Friday, 9 January 2015

హేమంత స్పర్శ - 4

నా జీవమా...

ఆకాశం రాల్చే వెన్నెల ముక్కలనే మంచెగా ఎంచుకుని జలపాతపు ఒడ్డున సెలపాటల రాగాలతో   జంటగా జావళీలు పాడుకుంటున్నప్పుడు ఒకరి చూపుల సుగంధాలనింకొకరం పీల్చుకుంటూ  మాటలు మత్తిల్లుతుంటే తుళ్ళి పడే తనువుల జాగారంలో రేయంతా నువ్వు  కడిగేసిన నా నిద్ర పగలంతా  రెప్పల పైన కూర్చుని  వాలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా కళ్లపై నువ్వేసే పెదవి ముద్రలలో జీవితాన్ని అనుభూతించాలని ఉంది.

తెల్లటి నెమలీకల్నిగుదిగుచ్చిన వెన్నెల విసనకర్ర విసిరేటప్పుడు వచ్చే పరిమళాల సమీరాల్లో మనం క్రీడిస్తూ  నారికేళపాకంలా అనిపించే జలాన్ని నింపుకున్న తటాకాలలో రాయంచలమై స్నానిస్తూ  ఏక తీరుగా మన ఏకాంతాన్ని  
హత్తుకుందామనే నా కోరికలోని స్వార్ధం  నీకూ ఎంతో ఇష్టమే కదూ…

హిమవత్పర్వతాలలోని దేవతా వనాల సౌందర్యాన్ని అమృతంలో కలిపితే వచ్చినంత మత్తులో ముంచెయ్యదూ...ఇష్టమైన  పలకరింపులోని  మాటల మాధుర్యం…

ఎంత చందనం కరిగిందో నీ మేనిలో… ఎన్ని మల్లెలు తాగావో గొంతులో… మాటగా తొలికినా   మౌనంగా  నడచినా   పరిమళమే రాలి పడుతూ ఉంటుంది.
ఎప్పుడూ చెప్పేదే అయినా మళ్ళీ మళ్ళీ  నాకు చెప్పాలనిపించే మాట ‘ నీతో  కలసి  బతకాలనేది  కాదు నా కోరిక…  నీలో కలసిపోయి  వసించాలని…’ నీ కణకణంలో అణువు అణువుగా  నేను ఇంకిపోతూ జీవితం చూడాలని ఉంది.

కొన్ని క్షణాలు ఉంటాయి చూడూ… వాటికి వేరే పని ఏమీ ఉండదు… నన్ను నీలా నిన్ను నాలా చూడాలనుకునే ఆశ  తప్ప. మన  ఇద్దరినీ ఒకే ఏకత్వంలో చూడాలనుకునే తపనని వెంటేసుకుని మనల్నే ఆవరించుకుని కావలి కాస్తుంటాయి.   

నువ్వు తాకని నా రోజులో యుగాల ప్రయాణం చేసే ఆ క్షణాల మీద జాలి నీకే మాత్రం ఉన్నా నాలో కొచ్చి వాటిని  స్పర్శించవూ. నీ స్పర్శని పొందిన ఆనందం చాలదూ వాటికి... చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా వెలుగులీనటానికి?

నువ్వున్నంత సేపు నా అస్తిత్వం ఎటు కొట్టుకుపోతుందో  అర్ధం కాని సందిగ్ధంలో  నేనో అనుభూతిగా  మారి  నిన్ను హత్తుకుపోయే ఉంటాను. లేకపోతే ఏమిటి మరి?  నువ్వున్నంతసేపు అసలు ప్రపంచమే కనిపించని నాకు… నువ్వు పక్కన లేని పగలంతా వెచ్చని చెమటగా కారిపోతూ ఉంటుంది. జంట నిట్టుర్పులతో మత్తిల్లే రాత్రి నువ్వు  లేనప్పుడు  ఏకాంతంగా నా కంట్లో కురుస్తూ ఉంటుంది...  

పగలూ రాత్రీ శత్రువులై  నా మీద చేసే యుద్ధం లో నీ తలపొకటి  వస్తే  చాలు… అది ఇక బ్రహ్మాస్త్రమే…  పాపం రేయింబగళ్ళు   పిచ్చుకల్లా మారిపోతాయ్… ఒద్దికగా ఒక మూల కూర్చుని  వణికి పోతూ...

నువ్వు లేనప్పుడు ఏదైనా ఒక సాయంత్రం అలా ఏటి ఒడ్డుకు షికారుకి వెళ్లి కూర్చుటానా… అవిశ్రాంతంగా పరుగులు పెట్టే ఆ చక్కటి నదీ పాయవై నువ్వే అగుపిస్తూ ఉంటావ్. చల్లని ఆ నీటి జాలులో వెచ్చగా  ఒదిగి పోయి  నిన్ను  ఆవరించుకోవాలని అనిపిస్తుందప్పుడు. వడి వడిగా వచ్చి ఏట్లో వెచ్చగా నన్ను ఒంపుకుంటూ నీ కోసం చూస్తానా… అక్కడ ఉండవే… మరెక్కడా అని చూస్తే వెన్నెల రజనులా మెరిసిపోయే ఏటి ఇసుకలో  వళ్లారా స్నానం చేస్తూ  ఆకాశాన్ని తెరగా చుట్టేసుకుని కనిపిస్తావ్…

అప్పుడు గానీ అర్ధం కాదు నాకు నేను చూసేది  నిజమైన నిన్ను కాదని నా ఊహలకి  ఊపిరిచ్చుకుని నేను  ఆ  క్షణాల్లో జీవం పోసిన నీ  భ్రమల రూపాన్నని.  నీ భ్రమల బొమ్మని చూస్తూ కూడా జీవితాన్ని ఆస్వాదించటం అలవాటు చేసుకున్న నన్ను ఆ నిమిషంలో ఎవరైనా చూస్తే నన్నో పిచ్చివాడి కింద జమకడతారేమో…  నిజమే ఊహల్లో నీతో కలసి వేస్తున్న అడుగులు… నీ సంతోషాల  నుండి  రాలి పడుతున్న నా నవ్వులు బయటి వాళ్ళకి పిచ్చితనంగానే తోస్తాయి కదూ…   

తప్పేముందిలే… జీవితాన్ని నిజంగా ఆస్వాదించ గలిగేది  మనసైన ప్రేమికులు… మరియు పిచ్చివాళ్ళే…

భావాల పందిరికి ఒక్కసారైనా అల్లుకోలేని మానవ యంత్రాలకి మనమెలా కనిపిస్తేనేం… నిజానికి ప్రకృతి సౌందర్యం ఆస్వాదించలేని ఆ సజీవ ప్రాణ యంత్రాలు కదా అసలు సిసలు పిచ్చివాళ్ళు.  

నీ


సురేష్

0 comments:

Post a Comment