ఏడాదుల్ని తవ్వుకుంటూ వెళుతున్న దారిలో
గాలి మడుగులో తప్పిపోయిన ఊపిరులని లెక్కగట్టి
ఒద్దికగా నిలబడిపోయిన వానల్లో
తడిచిన రెప్పల అలికిడిని వింటూ
పాతక్షణాలన్నీ ఒకటొకటిగా ఆవిరైపోతుంటే
వెనక్కి తిరిగిన ఓ చూపు చెబుతోంది…
నకారాత్మమొకటి మరింతగా చిక్కబడుతుందని!!
నాకు నేను ఒక షరతుగా మారిపోయాక
కుంచించుకుపోయిన ఆకాశానికి ప్రయాణం కట్టడానికి
ఈ నా రెక్కల బలిమి ఎంతైతేనేమి
నాకు నేనొక్క బంధనంగా కట్టబడ్డాక
ఎక్కడెక్కడి స్వేఛ్చలన్నీ
నా మనసు ముందు చేసే నర్తనంతో
నింగి నీలమంతా మనసులో కురిసింది
యదార్థతత్వాన్ని మోసపుచ్చేస్తూ
నకిలీ నవ్వులని పెదాలపై నగిషీలుగా అద్దుకుంటూ
ఆర్తిత్వాన్ని అణగార్చడం నేర్చుకుంటున్నప్పుడు
ఎప్పటి ఉనికినో పల్లవిగా చేసుకుంటూ
చీకటిలో నుండి చిక్కగా ఒక పాట మొదలవుతుంది
సరిగ్గా అప్పుడే…
గుండె నుండి ఆకాశం కురవటం మొదలవుతుంది







0 comments:
Post a Comment