Sunday, 14 February 2021

అనుకోకుండా కంటబడ్డ వెలుగు… ఈ “చీకటి”

 



ఫిక్షనల్ నవలలు తప్ప కథలూ, కవితలూ పెద్దగా చదివే అలవాటు లేని నేను అనుకోకుండా ఓ కథ చదివాను. చదివే కొద్దీ మనసులోని  చీకటి పలచబడుతున్న ఫీలింగ్.  ఆ కథ పేరు “చీకటి" . అల్లం శేషగిరి రావు గారి 'కథాస్రవంతి' కథల సంపుటిలోని ఒక కథ. 

ఈ కథా నేపధ్యం వేట. రచయిత అల్లం శేషగిరి రావు గారు అటవీ నేపధ్యంలోనే అనేక కథలు రాశారు. వేట మీద ఎంతో అనుభవం ఉంటే తప్ప అందులోని సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలని కళ్ళకి కట్టినట్లు చెప్పలేరు. కథలోని ప్రతి సన్నివేశం మన కళ్ళ ముందే జరుగుతున్నట్లుగా అనిపిస్తుందంటే ఈ కథ లో ఉన్న డీటైలింగ్ వల్లనే. సన్నివేశాన్ని పరిచయం చెయ్యడానికి, అదే సన్నివేశంలోకి మనల్ని నడిపించడానికీ చాలా తేడా ఉంది. ఈ కథ రెండో కోవకి చెందింది. కథ పొడుగూతా ఇందులోని ఒక పాత్ర అయిన డిబిరి గాడి జీవితాన్ని తన పక్కన ఉండి మనం చూస్తున్నట్లుగా అనిపిస్తుంది… అది మాత్రమే  కాదు రాత్రి చీకటిలో వేట దృశ్యం కూడా కళ్ళముందు కట్టినట్లుగా కనిపిస్తుంది.  

నక్కలోళ్ళు గా పిలవబడే ఒక సంచారతెగకి  చెందిన డిబిరి గాడు,  వేట హాబీగా ఉన్నరిటైర్డ్ మిలటరీ కెప్టెన్ వర్మకి చెప్పిన కథ ఇది. 

ఇద్దరివీ పూర్తిగా భిన్న నేపథ్యాలు. వీళ్ళద్దరికీ ఉన్న పోలిక ఒక్కటే వేట. కాకపోతే ఒకరికి అది హాబీ… మరొకరికి అది ఉపాధి. ఇద్దరూ కూడా వేటకి ఉపయోగించే తుపాకులు వేరు. కెప్టెన్ వర్మ తన హంటింగ్ డాగ్ తో వేటకి బయలుదేరితే డిబిరి గాడు కళ్ళు కుట్టేసిన పెంపుడు కొంగతో వేటకి బయలుదేరతాడు. 

ఇంతకీ వేట అంటే పులులనో సింహాలనో కాదు… డక్ హంటింగ్… బాతుల వేట!

బాతుల హంటింగ్ కోసం తన పెంపుడు కుక్క సీజర్ ని వెంటబెట్టుకుని చీకటిలో తంపర దగ్గరకు వెళ్లి తంపరలో వాలుతున్న బాతులని షూట్ చేస్తాడు. ఆ శబ్దానికి మిగిలిన బాతులన్నీ వెళ్ళిపోతాయి. ఆ సమయంలోనే  తన పొట్టకూటి కోసం నెత్తిమీద లాంతరు, తోడుగా నత్తగొట్టు అని పిలవబడే పెంపుడు కొంగ తోడుగా వచ్చి అదే తంపరకి మరోవైపున నీళ్ళలో ఉంటాడు డిబిరి గాడు. బాతులు ఎగిరిపోవడంతో, మళ్ళీ పక్షులొస్తే వేటాడవచ్చు అని ఎదురు చూస్తూ డిబిరి గాడు వేసుకున్న చలిమంట దగ్గరకు చేరతాడు కెప్టెన్ వర్మ. 

అతనితో మాట కలుపుతాడు డిబిరి గాడు. అతని మాటలలోని అమర్యాదకరమైన పలకరింపుకి కించిత్ బాధగా అనిపించినా అతని మాటల ప్రవాహంలోకి తనకి తెలియకుండానే ప్రవేశిస్తాడు. తన కాల్చిన తుపాకీ డిబిరి గాడి నోటికి కూడు అందకుండా చేసిందని తెలిసి కాస్త ఫీల్ అవుతాడు వర్మ. 

అక్కడి నుండి డిబిరి గాడి విశ్వరూపం దర్శనమవుతుంది. వేటలో తనకున్న మెళకువలు వినే కొద్దీ వేట మీద డిబిరి గాడి కున్న సాధికారత ఏమిటో తెలుస్తుంది వర్మకి. ఆ తరువాత డిబిరి గాడి ఒక్కొక్క అనుభవమూ ఒక్కో దయనీయమైన గాథగా తెలుస్తుంది. ఒక విధంగా సమాజంతో వేటాడబడ్డ జీవితం డిబిరి గాడిది. 

తన లాగానే సంచార తెగ మనిషి  అయినా తన కన్నా పెద్ద జాతికి చెంది సోది చెప్పుకుంటూ బతికే ఆమెతో  తన శృంగార అనుభవాన్ని పచ్చిగా చెప్పి వెనువెంటనే  నక్క కరవడం వల్ల వచ్చిన ఆమె  చావు, చచ్చిపోయాక నక్కల పాలబడ్డ ఆమె శవాన్ని మళ్ళీ కప్పేసి ఆ రాత్రంతా అక్కడే కాపలా కాస్తాడు.  ఇది ఒక అనుభవమైతే… తన తండ్రి గురించి అతను చెప్పింది మరో ఎత్తు. 

చేయని నేరానికి పోలీసులచే అరెస్ట్ చెయ్యబడి, తరువాత ఒక పోలీసుని హత్య చేసి లొంగిపోయి ఉరి శిక్షకి గురవుతాడు డిబిరి గాడి తండ్రి. అతను ఉరితీయబడటానికి ఒక రోజు ముందే అదీ సాయంత్రం పూటే తెలుస్తుంది డిబిరి గాడికి. అప్పటికప్పుడు కలవడానికి  జైలు ఆ ఊరిలో లేదు. బస్సెక్కి వెళ్ళాలి. బస్సుకు డబ్బులు లేక అడుక్కున్నా డబ్బులు సమకూరవు. ఇక తండ్రిని ఆఖరిసారి కలవడం కోసం ఆ పాటిన రాత్రంతా పరుగెత్తీ పరుగెత్తీ మరునాడు ఉదయానికి జైలు దగ్గరకి వెళ్ళేసరికే తండ్రిని ఉరి తీసేసి ఉంటారు.  తనకిచ్చిన జొన్న రొట్టెలని తనని చూడడం కోసం ఆకలితో పరిగెత్తుకుని వచ్చే కొడుక్కి ఇవ్వమని తన ఆఖరి కోరికగా కోరతాడు డిబిరి గాడి  తండ్రి. వాటిని తన తండ్రిని స్మశానం లో పూడ్చి పెట్టాక ఆక్కడే కూర్చుని తింటాడు డిబిరి గాడు. 

ఈ కథంతా చెప్పేసరికి కూడా మళ్ళీ వేట దొరికే సూచన కనబడక తన నత్తగొట్టు పీకని కత్తితో తెగ్గోస్తాడు డిబిరి గాడు. అది పాపం కదా అన్న వర్మతో ఈ రోజు దీనితో పొట్ట నింపుకోక పోతే తన ఆకలి తీరదని చెప్తాడు డిబిరి గాడు. 

డిబిరిగాడి విషాద జీవిత చిత్రం కెప్టెన్ వర్మ  మనసులో టీవీ స్క్రీన్ మీద ఘోస్ట్ ఇమేజ్ లా కదలాడుతుండగా,  తన చుట్టూ ఉన్న చీకటిలో డిబిరి గాడు ఇచ్చిన బీడీ కాల్చుతూ ఉండటంతో కథ ముగుస్తుంది. 

కథలో కరుణ రసం, శృంగార రసం, బీభత్స రసం… ఏదీ కూడా  కొలతలేసి రాసినట్లుగా కాక ఒక డిబిరి గాడి నిజ జీవితంలో నుండి ఎత్తుకొచ్చి పెట్టినట్లుగా అనిపిస్తాయి. సిగముడి, కణితి మీద కాల్చిన మచ్చ, చెవి రింగుల బరువుకి సాగి వేలాడుతున్న చెవి తమ్మెలు, చేతి మీద పులి పచ్చ బొట్టు. సరైన తిండి లేక ముడుచుకొని పోయిన కండలు అంటూ డిబిరి గాడి ఆహార్యాన్ని పరిచయం చెయ్యడంతో, తరువాత వర్మ కి డిబిరి గాడు తన కథ చెబుతున్నప్పుడు తనకే ఆ కథని చెబుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కథని చదివే పాఠకుడికి.  

ఓ నాటు మనిషి జీవితానికి శ్రోతగా మారిన ఓ నీటు మనిషి. ఈ నీటు మనిషి అంటే కథలో ఉన్న కెప్టెన్ వర్మ మాత్రమే కాదు. కథ చదివే నేనూ… మీరూ… మనమందరం. ఇందులో కెప్టెన్ వర్మది వడ్డించిన విస్తరి లాంటి జీవితం కాబట్టి హంటింగ్ అనేది హాబీగా చేసుకుని కాలం గడుపుతూ ఉంటాడు. మరి డిబిరి గాడికేమో అసలు విస్తరే లేని జీవితం… ఏ పూటకాపూట తిండి కావాలంటే వేటే గత్యంతరమైన జీవితం. వీళ్ళ ఇద్దరినీ కలపడం లోనే కింది మనిషి యొక్క యదార్థ జీవితపు విషాదపు లోతుల్ని పై మెట్టులో ఉన్నవాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలో రచయిత పరిచయం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. 

ఇందులో రచయిత పరిచయం చేసింది పుట్టుకలు గుర్తుండక చావులు మాత్రమే లెక్క బెట్టుకునే ఓ సంచార తెగకి చెందిన ఒక మనిషి జీవితాన్ని. ఆ చావులు కూడా సహజమైన చావులు కాదు. మనసుల్ని మెలిపెట్టే చావులు. మనుషుల్ని కుదిపేసే చావులు. అమ్మోరు పోసి చచ్చిపోయి శవమై రాబందులచే పీక్కు తినబడ్డ అమ్మ… నక్క కరవడంతో చచ్చిపోయిన ప్రేయసి… చేయని నేరాన్ని ఒప్పుకోలేక తిరగబడి హంతకుడై ఉరితీయబడ్డ తండ్రి. 

తనని ఉరితీయబోయే వార్త తెలిసి, కొడుకు ఎలా పరిగెత్తుకు వస్తాడో ఆ సమయానికి అతను ఎంత ఆకలితో ఉంటాడో ముందే ఊహించిన  డిబిరి గాడి తండ్రి  తనని  ఉరి తీయబోయే ముందు తన ఆఖరి కోరికగా  తినడానికి తనకిచ్చిన జొన్న రొట్టెలని  తన కోసం వచ్చే కొడుక్కి ఇవ్వమని చెప్పడం… తన తండ్రి తనకోసం ఉంచిన ఆ  రొట్టెలని, తన తండ్రిని పూడ్చిన చోటే కూర్చుని తినడం చదివిన పాఠకుడి మనస్సులో అకస్మాత్తుగా ఎవరో ఇంత శూన్యాన్ని పోసినట్లుగా నిశ్చేష్టులవుతారు. తన ఆత్మ బయటకు వచ్చి తన్నుకులాడుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. 

ఇందులో కాకుల్ని చంపి వాటి పీకా కాళ్ళూ కోసేసి ఈకలు దూసేసి పావురాల బొచ్చు అంటించి వాటిని పావురాలుగా అమ్మేసే డిబిరిగాడి మాయలోకానీ, ఎవరి మీద జల్లితే వాళ్ళు మన మాయలో పడిపోతారని చెప్పబడే ఫిట్టింగ్ మందు అమ్మే అతని ప్రేయసి మాటల్లో కానీ మనకెక్కడా మోసం కనపడదు… ఆకలంటుకున్న కడుపుకి ఇంత నిద్రని ఎర వెయ్యడం తప్ప. సంప్రదాయ అక్షరాల్లో రాయలేని పచ్చి శృంగారపు ఆశ్చర్యంలో నుండి మనం బయటకు రాకముందే డిబిరిగాడి ప్రేయసి చావును రాయడం…. సుఖానికీ దుఃఖానికీ పెద్దగా దూరం ఏమీ ఉండదు అని పాఠకుడిని హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తుంది. 

నిజానికి వీళ్ళ ఇద్దరి శృంగారం వెనకాల ఒక చక్కని ప్రేమ కథ ఉంది. మొత్తంగా చూస్తే ఒక్క పేజీ కూడా లేని ఆ ప్రేమ కథ మనసు మీద వేసే ముద్ర మాత్రం అత్యంత గాఢమైనది. ఇంత తక్కువ వాక్యాలలో ప్రేమ లోని గాఢత చూపి కళ్ళల్లో చెమరింపు వచ్చేలా చేయడంలో రచయిత యొక్క ప్రతిభ అర్థం అవుతుంది. ఆమె చనిపోయాక, నక్కలు పీక్కు తినబోతున్న ఆమె  శవాన్ని చూసి అతనిలో కలిగిన భావాలని  మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అతని లోని ప్రేమ మనకి తెలుస్తుంది. 

సంచార తెగల జీవితాల్లో భాషది ఒక ప్రత్యేక పార్శ్వం. వాళ్ళ జీవితాల లాగానే వాళ్ళ భాష కూడా... అరవం… ఉర్దూ... ఇంగ్లీష్… అన్ని యాసలూ కలగలసిన తెలుగు. ఏదీ పరిపూర్ణం కాదు.   నోటి నుండి వచ్చే భాష కన్నా మనసు నుండి వచ్చే భాషకే గాఢత ఎక్కువ కదా…    

నిజానికి ఇందులో రచయిత ప్రథానంగా పరిచయం చేసింది మాత్రం పోలీసుల దాష్టీకాన్ని. సంచార తెగల వాళ్ళ పట్ల పోలీసుల వైఖరి ఎంత కర్కశంగా ఉంటుంది అన్న నిజాన్ని నగ్నంగా బట్ట బయలు చేసినట్లుగా అనిపిస్తుంది. తండ్రితో ఏదోలా నేరం ఒప్పించడానికి తన ఎదురుగా కొడుకుని చిత్ర హింసలకి గురిచెయ్యడం… కొడుకు మీద మమకారంతో చేయని నేరాన్ని ఒప్పుకుని తరువాత పోలీస్ నే హత్య చెయ్యడం అంటే అతని అనుభవం  ఆ వ్యవస్థ పట్ల ఎంతటి హేయభావాన్ని కలుగ చేసినట్లు?

“ఏ జాతి పిట్టల్ని పట్టుకోవాలంటే ఆ జాతి పిట్టనే మచ్చిక చేసుకోవాలి. ముందుగా దానికి చూపు లేకుండా చేసెయ్యాలి” అని తన నత్తగొట్టు (పెంపుడు కొంగ) విషయంలో అన్న మాటలని ప్రస్తుత మానవ సమాజానికి అన్వయించుకుని చూస్తే? అని అనిపించిందంటే, అనుభవం  చెప్పిన ప్రతి మాటా  అంతర్లీనంగా  మనిషి జీవితాన్ని విప్పి చెప్పేలా ఉంటుంది.  

తుపాకితో బాతుల్ని చంపిన కెప్టెన్ వర్మ, ఆ రోజుకి తనకి వేట దొరక్క  ఆకలి తీర్చుకోవడానికి  తన పెంపుడు కొంగ పీకని కత్తితో కోసి చంపడం చూసి పాపం… ఇన్ హ్యూమన్  అని ఫీల్ అవ్వడం మనుషుల్లోని గురువిందతనానికి మంచి ఉదాహరణ. 

“నువ్వు కులాసాకీ. జల్సాకీ, గొప్పకీ ఏట సేస్తావు. నేను పొట్టకోసం ఏట సేస్తాను. ఏట లేకపోతే మేం బ్రతకలేం. ఆకలితో సవ్వాల. ఏది పాపం సారూ” అని అంటూ “ఈ రోజు  ఏట లేదు. నీ తుపాకీ శబ్దానికి పిట్టలు దిగలేదు. కొట్టిన పిట్ట ఊబుల్లో పడి పోయింది. వర్షం కూడా వచ్చేస్తుంది. మరి ఏట ఉండదు. ఈ రోజు దీనినే తిని పొట్ట నింపుకోవాల. లేకపోతే వస్తుండాల….. ఆకలి… ..మరి ఈ పాపం ఎవరిది సారూ? అని పొట్ట మీద కొట్టుకుంటూ పాపం….. పుణ్యం…” అని ప్రశ్నించే డిబిరిగాడి ప్రశ్నలకి శాశ్వత సమాధానం ఎప్పటికి దొరుకుతుంది. 

ఇది ఒక్క డిబిరి గాడి కథ కాదు. ఆకలి కొనసే ప్రతి ఒక్క మనిషి  కథ. ఇందులో బయటకి కనబడే కథా నేపధ్యం వేట అయితే… బయటకి పెద్దగా కనబడని అసలైన కథా నేపధ్యం ఆకలి. కొడుకు ఆకలి తీర్చడానికి ఉరికంబం ఎక్కబోయే తండ్రి ఆరాటం… ఆకలి  తీర్చుకోడానికి పెంచిన పిట్టని గొంతుక కోసిన డిబిరిగాడి కరుకు తనం. రెండిటిలోనూ ఉన్నది ఆకలే. 

“అన్ని ఊళ్లూ తిరుగుతుంటాం… ఎక్కడుంటే అదే మా ఊరు. ఈ భూమంతా మాదే”  ఒక చోట డిబిరి గాడు కెప్టెన్ వర్మతో చెప్పిన ఈ మాట  మన మూల పురుషుడెవరో చలికాచుకుంటూ చెప్పిన మాటలా అనిపించింది. మన పూర్వులంతా సంచారులే కదా. కొందరు ఎక్కడిక్కడ ఆగిపోయారు. ఇంకొందరేమో ఆగడం నేర్చుకోలేక సంచరిస్తూనే ఉన్నారు. ఈ కథలోని సంచార తెగల్లా!!!

0 comments:

Post a Comment