మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Tuesday, 30 June 2015

మట్టి కుదుళ్ళు

కంటికి కనబడేది మూడొంతుల సముద్రమే 
అసలంటూ... మొత్తం మట్టి కుదుళ్ళేగా...
సంద్రం నేను
మట్టి నువ్వు

Sunday, 28 June 2015

విజేత

నీదా?
వాడిదా?
ఝండా ఎవరిదోయ్…?
శాశ్వతంగా రెప రెపలాడుతున్నపతాకమెక్కడో  
ఆచూకి ఒక్కటి చూపించవూ

యుగాలుగా యుద్ధాలన్నీ మట్టికోసమేగా  
మరి ఏ మన్నుపై ఎవడు శాశ్వతమయ్యాడో 
ఆనవాలు ఒక్కటి తెచ్చివ్వవూ
జాతులు ఛిద్రమైన రణరంగాన 
ఏ దేహమెవ్వడిదో ఎరుకపరచగలవా

ప్రకృతి ప్రశాంతంగా ఉన్నంతవరకే 
సరిహద్దుల పద్దులన్నీ 
యుగాల రక్తం ఇంకిన మైదానాల
ఆక్రోశం బద్ధలై
ప్రళయంగా పిక్కటిల్లితే 
ఏ హద్దెవ్వడిదో లెక్కగట్టే 
స్వరమొక్కటి మిగిలుంటుందంటే చెప్పు
సరికొత్త యుగకర్తగా చరిత రాసేద్దువు

లేదంటే 

మట్టి కాగితంపై 
నరనరాల రణరంగంతో 
స్వేదమే సిరాగా 
శ్రమ సంతకం చేసేయ్ 
బంగారు పంటగా తలవంచుతూ 
మట్టి నీకు ప్రణమిల్లుతుంది 
నిన్ను విజేతగా నిలుపుతూ


Thursday, 25 June 2015

ప్రకృతి ధర్మం

ఒక చల్లదనాన్ని ఆస్వాదించాలంటే ఒక గ్రీష్మాన్ని భరించాలి. 
అదే ప్రకృతి ధర్మం
వేడెక్కిన గాలే నీటిని మోసుకుని వెళుతుంది 
చినుకై తొలకరించడానికి... 
మట్టికి తడిగా తోడవ్వటానికి.... 

Tuesday, 23 June 2015

కావలి


నవ్వుతూ తుళ్ళుతూ
కథ వింటూ కలగంటూ 
ఈ తీరుగా నా బతుకంటూ 
మనసు పొత్తిళ్ళపై 
నును వెచ్చని  గ్రీష్మంలా 
నాపై నిన్ను కప్పుకుంటూ 
కల్తీలేని ఊపిర్లు అరువిచ్చుకుంటూ 
పడిన చోటే పాన్పు వెదుక్కుంటూ 
ఇద్దరం ఒకటై 
ఓ మరణమా...
నాకు నువ్వు మరి నీకు నేను
అహరహం కావలిగా... 


Sunday, 21 June 2015

ఘోష

ఏయ్... 
తట్టుకోగలవా…
మౌనం మాట్లాడితే తట్టుకోగలవా…
గంభీరత గొంతు సవరించుకుంటే 
పెరిగే నీ గుండె వేగానికి కొలత కట్టగలవా? 
నేనో సముద్రాన్ని…
ఎంత ఒంటరినయితేనేం
ఆకాశమూ తన నిజాన్ని నాలో వెదుక్కోవాల్సిందే 
నా అగాధాల కింద తడి అంటిన మట్టే కాదు 
బడబాలనమై పెల్లుబికగలిగే అగ్నిపర్వతాలూ ఉన్నాయ్
సుడిగాలి నన్ను దాటితేనే 
మేఘమై మిమ్మల్ని తడిపేది
తీరంలో పడిలేచే నా అలల ఘోషకే బేజారిపోయే గుండెలు  
నాలోని గంభీరత అంతా పిక్కటిల్లితే ఏమవుతాయో…?
నాగరికత వేషాలు కాదోయ్
ప్రకృతి నీకోసం రాసి ఉంచిన పాఠాలు నేర్చుకో 
పంచభూతాలకీ ఇష్ట సఖుడివై 
జీవజాతికి ప్రియ మిత్రుడివై

Tuesday, 16 June 2015

నువ్వే...

'ఎప్పటికీ నాతోనే ఉంటావు కదూ' అంటున్నావ్...
నువ్వు తప్ప నా ఉనికెక్కడ ?
నాకు నన్ను ఇతరుణ్ణి చేసి
నీ అణువణువులో కణంగా చేసుకున్నాక...!

దైన్యంగా అర్ధిస్తున్నావ్...
ధైర్యపు స్పర్శ విలువ
నన్ను నీలో పోత పోసుకున్న
నీకన్నా ఎవరికి బాగా తెలుసని?  

అంతరాత్మలేని ఆడంబరపు ప్రపంచంపై
ఒంటరివై నువ్వు సాగిస్తున్న పోరాటంలో
ఆయుధంగా మారిన నన్ను గుర్తించక
భీతహరిణిగా మారిపోతే ఎలా?

నీ గుండె సవ్వడిగా మారిన నా ఊపిరిని గుర్తెరగకుండా
పలకరింపులకొక పెదవి లేదని అనుకుంటే ఎలా
నీ బేలతనం నా కళ్ళలో చెమరిస్తున్నప్పుడు
ఆ తడిస్పర్శ ఏ కొలమానినికి అందుతుందో చెప్పగలవా

ఆత్మీయ బంధమై నీ నిశ్శబ్దంలోనూ శబ్దం చేస్తూ
నువ్వు కోరుకునే ప్రతి ప్రపంచాన్నీ నేనే అవుతూ
ప్రపంచమంతా ఒక పక్క
నీ స్నేహమంతా మరో పక్కైన
తులాభారంలో
నువ్వే ఎక్కువ తూగుతావ్ ఎప్పుడూ కూడా...
నన్నో  స్వార్ధపరుడిని చేస్తూ  
నా స్వార్ధం మాత్రంనువ్వే...

-      

త్వమేవాహం

హనీ …


తీరాలూ... లోతులూ… హద్దులూ… తెలీని దుఃఖభూమిని నాలో పోతపోసుకుని దిమ్మరిగా తిరుగుతున్నప్పుడు ఒంటరి పచ్చిక బయళ్ళు అల్లరిగా అద్దుకున్న నీ చరణాల పరిమళాలు అనంతంగా ఆవరించి నీ అడుగుల్లోకి నన్ను అమాంతంగా లాగేసుకుంటుంటే నువ్వు చెరపట్టిన నా సమయాలు చెప్తున్నాయ్ అప్పుడప్పుడూ  చెరకూడా శాశ్వతమవ్వాలని కోరిక పుడుతుందని.


ఏ క్షణానికా క్షణం ఓ కొంగ్రొత్త మర్మం వెనుక దాగిపోతుంటే ఆ రహస్యానుభూతుల అమృతత్వంలో అంతం కావాలని అంతరంగం ఎంత ఆశగా ఎదురు చూస్తుందో… అప్పుడెప్పుడో తోవ తప్పిన కాలాశ్వాల కళ్ళాలు ఎప్పటికీ నా చేతుల్లోకి వచ్చేస్తే కనుపాపల తడిభాష ఆర్ద్రంగా మహదానందాన్ని మనసు నిండా అల్లెయ్యదూ.


ఎక్కడెక్కడి ప్రకృతినీ ఆరాధిస్తూ ఆకాశంగా నిర్వచించబడ్డ మహాశూన్యపు ప్రేమే నాకూ ఆదర్శమయ్యిందేమో.


నా మనసు పొత్తిళ్ళ నిండా కూరబడ్డ శూన్యం
నీతోనే మొదలయ్యింది…
నీతోనే నడిచింది…
నీతోనే అంతమయ్యింది...  
నన్ను నిడివంటూ లేని నిరంతర ప్రేమయాత్రకి సిద్ధం చేసి.


నిరంతరంగా వచ్చి పడే రేయింబవళ్ళు నన్ను నీ ఆలోచనాభిషిక్తుడిని చేస్తుంటే  ప్రతి లిప్త నిన్ను నాలో లిఖిస్తుంటే అర్ధం అయ్యింది నా రోజుకి నువ్వు యజమానివని… నీ శ్వాసకి నేనో కట్టుబానిసనని…


మొన్నెప్పుడో  నువ్వు గాలిలోకి విసిరేసిన శబ్దాలు అప్పుడప్పుడూ మౌనంగా  నన్ను ఏకాంతంలోనికి  లాక్కుని వెళ్ళినప్పుడు మనసు కింద పడి మెత్తగా నలుగుతున్న క్షణాలకి కాస్త ఊపిరద్దుతూ ఊసులాడదామంటే  ఓ ఆలింగనంతో ఆత్మైక్యమైయ్యావు.


మరి ’త్వమేవాహం’ అంటే ఇదేనా?

Saturday, 13 June 2015

మానసికశక్తి

ఎవరి వృత్తాలలో / పరిధులలో వాళ్ళు బతుకుతున్నప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు కానీ పక్కవాడి పరిధుల్లోకి వెళ్లి కెలికితే అన్నీసమస్యలే. మానసికశక్తితో ఎన్నో రుగ్మతలు నయం అవుతాయని సైన్స్ పరంగానే ప్రూవ్ అయ్యింది. దేవుడున్నాడనో / లేడనో నమ్మకాన్ని ఒకరికొకరు గేలిచేసుకోవటంవల్ల ఆ నమ్మకం ఇచ్చే మానసికశక్తి దూరమై సమాజానికి చెరుపు తప్ప మంచి చెయ్యదు.