మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Saturday, 12 March 2016

వెన్నెలమ్మాయీ


తలపుల పడవల్లో జ్ఞాపకాల తెరచాపలనెత్తి
గడచిన సమయాల తీరాన్ని తాకినప్పుడల్లా
కుంకుమ తోటలలోని వాయుస్పర్శనద్దుకున్న
వినీల కుంతలాలలో మెరుగు పూలు ముడుచుకున్న
నులివెచ్చని గ్రీష్మ కావ్యంలా లిఖించబడ్డ నీకై
నా రెప్పల కుంచెలని అరువిచ్చిన వార్తలు
ఎప్పటికప్పుడు నాలో చదవబడుతూనే ఉన్నాయి

నువ్వు విసిరేసిన జ్ఞాపకాల్లో
నన్ను నేను ఏరుకుంటూ వస్తున్నప్పుడల్లా
కొన్ని వెన్నెల జూకాల సవ్వడి
నిన్ను మరింత దగ్గరగా వినిపిస్తుంటే
చూడక పోతే విరాగం... చూస్తే రాగంగా
నువ్వెప్పుడూ ఓ ఇంద్రజాలపు మంత్రమై
నా గుండె గొంతుకలో తడి తడిగా
చల్లగా కురిసేస్తూ ఉంటావ్…
నువ్వెంతటి శీతలానివో ఓ వెన్నెలమ్మాయీ…!

ఒకటిగా


ఎప్పటికప్పుడు ఒకే దేహంలో 
రెండుగా చీల్చబడుతున్న సంఘర్షణలో 
రాజీ కుదర్చడానికి 
ప్రపంచమేమీ ఖాళీగా లేదులే 
నిశ్శబ్దానికీ అలజడికీ 
ఒకే ఉదాహరణలున్నచోట
ఎడతెగని మౌనానికీ 
ఘర్జించే నినాదానికీ 
ఒకే పుట్టుక ఉండటం 
పెద్ద వార్తేమీ కాదులే 
తన అస్తిత్వంలోని భిన్నత్వాలని 
సమన్వయం చేసుకోగలుతున్న ప్రతి మనిషికీ
ప్రపంచంతో కలసి నడవటం కష్టమేమీ కాదుగా 
మరి రా నేస్తమా… 
ఒకటిగా నడుద్దాం… ప్రగతిగా సాగుదాం

దైవత్వం



ఆకలిలో సోలిపోయిన మనిషి
మరో రోజులో కళ్ళు తెరిచినప్పుడల్లా
నువ్వొక బంగారు వెలుగులా
కనిపించనవసరం లేదు
ఒక్క అన్నం ముద్ద వాసనలా వీస్తే చాలు
ఆదిమత్వం నుండి అంతరిక్షం వరకూ
స్వర్ణరథమెక్కిన దేవతలా మిగిలిపోతావు

వెచ్చని చినుకు



శతాబ్దాల క్రితం కంచెలేసావ్
యుద్ధం కొన సా……..గుతూనే ఉంది
చెప్పుకోవటానికే యుద్ధం
నిజానికిది దండయాత్రే
అయితేనేం... ఏ దండయాత్రలో నైనా
అంతిమంగా వీరతిలకమద్దుకునేది మాత్రం మట్టే కదా

గెలిచి నిలిచినవారంటూ లేని రణరంగాన
కాలం అంచున కారుతున్న రక్తపుటేరుల కమురువాసన
ఇంకా నీకు వెగటు పుట్టించలేదనుకుంటా
ఒక చేత్తో అభయం మరో చేత్తో ఆయుధం ఇస్తూ
కృష్ణతత్వం వంటబట్టించుకున్నావ్
ఎక్కడో రగులుతున్న అగ్గిలో
నువ్వు వెలుగు కాచుకుంటున్నాననుకుంటావ్
నాకో నిజం  చెప్పు నేస్తమా
ఆ వెలుగుప్పుడైనా
ఒక్క ప్రాణజ్యోతిని నిలబెట్టిన నిజాన్ని చూసావా

నీటిమీద నువ్వు గీసిన బొమ్మలెంత శాశ్వతమో
బహుశా నీకు తెలిసే ఉండవచ్చు
కాలానికి నువ్వూ అంతేనన్న నిజం కూడా స్ఫురించనంత
జ్ఞానత్వంతో మిడిసి పడకు మిత్రమా
నీలో నువ్వు శలభంలా కొట్టుకులాడే రోజొకటి వచ్చేస్తుంది

క్లిష్టమైనచోట కాస్తంత కోల్పోయి చూడు
నువ్వెంత ఇష్టమవుతావో నీకే తెలుస్తుంది
కంటి చివర కొన్ని వెచ్చని చినుకులు తడిమితే కదా తెలిసేది
ప్రతి తేమలో ఒక హాయి ఉంటుందని
నీకు నువ్విచ్చుకునే ఒకానొక అద్భుతమైన కానుక తానని

వాయిదా



కాలం ఇంకిపోయే కొద్దీ 
చేతలు త్వరపడటం అన్నది 
శతాబ్దాలుగా 
ఎరిగిన సత్యమన్నది  
తెలిసీ 
నిన్ను నువ్వు బద్ధకించుకుంటూ 
వాయిదా వేసిన అనేకానేకాలను
కాలం నీకు మాయం చేసిన సంగతి
నీ దృష్టికి ఎన్నడూ రాకపోవటం 
దృష్టి లోపమేమీ  కాదు 
అది ఆ అవకాశం జారిపోవటమూ 
నిన్ను నువ్వు కోల్పోవటమూ  కూడా

పొడి నీరు



పరాకుగా జీవితాన్ని నడిచేస్తున్నట్లు 
ఒక కలని కంట్లో దాచుకుని 
ఎండమావుల తేమలో 
అలవోకగా దేహాన్ని పరచుకుంటూ 
పొడి నీటితో 
గొంతు తడుపుకున్నప్పుడల్లా
దాహం తీరిందో లేదో 
తెలియని అయోమయంలో 
నిన్ను పొడిబార్చుకుంటూ
తడి భ్రమలని ప్రతిబింబిస్తూ 
గాలి అలలలో  ఈత నేర్చుకోవటానికి 
రోజంతా ప్రయాస పడుతూనే ఉంటావు
ఎందుకంటే 
నువ్వు 
ఇప్పటికింకా 
అడుగు నేర్వని గమనానివి
నీకు దొరకని గమ్యానివి

Friday, 11 March 2016

యుద్ధం



ఎంగిలి కాబడని కలలంటూ కానరాని  స్వప్న మైదానాల్లో 
ఎంత సేపని తచ్చట్లాడతావు మిత్రమా
నేలదిగి నడిస్తే 
కనీసం గ్రాసం కోసం పోరాటం మొదలెట్టవచ్చు 

తప్పులకి తప్పులే సమాధానమవ్వుతున్నచోట 
ఎంతసేపని తారాడుతూ ఉంటావ్ నేస్తమా 
నీకు నచ్చకపోయినా తప్పులోకే జారిపో 
లేదంటే నువ్వు తప్పుడోడివైపోతావ్ 

కాస్తంత మందుకే  కమనీయ కవిత్వం పుట్టేచోట 
నాగరికాలకి పై పూతగా అరణ్యాలని అద్దుకునే చోట 
వాక్యాల నుండి జీవితాన్ని చూడకు స్నేహితుడా 
మళ్ళీ లేవకుండా మట్టిగొట్టుకుపోతావ్

మనసెంత్రమయ్యాక మనిషి గురించి తలవని చోట 
తన చేతితో తాను తినటం అనాగరికమైన వేళ 
పసి దేహాలూ కామ దాహల్లో కాలిపోతున్న చోట 
నిన్ను నువ్వు క్షమించుకోకు నేస్తమా 
నీలో నువ్వు కాలిపోతావ్ 

రక్తాన్ని అద్దుకోని ఒక చరిత్ర కోసం 
స్వార్థం కప్పుకోని ఒక ఇతిహాసం కోసం 
కామాన్ని దాటి రాలేని కాలం కోసం 
యుగాలన్నీ అన్వేషించాక తెలిసిన నిజమొక్కటే
మనిషి కోసమంటూ ఇంతవరకూ 
ఒక చెంచాడు దుఃఖం కూడా ఎవరిచేతా కార్చబడలేదని 
మనిషి జాతంటేనే ప్రళయానికి పర్యాయపదమని 

మనిషెక్కడ అన్న ప్రశ్నకు సమాధానం ఉంది 
ఎక్కడో కాదు... 
నీలోనే… నాలోనే… మనలోనే  
చేరే మార్గమే అస్పష్టం 
ప్రశ్న అడగటమే కాదు 
సమాధానం సాధించటంలోనే బయట పడుతుంది సమర్ధత

మనిషిగా మారే సంకల్పానికై యుద్ధం చెయ్యాలి 
నీకు నువ్వే ఒక యుద్ధ క్షేత్రం కావాలి 
నువ్వంటేనే యుద్దానికి ఒక నిర్వచనం కావాలి 
ఆ యుద్ధ రంగాన మనిషితనమే విజయఫలం...

Wednesday, 9 March 2016

నిష్క్రమణ



రెక్కలు తెగిన మాటకి
ఏ నిశ్శబ్దమూ ఆశ్రయమివ్వదు
మౌనంగా మథనపడటం తప్ప
ఆకతాయి శబ్దాలు వినవచ్చినప్పుడల్లా
ఊపిరి బిగబట్టుకుని నడుస్తున్న ఆడపిల్లలా
మాటని అదిమిపెట్టిన మౌనమొకటి
మాట భారాన్ని మొయ్యలేక అలసిపోతుది

నిన్నటి కలల పహారాలో
నిశ్శబ్దతిమిరపు తెరరూపం
కదలాడుతుంటే
చెమ్మగిల్లిన కళ్ళు
చెప్పిన కొన్ని కథలు
ఎన్నటికీ అర్థం కావు
మరెన్నటికీ కంచికి చేరవు

రాత్రి నుంచి కొల్లగొట్టుగొచ్చిన అనంత నిశ్శబ్దానికి
కనుపాప నల్లదనాన్ని కలగలపి
కారు నల్లని చీకటిని లిఖిస్తున్న సమయాలు
ఇక్కడేం కొత్తకాదులే

నిజం కనుగొన్నవాడికి
నిశ్శబ్దమూ చీకటి ఒక్కలాంటివే
బయటకేవీ స్పష్టంగా చూపించవు
అంతఃచక్షువులకి అన్నీ సుస్పష్టమే

తడింకిన నయన ద్వీపంలో
మొలిచేవన్నీ వంచనా శకలాలే అయ్యాక
సడిచేస్తున్న నిశ్శబ్దంలోకి దూకి ఆత్మహత్యించుకుంటున్న
సమయాలకే తెలుసు
కొన్ని సార్లు నిష్క్రమణలెంత ఆనందమిస్తాయో