హనీ …
తీరాలూ... లోతులూ… హద్దులూ… తెలీని దుఃఖభూమిని నాలో పోతపోసుకుని దిమ్మరిగా తిరుగుతున్నప్పుడు ఒంటరి పచ్చిక బయళ్ళు అల్లరిగా అద్దుకున్న నీ చరణాల పరిమళాలు అనంతంగా ఆవరించి నీ అడుగుల్లోకి నన్ను అమాంతంగా లాగేసుకుంటుంటే నువ్వు చెరపట్టిన నా సమయాలు చెప్తున్నాయ్ అప్పుడప్పుడూ చెరకూడా శాశ్వతమవ్వాలని కోరిక పుడుతుందని.
ఏ క్షణానికా క్షణం ఓ కొంగ్రొత్త మర్మం వెనుక దాగిపోతుంటే ఆ రహస్యానుభూతుల అమృతత్వంలో అంతం కావాలని అంతరంగం ఎంత ఆశగా ఎదురు చూస్తుందో… అప్పుడెప్పుడో తోవ తప్పిన కాలాశ్వాల కళ్ళాలు ఎప్పటికీ నా చేతుల్లోకి వచ్చేస్తే కనుపాపల తడిభాష ఆర్ద్రంగా మహదానందాన్ని మనసు నిండా అల్లెయ్యదూ.
ఎక్కడెక్కడి ప్రకృతినీ ఆరాధిస్తూ ఆకాశంగా నిర్వచించబడ్డ మహాశూన్యపు ప్రేమే నాకూ ఆదర్శమయ్యిందేమో.
నా మనసు పొత్తిళ్ళ నిండా కూరబడ్డ శూన్యం
నీతోనే మొదలయ్యింది…
నీతోనే నడిచింది…
నీతోనే అంతమయ్యింది...
నన్ను నిడివంటూ లేని నిరంతర ప్రేమయాత్రకి సిద్ధం చేసి.
నిరంతరంగా వచ్చి పడే రేయింబవళ్ళు నన్ను నీ ఆలోచనాభిషిక్తుడిని చేస్తుంటే ప్రతి లిప్త నిన్ను నాలో లిఖిస్తుంటే అర్ధం అయ్యింది నా రోజుకి నువ్వు యజమానివని… నీ శ్వాసకి నేనో కట్టుబానిసనని…
మొన్నెప్పుడో నువ్వు గాలిలోకి విసిరేసిన శబ్దాలు అప్పుడప్పుడూ మౌనంగా నన్ను ఏకాంతంలోనికి లాక్కుని వెళ్ళినప్పుడు మనసు కింద పడి మెత్తగా నలుగుతున్న క్షణాలకి కాస్త ఊపిరద్దుతూ ఊసులాడదామంటే ఓ ఆలింగనంతో ఆత్మైక్యమైయ్యావు.
మరి ’త్వమేవాహం’ అంటే ఇదేనా?







0 comments:
Post a Comment