రాత్రి నీడలో
ఒద్దికగా తల దాచేసుకుంటున్న పగటి మైదానంలో
వెలుగంటిన జీవితమెరుగని
గాయాల లిపిగా మారిన
తన భగ్న దేహం మీద
తన వ్యథాభరిత మనసు మీద
నెత్తురుని స్రవిస్తూ
దుఃఖించే తన హృదయం మీద
ఎప్పుడూ నిర్దయే
ఈ వానకీ… ఆ శీతలానికీ!!!
ఇంకా…
గుండె మీద విరియాల్సిన
ఓ నవ్వుకి!!!
కథ చెప్పడానికి
తను చాలా కాలం నుండి వేచి చూస్తూనే ఉంది.
అది
తన హృదయం నుండి తనను ఒంపుకునే కథ
తనని తాను మళ్ళీ పరిచయించుకునే కథ
శ్రోతలెవ్వరన్న పట్టింపులేదు
తరువాతేమిటన్న ప్రశ్నకి సమాధానమూ అవసరం లేదు
అయితే…
ఇప్పుడు తను చిక్కుకుందల్లా
తన కథని
ఎక్కడ మొదలు పెట్టాలా అన్న పద్మవ్యూహంలో







0 comments:
Post a Comment