మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 30 July 2015

అన్వేషణ

నీడలుగా జారడానికి ఊపిరి బిగబట్టుకున్న 
రోజుల్లోకి నడుస్తున్నప్పుడు 
గత స్మృతుల గాలి ఒక భీబత్సమై నన్ను చుట్టేస్తుంటే 
కాందీశీకుడినై మనసు లోతుల్లో ఖాళీ అరలను వెదుక్కుంటున్నా 
శాశ్వతంగా నన్ను నాలో ఏమార్చడానికి

ఎవరెవరి ఆనంద గానాలలోనో నేనెందుకు ఒదగాలి 
అనుకుంటూ నేను కట్టుకున్న బాణీ
బహు చిత్రం చేసింది 
ఎక్కడెక్కడి దుఃఖాన్ని నా పాటలోకి తెచ్చేసుకుని 

నిశ్శబ్దం పారుతున్న సమయాలన్నీ 
తుఫానుగా మారి మదిని అల్లకల్లోలం చేస్తుంటే 
ఎప్పటెప్పటి ఊసులూ ఊపిర్లు పోసుకుంటూ 
గాయపడిన గవ్వలుగా 
అంతరంగ తీరాన్ని ఆక్రమించేస్తున్నాయ్ 

విశాలమైన చీకటి మైదానాల్లో 
కురిసే విషాదం మొత్తం 
నా తిమిర వనాలని ఆర్తిగా హత్తుకుంటుంటే 
నా నిజమైన నేస్తం ఎవరో తెలిసింది 

ఒక శిల పుడుతున్నట్లు ఉంది 
గుండె గదులలో పేరుకున్న 
తడి మొత్తాన్ని స్ఫటికీకరించుకుంటూ 
నన్ను కొత్తగా కొనసాగించుకుంటూ ఉంటే…

నన్ను నేను తవ్వుకుంటూ వెళుతుంటే 
ఈ చిరపరిచిత దేహంలో 
ఒక అపరిచిత ప్రపంచం
అనంతమైన అనిశ్చితిలో స్థంబించి కనిపిస్తూ 
అన్వేషణ ముగిసే సరికి మిగిలేదేమిటో 
నా కథ చేరే లోకమేమిటో


Wednesday, 29 July 2015

హేమంత స్పర్శ - 14

ఏయ్…

రాత్రిళ్ళలో కూర్చుని చీకటిని శోధిస్తుంటే ఎన్ని కొత్త సంగతులు తెలిసాయో తెలుసా? మనల్ని పగలగొట్టే పగళ్ళ గాయాలకి విశ్రాంతి మంత్రమేస్తూ రెప్పలు చేసే సవ్వడి మాత్రమే వినే నాకు రేయిని అలా అలా తోడుకుంటూ ఉంటే తెలిసింది మనకు వెలుగవ్వటానికి తనెంత చీకటిని పులుముకుంటుందో అని. 

నమ్మవా ఏం? గాఢాంధకారం చుట్టుముట్టినప్పుడు ఒక్క వెలుగు రవ్వకి ఎంత విలువ వస్తుందో తెలిసిందే కదా… మరి ఆ వెలుగుకి విలువ కట్టటంలో రేయిని మంచినది ఏముంది? శబ్దం నుండే విశ్వం పుట్టింది అంటారు. విశ్వమంతా నిండిన శబ్దాన్ని రేయికన్నా బాగా వినిపించగలిగేది ఎవరని? 

అదంతా కాదుగానీ వెచ్చగా మనల్ని మైకంలోకి మనకు అత్యంత ఇష్టమైన వెన్నెల వెన్నదనం రేయికి మాత్రమే హక్కుగా వచ్చిన సొత్తు కదూ… మరి ఆ వెన్నెల ప్రేమని వెచ్చగా మన మీద కప్పుతుంది ఎవరు…? రేయేగా…

నీతివలువలు కప్పుకున్న జీవాలన్నిటి నిజమైన వ్యక్తిత్వం రేయి చీకటి పొరల్లోనే కదా నెమ్మదిగా విచ్చుకునేది… అదంతా ధైర్యంగా బయట పెట్టినా నిలదీసే ధైర్యంలేనిది మనకే… మనలాంటి వాళ్ళకే… 

అంతెందుకోయ్... అసలు రోజుకి మొదలూ చివరా ఉన్నది ఎవరు? రేయే కదా… చీకటి నుండి పుట్టి చీకట్లోకి సాగించే జీవన యాత్రకి ప్రతీకే కదా ఇది. 

దగ్గరగా ఉన్న వెలుగు… తనకు మించిన ఏ ఒక్క వెలుగునీ మన దరికి చేరనీయదు. అది దాని సహజ లక్షణం. కానీ ఒక్క చీకటి… ఒక్క రేయిగా... ఎన్ని నక్షత్రాలతో వెలుగుల తోరణం కడుతుందో మనకు తెలియని సంగతేం కాదుగా… అందుకేనోయ్ చీకటిని ఖర్మం అనుకోక… మరిన్ని వెలుగులని వెలుగులోకి తీసుకొచ్చే కాంతి దారిగా అనుకుంటే మనసెప్పుడూ నిరాశ వైపు మళ్లదు. 

పగలు రాత్రి కాసేపు విశ్రమిస్తేనే కదా రేపు మరింత శక్తితో వెలుగిచ్చేది. సుఖమొక సుఖమని తెలిసేది కష్టమంటే ఏమిటో తెలిసినప్పుడే కదా. 

ఇప్పుడీ రేయి గురించి అంతా నాకెందుకు అనుకుంటున్నావ్ కదూ… నా పగటి శ్రమలోనే కాదు రేయి అత్మావలోకనంలోనూ నువ్వే సందడి చేస్తుంటే అర్ధం అయ్యింది నాలోని నీ నిండుతనమూ ఆ పైన తన గొప్పతనమూ… 

నా నువ్వూ నీ నేనూ ఒకరిలో ఒకరం... ఒకరితో ఒకరం... మాట్లాడుకుంటున్నప్పుడల్లా మన శబ్దాలని అద్దుకుంటూ చిగురించిన పెదవులపై ఎక్కడెక్కడి పలుకులన్నీ తుమ్మెదలుగా వచ్చేసి ప్రపంచంలో చక్కర్లు కొడదాం అనుకోవటంలోనే తెలియటం లేదూ మనమెప్పుడూ మధురమేనని మాటలోనైనా మనసులోనైనా … 

అసలు మన గొప్పకి మనం విలువ ఇచ్చుకోకపోతే మరెవరో ఏమిస్తారు… మన గొప్పకి మనం విలువ ఇచ్చుకోవటం అంటే అహం అనుకుంటారేమో అనిపిస్తుంది కదూ… అహం కాదురా అది ఒక మంచి లక్షణాన్ని మననుండి కోల్పోకుండా చూసుకోవటం. కాదంటావా? అనలేవు కదూ… 

రోజూ ఎన్ని ముఖాలు చూస్తూ ఉంటావ్... 

కన్న వారినీ... ఉన్న ఊరినీ… ప్రపంచాన్నీ తిట్టుకుంటూ దిగుళ్ళని వేలాడ దీసుకుని… ఒకే మూసగా దుఃఖం ఒలికించే వాళ్ళని? బయట పడుతూ కొందరు… బయట పడక కొందరు… కానీ ఎక్కువ శాతం అలాంటి వారేగా. అలా బతకటం చాలా తేలికరా! కానీ ఆ బతుకు మనకి అవసరమా? 

మనకి వెలుగెంతో చీకటీ అంతే. సుఖమెంతో గాయమూ అంతే… ప్రకృతిలోని ఏ అస్తిత్వమూ తక్కువ కాదు. 

ఎవరికి వారే దుఃఖమైన జీవితాల్లో మనమూ నడవటం ఎప్పటికీ చెయ్యవద్దురా మనం. 

నీ 

నేను 


Tuesday, 28 July 2015

తాకుతూ... తాగుతూ

అప్పుడప్పుడూ ఆకాశం జల్లే మెరుపాక్షతలని మనస్సులో మధురంగా దాచుకుంటూ ఉన్నప్పుడు... తమ పరిమళం బరువు మొయ్యలేక లోకం మీదకి విసిరేస్తున్న మల్లెల సౌరభాలు వెన్నెల చల్లదనాన్ని కలుపుకుని  రక్తాన్ని మరిగిస్తుంటే రాసక్రీడా రహస్సులన్నీ మన శ్వాసలకి అద్దుకున్న  మన తొలి చలనాల సవ్వడిని  మనఃమంజూషంలో శాశ్వతం చేసుకున్న మౌనం ఎంత చక్కని అనుభూతి. 

మన అస్తిత్వాల ఏకత్వాల పరస్పర మార్పిడి నిన్ను నిన్నుగా నన్ను నన్నుగా నిలబెడుతూ మనల్ని ఏకం చేసిన సమయాల శుభముహూర్తం... మన స్మృతుల ఖజానాలో మేలిమైన లాలిత్యపు స్పర్శ. 

పగటి వేడినంతా రాత్రిపూట  సంద్రంలో నిమజ్జనం చేస్తూ పొద్దున్నే సాగర గర్భం నుండి ప్రతి రోజూ  కొత్తగా పుట్టే సూర్యుడు రాల్చే ఉషస్సులా  ఎప్పటి కప్పుడు కొత్తగా మనలో మనం ఉద్భవిస్తూ ఉంటే జీవితమెంత ఆహ్లాదమో అనుకుంటూ  కాసేపలా కళ్ళల్లో ప్రకృతిని కలుపుకుంటూ కూర్చుంటే చెదిరిపోయిన స్మృతులన్నీ ఊపిరిపోసుకుని వస్తూ తెచ్చే ఆనందాన్ని ఒక్క చుక్క కూడా కింద పడకుండా తాగాలనిపిస్తుంది... 

అప్పుడప్పుడూ ప్రకృతిని తాకుతూ తాగుతూ ఉండాలి కదూ... మనవైనవి కొన్ని మనసారా ఆస్వాదించటానికి...! 


Sunday, 26 July 2015

దగ్గరగా…

ఎదుటి గుండె 
అఖాతాల లోతుల్ని 
చదవగలిగే కళ్ళు ఉంటే బాగుండు…
చిగురుటాకు స్పర్శలా 
తాకే మనసొకటి పుట్టుకొస్తుంది 

ఒక్క తృటికాలపు చిరునవ్వే
శాశ్వత స్మృతిగా తడుముతూ  ఉన్న
మస్తిష్కపు తాత్వికతకు
అనంతంగా ఆనందాన్ని అద్ది చూస్తే 
అంతరంగం మొత్తం నక్షత్రాల సాన్నిధ్యం 

నాస్తికుడివైతేనేం 
భక్తి గీతంలోని 
భక్తిని విశ్వానికి వదిలి
తాదాత్మ్యతని మనసుకిచ్చి చూడు
అనుభూతుల వరద నిన్ను కమ్మేస్తుంది 

ధృఢత్వమొందిన మంచు బిందువుకంటే
గొప్ప వజ్రమేముంది 
ఏకాంతం ఇచ్చిన దగ్గరితనం కన్నా 
ఆత్మావలోకనానికి దారేముంది 

మనకు తప్ప అందరికీ అర్ధమయ్యే ఆనందాన్ని
మనకు మనవి చేసుకుందాం 
మనకు మనం మేలిమి అవుతూ 
పరాయి తనాన్ని పరాయి చేశాక
మిగిలేదంతా ‘మన’ తనమే... ‘మంచి’ తనమే...

Saturday, 25 July 2015

స్వార్ధం

ఆరారు ఋతువులు గ్రీష్మమై 
వేసవి వాలిన హృదయంపై 
మరువపు శీతలమద్దిన 
హేమంతమై స్పర్శిస్తుంటే 
తనని నా స్వార్ధం చేసుకున్న 
ఆ మొదటి క్షణంలోనే అనుకున్నా 
తన ఎదురుచూపుల నిండా 
నేనే ఉండాలని 
కానీ 
ఈ స్వార్ధమెంత మాయావో తెలుసా మీకు 
నా నిరీక్షణలకి తనని జీవంగా మార్చింది

తన ప్రతి క్షణానికీ కిరీటం తొడిగి 
నా సమయాల సింహాసనంపై 
తనని కూర్చోబెట్టాక
యుగాల లెక్కలూ తారుమారవుతున్న 
చిత్రాతి చిత్రపు మాయాజాలం ఐతేనేం 
అలసట తెలియని నిశ్శబ్ద తీరంలో 
తను వదులుతున్న శ్వాస 
నా ఊపిరిగా మారుతున్నప్పుడల్లా 
ఇష్టంగా మిమ్మల్ని చేరింది కదూ 
ఒకరికి ఒకరం స్వార్ధంగా మారుతూ 
మేముగా మాలో లీనం అయిన చప్పుడు!! 



Friday, 24 July 2015

చీకటి తెర

రేపో … 
ఇంకోనాడో 
ఒక చీకటి తెర  
శాశ్వతంగా 
నా రెప్పలని వరిస్తుందని 
ఈ నేలకి 
నన్ను మిథ్యని చేస్తుందని  తెలుసు 

అయితేనేం 
అప్పుడప్పుడూ 
మీ కళ్ళ తీరంలో చిరుఅలగా
చెక్కిళ్ళని తడుముతూ 
నే కదలాడుతే చాలు 
నా పుట్టుక ఒక సత్యమే
నా జీవితమొక ధన్యమే

Wednesday, 22 July 2015

కొత్త పుట్టుక

కన్నీళ్ళకి విలువకట్టబడే లోకంలో 
మగాడై పుట్టిన పాపానికి 
నా సునిశిత స్పందనలూ
తడిదేరిన ఆర్ద్రతలూ 
నమ్మలేని విషయాలౌతుంటే 
నా కళ్ళని ఎండమావులుగా చేసుకుంటున్నా 
ఉన్న కన్నీళ్ళని లేనట్లుగా చూపుకుంటూ

దారితప్పిన మృగాలు కొన్ని 
జనారణ్యంలో కీచకిస్తుంటే 
మృగాడిలా నేనూ నిందలు మోస్తున్నా 
పెదవులపై నవ్వుల మాయాజాలం చేస్తూ
మది గదుల్లో రోదిస్తున్నా

తమస్సు ఎప్పుడూ తపస్సు చేసే 
ఈ దేహారణ్యంలో 
కవాటాల నిండా గడ్డ కట్టిన దుఃఖం 
ఒక్క క్షణం గుండెనీ  గడ్డ కట్టిస్తే బాగుండు
నీడగానూ మిగలని నిద్రలోకి జారిపోతా 

కలలైనా కన్నీళ్ళైనా  
ఏ ఒక్కరి స్వంతమో కాదు 
అవి మనిషి మనిషి సొత్తే మరి

అందుకే 
ఆడదానికే కాదు 
మగాడికీ ఓ కొత్త పుట్టుక కావాలిప్పుడు
నిందలు చెల్లాచెదురయ్యే ఉప్పెనలా 
లింగాల లెక్కలవసరమే లేని మనిషితనంతో 


Tuesday, 21 July 2015

స్నేహ స్పర్శ

ఎన్ని గుండెల మధనంలో నుండి 
రాలిపడ్డ కన్నీళ్ళో అవి  
నేలపై మహాసంద్రాలని పరచాయి 

కంటికి నీరు కరువైన 
ఎడారి జీవితంలో 
చెలిమి గంధమొక్కటి చాలు
బీటలైన హృదయాన్ని 
చిగురింపజేయడానికి 

తెలుసుకోలేం కానీ 
జీవితంలో అమృతం కురుస్తూనే ఉంటుంది 
చెక్కిలి తుడిచే చేతి వేళ్ళ స్పర్శలో నుండి