'ఎప్పటికీ
నాతోనే ఉంటావు కదూ' అంటున్నావ్...
నువ్వు
తప్ప నా ఉనికెక్కడ ?
నాకు
నన్ను ఇతరుణ్ణి చేసి
నీ
అణువణువులో కణంగా చేసుకున్నాక...!
దైన్యంగా
అర్ధిస్తున్నావ్...
ధైర్యపు
స్పర్శ విలువ
నన్ను
నీలో పోత పోసుకున్న
నీకన్నా
ఎవరికి బాగా తెలుసని?
అంతరాత్మలేని
ఆడంబరపు ప్రపంచంపై
ఒంటరివై
నువ్వు సాగిస్తున్న పోరాటంలో
ఆయుధంగా
మారిన నన్ను గుర్తించక
భీతహరిణిగా
మారిపోతే ఎలా?
నీ గుండె
సవ్వడిగా మారిన నా ఊపిరిని గుర్తెరగకుండా
పలకరింపులకొక
పెదవి లేదని అనుకుంటే ఎలా
నీ
బేలతనం నా కళ్ళలో చెమరిస్తున్నప్పుడు
ఆ తడిస్పర్శ
ఏ కొలమానినికి అందుతుందో చెప్పగలవా
ఆత్మీయ బంధమై నీ నిశ్శబ్దంలోనూ శబ్దం చేస్తూ
నువ్వు కోరుకునే ప్రతి ప్రపంచాన్నీ
నేనే అవుతూ
ప్రపంచమంతా ఒక పక్క
నీ స్నేహమంతా మరో పక్కైన
తులాభారంలో
నువ్వే ఎక్కువ తూగుతావ్ ఎప్పుడూ
కూడా...
నన్నో స్వార్ధపరుడిని చేస్తూ
నా స్వార్ధం మాత్రం ‘నువ్వే’...
-







0 comments:
Post a Comment