Sunday, 17 April 2016

అసమర్ధుని ప్రేమలేఖ - 5


ఆత్మైషీ,

ఎంతకాలమయ్యిందో కదూ ఇలా లేఖ రాసి. అయినా రాసి ఏమి ప్రయోజనం లే. నా లేఖలూ నా రాతలూ నువ్వు అసలు చూడవు కదా అభిరుచులని కాదని అక్షరాల వెంట పరిగెట్టటం చాలా కష్టం కదూ.

అక్షరాలుగా రాయకపోతేనేం క్షణం క్షణం లోలకమై కొట్టుకుంటున్న గుండె చప్పుడుని వింటుంటే తెలియటం లేదూ క్షణానికో మారు నిన్ను నాలో ప్రతిధ్వనించుకుంటున్నానని. తెలిసినా ఏం చేస్తావులే, ఒక్క నవ్వు నవ్వుకుని మళ్ళీ నీ పనుల్లో నువ్వు ఉంటావ్ అంటే కదా. అదే నిజం కదా

అందరికీ నేనోరాయినిరా రాయినిరా నీ దగ్గర మాత్రమే నేను తడిగా మారతాను. నీ వేదనలోకి ఒక మాధుర్యాన్నై ప్రవహించాలనుకుంటాను. ఎంత వడిగా నిన్ను చేరినా, ఎక్కడికక్కడ నువ్వేసిన ఆనకట్టలు నన్ను శిలగా మార్చేస్తాయేమో భయంగా ఉంది. చాలా భయంగా ఉంది. నాకు శిలగా మారాలని లేదు. నీలో లయం అవ్వాలని తప్ప.

మనసంతా సాంధ్యవర్ణాల ఆవరింతలో ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళ ఆత్మీయ పలకరింపు ఒక్కటి చాలదూ కాంతి తీరమొకటి కాళ్ళ కిందకి నడచివచ్చినంత ఆనందంలోని త్రుళ్ళటానికి.

మనసులో ఉన్నదంతా అక్షరాల్లోకి ఒలికించేసాకా, లోనంతా ఖాళీ నాకు నేనుగా ఎప్పటికీ నింపుకోలేని ఖాళీ తనమది. నీ నిశ్శబ్దం వెలివేయబడ్డప్పుడే మళ్ళీ నిండే మంజూషమది. ఒక్క చీకటి చినుకు వేవేల కాటుక వర్ణాలద్దుకుని నిశికి నల్లరంగేసినట్లుగా, నీ ప్రతి మౌనం వేల విస్ఫోటనాల ధ్వనిగా నా హృదయాన్ని చిధ్రం చేస్తుంది.

గుండెలోని ప్రేమ వర్ణాలన్నీ వివర్ణమయ్యాయని తడుస్తున్న కనురెప్పల వాసన ఏ సాలీడుకో బాగా నచ్చినట్లుంది, నాలో ఒక సాలె గూటిని అల్లేస్తుంది నా అచేతనాన్ని గుర్తించిన తన చైతన్యం ఎంత గొప్పదో కదరా?

నిన్న కన్న కలలన్నీ మళ్ళీ కందాం అంటే ఎంతగా మొరాయిస్తున్నాయో నీకేం తెలుసు, నిన్నటి కలల్లో మత్తైన నీ మాట ఉంది, మనసైన అక్షరాలు ఉన్నాయ్. ఇప్పుడేమో కలలన్నిటిలో అర్ధం కాని మౌనమే. యుగాలు పయనం చేసి వచ్చిన ప్రేమ సవ్వడి ఒకటి కాసేపు సందడి చేసి మత్తుగా నిద్రపోతున్నట్లు ఉంది. నిజం రా...

మళ్ళీ మళ్ళీ నిన్నటి పేజీలన్నీ చదువుకుంటున్నా. అక్షరాలు ఎంత కమ్మగా నవ్వుతున్నాయో తెలుసా? ఇదిగో ఇపుడు ఖాళీగా పేరుకుపోతున్న ఈ కాగితాలని చూసి వాటికెంత ఎగతాళిగా ఉందో. మౌనరాట్నం పై నువ్వు వడుకుతున్న నిశ్శబ్దపు పోగులు ఇంతగా పేరుకు పోతుంటే మదిని వడకట్టడానికీ తలపులు మొరాయిస్తున్నాయి.

నా ఈ మనసంతా ఒక చకోరాంశరా నీ మాటల చినుకులనే తాగుదాం అనుకుంటూ నిన్నే తన ఏకైక స్వార్ధం చేసుకుని గడిపేస్తుంది. ఈ స్వార్ధం నిన్నేప్పటికి చేరుతుందో చూడాలి మరి.

రాసే కొద్దీ గుండె గద్గదమౌతుంది. చేయి ముందుకు కదలనని హఠాయిస్తుంది. శిథిలాల్లోనూ రావి మొక్క చిగురిస్తుందంటారు. ఈ రావికి వసంతం మాత్రం నీ చిరునవ్వులో విరబూస్తుంది. ఈ నిజం నీకు తెలుసు. నీకు మాత్రమే తెలుసు. మళ్ళీ నువ్వు రాక ముందు ఉన్న శూన్యాన్ని రచించుకునే ఓపిక ఐతే లేదు. ఈ సారి శూన్యమంటే ఇంకెప్పటికీ నేనుగా మిగలని ముక్తాయింపే.

ఒక్కసారి రచించబడ్డ క్షణాన్ని చెరిపెయ్యటం ఎంత అసాధ్యమో, చిధ్రమైన మనసుని అతికించడమూ అంతే అసాధ్యం. నిన్నటి పుస్తకంలోని పాత పేజీని నువ్వూ చదివి చూడు. ఎందుకు చెప్తున్నానో బాగా అర్ధం అవుతుంది.
ఇదంతా రాసింది నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదురా. నిన్నటి స్మృతుల్లోకి నిన్ను పయనం కట్టించాలని నీలో మళ్ళీ నన్ను చదువుకోవాలని...

ఆత్మైషికంటూ అయిదు నిమిషాలూ మిగలని కాలయంత్రాన్ని కౌగిలించుకున్న నా ప్రాణమా చివరగా ఒక్కటి చెప్పనా రా

నా ముగింపు వాక్యానికి నీ ఊపిరి చెమరింత తాకాలి
 
నీ

ఆత్మైషి

1 comments:

చిన్నప్పటి ఉత్తరాల వేళని కళ్ళ ముందర గిర్రున తిప్పింది. విషయంలోకి వెళితే- లోకంలో ఇంత ప్రేముంటుందా అని బోలెడు ఆశ్చర్యమేసేసింది. బతకని బిడ్డ బారెడు పొడుగని- విషాదాంతపు ప్రేమలింత శక్తిమంతంగా గుండెని పిండుతాయేమో!

Post a Comment