Sunday, 14 February 2016

ఒక అసంపూర్తి వచనంలోతలుపులు తెరచుకున్న రాత్రి నిండా కూరబడ్డ ఒకానొక బానిసత్వాన్నై ఒక మిథ్యా సమయాన్ని కలగంటున్నప్పుడు మిథ్యని మిథ్య చేస్తూ ఒక ఊపిరి నాలోకి ప్రవహించింది.  కలని దాటేసాక నాలో ఇంకిన ఆ ఊపిరి భౌతిక శ్వాసల స్పర్శ  కోసం కొన్నాళ్లుగా… కొన్నేళ్లుగా  అవిశ్రాంతుడినై నే నిరీక్షించిన సమయాలంటే నాకెంత ఇష్టమో తెలుసా… అనుక్షణం నీ ఉనికిని ఊపిరిస్తూ నా ఊపిరిని భద్రంగా చూసుకున్నాయని…!

నిజం… కళ్ళకంటుకున్న ఉదయం మనసుకద్దుకునే క్షణం కోసం ఎన్ని రాత్రిళ్ళు వేచిచూస్తేనేమిరా ఒక నిజమైన ప్రభాతమెంత ప్రభావవంతమో నువ్వు ఎదురు పడిన వేళని స్పర్శించాకే తెలిసింది.

గాటు పడ్డ గుండెమీద వెన్న రాసినట్లుగా ఒక నిశ్శబ్దం మీద పరచుకుంటూ వస్తున్న శబ్దం నీదైనప్పుడు గుండె పొరల కింద గొంతు విప్పలేని ఉరకలెత్తే ఒక అలజడి చేసే సందడిని చెప్పగలిగేంత అక్షర జ్ఞానం  నాకు అబ్బలేదేమో,  కానీ అలలు అలలుగా ఆ పొరలని తడుముతున్న నీ అణువణువుకీ నా భావ జ్ఞానం అందుతున్న సడి నాకు తెలుస్తూనే ఉంది.

ఒక్క చేతి స్పర్శతో ఒకరిలోకి ఒకరం ప్రవహించిన సవ్వడి ఇంకా ఇంకా వినవస్తూనే ఉంది. నులి వెచ్చని స్పర్శతో నాలోకి నువ్వు పంపింది మైకాన్ని కాదు... నాకు నువ్వున్నావన్న సందేశాన్ని.  ఇంతకంటే  ఇంకేం కావాలిరా నాకు?

నా హృదయం పై నువ్వు చేసి వెళ్ళిన సంతకం ఒక్కటి చాలు వెలుగారని లిపి ఒక్కటి జీవితాంతం నా మీదుగా ప్రవహించటానికి.

నువ్వెళ్ళిపోయిన మైళ్ళ దూరాల కొలతల నిండా నా శ్వాసలు వెలిగించిన దివ్వెల వెలుగులు విరజమ్ముతూ ఉన్నాయ్ కదూ. అది చాలదూ ! మన శ్వాసల కుండ మార్పిడి జరిగిందని తెలియడానికి...

నీకూ నాకూ మధ్య ఎంత దూరం అని ఎవరైనా అడిగితే ఎంత నవ్వొస్తుందో తెలుసా…? ఎందుకురా మనుషుల్ని దూరాలతో కొలుద్దామని చూస్తూ ఉంటారు చాలా మంది. దూరాన్ని బట్టి మనుషులు, మనసులు దగ్గరైతే బహుశా ప్రపంచం ఈపాటికే దగ్ధమై ఉండేదేమో…!

నిజంగా భౌతికపు  దగ్గరితనాలూ… దూరాలు మనసుల్ని శాసిస్తాయా?
ఎంత దగ్గరైతేనేం ? మనసులు సమాంతరంగా కదిలిపోతుంటే…
ఎంత దూరమైతేనేం? ఆత్మలు ఒక్కటై పెనవేసుకుపోతే...

మనఃస్థల కాలాలు ఒక్కటయ్యాక  దూరాలెప్పుడూ భారం కాదు. ఇది నిజంగా నిజం…   ఒకటి చెప్పు… ఒక్క చిరునామా కోసం గతానికి వెళ్లి స్మృతుల వనంలో వెదకటం కన్నా పెద్ద దూరం ఏదైనా ఉందంటావా?

చీకటిని చిదిమేసిన కాంతివానవై నాలో నిండుగా నువ్వు కురిసేసాక, ఎన్ని ఏకాంతాలని సవరించుకుంటున్నా… అన్నిటికీ సరిహద్దులు గీస్తూ నువ్వే కనిపిస్తున్నావ్...

కొన్ని ఇష్టమైన పుటల్లో నే రచించుకున్న వేళల నిండా నిన్ను స్వార్ధం చేసుకున్నాక నన్ను రాసుకోవడానికి ఖాళీతనం అంటూ మిగలలేదు.


అయితేనేం... ఒక అసంపూర్తి వచనంలో తల్లడిల్లిపోతున్న తడియారని హృదయ లేఖపై కొన్ని నవ్వుల ముద్రలేసి నువ్వు పూరించిన చేవ్రాలు ఒక్కటి చాలు నీలో నన్ను చూసుకోవటానికి…!

1 comments:

ప్రతి అక్షరం ఓ తృప్తిని అడ్డుగా పెట్టుకొని నిరాశతో శక్తికొద్దీ పొరాడుతున్నట్లనిపించింది...

Post a Comment