మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Saturday, 12 December 2015

ఇంధనం



హాయ్ కన్నా...

అమ్మపేగుతో నీ జీవబంధాన్ని ఎంతబాగా ముడి వేసుకున్నావ్ రా...!  అండం నుండి పిండంగా... ఆపై అమ్మ కడుపునే బ్రహ్మాండంగా భావిస్తూ ఎంతగా మురిసిపోతున్నావో కదా... అక్కడ ఉన్నన్నాళ్ళన్నా మురిసిపోరా… బయటకి వచ్చాక మురిసిపోతావో మరి ముగిసిపోతావో ఏదీ నీ చేతుల్లో లేదోయ్.

మరి బయటకి రావాలని ఎందుకురా తొందర? అమ్మకడుపు చెరసాల కాదురా… అవకాశం ఉంటే అక్కడే  ఉండిపో… ఒక్కటైతే చెప్పగలనురా… నువ్వు లోపలున్నా… బయటకి వచ్చినా అమ్మ ప్రేమ ఎప్పుడూ స్వచ్ఛమైనదే.

నువ్వక్కడ చూస్తున్నది రక్త మాంసాల మైదానాలు, ఉమ్మనీటి సాగరాలు మాత్రమే. ఒక్కసారి లోకానికి వచ్చేసావా నీ విహార యాత్రలన్నీ కాలుష్య కాసారాలలోనే… కాలుష్యం అంటే గాలి కాలుష్యమో… నీటి కాలుష్యమో కాదురా చిన్నా… మానవ జాతి కాలుష్యం... మనిషితనపు కాలుష్యం…! ఇక్కడ పుడుతూనే నువ్వు ఏడవాలిరా… అది ఈ లోకపు నియమం. ఖర్మకాలి పుట్టగానే నువ్వు ఏడవ లేదా తొడపాశం పెట్టి మరీ ఏడిపిస్తుందిరా ఈ లోకం.

నువ్వే చూస్తున్నావ్ కదా ఇప్పటి నీలోకం… నువ్వే కాదు… నేను… ఇంకోడు మరొకడు అందరమూ చూసిన ప్రపంచం అదేరా… అక్కడ ఉన్నప్పుడు మనకి తేడాలేమీ తెలియదు. బయటకు వచ్చే సరికి నీ కోసం ఎన్ని గుర్తింపులు  సిద్ధంగా ఉంటాయో తెలుసా?

లోపల నువ్వు చూసిన ప్రపంచం చాలా చిన్నదిరా. లోపల నువ్వు చూసిన దానితో పోలిస్తే  బయట ఉన్నప్రపంచం అనంతం రా. ఇంతటి పృథ్విపై నువ్వు స్వేచ్ఛగా  మెసలటానికి లేకుండా నీకంటూ ఒక ప్రాంతం, ఆ ప్రాంతాన్ని బట్టి, నువ్వు పుట్టిన కడుపున బట్టి నీకంటూ ఒకవర్ణం, నీ అమ్మానాన్నల ఆచరణని బట్టి నీకంటూ ఒక మతం, దాన్ని ఇంకాస్త విస్తరిస్తే  మతాల్లోని శాఖలో… కులగోత్రాలో… ఇంకా… ఇంకా… ఎన్నిరా? చెప్తూ వెళితే  అంతే ఉండదు.

ఏదో చిన్నా.. కన్నా అంటున్నాను  కదా అని  ఇదంతా కేవలం మగశిశువుకి చెప్తున్నా మాటలు కాదురా… ఒక వేళ నువ్వు గనక ఆడ శిశువువి ఐతే  నువ్వసలు బయటకు వస్తావో… వచ్చినా బతుకుతావో.. లేదో , బతికినా అమ్మ వడిలో లాల పోసుకుంటావో... చెత్తకుప్పలో శిధిలమవుతావో ఆ దేవుడికీ ఎరుక అవ్వదనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే  మా'నవ'జాతి తమలోని సగానికి ఇచ్చుకుంటున్న విలువరా అది. భూమికి భారం త్వరగా తగ్గిద్దామనే ప్రకృతి సేవలే అది అని చెప్పినా చెప్తారు మావాళ్ళు.

పుట్టకముందే మీకోసం… అంతే కాదురోయ్... మీ ఏడేడు  తరాల వారసుల కోసం రంగు కాగితాలనో, లోహ ధాతువులనో అలా అలా పేర్చుతూ  పోయేవారు కొందరైతే… గుక్కెడు పాలివ్వలేక… కంటికి ధారగా ఏడుస్తూ మిమ్మల్ని విడవలేక విడిచే వారు కొందరు. 

మరి ఇదొక రంగుల రాట్నం… మానవజాతి మాయాజాలం. అడుగు వేశావా వెనక్కి తీసుకోలేని మాయా చదరంగం. 
  
అప్పుడే అయిపోలేదు బంగారూ… ఎదిగేకొద్దీ పెరిగే సవాళ్ళూ… ఇప్పుడు నీకు తెలియటం లేదు కానీ, బయటి  లోకంలో   రూపంటూ ఆకలి  అనే రాకాసి ఒకటి  ఉంది. అది నిన్ను జీవితంలో ఏ తీరాలకి చేరుస్తుందో ఇప్పుడే చెప్పలేం. అదొక్కటి చాలు నీ కలలన్నిటినీ అస్తవ్యస్తం చెయ్యటానికి.

మీరు ఈ భూమ్మీదకి వచ్చాక అయినా, ఏ అజ్ఞానాన్నీ నేర్వకండి.  ఆనందానికి పనికిరాని అన్ని సిద్ధాంతాలనీ తెగనరకండి.  మనిషిని నుండి మనిషిని వేరు చేసే సమాజాన్ని చిధ్రం చెయ్యండి. భీరువుగా బతకొద్దురా ధీరుడివై ప్రకృతితో మిత్రత్వాన్ని కొనసాగించు. హక్కుల కోసం కాదురా ఆనందం కోసం పోరాడు.

ఇకపై విప్లవమంటే నెత్తుటి పోరాటం మాత్రమే కాదు మనిషిని మిగుల్చుకోవాలనే ఆరాటం కూడా. పవిత్ర యుద్ధాలు చెయ్యల్సింది మనుషుల్ని చంపుతూ కాదు... మనుసులోని  మమతలని  వెలికి తీస్తూ…

దిగంతాల్లో అనంతకాలం ప్రజ్వలిల్లాలి మీ తరమే  ‘ఇంధనమై’

ఇట్లు,

ఓ చేతకానివాడు

నీడ



ఓ అభిజ్ఞా...

ఈ పిలుపేంటి పిలగాడా అని మాత్రం అనుకోకేం.  నీడ నీడతో ఇలాగే మాట్లాడాలి. నిజం చెప్పు! నీకు నా  దగ్గరి తనపు  స్పర్శ  తెలియటం లేదూ.  నీ మనసులో గోరువెచ్చని మమతల్లో దాగున్న నన్ను దూరంగా ఉన్నానంటూ ఆక్షేపించటం నీకు మాత్రమే చెల్లింది. నీకు నాతో జగడాలు ఆడటం ఇష్టమని తెలుసు కానీ ఇన్ని అభాంఢాలా? అన్యాయం కదా. ఒక్కసారి లో లోపల తడుముకుని చూడు. ఆ మనసు పరిమళంలో అదే స్వచ్ఛత అదే సువాసన అదే పరవశం  మరి అది నేను కానా.

నువ్వంటున్నావే విసిరిన మాటలు అని… అవి విసిరిన మాటలు కాదోయ్... అరవిరిసిన హృదయ సుమాలు! కాబట్టే మౌనం కోటి రకాలుగా  మాటలాడుతుంది. నా నిశ్శబ్దపు హోరూ, నీ మౌనాల జోరూ… ఈ రెండూ మనల్ని  ఇంకా ఇంకా దగ్గరే చేస్తాయి కానీ  ఎప్పటికీ దూరాన్ని పెంచలేవులే. నీ ఏకాంతం నీకెలా ఉంటుందనుకున్నావ్ నన్ను ఊహలకి వెళ్లాడదీసాక?

ఎందుకీ విరామాలంటూ వగపులేల? కొన్ని విరామాలు… వరాల ఆరామాలు ! విరామంలో వరమేంటి అంటే ఏమని చెప్పను నేను? సమయం మొత్తాన్ని తలపులకి అల్లేసిన సడిలో మామూలుగా కన్నా ఇంకా దగ్గరైనతనం చెప్పటం లేదూ అదెంత వరమో..!

నువ్వనుకున్నట్లు మౌనమెప్పుడూ అందమైన  గాజు పువ్వు మాత్రమే కాదురా… అది ఘనీభవించిన సజీవ పరిమళం. స్థితి ఏదైతేనేం దాని అలజడి తీరు మాత్రం ఎప్పుడూ ఒక్కలాగానే ఉంటుంది. నీకు తెలియనిది కాదనుకో… అయినా  సరే మరో సారి చదివి చూడు మౌనం రాస్తున్న మనఃప్రతిని. నల్లని నీడలో… రంగు రంగుల వర్ణాలో…  ఎలా అనిపించినా అవి పరిచయించేది  మాత్రం నిన్నుగా రాసుకున్న నా ఊసుల లిపినే.

నీడగా ఉండటం అంటే నిన్ను కాచుకోవటం అన్న మాటేగా… సమయాన్ని బట్టి తగ్గుతూ పెరుగుతూ రూపుని దాటేసిన రక్షా కవచమది. నీ  హృదయ స్పందనలు  వినిపించనంత  దూరం అంటే నాకు తెలిసింది ఒక్కటే… అదే  మరణం.

ఏదేదో ఊహించు కుంటున్నావ్ గానీ నిజంగా నీకు తెలియదా చెప్పు?  నిన్ను తలుచుకుంటే నా గుండె నిండుగా పరిమళించే తొలకరి చినుకు చీల్చే మట్టి వాసన, నీ  పిలుపు వింటే చాలు పిల్లగాలిపై మనసు పడ్డ  పైరులా పరవశం… ఒక్కొక్క అనుభూతీ ఒక్కోలా నిన్ను నాలో నింపేసాక  నాకు నేను అతిధినయ్యానని !

గెలిపించేదీ నువ్వే... ఓడించేది నువ్వే... దిగులు పెట్టించేది నువ్వు… ధైర్యమిచ్చేది నువ్వే… బెదిరించేది నువ్వే... ఆదరించేది నువ్వే...

ఎప్పటికీ నా నీడగా నన్నంటి ఉన్న నా తోడుగా నీకు నేనున్నానని తెలుపుకునే తలపుల తాయిలమిది.

అనుకోకుండా తారసపడ్డా… నిశ్శబ్దంగా చేరువైనా… జత కలసిన అడుగులు ఒకటికి ఒకటి రెండుగా… రెండిటి తపమూ ఒకటిగా...  బంధం అల్లుకుపోయాక జతలంటూ  ఏమీ ఉండవు ఏకమైన మనో శబ్దం తప్ప.

నీ
“తోడూ నీడ”

Friday, 11 December 2015

శయనం


హాయ్ బంగారూ

గుండె ఉన్నదే కొట్టుకోవటానికి. కాదంటావా? జీవాన్నే  శాసించే సజీవలోలకం ఒకటి నిమిషానికి 72 సార్లు కొట్టుకునేది నిన్ను మోస్తూనే అని తెలియటం కంటే జీవితంలో ఆనందపు మొదలు ఎక్కడ ఉంది. తడబాట్లూ, తలపులూ, తపనలూ, పారవశ్యాలూ  అన్నీ… అన్నీ కూడా ఆ అనుభూతి తరువాతే. ఆపై అవన్నీ తన సహజాతలే.

నిన్ను తెగ చదివేద్దాం అని నేను అనుకున్నప్పుడల్లా అక్కడ పరావర్తనమైన నేనే కనిపిస్తున్నాను. ఇంతకూ నువ్వు నాకు దర్పణమా? నేను నీకు రూపాన్నా? Feeling Confused 

సవ్వడెంత ఎక్కువైతే సందడంత ఎక్కువేమో కదా? సవ్వడీ  సందడీ ఒక్కరే అయిన చోట మైదానాన్ని సిద్ధం చేసి ఉంచానన్న నిజం నిన్ను దాటిపోయిందా?  కోవెల్లో హారతి ధూపపు పారవశ్యపు బరువులా నా నిండా నువ్వు నిండిపోయిన వాస్తవం నీకు తెలీదూ? నన్ను లోకానికి నిరూపణ చెయ్యాలన్న నీ తాపత్రయంలో  లోలోన  ఎన్ని గుసగుసలో కదా…

కోట్ల తారలు వేలాడుతూ ఉన్నాయి కదా అని ఆకాశం ఏమైనా బరువెక్కిందా ఏమి? మన విషయంలోనూ అంతేనోయ్.. అంతులేని తలపుల బరువుతో సహా   నాలో నిండుగా నిన్ను నింపుకున్నాకే నేను తేలికపడ్డానన్న నిజం నీకూ తెలుసుగా.  కొన్ని కొన్ని అంతే లోక విరుద్ధంగా జరిగిపోతుంటాయ్.  

ఒకరికొకరంగా ధ్యానబద్ధులమై ఉన్నచోట దివారాత్రాల అలికిడి చేరని అలౌకితగా మనం కొనసాగుతున్న మౌనవచనంలో అక్షరబద్ధం అయ్యే  ఒకే ఒక్క నిజం మన ‘ప్రేమ’ .

తుంటరి ఊసుల థిల్లానాలో వేడుక్కుతున్న వెన్నల రాత్రులకి ఏమి తెలుసు? వేల వేకువలు పొద్దుపొడిచినా ఆ ఊసుల ఊపిరాగదని !  ఒంటరిది కదా అని జాలిపడతాం గానీ ఇద్దరి మధ్య  రాయబారిగా ఆ కృష్ణభగవానుడిని మించిన మాయాజాలంతో   ఈ చిరుగాలి చేసే చమక్కుల చూస్తే తెలుస్తుంది… తానెంతటి ‘అభిజ్ఞ’యో.

నిదురనద్దుకోనంటున్న రాత్రిళ్ళకి నీ కలల ‘నజరానా’ ఆశ చూపించేసరికి…నా కనురెప్పలపై ఎంతటి భారమైన ముద్రలేస్తున్నాయో చూడు. అదీ సంగతి... ఇవి కూడా ఇలా ‘తొండి’ఆటలు మొదలు పెడితే  ఎలాగోయ్ బతకటం?

ఛ...ఛా… పాపంలేరా… రాత్రుళ్ళది తప్పేం లేదు  ఎన్ని ఒంటరిక్షణాల నిరీక్షణలని నీకర్పించానో బాగా తెలిసిన నీడలు కదా అవి … నీ కలల స్మరణలో పునీతమైన నా కళ్ళకి నిన్ను శాశ్వతరూపంగా అందించాలనే సదుద్దేశ్యమేలే…
చివరిగా నీకొకటి చెప్పనా…
నా అనేకానేక అనుభూతులకి ఒక ఒక్క కారణం నువ్వు.
అనేకానేకంగా నాలోకి ప్రవహించిన నా ఏకైక ‘అహం’ నువ్వు.  
నాదెప్పటికీ ఒకే ఒక్క కోరిక…తీరుస్తూనే ఉంటావ్ కదూ...
నా అధరలాస్యాలపై  అనంత శయనానివై ఊపిరిల్లవూ…!

నీ

…..

Wednesday, 9 December 2015

ప్రణవం

దోసిలి నిండా చిన్ని నవ్వులు చాలు అన్నాను
గుండెనిండుగా స్వేచ్ఛని నింపుకొచ్చావు
ఒక్క వెదురు ముక్కని తీసుకు రావూ అన్నాను
నన్నలరించే హేమంతపు పాటనే తెచ్చావు
ఒక్క నిమిషం నాతో ఉండమన్నాను
నీ కాలాశ్వపు పగ్గాలే నాకందించేశావు

నువ్వు
అనంతంగా నన్నలరించటానికి
నాకోసమొచ్చిన అక్షయానివని తెలిసి
అణువణువునా నిన్ను నాలో ప్రణవిస్తూ
ఇప్పుడిక
మది నికుంజాలలో నిశ్శబ్దపు శబ్దం చేస్తున్నా



Tuesday, 8 December 2015

నీల రేఖ



ఆ తడి తీరంలో అనంతపు నీల రేఖపై నడుస్తూ
లోకపు సరిహద్దంటే నేలా నీళ్ళూ  అనుకున్నాను
ఇంతలో నువ్వెదురొచ్చావ్...
లోకానికి నిర్వచనమే మారిపోయింది…!



రంగస్థలం




1.
అలపొద్దులో తిమిరపు స్పర్శ తాకుతుంటే ఎడతెగని ఆకలి మోతతో రాత్రి శబ్దం పెరిగిపోతుంటే తడి గీతాల్ని ఆలపిస్తూ తనువంతా తన్మయం నటిస్తున్ననటనాలయంలో మనసుని ఆక్రమించుకుంటున్న ఒక దుర్గంధాన్ని భరిస్తూ పూల బతుకుల్ని చిధ్రం చేస్తూ చీకటిలో బతుకుని వెదుక్కుంటూ ఒకానొక మెలకువ 2. అప్పుడెప్పుడో పనిమొదలెట్టేసిన రాత్రి తను చిక్కబడ్డాక పనిలోకి వచ్చిన వారిని చూసి కుళ్ళుకు పోయిందనుకుంటా రహదారుల మీద నుండి ఎగిరిపోతూ వారి కళ్ళలో అలా అలా కొంచెం కొంచెంగా పేరుకుపోతూ అప్పుడప్పుడూ డబ్బెక్కిన మద చక్రాల క్రిందకు వారిని తోసేస్తూ పగటి వాకిటి ముందు నెత్తుటి కళ్ళాపి చల్లి వెళ్ళిపోతుంది 3. ఉదరపోషణ ఉరుకుల్లో రాత్రికి అంటుకట్టబడ్డ జీవితంలో మనిషితనం మీద నమ్మికింకా చెదరని చెల్లమ్మనుకుంటా ఊరి బయట పొదల్లో ప్రాణం పారేసుకుంది మూతబడని కనులలో లోకాన్ని ప్రశ్నిస్తూ ఇక ఏ రాత్రినీ స్థిమితంగా నడవనివ్వక 4. పగలంతా రాత్రిలోకి ఇంకిపోవటం మొదలు పెట్టాక చీకటి కుంచె స్పర్శ కళ్ళ కాన్వాస్ పై అద్దుకుంటుంటే పాత కథలని కొత్త పాత్రలతో రంగరిస్తూ తిమిర థిల్లానాల రంగస్థలంపై ఎప్పటిలాగానే సేద తీరటం మొదలు పెట్టింది ఒక రద్దీ (రాత్రి) దృశ్యం

Monday, 7 December 2015

హేమంత స్పర్శ - 15



ఏమిటోయ్ నేస్తం! 

నీ ఈ మాయా జాలం. 

సమాధానాలన్నీ  మృగ్యమైన ప్రశ్నలకే  పూయబడ్డట్లున్న ఈ  బ్రతుకులో, కాస్త ఆలస్యంగానైతేనేం  నాకు రావాల్సిన ఒకే  ఒక్క ప్రత్యుత్తరమై  నువ్వు...  తోడే కొద్దీ స్వచ్ఛతనే  అందించే  ఇసుక అడుగున దాగిన చెమ్మలా హృదయం నిండా పరచుకున్నావ్.

ఒక్క ఖాళీ గదీ లేని గుండెలో ఒక వేకువని శాశ్వతం చేసిన ప్రాణమా!  

నువ్వు నడచిన నీరెండల దూరాలని మట్టి పొరల కింద నుండి ఆర్ద్రంగా అనుభూతించాలని  వేచి ఉన్న నా గతమంతా నిరీక్షణకి నిజమైన నిర్వచనమంటే కాదన గలవా?  లేదు కదూ! నిద్రని వలస పంపేసిన ప్రతి ఎదురు చూపూ నిన్నటి రాత్రుళ్ళకి చేసిన గాయపు మరకలని యిట్టే అదృశ్యం చేసిన నీ సహజ స్వాభావికం అలలు అలలుగా నన్ను తడుముతున్న ఈనాటి ఒరవడిలో నిశ్శబ్దాన్ని  శబ్దించే ఒకానొక అభిరుతం.

అప్పుడెప్పుడో నా నిరీక్షణవైన నువ్వు ఇప్పుడు మాత్రం నా అహానివి. మామూలుగా ఐతే ఏమో కానీ ఇలాంటి అహం ఉన్నప్పుడు దాన్ని వదులుకోవటం నేనైతే చెయ్యలేనురా. నిజానికి మనిషి మనిషికి ఇలాంటి అహమొకటి వ్యక్తిగతమైతే… ఆ అహాన్ని శాశ్వతం చేసుకునే దిశగా మనిషి మనసుతో మాట్లాడటం మొదలు పెడితే...   అది చాలదూ సమస్తమూ ఆనందంగా మారిన ప్రకృతిని హాయిగా అనుభూతించడానికి? 

క్షణం విరామమొస్తే చాలు, నువ్వో ఆలోచనల ఆరామంగా మారిపోయి ‘రావి’ చెట్టు కింద మొదలైన చల్లని గాలి లా నను చుట్టేసిన ప్రపంచమైపోతావ్. అప్పుడే కదా అర్ధం అయ్యేది ‘ప్రాణ’వాయువు అంటే మరేం కాదనీ నా వసంతంగా  నువ్వు చిగురించే ‘ఊపిరి' సుమాల పవనవాసమని. 

మనుషుల మధ్య  ఓ కర్పూరపు కాలువ పారటం ఎవరికైనా అనుభవమయ్యిందో లేదో కానీ, నువ్వు మాట్లాడినప్పుడల్లా  అది నా మనసుపై ప్రవహిస్తూ  హేమంతపు ధూపమెయ్యటం నాకెప్పుడూ విస్మయం కాదు. నాకు తెలుసు మరి నువ్వో పరిమళ సాగరానివని. 

నీ నవ్వులు రాలినప్పుడల్లా  చక చకా ఏరుకుంటానా, వాటికేం మాయలు వచ్చో కానీ లోపలెక్కడో వెన్నెలగింతలుగా మనసుని చిలికేస్తుంటాయ్. నీ ప్రతి నవ్వు నిన్ను నాలోనే కట్టిపడేస్తున్న ఒకానొక విడుదల… విడుదల కట్టిపడేయటమేమిటంటే ఏమి చెప్పనూ ఎలా చెప్పనూ? పంజరాన ఉన్న చిలుకకి స్వేచ్ఛ నిచ్చాక  అది నెమ్మదిగా మన భుజం మీదే వాలుతున్న సడి లాంటి విడుదల అని

నువ్వు వెలిగించిన ఒక ప్రభాతాన్ని తెరలు తెరలుగా శ్వాసిస్తున్నప్పుడు, నెమ్మదైన పూల బాటని సున్నితంగా అద్దుకుంటున్న  పాదరక్షలని చూస్తుంటే వాటి గురుత్వం ఒకటి నాకు తెలిపిన అద్భుతమైన పాఠం ఒకటి తెలుసా…  ‘ప్రపంచంలో కొన్ని జంటగానే పనికి వస్తాయనీ… ఒంటిగా వాటి విలువ శూన్యమని.’  మనమే అందుకు ఉదాహరణ కదూ… నువ్వైనా...  నేనైనా… ఒంటిగా శూన్యం. జంటగా  అనంతం.

నీ,

సు'రేష్'

Wednesday, 2 December 2015

కాసిని మరకలు

హాయ్ రా!

నువ్వెలా ఉన్నావో నన్ను చేరుకున్న నీ అక్షరాలు విప్పి చెప్పాయి. నీ అక్షరాలకి ఈ నా లేఖ సమాధానంగా రాసింది కాదు గానీ నువ్వు, నేను, మనలాంటి వాళ్ళందరం ఎలా ఉన్నామో ఆలోచిస్తుంటే కాగితాన్నద్దుకున్న సిరామరకలు ఇవి.

ప్రతి రోజూ కొత్త ఉషస్సు తడిమినప్పుడల్లా ఒక్కొక్కసారి కొత్త ఉత్సాహంలా, మరి కొన్నిసార్లు అదో ఉత్పాతంలా అనిపించటంలోనే మనసు ద్వైదీభావం కనిపిస్తుంది కదా.. ఉత్సాహానికి ఊపిరి వచ్చిన రోజు కాలాన్ని ఎంత త్వరగా పరిగెత్తిస్తుందో, శూన్యాన్నివెంటపెట్టుకొచ్చిన రోజు క్షణం గడవక విలవిల్లాడిపోతుంది.

మనసులోని పదార్ధం అంతా ఖాళీఅయి ఒక్క ఆలోచనా ముందుకు కదలని నీరవ నిశ్శబ్దంలో ఎంత శూన్యం దాగి ఉంటుందో నీకు తెలుసు కదా. కాసేపలా శూన్యాన్ని తాగేసిన ఉత్సాహమొకటి ఎన్ని వేదనల్ని బయటకి కక్కుతుందో కదా… ఎవరికి తెలుసోయ్… ఏ వేదన ఎవరిని కదిలిస్తుందో? ఏ కథని పరిష్కరిస్తుందో?

నీ వాళ్ళనీ, నా వాళ్ళనీ, గడచిపోయిన జీవితపు ఆనవాళ్ళని… దాటొచ్చిన సరిహద్దుల్ని, దాటలేని కంచెలని అక్షరాల్లో ఒంపటం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఆ అక్షరాలకి అమరత్వం అద్దటంలో కురిసే స్మృతుల జడివానలో కొట్టుకుపోకుండా ఉండగలగటం దాదాపు అసాధ్యమే, అది నీకైనా మరి నాకైనా. ఎన్ని కవితలు, కథలు మనలో చెక్కుకున్నా శిలలు శిలలుగా ఎదురు పడే కొన్ని కాలాలు ఊహలకి అందవు కదా. మస్తిష్కానికి చేరని ఆహ్లాదపు శాసనాలు ఎన్ని చెక్కి ఏమి ప్రయోజనం? అంతరంగపు గోడలని మకిలి పరచటం తప్ప.

అవకాశం ఉన్నంత సేపు మనం కాలాన్ని ఎంతగా శాసించినా అంతిమ శాసనం మాత్రం కాలానిదే. ఇది నిర్వేదం కాదు వాస్తవం. కాలపు అడుగులకి మడుగులొత్తాల్సిన అవసరం లేదు. దాన్ని ధిక్కరించాల్సిన అవసరమూ లేదు మనం చెయ్యాల్సిందల్లా మనమున్నంత వరకూ తనతో సహజీవనం చెయ్యటమే.

జీవితం అంటే ఏదో అనుకుంటాం కానీ, ఎంత విసిగించినా, వెక్కిరించినా ఇది మన జీవితమే. దీన్ని దాటి వెళ్ళటానికి మనకున్నది ఒకే ఒక్క ఆప్షన్. అది కూడా మనకి మనం ఎంచుకోకూడని ఆప్షన్. దానికై అది హత్తుకోవాల్సిందే కానీ మనకి మనం ఎంచుకోవటం అంటే ప్రకృతిని ధిక్కరించి నడవటమే. వేదనలోనూ, వేడుకలోనూ, జీవితం ఎప్పుడూ మన మురిపమే. అదొక మధుపమై మనలో జీవాన్ని వెదుక్కుంటుంది.

ఎన్ని జన్మలు మనం దాటి వచ్చామో, ఇంకా ఎన్ని జన్మలు ప్రయాణం చేస్తామో,రాబోయేది జన్మ రాహిత్యమో, అసలు నిజంగా జన్మలంటూ ఉన్నాయో లేవో అంటూ ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్న చోట ప్రస్తుతం మన ఎదురుగా ఉన్నదే జీవితం అని సమాధానం చెప్పుకుంటే, మన ఎదురుగా ఉన్న ప్రతి క్షణం ఎంత విలువైన సంపదో అర్ధం అవుతుంది కదూ. ఏ పాజిటివ్ ఎనర్జీ అయినా అందులో నుండే రావాలి. ఇచ్ఛ, ఆశ, ఆసక్తి పేరేదైతేనేం.. అన్నీ జీవితపు గమ్యానికి ఇంధనాలేగా! బాధని చూడని సంతోషమూ, తిమిరం తెలియని కాంతి, కుతూహలం పుట్టని జీవితమూ నిస్సందేహంగా నిస్సారమే. ఇవేవీ చూడకుండా ఎన్ని సోపానాలెక్కినా తెలియని అసంతృప్తి ఒకటి వెన్నాడుతుంది కానీ ఆనందం మాత్రం పుట్టదు.

కష్టమో, సుఖమో మనం నడిచే మార్గంలో ఎందరు తారస పడతారో, మనల్ని దాటి వెళ్ళే వాళ్ళు, మన అడుగులని జాగ్రత్తగా ఒడిసి పట్టుకునే వాళ్ళు, మన జతగా అడుగులు వేసేవాళ్ళు లేదా అసలు మన నడకనే ఆపేద్దాం అనుకునే వాళ్ళు.. ఇలా ఎంతమందో కదా?! కానీ వీళ్ళలో ఎందరు మనకి గుర్తుంటారు?! ఎందరి జ్ఞాపకాలు మనల్ని చుట్టుకుని ఉంటాయ్?!

కొన్ని మోసపు జీవాలని నమ్మేసి శలభాల్లా జీవితాన్ని కాల్చేసుకుంటాం. మనకి తెలియకుండానే మనల్ని అభిమానించే వాళ్ళని విస్మరిస్తాం. పరిచితులు చేసే గాయాల కన్నా అపరిచితులు వదిలే జ్ఞాపకాలే ఎంతో నయం. ఒక్కో సారి అవే పదిలం అనిపిస్తాయి కూడా. చిరపరిచితమొకటి మనల్ని అపరిచితంగా చూడటానికి మించిన గాయం ఏముందోయ్ జీవితంలో?

అసలు ఒకటి చెప్పు! ఈ క్షణం మనం చేసే పని ఏమిటి? గతాన్ని తలచుకోవడమో, లేదా భవిష్యత్ ఎలా ఉండబోతుందో అని తలలు బద్దలు కొట్టుకోవటమే కానీ ఇప్పుడేం చేస్తున్నావంటే సమాధానం ఉందంటావా? క్షణం తరువాత ఏమి జరుగుతుందో అన్న ఆందోళనతో ఇప్పుడు తనతో ఉన్న క్షణాన్ని కాల రాసుకోవడమే మనిషి నైజంగా మారిపోయింది. వాస్తవించే ఊహలు మోటివేషన్ ఇస్తాయి కానీ అలవిమాలిన ఊహలు, భ్రమల వెంట పరుగులు మనకిచ్చేది మాత్రం ఖాళీ చేయబడ్డ కాలం పాత్రనే.

జీవితం ఉంది ఎలాగోలా నడవటానికి కాదు. ఎలాగోలా అనటంలోనే ఒక రాజీ ఉంది. నీ జీవితం నీ కేంద్రంగా ఉండేలా చూసుకుంటే చాలు ఎలాంటి రాజీలు అవసరం ఉండదు. కానీ చాలా మంది జీవిత కేంద్రాలు మరెవరో… అక్కడే ఒక రాజీ ఆరంభమవుతుంది. ఒక జీవితం విచ్ఛిన్నమవుతుంది. అసంతృప్తి కొనసాగని రాజీ ఎప్పుడైనా తెలిసిందా? నాకైతే లేదు.

సిద్ధం చేసుకున్నవ్యూహాలు, పదును పెట్టుకున్న అస్త్రాలన్నీ వ్యర్ధం అయ్యే రణక్షేత్రం జీవితం మాత్రమే. నిజానికి వ్యూహాలు పన్నాల్సింది కాలం విసిరే అస్త్రాలని సమర్ధంగా అడ్డుకుంటూ దానితో పాటుగా ప్రయాణం చెయ్యటానికే. నిజానికి అసలు సమస్య అంతా జీవితాన్ని అతిగా ఊహించుకోవటంలోనే వస్తుంది. మనం సరళంగా ఉండాలంటే జీవితాన్ని సరళంగా చూడాలి తప్ప ఎక్కడెక్కడి సంక్లిష్టతలన్నిటినీ దానికి ముడేయ కూడదు. కాలంలో కలసిపోయిన గతాన్ని పట్టుకుంటే అదే ఊబిలో మనమూ కూరుకుని పోతాం కానీ అడుగు ముందుకు వెయ్యలేం కదా. గతం ఒక శిధిల కుబుసం. అక్కడ ప్రోది చేసుకున్న అనుభవాలని పాఠంగా మార్చుకోవాలి కానీ దాన్నో కేంద్ర బిందువుగా చేసుకుని దుఃఖసింధువుగా జీవితాన్ని మార్చుకోవటంలో వివేకం ఏముందిరా?

ఓ
స్నేహితుడు

( Published in Vaakili - http://vaakili.com/patrika/?p=9521)