Saturday, 6 February 2021

రాత్రి చిత్రం




ఆదమరచి నిద్రించేలా ఒక్క రాత్రినీ 

సరిగ్గాచిత్రించని చిత్రకారుడెవ్వడో కానీ 

రాత్రికి పర్యాయ పదమంటే 

చీకటని చదివాడేమో పాపం 

తన కుంచెని చివరి వరకూ 

చీకటి  రంగులోనే ముంచుకున్నట్లున్నాడు 

 

ఊహూఁ…

ఇదేం బాలేదు 

 

ఈ చిత్రంలో జీవం  పలకటం  లేదు 

 

నాకైతే 

రాత్రి చిత్రమంటే    

వెన్నెల్లో అభ్యంగన స్నానం చేసే 

నీలాల వన కన్య  తీసే ఊపిరి 

పగటి  రహస్యాలని  

రెప్పలగూట్లో  దాపెట్టి 

రంగు రంగుల స్వప్నాలని  

రసరమ్యంగా సిద్ధం చేసే

వాసకసజ్జిక  శ్వాస 

0 comments:

Post a Comment