Sunday, 18 January 2015

తెలుగు తేజం

యుగ పురుషా
తెలుగు జాతి తేజమా

ఈ రోజు  మా  కంటి తడికి  మాటొస్తే అది స్వర్గాన  ఉన్న నీకు  వినిపిస్తే  మళ్ళీ  ఈ తెలుగు జాతి కోసం  బొందితో దిగి వస్తావేమో ఇది కలకావొచ్చేమో  కానీ  ఎందరి  మనస్సుల్లోనో  గత 19 వత్సరాలుగా సజీవం గా  ఉన్న ఆశ.  

అసలు నిన్ను ఎలా ఇష్ట పడాలి మేము  ఒక నటుడిగానా  లేదా  ఒక నాయకుడిగానా? ఎలా?  తెలుగు జాతి వరకూ  దేవుడెలా  ఉంటాడో చూపిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడివి నీవే  సమాజమే  దేవాలయం , ప్రజలే  దేవుళ్ళుఅంటూ మాటలతో మాత్రమే కాక  చేతల్లో చూపించిన  నిజజీవిత  కథానాయకుడివీ  నీవే...

ఎందరో నటులు   వచ్చారు , వస్తున్నారు  వచ్చినట్లే  పోతున్నారు  కానీ   కొందరో  శాశ్వతమవుతున్నారు  ఆ కొందరిలో  నువ్వో  మేరునగధీరుడివి.  కేవలం  నటుడివైతే  ఇది  సాధ్యమా?  

రాయల సీమ  కరువులో  ఇండియా పాకిస్తాన్  యుద్ధ సమయంలో  దివిసీమ  ఉప్పెనలో ఇలా  జాతి  కష్టాల్లో  ఉన్న ప్రతిసారి  నాయకుడివై  చలన చిత్ర సీమని ఒక్క తాటిపై  నడిపించి...  కేవలం  ముఖానికి రంగులేసుకునే  నటుడిని మాత్రమే  కాదని  జన్మతహా  నాయకుడినని  ఆనాడే  నిరూపించావ్.

తమ పార్టీ కి  ఉపయోగ పడతారు అనుకుంటే  చాలు  అవార్డుల పందేరం  చేస్తూ ఎవరెవరికో   భారత రత్నాలు  ఇచ్చేస్తున్నారు. భారత చలన చిత్ర సీమలో  దాదాసాహెబ్ ఫాల్కే. పద్మభూషణ్ పద్మ విభూషణ్  లాంటి  అవార్డులెన్నో  పొందిన  చలన చిత్ర  ప్రముఖులందరూ  ప్రతిసారీ మహా నటుడిగా  తలచుకునేది నిన్నే అయితేనేం  హస్త  సాముద్రికాలతో  అరచేతుల్లో  స్వర్గం  చూపించేసిన  రాజకీయులు మాత్రం  నీ  విషయంలో  తాము  నిజంగా నే   మిథ్య  అనే  అనుకున్నారేమో  ఏ అవార్డులనీ  నీ దరి చేరనియ్యలేదు.  

అయినా గానీ వారి పిచ్చిగానీ  ఒక  కాగితపు ముద్రతో ఒక  లోహపు  ముక్కతో   మనిషినైనా  జనం గుండెల్లో  శాశ్వతం  చెయ్యగలరా?   ఒక  అశోక  చక్రవర్తి, ఛత్రపతి  శివాజీ, శ్రీ కృష్ణ  దేవరాయలు, రాణి రుద్రమదేవి ఇలాంటి వాళ్ళంతా  శతాబ్దాలుగా జనం గుండెల్లో  ఎలా  శాశ్వతమయ్యారు?  అలాంటి  మహనీయుల  వారసుడివి  నీవు. అయినా గానీ ఎక్కడో భూమి పొరల్లో దాగుండే రత్నానివి కాదు నువ్వు...  నిత్యం వినువీధిలో తెలుగు జాతి  పతాకాన్ని  రెపరెపలాడించే ధృవతారవు.

"దేశమదేల యన్న దేశంబు తెలుగేను
యెల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
యేను తెలుగు వల్లభుండ తెలుగొకొండ
దేశ భాషలందు తెలుగు లెస్స"  

అని శతాబ్దాల క్రితమే  దక్షిణ భారత సార్వభౌముడైన శ్రీ కృష్ణ  దేవరాయలంతటి సకల కళా వల్లభుడిచే శ్లాఘించబడ్డ  తెలుగు భాషా / తెలుగు జాతీ కాల క్రమేణా మదరాసీలుగా పేరు పడితే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపి తెలుగోడి సత్తాను సరి కొత్తగా ప్రపంచానికి  చాటి చెప్పిన పౌరుషాగ్ని జ్వాలవి నువ్వు.

చలన చిత్ర రంగంలో నువ్వు రారాజుగా ఉన్నప్పుడు... తిరుపతి వెంకన్నకు మొక్కు  తీర్చుకుని అటునుండి అటు చెన్నపట్నం వచ్చి నిన్ను దర్శించుకుంటేనే ఆ యాత్ర ముగిసేది అన్న వార్తలు చదివితే  జనాల గుండెల్లో నువ్వేంటో అర్ధం అవుతుంది.

33 ఏళ్ల చలన చిత్ర రంగంలో .

పురాణ పాత్రల్లో దివ్య మంగళ స్వరూపంతో దైవాంశ సంభూతునిలా
జానపద చారిత్రాత్మక పాత్రల్లో   పోతపోసిన పౌరుషం నిండిన ధీరోదాత్త నాయకునిలా
సాంఘిక చిత్రాలలో సమాజానికి చక్కనైన ప్రతినిధిలా

మూడు వందలకు పైగా  చిత్రాలు పదుల కొద్దీ  పాత్రలు పాత్ర పాత్రకీ  ఏంతో వైవిధ్యం నాయకుడి గానూ ప్రతినాయకుడి గానూ  మెప్పించిన అనితర సాధ్య నటనా వైదుష్యం ఎవరికి సాధ్యం నీకు తప్ప

13 ఏళ్ల రాజకీయ రంగంలో

అసలు సిసలు ప్రజానాయకుడివి సమకాలీనుల్లోనే కాదు ఇప్పటికి కూడా తెలుగు  జాతి లో ప్రజాదరణలో ఎవరైనా నీ తరువాతే.  వటవృక్షం లాంటి కాంగ్రెస్స్ పార్టీని నెలల బాలుడిగా మట్టి కరిపించిన మేరునగధీరుడివి.  

ఏ జాతి మనుగడ  అయినా స్త్రీ జాతి మీదే ఆధార పడుతుంది అని నువ్వు ఆడపడచులు అని పిలుచుకునే  మహిళలకి ఆస్తిలో హక్కు ఉండాలని చట్టం చేసిన మహిళా పక్షపాతివి. అలాగే మహిళల కోసం ప్రత్యేక  విశ్వవిద్యాలయం నీ పుణ్యమే కదా...

బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి బడుగు బలహీన వర్గాల  వారికి రాజకీయంగా ఉన్నత స్థానాలు కల్పించావు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో పధకాలు

అసలంటూ తెలుగు గడ్డ మీద మార్పు మొదలయ్యింది నీతో. తెలుగు జాతి నరనరాల్లో చైతన్యం నింపింది నువ్వు .  

గుండె గుండెలో ఒక ఆర్తిలా దాగున్నావ్ కంటి కంటినీ ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉన్నావ్.  దిగంత లోకాలలో దివ్య తారల నీరాజనాలు అందుకుంటూ ఉండి ఉంటావ్ రెండుగా చీలిన నీ తెలుగు జాతి నిండుగా వెలిగేలా  రెండు కళ్ళతో కనిపెట్టుకుని ఆశీర్వదిస్తూ ఉండి ఉంటావ్.

ఎవ్వరేమనుకోనీ... నువ్వే నాయకుడివి...

నువ్వున్న కాలంలో మేమూ ఉన్నాం  ఒక చారిత్రిక పురుషుడిని  మేమూ  చూసాం  అన్న తృప్తి  చాలదూ  మా జీవితాలకి.

తరతరాల తెలుగు చలన చిత్ర  / రాజకీయ రంగంలో సరిలేరు  నీకెవ్వరూ  జనం  మెచ్చిన  ఒకే ఒక్క నాయకుడివి  నువ్వే...

తెలుగుజాతి కోసం  తెలుగు భాష  కోసం  ఆ దేవదేవుడు  అందించిన  సమ్మోహన  అస్త్రం ...  నందమూరి తారక రామాస్త్రం...

తారక రామా...అజరామరం నీ కీర్తి... దిగంతాల్లోనూ నీతోనే తెలుగుకు ఖ్యాతి...!

తెలుగు జాతి గుండెల్లో నీ రూపం శాశ్వతం...

ఓ యుగ పురుషా... తెలుగు జాతి ఉన్నంత వరకూ నువ్వుమృతంజీవుడివే

మళ్ళీ నీ ఊపిరి చప్పుడు కావాలట తెలుగు జాతికి... తారక రామ తేజమై రా!

ఇట్లుతెలుగోడు

(నందమూరి తారక రాముడి ౧౯వ వర్ధంతి నివాళులు)


1 comments:

నిజమే... మృతంజీవుడే! చాలా బాగా రాసారు.

Post a Comment