Sunday, 11 January 2015

హేమంత స్పర్శ - 5


నిత్య హేమంతమా...

ప్రతి ఉషోదయాన నీతో కలసి భానుని  ఉదయ కిరణాలలో తడుస్తూ  అనంత వాయు గానాలలో లీనమై పోతూ నడుస్తున్నప్పుడు   తమ కిల కిలా రావాలతో ప్రకృతికే  మేలు కొలుపుతున్న బుజ్జి బుజ్జి పిట్టల  ఇచ్చే సాదర స్వాగతం  ముందర ఎన్ని స్వర్ణ కంకణ సత్కారాలూ  ఏ మూలకి?

నీకో సంగతి తెలుసా..?

ఎప్పటికప్పుడు నీకేదో చెప్దాం అనిపిస్తుంది… కానీ చెప్పటానికి గుండె  పెగలదే… చెప్పాలనుకున్నది ఒకసారి చెప్పేసాక ఇక చెప్పటానికి ఏమీ ఉండకపోతే… నీకూ నాకూ మధ్య ఏదైనా శూన్యం వచ్చి  ఆక్ర మించుకుంటుందేమో  అన్న భయం నా పెదాల మీదే నిలిచి ఉంటుంది మాటల్ని తూలనివ్వకుండా…

గుండె సవ్వడికి పెదవి చప్పుడికి సమన్వయం కుదిరిన మనిషి పయనం ఎప్పుడూ ఆహ్లాదమే కదూ…

శ్రావణ మేఘాల్ని దాటి కార్తీకపు కోనేటిలో మునిగి  హేమంతపు తుషారంలో తడుస్తున్నప్పుడు చిగురుటాకుల్లా వణుకుతున్న దేహాల దాహాల్లో కోరికల తీర్ధం పోసి వేడుక చూస్తున్న ఏకాంతపు స్పర్శ ఎంత బాగుందో కదా….

ఏ గుండె కథ చూసినా ఏ మనసు వెత వెదకినా కనిపించే ప్రతి తడికీ కదిలిపోయే నీ కన్నీటి  రాత్రుల్లో  నన్నొక్కసారి  తలపుకు తెచ్చుకుని చూడు....  కలల లోకపు పసిడి ఊబిలో చిక్కుకు పోవూ నీ  కనుపాపల తెరలు…!

అసలెందుకో ఇలా ఇన్ని కథలు… వ్యథలు… బ్రహ్మ రాసిన నాటకంలో  కాసేపు వచ్చి  ఎవరి పాత్ర  వాళ్ళు  పోషించే  నటుల్లా అనుకుని చూడు… ప్రతి జీవితాన్ని ఒక కమ్మని కథలా ఆస్వాదించుకోవచ్చు కదూ… నవరస పోషణల్లో ఎన్ని రకాల  అభినయాలో. ఎవరికీ తాము నటులం అని తెలియదు కదా అందుకే   ఏదీ కృతకంగా అనిపించనే అనిపించక అలా సాగిపోతున్న పాత్రల చిత్రీకరణ చూడు… నైరాశ్యం దరిచేరదు బంగారూ….  


యాంత్రికాలన్నిటినీ వదిలించేసుకుని  చలచల్లని ప్రకృతిలోకి నును వెచ్చగా  సెలపాటలాడుతూ జారిపోయే ఒక సాయంకాలపు బద్ధకంలో నిన్నో వలయంలా చుట్టేసుకోవాలని ఉంది రా…

నిశ్శబ్దంగా మగతని తాగేస్తున్నా నేను...మధుర స్వరమై నువ్వు మత్తును పోత పోస్తుంటే…!  

మాటొక మధు ప్రవాహమైనప్పుడు సమ్మోహనాల వాగులన్నీ స్వరాస్త్రాలుగా మారి నీ గొంతుకలో సందడి చేస్తుంటే  ఏ నాగ స్వరాలూ నీ మాటకు సాటి వస్తాయంటావ్? ఎన్నిన్ని కబుర్లో  పరవళ్ళుగా మారి నా చెవి చేరుతుంటే  దేహమంతా చైతన్య రహితమై మనసంతా మత్తిల్లుతూ  నీ పెదవుల నర్తనాన్ని మౌనంగా అవలోకిస్తూ  నాలో నుండి నేను  స్రవించే  ఆనందం  ఉంది  చూశావూ… వినటం కాదు ఒక్క సారి ఆ అనుభూతిలోకి ఒలికి చూడు… నీ విద్వత్తు ఏమిటో నీకే అవగతమవుతుంది.

ఓ వలయంలో చిక్కుకుని పరుగెడితే ఆపలేని బతుకు పందెం కన్నా తాపీగా తేనె తాగినంత మధురంగా జీవితాన్ని ఒంపేసుకుందాం… ఏమి కావాలి మరి ఆ మధురానికి?  కాసిన్ని పగళ్ళు…. ఎన్నో సాయంత్రాలు… మరెన్నో నిశి రాత్రులు… ఇంకెన్నో పొద్దు పొడుపులు…

ఆ కాసిన్ని పగళ్ళలో కాయాన్ని బతుకులోకి  నెట్టేద్దాం… ఆ దేహాల్ని సాయంత్రాలలోకి లాగేసుకుని అలసటలన్నిటినీ  మన ఊసులతో చెరిపేద్దాం. నిశిరాత్రుల్లో నిద్రని చీకట్లో పారబోసి వెన్నల  మొత్తాన్నీ కళ్ళకి కప్పుకుని పచ్చిక  దుప్పటిని నలిపేద్దాం. తొలి పొద్దు పొడుపులో రాలి పడుతున్న తుషారాలన్నిటినీ గొంతులోకి ఒంపుకుంటూ హేమంతాన్ని గుండెల్లో దాచేసుకుందాం…

నీ


నేనే...

2 comments:

తాపీగా తేనె తాగినంత మధురంగా జీవితాన్ని ఒంపేసుకుందాం..మధుర భావన

చెప్పాలనే ఉంటుంది.....చెప్పటానికి గుండె పెగలదు...బావుంది...

Post a Comment