మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 18 January 2015

తెలుగు తేజం

యుగ పురుషా…
తెలుగు జాతి తేజమా…

ఈ రోజు  మా  కంటి తడికి  మాటొస్తే … అది స్వర్గాన  ఉన్న నీకు  వినిపిస్తే  మళ్ళీ  ఈ తెలుగు జాతి కోసం  బొందితో దిగి వస్తావేమో… ఇది కలకావొచ్చేమో  కానీ  ఎందరి  మనస్సుల్లోనో  గత 19 వత్సరాలుగా సజీవం గా  ఉన్న ఆశ.  

అసలు నిన్ను ఎలా ఇష్ట పడాలి మేము  ఒక నటుడిగానా  లేదా  ఒక నాయకుడిగానా? ఎలా…?  తెలుగు జాతి వరకూ  దేవుడెలా  ఉంటాడో చూపిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడివి నీవే…  ‘సమాజమే  దేవాలయం , ప్రజలే  దేవుళ్ళు’ అంటూ మాటలతో మాత్రమే కాక  చేతల్లో చూపించిన  నిజజీవిత  కథానాయకుడివీ  నీవే...

ఎందరో నటులు   వచ్చారు , వస్తున్నారు  వచ్చినట్లే  పోతున్నారు …  కానీ  ఏ  కొందరో  శాశ్వతమవుతున్నారు …  ఆ కొందరిలో  నువ్వో  మేరునగధీరుడివి.  కేవలం  నటుడివైతే  ఇది  సాధ్యమా?  

రాయల సీమ  కరువులో…  ఇండియా పాకిస్తాన్  యుద్ధ సమయంలో  దివిసీమ  ఉప్పెనలో … ఇలా  జాతి  కష్టాల్లో  ఉన్న ప్రతిసారి  నాయకుడివై  చలన చిత్ర సీమని ఒక్క తాటిపై  నడిపించి...  కేవలం  ముఖానికి రంగులేసుకునే  నటుడిని మాత్రమే  కాదని  జన్మతహా  నాయకుడినని  ఆనాడే  నిరూపించావ్.

తమ పార్టీ కి  ఉపయోగ పడతారు అనుకుంటే  చాలు  అవార్డుల పందేరం  చేస్తూ ఎవరెవరికో   భారత రత్నాలు  ఇచ్చేస్తున్నారు. భారత చలన చిత్ర సీమలో  దాదాసాహెబ్ ఫాల్కే…. పద్మభూషణ్ … పద్మ విభూషణ్  లాంటి  అవార్డులెన్నో  పొందిన  చలన చిత్ర  ప్రముఖులందరూ  ప్రతిసారీ మహా నటుడిగా  తలచుకునేది నిన్నే… అయితేనేం  హస్త  సాముద్రికాలతో  అరచేతుల్లో  స్వర్గం  చూపించేసిన  రాజకీయులు మాత్రం  నీ  విషయంలో  తాము  నిజంగా నే   మిథ్య  అనే  అనుకున్నారేమో  ఏ అవార్డులనీ  నీ దరి చేరనియ్యలేదు.  

అయినా గానీ వారి పిచ్చిగానీ  ఒక  కాగితపు ముద్రతో … ఒక  లోహపు  ముక్కతో  ఏ  మనిషినైనా  జనం గుండెల్లో  శాశ్వతం  చెయ్యగలరా?   ఒక  అశోక  చక్రవర్తి, ఛత్రపతి  శివాజీ, శ్రీ కృష్ణ  దేవరాయలు, రాణి రుద్రమదేవి ఇలాంటి వాళ్ళంతా  శతాబ్దాలుగా జనం గుండెల్లో  ఎలా  శాశ్వతమయ్యారు?  అలాంటి  మహనీయుల  వారసుడివి  నీవు. అయినా గానీ ఎక్కడో భూమి పొరల్లో దాగుండే రత్నానివి కాదు నువ్వు...  నిత్యం వినువీధిలో తెలుగు జాతి  పతాకాన్ని  రెపరెపలాడించే ధృవతారవు.

"దేశమదేల యన్న దేశంబు తెలుగేను
యెల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
యేను తెలుగు వల్లభుండ తెలుగొకొండ
దేశ భాషలందు తెలుగు లెస్స"  

అని శతాబ్దాల క్రితమే  దక్షిణ భారత సార్వభౌముడైన శ్రీ కృష్ణ  దేవరాయలంతటి సకల కళా వల్లభుడిచే శ్లాఘించబడ్డ  తెలుగు భాషా / తెలుగు జాతీ కాల క్రమేణా మదరాసీలుగా పేరు పడితే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపి తెలుగోడి సత్తాను సరి కొత్తగా ప్రపంచానికి  చాటి చెప్పిన పౌరుషాగ్ని జ్వాలవి నువ్వు.

చలన చిత్ర రంగంలో నువ్వు రారాజుగా ఉన్నప్పుడు... తిరుపతి వెంకన్నకు మొక్కు  తీర్చుకుని అటునుండి అటు చెన్నపట్నం వచ్చి నిన్ను దర్శించుకుంటేనే ఆ యాత్ర ముగిసేది అన్న వార్తలు చదివితే  జనాల గుండెల్లో నువ్వేంటో అర్ధం అవుతుంది.

33 ఏళ్ల చలన చిత్ర రంగంలో ….

‘పురాణ పాత్రల్లో దివ్య మంగళ స్వరూపంతో దైవాంశ సంభూతునిలా
జానపద చారిత్రాత్మక పాత్రల్లో   పోతపోసిన పౌరుషం నిండిన ధీరోదాత్త నాయకునిలా
సాంఘిక చిత్రాలలో సమాజానికి చక్కనైన ప్రతినిధిలా ‘

మూడు వందలకు పైగా  చిత్రాలు… పదుల కొద్దీ  పాత్రలు… పాత్ర పాత్రకీ  ఏంతో వైవిధ్యం… నాయకుడి గానూ ప్రతినాయకుడి గానూ  మెప్పించిన అనితర సాధ్య నటనా వైదుష్యం… ఎవరికి సాధ్యం నీకు తప్ప

13 ఏళ్ల రాజకీయ రంగంలో

అసలు సిసలు ప్రజానాయకుడివి సమకాలీనుల్లోనే కాదు ఇప్పటికి కూడా తెలుగు  జాతి లో ప్రజాదరణలో ఎవరైనా నీ తరువాతే.  వటవృక్షం లాంటి కాంగ్రెస్స్ పార్టీని నెలల బాలుడిగా మట్టి కరిపించిన మేరునగధీరుడివి.  

ఏ జాతి మనుగడ  అయినా స్త్రీ జాతి మీదే ఆధార పడుతుంది అని నువ్వు ఆడపడచులు అని పిలుచుకునే  మహిళలకి ఆస్తిలో హక్కు ఉండాలని చట్టం చేసిన మహిళా పక్షపాతివి. అలాగే మహిళల కోసం ప్రత్యేక  విశ్వవిద్యాలయం నీ పుణ్యమే కదా...

బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి బడుగు బలహీన వర్గాల  వారికి రాజకీయంగా ఉన్నత స్థానాలు కల్పించావు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో పధకాలు…

అసలంటూ తెలుగు గడ్డ మీద మార్పు మొదలయ్యింది నీతో. తెలుగు జాతి నరనరాల్లో చైతన్యం నింపింది నువ్వు .  

గుండె గుండెలో ఒక ఆర్తిలా దాగున్నావ్… కంటి కంటినీ ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉన్నావ్.  దిగంత లోకాలలో దివ్య తారల నీరాజనాలు అందుకుంటూ ఉండి ఉంటావ్… రెండుగా చీలిన నీ తెలుగు జాతి నిండుగా వెలిగేలా  రెండు కళ్ళతో కనిపెట్టుకుని ఆశీర్వదిస్తూ ఉండి ఉంటావ్.

ఎవ్వరేమనుకోనీ... నువ్వే నాయకుడివి...

నువ్వున్న కాలంలో మేమూ ఉన్నాం…  ఒక చారిత్రిక పురుషుడిని  మేమూ  చూసాం  అన్న తృప్తి  చాలదూ  మా జీవితాలకి.

తరతరాల తెలుగు చలన చిత్ర  / రాజకీయ రంగంలో సరిలేరు  నీకెవ్వరూ …  జనం  మెచ్చిన  ఒకే ఒక్క నాయకుడివి  నువ్వే...

తెలుగుజాతి కోసం  తెలుగు భాష  కోసం  ఆ దేవదేవుడు  అందించిన  సమ్మోహన  అస్త్రం ...  నందమూరి తారక రామాస్త్రం...

తారక రామా...అజరామరం నీ కీర్తి... దిగంతాల్లోనూ నీతోనే తెలుగుకు ఖ్యాతి...!

తెలుగు జాతి గుండెల్లో నీ రూపం శాశ్వతం...

ఓ యుగ పురుషా... తెలుగు జాతి ఉన్నంత వరకూ నువ్వు ‘మృతంజీవుడివే’

మళ్ళీ నీ ఊపిరి చప్పుడు కావాలట తెలుగు జాతికి... తారక రామ తేజమై రా!

ఇట్లు

ఓ


తెలుగోడు

(నందమూరి తారక రాముడి ౧౯వ వర్ధంతి నివాళులు)


Sunday, 11 January 2015

హేమంత స్పర్శ - 5


నిత్య హేమంతమా...

ప్రతి ఉషోదయాన నీతో కలసి భానుని  ఉదయ కిరణాలలో తడుస్తూ  అనంత వాయు గానాలలో లీనమై పోతూ నడుస్తున్నప్పుడు   తమ కిల కిలా రావాలతో ప్రకృతికే  మేలు కొలుపుతున్న బుజ్జి బుజ్జి పిట్టల  ఇచ్చే సాదర స్వాగతం  ముందర ఎన్ని స్వర్ణ కంకణ సత్కారాలూ  ఏ మూలకి?

నీకో సంగతి తెలుసా..?

ఎప్పటికప్పుడు నీకేదో చెప్దాం అనిపిస్తుంది… కానీ చెప్పటానికి గుండె  పెగలదే… చెప్పాలనుకున్నది ఒకసారి చెప్పేసాక ఇక చెప్పటానికి ఏమీ ఉండకపోతే… నీకూ నాకూ మధ్య ఏదైనా శూన్యం వచ్చి  ఆక్ర మించుకుంటుందేమో  అన్న భయం నా పెదాల మీదే నిలిచి ఉంటుంది మాటల్ని తూలనివ్వకుండా…

గుండె సవ్వడికి పెదవి చప్పుడికి సమన్వయం కుదిరిన మనిషి పయనం ఎప్పుడూ ఆహ్లాదమే కదూ…

శ్రావణ మేఘాల్ని దాటి కార్తీకపు కోనేటిలో మునిగి  హేమంతపు తుషారంలో తడుస్తున్నప్పుడు చిగురుటాకుల్లా వణుకుతున్న దేహాల దాహాల్లో కోరికల తీర్ధం పోసి వేడుక చూస్తున్న ఏకాంతపు స్పర్శ ఎంత బాగుందో కదా….

ఏ గుండె కథ చూసినా ఏ మనసు వెత వెదకినా కనిపించే ప్రతి తడికీ కదిలిపోయే నీ కన్నీటి  రాత్రుల్లో  నన్నొక్కసారి  తలపుకు తెచ్చుకుని చూడు....  కలల లోకపు పసిడి ఊబిలో చిక్కుకు పోవూ నీ  కనుపాపల తెరలు…!

అసలెందుకో ఇలా ఇన్ని కథలు… వ్యథలు… బ్రహ్మ రాసిన నాటకంలో  కాసేపు వచ్చి  ఎవరి పాత్ర  వాళ్ళు  పోషించే  నటుల్లా అనుకుని చూడు… ప్రతి జీవితాన్ని ఒక కమ్మని కథలా ఆస్వాదించుకోవచ్చు కదూ… నవరస పోషణల్లో ఎన్ని రకాల  అభినయాలో. ఎవరికీ తాము నటులం అని తెలియదు కదా అందుకే   ఏదీ కృతకంగా అనిపించనే అనిపించక అలా సాగిపోతున్న పాత్రల చిత్రీకరణ చూడు… నైరాశ్యం దరిచేరదు బంగారూ….  


యాంత్రికాలన్నిటినీ వదిలించేసుకుని  చలచల్లని ప్రకృతిలోకి నును వెచ్చగా  సెలపాటలాడుతూ జారిపోయే ఒక సాయంకాలపు బద్ధకంలో నిన్నో వలయంలా చుట్టేసుకోవాలని ఉంది రా…

నిశ్శబ్దంగా మగతని తాగేస్తున్నా నేను...మధుర స్వరమై నువ్వు మత్తును పోత పోస్తుంటే…!  

మాటొక మధు ప్రవాహమైనప్పుడు సమ్మోహనాల వాగులన్నీ స్వరాస్త్రాలుగా మారి నీ గొంతుకలో సందడి చేస్తుంటే  ఏ నాగ స్వరాలూ నీ మాటకు సాటి వస్తాయంటావ్? ఎన్నిన్ని కబుర్లో  పరవళ్ళుగా మారి నా చెవి చేరుతుంటే  దేహమంతా చైతన్య రహితమై మనసంతా మత్తిల్లుతూ  నీ పెదవుల నర్తనాన్ని మౌనంగా అవలోకిస్తూ  నాలో నుండి నేను  స్రవించే  ఆనందం  ఉంది  చూశావూ… వినటం కాదు ఒక్క సారి ఆ అనుభూతిలోకి ఒలికి చూడు… నీ విద్వత్తు ఏమిటో నీకే అవగతమవుతుంది.

ఓ వలయంలో చిక్కుకుని పరుగెడితే ఆపలేని బతుకు పందెం కన్నా తాపీగా తేనె తాగినంత మధురంగా జీవితాన్ని ఒంపేసుకుందాం… ఏమి కావాలి మరి ఆ మధురానికి?  కాసిన్ని పగళ్ళు…. ఎన్నో సాయంత్రాలు… మరెన్నో నిశి రాత్రులు… ఇంకెన్నో పొద్దు పొడుపులు…

ఆ కాసిన్ని పగళ్ళలో కాయాన్ని బతుకులోకి  నెట్టేద్దాం… ఆ దేహాల్ని సాయంత్రాలలోకి లాగేసుకుని అలసటలన్నిటినీ  మన ఊసులతో చెరిపేద్దాం. నిశిరాత్రుల్లో నిద్రని చీకట్లో పారబోసి వెన్నల  మొత్తాన్నీ కళ్ళకి కప్పుకుని పచ్చిక  దుప్పటిని నలిపేద్దాం. తొలి పొద్దు పొడుపులో రాలి పడుతున్న తుషారాలన్నిటినీ గొంతులోకి ఒంపుకుంటూ హేమంతాన్ని గుండెల్లో దాచేసుకుందాం…

నీ


నేనే...

Friday, 9 January 2015

హేమంత స్పర్శ - 4

నా జీవమా...

ఆకాశం రాల్చే వెన్నెల ముక్కలనే మంచెగా ఎంచుకుని జలపాతపు ఒడ్డున సెలపాటల రాగాలతో   జంటగా జావళీలు పాడుకుంటున్నప్పుడు ఒకరి చూపుల సుగంధాలనింకొకరం పీల్చుకుంటూ  మాటలు మత్తిల్లుతుంటే తుళ్ళి పడే తనువుల జాగారంలో రేయంతా నువ్వు  కడిగేసిన నా నిద్ర పగలంతా  రెప్పల పైన కూర్చుని  వాలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా కళ్లపై నువ్వేసే పెదవి ముద్రలలో జీవితాన్ని అనుభూతించాలని ఉంది.

తెల్లటి నెమలీకల్నిగుదిగుచ్చిన వెన్నెల విసనకర్ర విసిరేటప్పుడు వచ్చే పరిమళాల సమీరాల్లో మనం క్రీడిస్తూ  నారికేళపాకంలా అనిపించే జలాన్ని నింపుకున్న తటాకాలలో రాయంచలమై స్నానిస్తూ  ఏక తీరుగా మన ఏకాంతాన్ని  
హత్తుకుందామనే నా కోరికలోని స్వార్ధం  నీకూ ఎంతో ఇష్టమే కదూ…

హిమవత్పర్వతాలలోని దేవతా వనాల సౌందర్యాన్ని అమృతంలో కలిపితే వచ్చినంత మత్తులో ముంచెయ్యదూ...ఇష్టమైన  పలకరింపులోని  మాటల మాధుర్యం…

ఎంత చందనం కరిగిందో నీ మేనిలో… ఎన్ని మల్లెలు తాగావో గొంతులో… మాటగా తొలికినా   మౌనంగా  నడచినా   పరిమళమే రాలి పడుతూ ఉంటుంది.
ఎప్పుడూ చెప్పేదే అయినా మళ్ళీ మళ్ళీ  నాకు చెప్పాలనిపించే మాట ‘ నీతో  కలసి  బతకాలనేది  కాదు నా కోరిక…  నీలో కలసిపోయి  వసించాలని…’ నీ కణకణంలో అణువు అణువుగా  నేను ఇంకిపోతూ జీవితం చూడాలని ఉంది.

కొన్ని క్షణాలు ఉంటాయి చూడూ… వాటికి వేరే పని ఏమీ ఉండదు… నన్ను నీలా నిన్ను నాలా చూడాలనుకునే ఆశ  తప్ప. మన  ఇద్దరినీ ఒకే ఏకత్వంలో చూడాలనుకునే తపనని వెంటేసుకుని మనల్నే ఆవరించుకుని కావలి కాస్తుంటాయి.   

నువ్వు తాకని నా రోజులో యుగాల ప్రయాణం చేసే ఆ క్షణాల మీద జాలి నీకే మాత్రం ఉన్నా నాలో కొచ్చి వాటిని  స్పర్శించవూ. నీ స్పర్శని పొందిన ఆనందం చాలదూ వాటికి... చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా వెలుగులీనటానికి?

నువ్వున్నంత సేపు నా అస్తిత్వం ఎటు కొట్టుకుపోతుందో  అర్ధం కాని సందిగ్ధంలో  నేనో అనుభూతిగా  మారి  నిన్ను హత్తుకుపోయే ఉంటాను. లేకపోతే ఏమిటి మరి?  నువ్వున్నంతసేపు అసలు ప్రపంచమే కనిపించని నాకు… నువ్వు పక్కన లేని పగలంతా వెచ్చని చెమటగా కారిపోతూ ఉంటుంది. జంట నిట్టుర్పులతో మత్తిల్లే రాత్రి నువ్వు  లేనప్పుడు  ఏకాంతంగా నా కంట్లో కురుస్తూ ఉంటుంది...  

పగలూ రాత్రీ శత్రువులై  నా మీద చేసే యుద్ధం లో నీ తలపొకటి  వస్తే  చాలు… అది ఇక బ్రహ్మాస్త్రమే…  పాపం రేయింబగళ్ళు   పిచ్చుకల్లా మారిపోతాయ్… ఒద్దికగా ఒక మూల కూర్చుని  వణికి పోతూ...

నువ్వు లేనప్పుడు ఏదైనా ఒక సాయంత్రం అలా ఏటి ఒడ్డుకు షికారుకి వెళ్లి కూర్చుటానా… అవిశ్రాంతంగా పరుగులు పెట్టే ఆ చక్కటి నదీ పాయవై నువ్వే అగుపిస్తూ ఉంటావ్. చల్లని ఆ నీటి జాలులో వెచ్చగా  ఒదిగి పోయి  నిన్ను  ఆవరించుకోవాలని అనిపిస్తుందప్పుడు. వడి వడిగా వచ్చి ఏట్లో వెచ్చగా నన్ను ఒంపుకుంటూ నీ కోసం చూస్తానా… అక్కడ ఉండవే… మరెక్కడా అని చూస్తే వెన్నెల రజనులా మెరిసిపోయే ఏటి ఇసుకలో  వళ్లారా స్నానం చేస్తూ  ఆకాశాన్ని తెరగా చుట్టేసుకుని కనిపిస్తావ్…

అప్పుడు గానీ అర్ధం కాదు నాకు నేను చూసేది  నిజమైన నిన్ను కాదని నా ఊహలకి  ఊపిరిచ్చుకుని నేను  ఆ  క్షణాల్లో జీవం పోసిన నీ  భ్రమల రూపాన్నని.  నీ భ్రమల బొమ్మని చూస్తూ కూడా జీవితాన్ని ఆస్వాదించటం అలవాటు చేసుకున్న నన్ను ఆ నిమిషంలో ఎవరైనా చూస్తే నన్నో పిచ్చివాడి కింద జమకడతారేమో…  నిజమే ఊహల్లో నీతో కలసి వేస్తున్న అడుగులు… నీ సంతోషాల  నుండి  రాలి పడుతున్న నా నవ్వులు బయటి వాళ్ళకి పిచ్చితనంగానే తోస్తాయి కదూ…   

తప్పేముందిలే… జీవితాన్ని నిజంగా ఆస్వాదించ గలిగేది  మనసైన ప్రేమికులు… మరియు పిచ్చివాళ్ళే…

భావాల పందిరికి ఒక్కసారైనా అల్లుకోలేని మానవ యంత్రాలకి మనమెలా కనిపిస్తేనేం… నిజానికి ప్రకృతి సౌందర్యం ఆస్వాదించలేని ఆ సజీవ ప్రాణ యంత్రాలు కదా అసలు సిసలు పిచ్చివాళ్ళు.  

నీ


సురేష్

Wednesday, 7 January 2015

అంటుగట్టిన మనఃస్పర్శ

ప్రియమైన నీకు,

ఇంత కాలానికా లేఖ అని కోపమా.... 

నీ ముఖానికి కోపం అసలు బాగోదమ్మడూ… దరహాసాలన్నిటినీ దండగుచ్చి  నీ  పెదాల మీద  చిలకరించినట్లే ఉంటావ్ నువ్వు… అలా ఉంటేనే  నువ్వు అందంగా ఉంటావ్…

ఏయ్… పక్కకి చూడక్కర్లేదు అక్కడ ములగ చెట్టు లేదులే… నేను నిన్ను ఎక్కిస్తున్నాను అనుకోవటానికి. నీకు తెలియదూ నేను ఎప్పుడూ నిజాలే చెపుతానని.  

ఏదో  ఒక ఉత్తరం రాయటం ఎంత సేపురా? కానీ ఏదో ఒకటో రాసేసి నేను పోస్ట్ డబ్బాలో పడేసి అందుకున్న నువ్వు ఓ క్షణంలో దాన్ని చదివేసి  ఇంటి వసారాలో కట్టిన ఉత్తరాల తీగకు దాన్ని గుచ్చేసి…. ఉహూ తలచుకుంటుంటే నాకు మన ఇద్దరి మనసులని కలపి అక్కడ గుచ్చేసినంత బాధగా ఉందిరా… నీ గురించి ఒక్క వాక్యం రాసినా  చిత్తుకాగితం సైతం అమూల్యమవుతుంది నాకు. పరమ పద సోపానపటంలో ఎప్పుడూ నిచ్చెనలెక్కితే  వచ్చేంత  ఆనందం  నా చేతిరాతతో నీ పేరు రాస్తున్నప్పుడు  వస్తుంది… ఆ ఆనందాన్ని కొంచెం చదివి చూడవూ… దాని నిడివి కొలిచి చెప్పవూ… తెలిసింది కదూ  నీతో  నా  ఆనందం నీ మనసంత లోతని.

క్షణంలో  వెలిసిపోయే అక్షరాలు ఎన్ని రాసి ఏమి ప్రయోజనం… రాసిన కాగితం చెదపట్టినా… అక్షరం మదిని చేరి తలచినంతనే అలవోకగా అనుభూతిగా  మరల మరలా హృదిని మీటేలా రాయాలి….

మాటమీద మౌనాన్ని కప్పెట్టి  నిశ్శబ్దాల తపస్సు  చేసే నాకు  ఏ శబ్దమైనా  నువ్వే… నిశ్శబ్దపు సడిలో నీ శబ్దాన్ని వింటూ అలౌకిక స్థితిలోకి నేను చేసే ప్రయాణాన్ని అక్షరీకరించటం నీ ఊహలు నాలో వర్షిస్తున్నంత  సులువు కాదు కదా… 

నా  లేఖ అంచున అంటిన తడి ఏమిటో  తెలుసా… 

ఏయ్… పిచ్చీ… అది కన్నీటి తడి  కాదురా… నీ  కళ్ళల్లో  నదులు  పారటానికి…. ఆ తడి ‘నిన్నటి మన క్షణాల జ్ఞాపకాల  స్పర్శ…. మన  రేపటి  ఆశల  తాకిడి… వర్తమానమై కురిసిన ఆనందం …! ‘

నిన్నటి హేమంతపు ఉదయాలల్లో మొదలైన మన ఊసులు  సాయంత్రాలలో నీ జతలో  వెచ్చని అడుగులుగా మారి రాత్రులన్నీ నాలో  వేస్తున్న కలల  ముద్రలని  నీకు చేరవేసే  నీ మది మంజూషంలోని  స్మృతుల  ఖజానాలో  చేర్చి  మరల మరల నీ మధుర శ్వాసలలో ఊపిరి తీసుకోవాలని నా చిరు ఆశ....! 

బాగా నడిచినంత సేపు  చాలా  తేలికగా  కనిపిస్తుందీ కాలం.  గతి తప్పిన ఒక్క అడుగు చాలు కదా  కాలం  తన  మహిమ చూపి ఎద బాటని  ఎడబాటుగా మార్చటానికి…! కాదంటావా... చెప్పు మరి…  లేకపోతే ఏమిటి మరి  పక్క పక్కన కూర్చుని శంఖులాంటి నీ మెడ మీద వెచ్చని ఊపిరిలడ్డుతూ చెవిలో ఎన్నో గుసగుసలాడాల్సిన  నేను  ఇక్కడ… నువ్వు అక్కడెక్కడో… అక్షరాలలోనే అనుభూతులన్నీ చవి చూసుకుంటూ....!

ఒక్కటి మాత్రం నిజంరా… కాలం ఎంత గొప్పదైనా కావొచ్చు కానీ నీ మీద నా ప్రేమని ఏ నాటికి తుంచలేదు… దేహాలనైతే వియోగించగలడేమో కానీ మనసుల సంయోగాన్ని ఏ కాల పురుషుడు మాత్రం కాల రాయగలడు…?  కాలంతో మరుపు సహజమే అన్న నానుడి అందరికీ అన్ని సార్లూ  వర్తించదు కదూ … కొందరి విషయంలో కాలంతో  కొన్ని స్మృతులు మరింత గాఢంగా మనసుని పెనవేసుకుపోతూ గడచిన ప్రతి క్షణాన్ని అమరం చేస్తాయి. 

భౌతికంగా ఒక్క చోటున లేమని తప్ప నిజంగా మనకేమి లోటురా… ఖాళీగా ఉన్న ప్రతి క్షణమూ  ఒకరి మనసుతో  ఒకరం  భాషించుకుంటూ… ఖాళీ చేసుకుని మరీ కొన్ని క్షణాలకి మన ఊసులద్దుతూ.... మరి మన జీవితం మధురం కాదా చెప్పు…! 

జీవితాన్ని చదివేశాం … బతుకుని దోసిట్లో నీరు పోసి తాగినంత సులువుగా గడిపేస్తున్నాం అని చెప్పే వారి కళ్ళల్లోకి  ఒక్క సారి సూటిగా చూడు… మాటల్లో ఎక్కడా కనపడని నిస్తేజత అంతా అవే మోస్తూ కనపడతాయ్… ఎందుకంటే… వాటికి అబద్ధం ఆడటం రాదు పాపం… అయినా పరాయివాళ్ళకేం వంద చెప్తారు… నాలుగు గోడల మధ్యే ఉన్నా నాలుగు యుగాల దూరంతో బతికే వారే వారంతా…

అద్దం ఎదురుగా నిలబడి నీ కళ్ళని ఒక్కసారి చూసుకో… ఎంత తేజంతో  వెలిగిపోతున్నాయో  కదా… అది చాలదూ మనజీవితాలని చెప్పటానికి… 

మనమిద్దరం  పరాయి ప్రదేశాలలో ఉంటున్నామేమో కానీ మనసైన మన అనుభూతులెన్నడూ  పరాయీకరణ చెందవు రా… 

ఒక్కటి చెప్పనా... ఇక్కడున్నప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీ కూడా నాకు నీ ఊసులని స్పర్శించేలా  చేస్తుంది… తాను చెట్టుగా ఉన్నప్పుడు వసంతం చూసిన సంతోషం తనకి నీ గురించి నాకు చెప్పేటప్పుడు...అద్భుతం కదూ...  

నువ్వు  తాకిన ప్రతి  వస్తువూ నీ స్పర్శని  నా మనసుకు అంటుగట్టేసాయి… ఇప్పుడీ ఉత్తరంలోని అక్షరాల ద్వారా నేను నీలోకి కురిసినంత మత్తుగా…!  

ఉత్తరం ముగిసే సరికి ఇదిగో నీ నవ్వు కురుస్తున్న చప్పుడు నా హృదిని తాకుతూ… :) 

నీ

నేను 

Sunday, 4 January 2015

దేవుళ్ళూ…

దేవుళ్ళూ…

మీరున్నారు… నిజమే మీరున్నారు…!  

ఇంతకు ముందులా  దేవుడున్నాడా లేడా అన్న సందిగ్ధత  నాలో ఇప్పుడు లేదు. కాకపోతే మీరున్నారన్న జ్ఞానోదయం  కాస్త ఆలస్యంగా అయ్యింది స్వామీ… ఈ అల్ప జీవిని క్షమించెయ్యండి.

ఇంత అకస్మాత్తుగా  వీడికీ జ్ఞానోదయం ఏలనో అనుకుంటున్నారు కదూ…?  

కోళ్ళ కాళ్ళకి కత్తులు కట్టి కోడి పందాలాడుతూ పండగ  సంబరాలు చేసుకునే మనుషులం మేము.  అలా చేస్తున్నప్పుడు  మా కళ్ళల్లో  ఎంత ఆనందం... ఎంత  సంతోషం...  మేమలా చెయ్య గలుగుతుంది అవి  మా కన్నా అల్ప జీవులు కాబట్టే కదా… ఒక స్వజాతి  వాటిలో అవి కలహించుకుంటుంటే దానికైనా మెరుగైన జాతికది వేడుక  అనే కదా దీని అర్ధం.

మరి మీరు మాకన్నా బుద్ధి జీవులేగా.... మాలో మేము కలహించుకుంటుంటే మీకెంత వేడుకగా ఉండి ఉంటుందో కదా… 

మేము కోళ్ళకి కత్తులు కట్టి బరిలోకి  దింపినట్లు… పశువులకి ఎర్ర గుడ్డ చూపి ఒకదాని మీదకి ఉసిగొల్పినట్లు… గుర్ర్రాలనైతే డొక్కల్లో తన్ని పందెపు సవ్వారీ చేయిస్తున్నట్లు… మనుష్యులమైన మాకు కొన్ని మతాలు… కులాలు… వర్ణాలు… ప్రాంతాలూ అంటగట్టి ఒకరి మీద ఒకరు చేసుకునో మారణ హోమం మీకు  భోగి మంటలంత పసందుగా ఉంటాయనుకుంటా కదూ…

రక రకాల విద్వేషాలతో మనుష్య జాతి ఒకరినొకరు చంపుకుని చావటం మీకు క్రీడా వినోదమే కదూ… నిజంగా మీకు మేము ఆట వస్తువుల్లాంటి వాళ్ళం కాకపోతే ఎందుకు ఇన్నిన్ని మతాలూ… వాటిల్లో మరిన్ని శాఖలు… 

అన్ని మతాల సారమూ ఒక్కటే అంటారు…  ఏ మతానికి ఆ మతమే గొప్పదని  కొట్టుకు చస్తుంటారు. డబ్బుతో ఒకడు… హింసతో మరొకడు… సనాతనధర్మమంటూ ఇంకొకడు…. ఎవరికి వారు  తమలోకి కొత్త మనుషుల్నిలాక్కోవటం ఎందుకు?  నిజంగా మనిషి మనస్ఫూర్తిగా ఇష్టపడి ఎవరిని నమ్మితే ఏమి అనుకోరెందుకు…

‘ఇంత మంది అల్ప జీవులు మా  వెనక ఉన్నారని చెప్పుకుంటూ’ మీ లోకంలో ఆధిపత్యం కోసం  వెంపర్లాడే  రాజకీయ నాయకులేమో కదూ…

‘ఈ మనుషులున్నారు చూసారూ...  మన పేరిట రాళ్ళకి  రత్నాలు  తొడుగుతారు… చర్చికి విరాళాలు ఇస్తారు… మసీదుల్ని అలంకరింపచేస్తారు… కానీ వాళ్ళ తోటి వాళ్ళకి ఆకలేస్తే పట్టెడన్నం పెట్టేదెంతమందో చూడండి” అని మీలో మీరే మా గురించి నవ్వుకుంటారు కదూ… 

కాదంటారా చెప్పండి…?   

నిజంగా  మానవ జాతి క్షేమం కోసమే మేమున్నాం… మిగిలినవన్నీ మధ్యలో మనిషి కల్పించుకున్నవే  అని అంటారా? అలాంటప్పుడు మనిషికి మీరెందుకు? 

దారి తప్పుతున్న మనిషిన గాడిన పడెయ్యలేని దేవుళ్ళు మాకెందుకు?  

రోడ్డున నడవాలంటే భయం 
పార్కులో కూర్చోవాలంటే భయం
బడికి వెళ్ళాలంటే భయం
గుడికి వెళ్ళాలంటే భయం 
బొట్టు పెట్టుకుంటే భయం
టోపీ పెట్టుకుంటే భయం 
నల్లగా ఉంటే భయం 
తెల్లగా ఉంటే  భయం 
ఇన్ని భయాల మధ్య ఏ ధైర్యంతో  మీ మీద నమ్మకం పెట్టుకోవాలి… 

అప్పుడెప్పుడో భూమి మీద తెగ తిరిగేవాళ్ళట కదా మీరు… మరి ఇప్పుడు రండి  భూమి మీదకి… 

ఒక్కొక్కరుగా కాదు … 
ఒక్కొక్క యుగంలో కాదు…. 
ఒక్కొక్క ప్రాంతంలో కాదు…

అన్ని మతాలకీ  ప్రాతినిధ్యం వహిస్తున్న  అందరు దేవుళ్ళూ ఒకేసారి రండి… 

వీలైతే మీరంతా ఒక్కటే అని చెప్పండి… 

లేదా మీలో మీరు పోరాడండి... గెలిచిన దేవుడికే మానవజాతి సమస్తం ఊడిగం చేస్తుంది.  అంతే  కానీ   ఎన్నడూ  కానరాని మీకోసం మాలో మేము ఎందుకు  నరుక్కు చావాలి?

ఇట్లు...

ఒక మానవుడు 

Friday, 2 January 2015

నీ సమక్షపు నా తొలి క్షణం

రేయ్ హనీ.... 
అమృతంలా కురిసే నీ పలుకులతో  ఎడారిలాంటి జీవితానికీ  సరికొత్తగా వసంతాన్ని అద్దుతూ వచ్చిన వసంత సేనవే కదూ నువ్వు…
నిన్ను అలా అలా చూస్తూ ఉండి పోవాలి అని ఉందిరా!” అంటూ ఉంటావ్…
నీ మనఃమందిరంలోకి ఒక్క సారి చూసుకుని నిజం చెప్పు.... రోజూ నువ్వు నన్ను చూడటం లేదూ… మరి అక్కడ ఉన్నాను గా నేను. 
నా గురించి నేను అలోచించుకోవటం మానేసి ఎన్ని రోజులయ్యిందో… ఎందుకంటావా... ?  నా గురించి ఆలోచించటానికి నువ్వున్నావనే నమ్మకంతో… కాదా  మరి...
నువ్వు రాకముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నాకు గుర్తు లేదు… నువ్వొచ్చాక  నేనేమిటో ఆలోచించటానికి  నాలో  నేనుంటే  కదా….
నీకూ నాకూ ఎంత దూరమో నువ్వూ నేను అంత దగ్గర… మరి కాదంటావా…. చెప్పు?  ఒకటేమో  భౌతికం  మరొకటి  మానసికం. 
ఎక్కడెక్కడి మౌనం మూర్తీభవించిన నాలో నీ దగ్గర మాత్రం మౌనం మూగబోతుంది… నువ్వు మాట్లాడే ప్రతి మాటకూ బదులు మాటలిస్తూ అసలు మాట్లాడేది నేనేనా అని నాకే అనుమానం వచ్చేస్తుంది.
నా జీవితమొక వెదురు గొట్టం లాంటిదే ఇంత వరకూ…  కానీ అది నిన్ను పరిచయించుకున్నాక  పిల్లనగ్రోవిలా  సరికొత్తగా మురళీరవాలు పలికిస్తుంది. 
శిశిరం లేని జీవితాన్ని చూడాలనుకుంటే నువ్వొచ్చాక నా జీవితాన్ని చూస్తే చాలు… ఆరారు ఋతువులు వసంతంలో పోతపోసుకుని వచ్చేస్తున్నాయి…
ఏమిటో అందరూ మధుర క్షణాలని భద్రపరచుకోవటానికి ఫొటోలు దిగుతూ ఉంటారు.   ఏ పదేళ్ళ  తరువాతో ఇరవై ఏళ్ల తరువాతో  వాటిని చూసుకుని మురిసి పోతూ అప్పుడలా ఉండేవాళ్ళం  అంటూ   మనవళ్ళకో మనవరాళ్ళకో చెప్పుకోవటానికే పనికి వస్తాయి.  
ఆస్వాదించే హృదయం అంటూ ఉండాలి  కానీ  ప్రియమైన వాళ్ళని చూసిన మొదటి క్షణం శాశ్వతమై మళ్ళీ మళ్ళీ అలా అలా ఊపిరి ఆగే వరకూ కళ్ళల్లోనే తేలియాడదూ… అలాంటి ఒక్క క్షణం చాలదూ  ఎవరికైనా జీవితం మీద  సరికొత్త ఆశ చిగురించటానికి? 
నీ తలపు నను తట్టిన ప్రతి క్షణమూ ఒక ఛాయా చిత్రం గా మారి మధురంగా మనసులో తిష్ట వేసుకుని నా జీవితాన్ని సుందరం గా వెలిగించటం ఉంది చూశావూ… అది అనుభవమైతే కానీ తెలియదులే...  
ఎప్పుడూ రణగొణధ్వనులతో హడావిడిగా బతుకుని ఈడ్చేస్తూ  ప్రకృతి  సహజ సిద్ధంగా ఇచ్చిన ఆనందాలని అర్ధం చేసుకోలేని యాంత్రికుల మధ్య  ఒంటరిగా జీవిస్తూ ఏకాంతంగా ప్రకృతిలో లీనమై పోతూ  నిన్ను నాలో వర్షించుకుంటున్న భావ వ్యసనముంది చూశావూ… వ్యసనమంటే  అదీ…
కొన్ని సాధారణాలని  అసాధారణంగా పరిణామం చెందేలా అందరి ఆలోచనలూ సాగుతుంటే నాకెందుకో నువ్వు తాకిన  కొంచెం నేల… నిన్ను తాకిన కొంచెం గాలి… నీ వంటి మీద కాసేపున్న మట్టి గాజు …. ఇలాంటివే అపురూపంగా అనిపిస్తూ ఆలోచనలు మొత్తం నీ చుట్టూనే  పరిభ్రమిస్తూ ఉంటాయి.   
ఎందుకోగానీ ఎప్పుడూ నువ్వు కలలోకి రావు… బహుశా కలలోకి వస్తే  నువ్వు వాస్తవం కాదని  నా మనసు భ్రమల్లోనే  నిన్ను చూసుకుంటూ అక్కడే ఉండి పోతుందని అంతరాంతరాల్లో ఎక్కడో భయపడుతున్నానేమో మరి…
ఎవరికి వారు వారి కోసం కొంచెం  తీరుబడిగా  చేసుకునే ఆలోచనల ద్వారా  మనసు  చేసే అద్భుతాలని తనకి నచ్చే అనందాలనీ తెలుసుకోగలితే  ప్రపంచం తీరు మారదూ సరి కొత్తగా… ఆ మారిన ప్రపంచంలో  నీ జతగా  సాగాలి  నా ఆలోచనల ప్రయాణం. 
బాల్యం  ఎంత బాగుందో అక్కడే ఆగిపోతే ఎంత బాగుండేదో కదా అనుకునే వాడిని…నిజంగా నేను  ఆ బాల్యంలోనే ఆగిపోయి ఉండి ఉంటే  ఎప్పటికప్పుడు నిన్ను నాలో ఒంపుకుంటూ పొందే ఈ  ఆనందం  నాకు  ఉండి  ఉండేదా… అసలు నువ్వు పుట్టిందే నాలో  ఈ  ఆనందాన్ని పోతపొయ్యటానికే  కదూ… 
అందుకే ఏ వయసులో ఉన్నప్పుడు అప్పటికి తగ్గ ఆనందం మనసుకు చేరవేయ గలిగితే  వర్తమానమెప్పుడూ మధురమే. 
ఎవరిని చూడగానే నా ఈ  మనస్సు స్పందించటం నేర్చుకుందో 
ఎవరిని తాకగానే నా  తనువుకీ  పులకరింతలు ఉన్నాయని తెలిసిందో 
ఎవరికోసం నేను  విసుగు విరామం లేకుండా యుగాలుగా నిరీక్షితుడిగా ఉన్నానో 
ఎవరిని చూడగానే ఆ  సమస్యలన్నీ మరచి అలౌకిక స్థితిలోకి అలా నడచి వెళ్లి పోతానో…
ఆ ఎవరు ఎవరో నేను తెలుసుకున్న తరుణం నిన్ను నేను చూసిన  నీ సమక్షపు నా తొలి క్షణం 
మనసులోని ప్రేమనంతా అక్షరాల్లో చూపించగలిగే  కావ్యశిల్పిని కాదుగా నేను… అందుకే  ఈ  చిన్ని చిన్ని పద  నీరాజనాలతో  సరిపుచ్చుకో....
నీ 
….రేష్