమంటే లోకానికి చేప్పిన వేళ

 మన ఊహల్లోని ఊసులన్నీ సత్యాలై సందడి చేసిన వేళ

 అదే అదే కదా మన జంట ఒక్కటైన వేళా

 ఆకాశరాజు భూదేవి కన్నియకు నక్షత్రాల అక్షరాల్ని కూర్చి ఉత్తరాన్ని రాయటానికి ఆయత్తమవుతున్నవేళ నీ వడిలో నా తల పెట్టుకుని నీ కళ్ళలో కళ్ళు కలిపి మౌనముగా కనులతోనే సంఙ్ఞలు చేసుకునే సమయాన జాబిల్లి కూడా నీ ముఖచ్చాయ ముందు వెలవెలబోయి మబ్బు చాటుకు తప్పుకుని మన ఇద్దరినీ ఏకాంతంగా వదిలి తాను తారలతో సరససల్లాపములకు వెళ్ళెనేమో! 

పువ్వులా విరిసే నీ నవ్వు చూసి పాటంటే తెలియని పామరుడు సైతం రాగాలు తీయగలడు. ఆటలు రాని అమాయకుడైనా నర్తించగలడు.

 నీరెండ సంధ్యలో నీ మందార చెక్కిళ్ళ నునుపులు మెరసి అస్తమిస్తున్న సూర్యుని ఎరుపులో ప్రతిఫలిస్తున్నాయనుకుంటా కదూ...
 
రెపరెప లాడుతున్న నా కనురెప్పల మాటున దాగి ఉన్న నా కన్నులలో అనుక్షణం నీ రూపు ప్రతిఫలిస్తూ నన్ను కవ్విస్తూ ఉంది. నీ తలపులు లేకుండా ఒక్క క్షణమైనా నాకు గడవదే...

మరి నీ ఊహల జగతిలో నేను ఒక్క క్షణమైనా ఊగిసలాడేనా. నీలాల నీ కళ్ళల్లో ఒక్క క్షణమైనా నా రూపు ప్రతిఫలించేనా.

నీవు నా మదిలో అల్లరి చేస్తుంటే ఆకలి అంటే ఏమిటో తెలియదు. నిద్ర పట్టే రాత్రే లేదు. చదువుదామంటే పుస్తకంలో నీ రూపే.

నీ మరాళ కుంతలాలపై జాలువారిన మల్లె మొగ్గలు వినీలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాల్లా ఉన్నాయి. నీలాంటి అందాల హరివిల్లుని వర్ణించాలంటే కాళిదాసుకైనా మాటలు దొరకవేమో. నీ లాంటి వన్నెల ఇంద్రధనస్సుని చిత్రించాలంటే రవివర్మ కుంచెకూడా వణుకుతుందేమో. 





Wednesday, 27 February 2013

వెన్నెల కుసుమం - 3


గ్రీష్మ ఋతువులో వేడి తాకిడికి మండిపోతున్న అభాగ్యునికి తొలకరి జల్లులు పన్నీటి జల్లుల్లా సేదతీర్చినట్లు నీవు నా దరి చేరి స్వాంతన కలిగిస్తావని నా ఆశ.

కోనసీమలో గోదారి గట్టున కొబ్బరి తోటల్లో  వెన్నెల రాత్రుల్లో నీవు నేను కలసి ఎన్నో ఎన్నెన్నో ఊసులాడాలని సంధ్యా సమయాన సాగరతీరంలో సాగరుని ధాటికి అరగిన రాళ్ళమీద మనమిద్దరం కూర్చుని ఉండగా గాలికి రేగే నీ ముంగురులను సవరిస్తూ సముద్రపు అలల తాకిడికి తడసిన నీ   పసిడి పాదాలను నా పెదవులతో స్పృశిస్తూ పచ్చని ప్రకృతిలో నీ వడిలో తల పెట్టుకుని పడుకుని నీ మోమును పలుకరించాలని ఎన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు  --- అవన్నీ తీరేనా ...   

చల్లని సాయంత్రాన పిల్ల గాలుల పరిమళాలతో నీవు నేను చెప్పుకున్న ఊసులన్నీ విన్న చిలకా గోరింకలు వాటి సఖులైన మిగిలిన పక్షులకు చెప్పేనా...

చిరుగాలుల సవ్వడిలో ప్రేమ పక్షుల కిలకిలరావాలలో మన ప్రేమ రాగం వినిపించాలి.

పాలసంద్రం నుండి ఉద్భవించిన అమృతధారలో నీ శరీరాన్ని మెరుగు పెట్టినారా అన్నట్టున్న నీ శరీరఛాయను, సుధలు కురుస్తున్న నీ లేలేత చెక్కిళ్ళను చూసిన వెన్నెల రాజు సిగ్గు పడి తాను మబ్బుతెరల చాటుకు తప్పుకుంటున్నాడు.

ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చటి చెట్లు, తీగల్లా అల్లుకుపోయిన లతలు ఉన్నచోట పిల్లగాలి తెమ్మెరలు వీస్తున్నప్పుడు పులకించే వనసీమలలో  సెలయేటి గలగలలు వింటూ నీవు నేను ఆ సెలయేటిలో జలకాలాడి వంటి తడి ఆరమునుపే మన ప్రణయ కేళీ విలాసాలు పూలతలతో అల్లిన మంచెపై జరగాలి ప్రియతమా...

అప్పుడు నీవు వనకన్యకలా.... అభినవ శకుంతలలా.... ఆకులు, పూలతలే ఆభరణాలుగా నన్ను చేరి నా హృదయపీఠం కదిలించాలి.

నీ వడిలో నా తల పెట్టుకుని నీ కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూస్తూ విరహతాపంతో భారంగా వణుకుతున్న నీ అధరాలలోని సుధలను నా పెదవులతో గ్రోలాలి.


చెలి చెంత లేకున్న చెలికాడు వ్యధ చెప్పుకునేదెవ్వరికి. చెలి ఛాయ చూసినా చాలు కదా చెలుడు చింతనుండి తేరుకుని తనకై ఆశగా ఎదురు చూడటానికి.



Friday, 22 February 2013

మరుభూమి



సోదరా ఓ భారతసోదరా
చూడరా భారతమాత వేదన ఆవేదన
మరుభూమిగా మారుతున్నది మన మాతృభూమి
బీటలు వారెను భవితవ్యం భరతభూమిలో
యువత అంతా నిర్వీర్యం హిందూసీమలో                     

భవితే లేదా హిందూస్తాన్లో భారతయువతకు
సవతిగ మారెను పాకిస్తాన్ మన హిందూమాతకు
బందులు కూడా పండుగలే భరత భూమిలో
హత్యలు కూడా వేడుకలే హిందూసీమలో
మానభంగాలంటే మక్కువ ఎక్కువ మన మాతృభూమిలో
అల్లర్లంటే ఆరో ప్రాణం అస్సాం మొదలు ఆంధ్రా వరకు       

లోహవిహంగాలై ఆకాశ యానం చేసే ధరలు
ఆరని మంటల జ్వాలల్లోన కాలే కడుపుల ఆకలికేకలు
వరకట్నపు చితిమంట్ల్లోన ఆడపడచుల సజీవదహనాలు
మామూలేగా మన మాతృసీమలో
కుర్చీ కోసం కుస్తీపడుతూ కుమ్ములాటలు
పదవికోసం ప్రాణాల్తోనే పైరవీలు
దేశభక్తులు ఎందరుపోయినా తెలుస్తుందా ఒక్కరికైనా
దుర్మార్గుల్లో ఒక్కడు చచ్చినా దేశమంతా హత్యాకాండలు 

అందుకే లేవరా! ఓ సోదరా
తీర్చరా! మన మాతృభూమి కష్టాలు కడతేర్చరా






Friday, 15 February 2013

వెన్నెల కుసుమం - 2



వెన్నెల తోటలో విరబూసిన తారకలా, మణిమయ భవనాన నిలచిన వరూధినిలా, ప్రాణం పోసుకొని వచ్చిన మొనాలిసా చిత్రంలా, కాళిదాసు తలపుల్లోని కావ్యనాయికలా,  రవివర్మ కుంచెనుండి జాలువారిన ఊహాసుందరిలా ఉన్న నీ ముగ్ధమనోహర రూపం...


ఓహ్! మండు వేసవిలో నీడలేక తిరుగుతున్న పాంధుడికి వటవృక్షం నీడ చూపినట్లుంది. నీవు నన్ను చూసి చిరునవ్వుల బాణాలు విసిరితే నీ సన్నిధే స్వర్గంలా, మధుస్రవంతిలా వుంటుంది.


తెల్లని సూర్యకాంతి పడిన పాలరాతి గచ్చులా నా హృదయంలో నీ రూపం  ప్రతిఫలిస్తుంది.


భిక్షపాత్ర పట్టుకొని ప్రేమార్ధినై నీ దగ్గరకు వస్తే నీవు చూపు ఆదరణ తలచుకుంటే ఓహ్! నా మనస్సు పులకరిస్తుంది.


నడి ఎడారిలో నీళ్ళు లేక దాహంతో అలమటిస్తున్న బాటసారికి అమృతంతో గొంతు తడపినట్లుంది.


ప్రపంచం - ప్రకృతి - సృష్ఠి - సూర్యచంద్రులు - ఆకాశం - మేఘాలు -వెన్నెల - నక్షత్రాలు - ఎండా వానా అన్నీ నీవే.


నీవులేని ఊహను కూడా నేను ఊహించలేను.

మలయ మారుతానికి రూపం వస్తే నీ రూపే కావాలంటుందేమో.

మల్లెల పరిమళాలకు స్వరూపం వస్తే నీ రూపే  కోరతాయేమో.

ధవళకాంతులీనుతున్న నీ మోముచూసి చంద్రుడైనా సిగ్గుతో తలవంచుకుంటాడేమో.

గులాబీల సున్నితత్వానికి ప్రాణంపోస్తే నీ రూపు దాల్చిందేమో.

పాడుతాతీయగా అంటూ పాడే కోయిల సైతం నీ గాన మాధుర్యానికి తన్మయం చెందుతుందేమో.

స్వాతిచినుకు నీ మేనిపై పడితే వెన్నెల ముత్యంలా మెరుస్తుందేమో.


"రా ప్రియా త్వరగా వచ్చేయ్

ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు,

ఎన్ని రోజులు, ఎన్ని యుగాలు

వ్యర్ధంగా నిస్సారంగా గడచిపోతున్నాయ్

ఎన్ని మల్లెలు, ఎన్ని జాజులు,

ఎన్ని రాత్రులు, ఎన్ని రాగాలు

ఇవన్నీ నీ కోసం నీవొచ్చాక మన కోసం

ఆశతో బేలగా, జాలిగా ఎదురుచూస్తున్నా ప్రియా

రా ఉన్నపళంగా

గాలి కంటే వేగంగా

మనస్సు కంటే త్వరితంగా

నిన్ను చుడక పోయినా

నీ సన్నిధి దూరమైనా

కనీసం నీ స్వరమైనా వినే అదృష్ఠం కోసం

చకోరంలా ఎదురు చూస్తూ చూస్తూ చూస్తూ........"



Thursday, 14 February 2013

వెన్నెల కుసుమం - 1

వెన్నెల జలపాతం నుండి జాలువారుతున్న కలువ నక్షత్రంలా
తొలిపొద్దు రవి కిరణం సోకి విరిసిన కుసుమంలా
అమృత భాండం చేతబట్టి దేవతల్ని చూసి  నవ్విన జగన్మోహినిలా 
నీవు నవ్వి నా హృదయ పీఠికను అధిష్ఠించినావు

వెండి వెన్నెల స్పర్శతో వికసిస్తున్న కలువమొగ్గల్లా ఉన్న అధరాలు
కోటి సూర్యుల వెలుగుతో ప్రకాశిస్తున్న నీ నీలాల నయనాలు
గులాబీల కాంతులతో జాబిల్లికె వెన్నెల పంచుతున్న నీ అందమైన చెక్కిళ్ళు
వానవెలసిన తరువాత కనిపించే ఇంధ్రధనస్సులో మిళితమైన సప్తవర్ణాలు నీ చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తూ
సాగరతీరాన వెండి వెన్నెల రజను లా ఉన్న ఇసుకలో దొరకిన శంఖంలాంటి నీ కంఠం

లేత గులాబీ ఛాయతో మెరుస్తున్న నీ అందాల మేనిపై అరుణోదయాన పడిన మంచు తొలి కిరణం వేడికి కరిగి నీ శరీరంపై పడి వెన్నెల రజనులా మెరుస్తున్నట్లు

అఙ్ణాత కార్మికుల ఊపిరితో రూపందాల్చి శతాబ్దాలుగా వెండికొండలా ఉన్న తాజ్‌మహల్ అందమైన పడతిగా మారి నా ఎదలో వగలు రేపినట్లు నీవు నా చెంతన తిరుగుతూ ఊంటే,

"రవివర్మ కుంచెకందని లావణ్యం
కాళిదాసు గీతికకందని స్నిగ్ధత్వం"

కలబోసుకొని ఉన్న నిన్ను చూసి గంధర్వకన్యలూ, దేవతమూర్తులూ, అప్సరాంగనలూ, యక్షిణీకన్యలూ అసూయతో దహించుకుపోతూ ఉంటారేమో.

మణిదీపశిఖలా, విద్యుల్లతలా, హంపీకన్యలా, అజంతా చిత్రంలా, ఎల్లోరా శిల్పంలా, బాపు బొమ్మలా, కాంతి తీరాన గంధర్వ బాలలా నిలుచున్న  నీ తలనుండి రాలి పడే మల్లెలు చీకటిలో మెరుస్తున్న మంచులా ఉన్నాయి.


కలలారని కనుపాపకి నీ రూపమే కవచం


ప్రభాతపు సుప్రభాతం లో నాకు వినిపించే తొలి పదం నీ పేరేగా
వేకువనే వికసించే ప్రతి కుసుమం నీ నవ్వు నుండే పుట్టిందా?
కాళిదాసు కావ్య నాయిక ఇలలోకి ఇప్పుడొచ్చెనా
నింగిలోని జాబిలమ్మ కి  నిదుర రాక  నాకోసం నడచి వచ్చెనా
నిదుర నదిలో ఎదురుపడే కలలనావలన్నిటిలో నీవేగా
కలలారని కనుపాపకి నీ రూపమే కవచం
మది దాటని మధురూహకి నీ ధ్యానమే వేదం
ఎదవాకిలి తలుపులు తీసి మది కోవెలలో పీఠం వేసి
నా ఊపిరినే వింజామర చేసి నీ కోసమే వేచి ఉన్నా...